‘పాలకుల చర్యలతో  రాయలసీమ ఓడిపోయింది’

బొజ్జా దశరథ రామి రెడ్డి

కృష్ణా, తుంగభద్ర నదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుగా రాయలసీమలో ప్రవేశించి కోస్తా ఆంధ్రలో సముద్రంలో కలుస్తాయి.  రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన నీటి కంటే అధికంగానే ఈ నదులలో సగటు ప్రవాహం వుంది. కానీ  రాయలసీమలో చట్టబద్ద నీటి హక్కులున్న ప్రాజెక్టులు, కేటాయించిన నీటిని వినియోగించుకోలేక పోతున్నాయి.  రాయలసీమ ప్రాజెక్టులకు సక్రమంగా నీరు అందాలి అంటే తుంగభద్ర, కృష్ణా నదిలో వచ్చిన నీటిని నిలుపుకొనడానికి రిజర్వాయర్ల నిర్మాణం, తగిన సామర్థ్యంతో కాలువల నిర్మాణం, చిన్న చిన్న ఎత్తిపోతల పథకాలు  చేపట్టాల్సి ఉంది.  రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన నీటికంటే అదనంగా రెండు, మూడింతలు నీరు తుంగభద్ర నదిలో ప్రవహిస్తున్నా పాలకుల నిర్లక్ష్యం తోనే  రాయలసీమ ప్రతి నిత్యం కరువు బారిన పడుతూనే వున్నది.

నదిలో నీరు ఉన్నా, ఆ నీటిని వినియోగించుకొనడానికి ఉన్న అవకాశాలపై ప్రణాళికలు రూపొందించడంలో అంధ్రప్రదేశ్ జలవనురుల శాఖ పూర్తిగా విఫలమయ్యింది.  ఆ దిశగా జలవనురుల శాఖ కార్యక్రమాలు చేపట్టేలాగా విధివిధానాలు రూపొందించడంలో పాలకులు విఫలమయ్యారు. పాలకులపై ఒత్తిడి పెంచడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయి. వీటన్నింటి పర్యవసానంతో రాయలసీమ వెనకబడింది. కాదు …  రాయలసీమ  ఓడిపోయింది.

పాలకుల సాగునీటి  విధానాల వలన ఓడిపోయిన రాయలసీమ ప్రాంత వాసులు వలసబాట పట్టడానికి గల కారణాలకు కర్నూలు పక్షిమ ప్రాంత సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి దర్పణం పడుతుంది.

బొజ్జా దశరథరామిరెడ్డి
బొజ్జా దశరథరామిరెడ్డి,

కర్నూలు పశ్చిమ ప్రాంతానికి వరప్రదాయిని తుంగభద్ర దిగువ కాలువ. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో 1.51 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో  ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఫిబ్రవరి 28, 1945 శంకుస్థాపన జరిగిన తుంగభద్ర డ్యాం నుండి మొట్ట మొదటి సారిగా జూలై 1, 1953 న  ఈ ప్రాజెక్టుకు నీటి విడుదల జరిగింది. ఈ ప్రాజెక్టుకు తుంగభద్ర డ్యాం నుండి 24 టి ఎం సి ల ను  చట్టబద్ధ నీటి కేటాయింపులను బచావత్ ట్రిబ్యునల్ చేసింది. గత పది సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు క్రింద యాబై వేల ఎకరాలకు (50,000) కూడా నీరు అందడం లేదు. తుంగభద్ర ఎగువ కాలువ బ్రాంచ్ కెనాల్ అయిన ఆలూరు కాలువ ద్వారా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో పదహైదు  వేల ఎకరాలకు (15000) నీటి కేటాయింపులు ఉన్నాయి. కానీ గత పది సంవత్సరాలలో సగటున ఎనిమిది వేల ఎకరాలకు (8000) కూడా నీరు లభించడం లేదు. హంద్రీ నది మీద నిర్మించిన సంజీవయ్య సాగర్ ప్రాజెక్టు (జి డి పి) ద్వారా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఇరవై నాలుగు వేల ఎకరాలకు (24000) చట్టబద్ధ నీటి కేటాయింపులు వున్నాయి. కానీ గత పది సంవత్సరాలుగా పదకొండు వేల ఎకరాలకు (11000) కూడా నీరు లభించడం లేదు. ఈ ప్రాజెక్టుల ద్వారా నీరు పొంది లభ్ది పొందిన రైతుల కంటే, నీరు వస్తుందని పంటలు వేసుకొని నీరు సక్రమంగా రాక నష్టపోయిన రైతులే ఎక్కువగా ఉన్నారు. అంతేకాకుండా తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో ఉన్న వందలాది గ్రామాలు, పట్టణాలలో నివశిస్తున్న ప్రజలు వర్షా కాలంలో కూడా త్రాగు నీటికి అలమటిస్తున్నారు. త్రాగు, దైనందిక అవసరాలకు కావలసిన నీటిని ఇంటికి తెచ్చుకోవడానికి రాయలసీమలోని మహిళలు పడే శారీరక శ్రమ, మానసిక క్షోభ అనుభవిస్తే కానీ తెలియదు.  మరి తుంగభద్ర నదిలో నీరు ప్రవహించడం లేదా అంటే సగటున 150 టి ఎం సి ల తుంగభద్ర జలాలు, అంటే సుమారు పదహైదు లక్షల ఎకరాలకు (15,00,000) వినియోగించే నీరు, ఈ ప్రాంతం దాటి శ్రీశైలం రిజర్వాయర్ చేరుతున్నాయి. ఈ సంవత్సరం 596 టి ఎం సి ల తుంగభద్ర జలాలు ఈ ప్రాంతం గుండా ప్రవహించి శ్రీశైలం రిజర్వాయర్ చేరాయి. ఈ నీటిని సక్రమంగా వినిగించుకునే విధానాలు రూపొందించడంలో పాలకులు విఫలం అయ్యారనడానికి ఇవి సజీవ సాక్ష్యాలు.

