కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజుకు రాయలసీమ మేధావుల ఫోరం వినతి.
ఏపీ కాంగ్రెస్ అద్యక్షులు గిడుగు రుద్రరాజు తిరుపతి పర్యటన సందర్భంగా రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి కలిసి కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర నదిపై బచావత్ అవార్డుకు వ్యతిరేకంగా నిర్మిస్తున్న ఎగువ భద్ర ఎత్తిపోతల పథకం వల్ల రాయలసీమకు తీవ్ర నష్టం ఉంటుందని రాయలసీమ ప్రజల ఆందోళనలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.
పార్టీలో చర్చించి తగిన కార్యాచరణ రూపొందిస్తామని గిడుగు రుద్రరాజు హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ అధ్యక్షులు దృష్టికి ఎగువ భద్ర ఎత్తిపోతల పథకం వల్ల జరిగే నష్టాన్ని పురుషోత్తమ రెడ్డి తీసుకువెళ్లారు.
ఏపీ ప్రయోజనాల పట్ల కేంద్రం వివక్ష
కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చట్టబద్ధత లేని ఎగువ భద్రను నిలువరించాల్సిన కేంద్రప్రభుత్వం అందుకు భిన్నంగా జాతీయ హోదాను ప్రకటించడంతో రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి తీవ్ర అవరోధాలు సృష్టించడం అవుతుంది
ఎగువ భద్రను 42 TMC సామర్థ్యంతో ఎత్తిపోతల పథకాన్ని రూపొందించినారు. 2008 న ప్రారంభించిన సదరు ప్రాజెక్టుకు కృష్ణా నీటి వివాదాల ట్రిబ్యునల్ (KWDT -1) 31 . 05. 1976 బచావత్ అవార్డు ప్రకారం నీటి కేటాయింపులను నిరాకరించారు. నిబంధనలకు భిన్నంగా KWDT 2( 13 – 12- 2010 న) 9 TMC నీటిని కేటాయించినది. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సలాల్ చేస్తూ SLP వేయగా సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా స్టే ఇచ్చింది.
బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వరస ఉల్లంఘనలకు పాల్పడటం అన్యాయం.
సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా నదీ పరీవాహక రాష్టాల అభ్యంతరాలను , అభిప్రాయాలను పట్టించుకోకుండా ఎగువ భద్ర స్టేజ్ 1 క్రింద పొడిగింపు , స్టేజ్ 2 క్రింద అటవీ అనుమతులను 2017 లను బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం 2019 , 2021లో రెండు సార్లు , 2022 లో ప్రాజెక్టు అనుమతులపై చేసిన వరుస అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా CWC ఏకంగా 2020 లో 29.90 TMC లకు సాంకేతిక అనుమతులు మంజూరు చేసింది. తదుపరి 2022 లో జలశక్తి మంత్రిత్వ శాఖ 16125 కోట్ల అంచనాలతో జాతీయ ప్రాజెక్టుగా సిఫార్సు చేసై తాజా బడ్జెట్ లో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి 5300 కోట్లు కేటాయించింది. ఈ మొత్తం వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం చేసిన వినతులు , అభ్యంతరాలను కనీసం పట్టించుకోకుండా ఏపీ ప్రజల పట్ల వివక్ష కర్ణాటకకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించి ఫెడరల్ స్ఫూర్తిని తుంగలోకి తొక్కింది.
కృష్ణను కోల్పోయిన రాయలసీమకు తుంగభద్రను దూరం చేస్తున్నారు.
కృష్ణా , తుంగభద్ర నదులకు ఏపీకి ముఖద్వారం రాయలసీమ అయినా నీటి కేటాయింపులు , నిల్వ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల రతనాల సీమగా ఉండాల్సిన రాయలసీమ నేడు కరువు సీమగా మారింది. కృష్ణా నదికి వరద ప్రవాహం క్రమేణా తగ్గడం అందుబాటులో ఉన్న నీటిలో మిగులు జలాలను సైతం పంచడం వల్ల సీమ ప్రాజెక్టులకు తుంగభద్ర నీరు కీలకంగా మారింది. ఆంగ్లేయులు రూపొందించిన కృష్ణా ప్రాజెక్టును కోల్పోయిన కారణంగా కృష్ణా నదిని రాయలసీమ కోల్పోయినది వందల TMC నీటిని తుంగభద్ర తీసుకొస్తుంది. తుంగభద్ర నీటిని కృష్ణలో కలపాల్సినది 30 TMC లే అయినా గత ఏడాది అదనంగా 600 TMC లు కలిసింది. ఎగువన ఉన్న కర్ణాటక తుంగభద్ర పై అదనంగా మరో ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే దిగువన ఉన్న రాయలసీమ లోని తుంగభద్ర పై నికరజలాల కలిగి ఉన్న LLC , HLC , KC కెనాల్ అనుమతులు ఉన్న గుండ్రేవుల ప్రమాదంలో పడుతుంది. కృష్ణా నదిలో ప్రవాహం తగ్గి తుంగభద్ర నీరే ప్రదానం అవుతున్న నేపథ్యంలో కర్ణాటక అనుమతులు లేకుండా నిర్మించే ఎగువ భద్ర వల్ల గాలేరు నగరి , హంద్రీనీవా , తెలుగు గంగ , SRBC లకు ప్రమాదం ఉంటుంది.
ఇంతటి తీవ్రమైన సమస్య పరిష్కారానికి తనవంతు పాత్రను పోషించాలని కాంగ్రెస్ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారిని కోరగా రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి అగాధం ఏర్పడే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అఖిలపక్షం నిర్వహించి అందరిని కలుపుకుని కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలని రుద్రరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కోరారు. ఏపీ ప్రభుత్వ వ్యవహారంతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ తన శక్తి మేరకు పోరాటం చేస్తుందని.రాయలసీమ ప్రజలకు అండగా ఉంటామని గిడుగు రుద్రరాజు హామీ ఇచ్చారు. ఈ భేటీలో రాష్ట్ర నేత రాంభూపాల్ రెడ్డి కూడా ఉన్నారు.