వనపర్తి ఒడిలో-16
–రాఘవ శర్మ
ప్యాలెస్ లో గుండు బావి.
ఈ ప్యాలెస్ కంటే పురాతనమైంది.
ఈ బావి వయసు 155 ఏళ్ళు.
ఇన్నేళ్ళుగా ఇది ఎంత మంది దాహార్తి తీరిస్తోందో!
దీని అసలు పేరు గరుడ పుష్కరిణి.
ప్యాలెస్ కు ఇది ఎడమ పక్కన ఉంది.
గుండ్రంగా ఉంటుంది కనుక దీన్ని గుండు బావి అంటున్నారు.
పాలిటెక్నిక్ స్థాపించాక సాయంత్రం పూట గ్రామ్ ఫోన్ రికార్డులు వేసేవారు.
ఈ బావి చుట్టూ ఉన్న గట్టు పైన కూర్చుని పాటలు వినేవాళ్ళం.
ఆ బావి గట్టుపైనే కూర్చుని ఎన్ని కబుర్లు చెప్పుకున్నామో!
ఆ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతోంది.
పిల్లలు ఆడుకుంటూ, ఆడుకుంటూ బావిలోకి దిగేవారు.
పెద్ద వాళ్ళు వారిస్తున్నా, ఇక్కడ దాగుడు మూతలు ఆడేవారు.
బావి కింద నుంచి రాతి కట్టడమే.
చెక్కిన కొండ రాళ్ళతో రెండంచెలుగా గుండు బావిని నిర్మించారు.
పై నుంచి ఏట వాటుగా బావిలోకి విశాలమైన మెట్లు.
ఆ మెట్లు ఒక అంచె వరకు వచ్చి ఆగిపోతాయి.
మెట్లు ముగిసిన చోట బావి లోపల చుట్టూతిరగడానికి దాదాపు మూడడుగుల వెడల్పైన గట్టు నిర్మించారు.
ఆ గట్టు పైన మెట్లకు ఎదురుగా చిన్న మండపం లాంటి నిర్మాణం కనిపిస్తుంది.
నిజానికిది మండపం కాదు.
మోటార్లు లేని రోజుల్లో ఇది కూడా మోట బావే.
కాకపోతే తాగునీటికి ఉపయోగించే బావి.
మండపం వంటి నిర్మాణం పై నుంచి నేరుగా నీళ్ళలోకి తోలుతిత్తి దిగడం కోసం దీన్ని నిర్మించారు.
బావిలోకి దిగినప్పుడు వర్షం వస్తే ఈ మండపం కింద తలదాచుకోవచ్చు.
మొదటి మెట్లవరుస నుంచి బావి లోపలికి దిగడానికి మరొక చిన్నని మెట్ల వరుస నిర్మించారు.
ఈ మెట్ల వరుస నీటిని తాకుతుంది.
మెట్లకు పక్కన రెయిలింగ్ ఏమీ లేదు.
లోపల రెండు మెట్లు విరిగిపోయాయి.
ఈ విరిగిపోయిన మెట్ల నుంచి లోనికి దిగడం ప్రమాదం.
బావిని నిర్మించినప్పుడే పెద్ద పెద్ద రాళ్ళను రాతి కట్టడంలోకి దూర్చి మెట్లుగా అమర్చారు.
విరిగిపోయిన రెండు మెట్లను పునర్నిర్మించడం అంత తేలిక కాదు.
మేం అక్కడ ఉన్నప్పటి నుంచి విరిగిన మెట్లు అలాగే ఉన్నాయి.
ఇప్పటికీ అలాగే ఉన్నాయి.
మండపం కింద మోటారు పెట్టి నీళ్ళు పైకి తోడే వాళ్ళు.
నీటి పరిమాణం తగ్గేసరికి మోటారును కూడా కిందకు దించారు.
ప్యాలెస్ ఆవరణలో ఉన్న క్వార్టర్లన్నింటికీ ఈ గుండు బావినుంచే నీటిని సరఫరా చేసేవారు.
గుండు బావి ఒక సారి ఎండిపోయింది.
బావిలో బోరు వేస్తే నీళ్ళు పడ్డాయి.
ఆ రోజుల్లో బోరు వేయడం ఒక వింత.
బోరు వేయడం అక్కడ అదే కొత్త.