చట్టబద్ద నీటి హక్కులున్న ప్రాజెక్టుల స్థిరీకరణకు గుండ్రేవుల రిజర్వాయర్, వేదవతి ఎత్తిపోతల పథకం, తుంగభద్ర  వరద కాలువ, సిద్ధేశ్వరం అలుగు లాంటి అనేక ప్రాజెక్టులకు విశ్రాంత సాగునీటి నిపుణులు సుబ్బరాయుడు ప్రతిపాధనలు చేసారు. కృష్ణా జలాల నీటి పంపకాలపై ఏర్పాటు చేసిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆర్ డి ఎస్ కాలువకు 4 టీఎంసీల నీటిని కేటాయించింది. ఈ ట్రిబ్యునల్ తీర్పు నోటిపై కానప్పటికీ, ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై అయ్యే నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసే లక్ష్యంతో తమ ప్రాంతంలోని ప్రాజెక్టుల అంతర్గత సర్దుబాట్లతో నిర్మాణం చేస్తున్నామని ఆయా రాష్ట్రాలు  ముందుకు పోతున్నాయి.  ఇందుకు ఉదాహరణ కర్నాటక రాష్ట్రం నిర్మిస్తున్న అప్పర్ భద్ర ప్రాజెక్టు. ఆర్ డి ఎస్ కుడి కాలువ నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులను గత ప్రభుత్వం ఇచ్చి, టెండర్లు పిలిచిన, పనుల్లో పురోగతి లేక ఎక్కడికక్కడ ఆగి పోయో ఉన్నాయి.  అదేవిధంగా ఆంధ్రప్రదేశ్  కృష్ణా నది జలాల సక్రమ నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం కృష్ణా నది యాజమాన్య బోర్డ్ కార్యాలయంను అంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని చట్టం చేసింది. ఈ అంశాల పట్ల  సమగ్ర ప్రణాళికతో ముందుకు పోతే రాయలసీమ సాగునీటి హక్కులను సద్వినియోగం చేసుకోవచ్చు. కానీ ఈ ప్రతిపాదనల పట్ల పాలకులు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు.

