సభ
‘వెంటిలేటర్‌పై ప్రజాస్వామ్యం’
తేది: మార్చి 9, 2023 (గురువారం),
సమయం: మధ్యాహ్నం 12.30 గంటలకు
స్థలం: శ్రీ వేంకటేశ్వర హోటల్, మినీ ఫంక్షన్ హాల్,
అంబేద్కర్ చౌరస్తా, స్టేషన్ రోడ్, భువనగిరి
కరపత్రం
అనేక ప్రజా విప్లవాలకు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాలకు పురుడు పోసిన భువనగిరి గడ్డ స్వరాష్ట్రంలో బోరున విలపిస్తున్నది. ఎట్లున్న తెలంగాణ ఎట్లాయే. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏదో అయితది అనుకుంటే ఇంకా ఏదో అయ్యింది. పక్క రాష్ట్రపోడు నీళ్లు, నిధులు, నియామకాలు దోచుకుంటున్నాడని పోరు చేస్తే, పొరుగు రాష్ట్రాల వ్యాపారుల దండు కదిలే. దగాపడ్డ తెలంగాణ అనుకుంటూ ఉద్యమిస్తే, దౌర్భాగ్యపు తెలంగాణ దర్శనమివ్వబట్టే. ఈన గాసిన సేను నక్కల పాలాయే. నడిమంత్రపు సిరుల పదవులు పొందిన స్వపాలకులు, నవ్వుల బతుకులు చేయబట్టిరి. పోరు బిడ్డల గోస ఊరికనే పోదు.
“అంతర్గత వలస పాలన”లో సాగిన దోపిడి, వివక్ష, అవమానాలు తెలంగాణ ఏర్పడ్డాక కూడా అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల మూలంగా గోదావరి, కృష్ణా నీరంతా ఇప్పటికీ తరలిపోతున్నది. కేంద్ర నిధులతో తెలంగాణ భూభాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునకకు గురిచేసి, నీళ్లన్నీ తరలించే పోలవరం ప్రాజెక్టును కట్టి, ఆఖరికి భద్రాచలం రామాలయాన్ని ముంచుతున్నా, తెలంగాణ ప్రభుత్వం నోరు విప్పడం లేదు. నిరసన తెలపడం లేదు. దీంతో బీజేపీ, బీఆర్‌ఎస్, వైఎస్సాఆర్సీపీ రహస్య ఒప్పందం బహిర్గతమైపోయింది.
కాళేశ్వరం ఆచరణలో ఖజానా ‘ఖాళీ’శ్వరంగా ముంచుకొచ్చింది. ఇప్పుడు గోదావరి నీళ్లు మహారాష్ట్రకు తరలించడానికి బీఆర్ఎస్ పథకాలు రూపొందిస్తున్నది. తెలంగాణలో బొగ్గు, సున్నపురాయి, డోలమైట్, స్టెగ్మటైట్, ముడి ఇనుము వంటి ఖనిజాలు అపారంగా భూగర్భంలో నిక్షిప్తమై ఉన్నా, లెక్కలేనన్ని వృక్షజాతులు, జంతు జాతులు, పక్షిజాతులు విహరిస్తున్నా మనం ఇంకా ఎందుకు ఆగర్భ దారిధ్ర్యంలో కునారిల్లుతున్నాం?
దేశమంతా స్వాతంత్ర్య ‘అమృత’ మహోత్సవాలు జరుపుకుంటూ అన్ని రాజకీయపార్టీలు ‘అనృత’ (అసత్య) మహోత్సవాలలో ఊరేగుతున్నాయి. ఎటు చూసినా, చీకటి కమ్ముకొస్తున్నా నిరాశజనక పరిస్థితుల మధ్య తెలంగాణ ఉద్యమకారులు భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలి. మన బతుకులు మనమే బాగు చేసుకోవాలంటే వెంటిలేటర్‌పై ఉన్న ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలి. ప్రభుత్వంలో, పాలనలో ప్రజలందరికీ సమాన భాగస్వామ్యం కల్పించాలి. ఈ విషయమై పౌరసమాజం కర్తవ్యాన్ని చర్చించుకోవాడానికి జరిగే సదస్సును జయప్రదం చేయడానికి ఉద్యుక్తులమవుదాం.
*సదస్సులో వక్తలు:
పి.నిరూప్ (సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది)
పాశం యాదగిరి (సీనియర్ జర్నలిస్ట్)
కరుణాకర్ దేశాయి (తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు)
భువనగిరి శ్రీనివాస్ (అస్సలు తెలంగాణవాదుల ఐక్యవేదిక)