బోరు వేస్తుంటే ఎంత మంది వచ్చి చూసిపోయేవారో!
కొంత కాలంగా ఈ గుండు బావి పాడుపడిపోయింది.
మొదటి అంచెలోని ప్లాట్ ఫామ్ దెబ్బతింది.
అక్కడక్కడా రాళ్ళు ఊడిపోయాయి.
దీన్ని పట్టించుకునే వారు లేక బావి వాడుకలో లేకుండా పోయింది.
పూర్తిగా పూడిపోయి బావురు మంటోంది.
ఏడాదిన్నర క్రితం నాటి మాట ఇది.
అమెరికాలో ఉన్న చాముండేశ్వరి, ఆమె భర్త వచ్చారు.
హైదరాబాదులో ఉన్న చాముండేశ్వరి అన్న ప్రసాద్ కూడా వారి వెంట ఉన్నాడు.
ప్రసాద్ క్లాస్మేట్ శేషు వారికి కనిపించాడు.
అర్ధ శతాబ్దం తరువాత అలాకలుసుకోవడంతో వారంతా దిగ్భ్రమ చెందారు.
తమ బాల్యమంతా గడిచిన ప్యాలెస్ పరిసరాలను నలుగురూ కలిసి చూశారు.
జ్ఞాపకాలను నెమరేసుకుని, ఫొటోలు దిగారు.
పాడుపడిన గుండు బావిని చూసి బాధపడిపోయారు.
బావి ఫొటోలు తీసుకున్నారు.
ఎవరీ ప్రసాద్, చాముండశ్వరిలు!?
పాలిటెక్నిక్ సివిల్ విభాగంలో తొలి తరం లెక్చరర్ గా పనిచేసిన వివిఎస్ మూర్తి పిల్లలు.
వివిఎస్ మూర్తి మంచి చిత్రకారుడు.
ఆ రోజుల్లో అయన వేసిన కార్టూన్లు పత్రికల్లో వచ్చేవి.
బొమ్మలు ఎలా వేయాలో నాకు నేర్పించిన తొలి గురువు వివి ఎస్ మూర్తి.
మూర్తి ఇప్పుడు లేరు.
రిటైర్ అయ్యాక హైదరాబాదులో ప్లాన్స్ ఎగ్జిక్యూషన్ ఆఫీసు పెట్టుకున్నారు.
ఆయన తదనంతరం కుమారుడు ప్రసాద్ ఆ ఆఫీసును కొనసాగిస్తున్నాడు.
ప్రసాద్, చాముండేశ్వరి, ఆమె భర్త కలిసి గుండు బావి కోసం ఏదైనా చేయాలనుకున్నారు.
ఫొటోలైతే తీసుకున్నారు.
ఏం చేశారో సమాచారం లేదు.
అయిదు నెలల క్రితం బావి పూడిక తీత, మరమ్మతులు మొదలయ్యాయి.
గుండు బావి పూర్వ వైభవం సంతరించుకుంది.
దీన్ని ఎవరు బాగు చేశారో తెలియదు.
రాజకీయ నాయకులు మాత్రం తమ ఖాతాలో వేసుకున్నారు.
పాడు పడిపోయిన చారిత్రాత్మక బావిని ఇంత కాలం ఎందుకు వదిలేశారు?
కాలువల్లో పూడిక తీయలేని మున్సిపాలిటీ బావిని బాగు చేస్తుందా!?
గుండు బావిని 1868లో నిర్మించారు.
ప్యాలెస్ నిర్మాణానికి 23 ఏళ్ళ ముందే తాగు నీటి అవసరాల కోసం బావి నిర్మాణం పూర్తి చేశారు.
మళ్ళీ 1914లో దీన్ని పునర్నిర్మించారు.
ప్యాలెస్ నిర్మాణానికి ముందు నుంచి ఈ ప్రాంతంలో తాగు నీటి అవసరాలను తీర్చింది.
ఈ గుండు బావి ఎందరు సామాన్యులను చూసిందో!
ఎంత మంది పాలకులను చూసిందో!
ఎన్ని మార్పులను చూసిందో!
ఈ గుండు బావి తన గుండెల్లో ఎంత చరిత్రను దాచుకుందో!
ఎన్ని జ్ఞాపకాలను తన పొట్టలో పొదుగుకుందో!