రాయలసీమకు చట్టబద్ద నీటి హక్కులున్న తుంగభద్ర దిగువ కాలువ, గాజులదిన్నె ప్రాజెక్టుల తో సహా  కె సి కెనాల్, తెలంగాణలోని ఆర్ డి ఎస్ ప్రాజెక్టులకు సక్రమంగా తుంగభద్ర నది నుండి నీటిని పొందడానికి వీలుగా గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణానికి రాయలసీమ సాగునీటి సాధన సమితి చేసిన కృషితో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 2012 వ సంవత్సరంలో సమగ్ర ప్రాజెక్టు నివేదికకు అనుమతులు లభించాయి.   ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ రాష్ట్రంను ఒప్పించి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని GO RT No.154 Dt 21.2. 2019 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. గుండ్రేవుల  రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉద్యమాలు చేసినా, ప్రజా ప్రతినిధులు ఉత్తరాలు వ్రాసినా, సాగునీటి సలహా మండలి సమావేశాలలో తీర్మానాలు చేసినా,  ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అలక్ష్యంతో ఈ ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా తయారైంది. అధేవిదంగా వేదవతి ఎత్తిపోతల పథకానికి 2019 వ సంవత్సరంలో పాలనాపరమైన అనుమతులు లభించాయి. కానీ ఈ ప్రాజెక్టుకు అనుమతులు సాధించే దిశలో, దీని నిర్వహణ సామర్థ్యాన్ని  3 టి ఎం సి లకు తగ్గించారు. దీని నిర్వహణ సామర్థ్యాన్ని 8 టి ఎం సి లకు పునరుద్ధరించి, వేదవతి పైన గూళ్యం వద్ద ఒక టి ఎం సి సామర్థ్యంతో రిజర్వాయర్, తుంగభధ్ర దిగువ కాలువ స్థిరీకరణ కు చిన్న ఎత్తిపోతల పథకం చేపట్టాలన్న నిపుణల సూచనలను పరిగణలోనికి తీసుకోవడంలో జలవనరుల శాఖ  నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుంది. హంద్రీనీవా ప్రాజెక్టు తో సహా, రాయలసీమలోని అనేక ప్రాజెక్టులకు, శ్రీశైలం రిజర్వాయర్ క్రింద త్యాగం చేసిన ప్రాంతానికి త్రాగు, సాగు నీటిని అందించడానికి, శ్రీశైలం రిజర్వాయర్ పూడికను నివారించి శ్రీశైలం రిజర్వాయర్ జీవిత కాలం పెంచే “రాయలసీమ ప్రజల హృదయ స్పందన సిద్దేశ్వరం అలుగు” విషయంలో కూడా జలవనురుల శాఖ మొద్దు నిద్రపోతున్నది. ఆర్ డి ఎస్ కుడి కాలువకు పాలనాపరమైన అనుమతులను ఇచ్చి పనులు మొదలు పెట్టినంత సమయం కూడా పట్టలేదు జలవనురుల శాఖకు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని మూలనపడవేయటానికి‌.

 

కృష్ణా జలాల నిర్వహణకు అంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం – 2014 ప్రకారం కృష్ణా నది యాజమాన్య బోర్డ్ కార్యాలయంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి.  సహజ న్యాయ సూత్రాలను అనుసరించి కృష్ణా నది యాజమాన్య బోర్డును  కృష్ణా జలాల నిర్వహణకు మరియు పంపిణీకి కీలకమైన  శ్రీశైలం రిజర్వాయర్ ఉన్న కర్నూలులో ఏర్పాటు చేయాల్సి వుంది. ఈ కార్యాలయ పర్యవేక్షణలో రాయలసీమ సాగునీటి ప్రాజక్టులకు న్యాయం జరుగుతుందని, రాయలసీమ సమాజం భావిస్తున్న తరణంలో,   కృష్ణా నది తో ఏమాత్రం సంబంధం లేని  విశాఖపట్నం లో కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏర్పాటుకు జల వనరుల శాఖ మొగ్గు చూపడం  రాయలసీమ వాసులను ఆశ్చర్యానికి గురిచేసింది. కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయాలని గత రెండు సంవత్సరాలుగా రాయలసీమ సాగునీటి సాధన సమితి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నా, అనేక మంది ప్రజాప్రతినిధులు  ఉత్తరాలు వ్రాసినా,  జలవనరుల శాఖకు చీమ కుట్టినట్లుగా  కూడా లేదు.

 

ఇదే సందర్భంలో  కర్ణాటక రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి సాగునీటి ప్రాజెక్టుల సాధనకు కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక జలవనరుల శాఖ చేస్తున్న ప్రయత్నాలను, విజయాలను స్పూర్తిగా తీసుకొని అంధ్రప్రదేశ్ రాష్ట్రం  ముందుకు పోవాలని రాయలసీమ సమాజం ఆశిస్తున్నది.  కర్ణాటక ప్రభుత్వం గత 20 సంవత్సరాలుగా మాస్టర్ ప్లాన్ రూపొందించుకొని, అప్పర్ భద్ర  ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించిన కార్యాచరణను అంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ నిశితంగా పరిశీలించాల్సిన అవసరం వుంది. తుంగభద్ర నది K  8  సబ్ బేసిన్ లో కేటాయించిన నీటిలో అంతర్గతంగా సర్దుబాట్లతో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు లోబడే  కర్నాటక ప్రభుత్వం  అప్పర్ భద్ర ప్రాజెక్టు చేపట్టిందని   కేంద్ర జలవనరుల శాఖ ఒక సమగ్ర నివేదికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జనవరి 14, 2022 న పంపింది.  కేంద్ర జలవనరుల శాఖ ఫిబ్రవరి 15, 2022 న నిర్వహించిన 14 వ హై పవర్డ్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది.  దీన్ని అనుసరించే కేంద్ర ప్రభుత్వం అప్పర్ భద్ర ప్రాజెక్టుకు  5300 కోట్ల రూపాయల నిధులను కేంద్ర బడ్జెట్ లో ఫిబ్రవరి 1, 2023 న ప్రకటించింది.

 

కర్ణాటక ప్రభుత్వం బచావత్ ట్రిబ్యునల్ లో K 8 సబ్ బేసిన్ లో కేటాయించిన ప్రాజెక్టుల ఆధునీకరణ ద్వారా ఆదా అయ్యే నీళ్ళను మరియు పోలవరం నిర్మాణం ద్వారా ఆదా అయ్యే కృష్ణా జలాల్లో కర్నాటకకు లభించే 21 టి ఎం సీ ల నీటిలో 2.4 టి ఎం సీ ల నీటిని  అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేటాయింపులు చేసి ఈ ప్రాజెక్టుకు అనుమతులు సాదించింది. కానీ అంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరువు పీడిత రాయలసీమలో చట్టబద్ద నీటి హక్కులున్న ప్రాజెక్టులకు సంపూర్ణంగా నీటిని వినియోగించుకొనడానికి చేపట్టాల్సిన ప్రాజెక్టుల ప్రణాళికలు రూపొందించడంలో, వాటిని కేంద్ర జలవనరుల శాఖ ముందుంచడంలో, అనుమతులు సాధించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. రాయలసీమకు హక్కుగా ఉన్న నీటిని సంపూర్ణంగా వినియోగించే కార్యాచరణ చేపట్టడంలో విఫలమైన జలవనరుల శాఖ వలన,  కృష్ణా, తుంగభద్ర జలాలు  సముద్రం పాలు అవుతుండటంతో,  అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యంతరాలకు  పసలేకుండా పోయిందని రాయలసీమ సమాజం భావిస్తున్నది.

 

తుంగభద్ర, కృష్ణా నదులకు  ఎగువన కర్నాటకలో అప్పర్ భద్ర లాంటిప్రాజెక్టులు నిర్మిస్తే రాయలసీమ ఎడారిగా మారుతుందని రాయలసీమ మీద ఎనలేని సానుభూతిని  వ్యక్తపరుస్తున్నాయి రాజకీయ పార్టీలు, తెలుగు జాతి అంతే ఒక్కటే అనే విశాల హృదయం కలిగిన ప్రజా సంఘాలు. వీరే తుంగభద్ర, కృష్ణా నదులకు దిగువన ఉన్న కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు ద్వారా మళ్ళిస్తే  రాయలసీమ బాగుపడుతుందని ఎనలేని ప్రేమను  వ్యక్తపరుస్తున్నారు.  కాని రాయలసీమకు చట్టబద్ద హక్కులన్న ప్రాజెక్టుల సక్రమంగా నీరు పొందడానికి నిర్మించాల్సిన రిజర్వాయర్ల, కాలువల, ఇతర నిర్మాణాలు చేపట్టాల్సిన ఆవశ్యకతను వీరు  విస్మరించడం పట్ల  రాయలసీమ సమాజం విస్తుపోతున్నది. వీరు  రాయలసీమ పట్ల వ్యక్తపరిచే జాలి, ప్రేమలను   రాయలసీమ సమాజం శంకిస్తున్నది.

 

దశాబ్ద కాలంగా రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కొరకు ఉద్యమాలు నిరంతర ప్రవాహంలా జరుగుతున్నాయి. రాయలసీమ ప్రజలు చైతన్యవంతం అవుతున్నారు.    రాయలసీమ ప్రజల ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకోని పాలకులను,   రాయలసీమ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.  ఇప్పటికైనా చట్టబద్ద  రాయలసీమ నీటి కేటాయింపులను సంపూర్ణంగా వినియోగించుకోవడానికి అంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టి, దీని అమలుకు రాజకీయ దౌత్యం చేపట్టాలని, ఆ దిశగా పాలక వర్గం అడుగులు పడకపతే తగిన బుద్ది చెప్పడానికి రాయలసీమ సమాజం సిద్ధమవుతున్నది. జాగ్రత్త…

(బొజ్జా దశరథ రామి రెడ్డి, అధ్యక్ష్యులు,  రాయలసీమ సాగునీటి సాధన సమితి, మొబైల్: 98480 40991)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *