తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన బుధవారం రాత్రి శ్రీ సోమస్కంధమూర్తి అధికార నంది వాహనంపై అభయమిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.
శ్రీ కపిలేశ్వరస్వామి వాహనసేవలలో విశిష్ఠమైనది అధికారనంది. ఈ అధికారనందికి మరోపేరు కైలాసనంది. కైలాసంలో మెడలో మువ్వలదండలతో, కాళ్లకు గజ్జెలతో మనోహరాకారంతో, బంగారుకొమ్ములతో అలరారే నంది భవుడికి నిత్యవాహనం.
ఆకట్టుకున్న సంగీత కార్యక్రమాలు
శ్రీకపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద బుధవారం నిర్వహించిన సంగీత కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, నాదస్వరం పాఠశాల, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 నుండి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ముందుగా హరికథ గానం జరిగింది. అనంతరం ఎస్వీ నాదస్వర పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ ఎస్.మునిరత్నం బృందం నాదస్వరం, శ్రీ నాగరాజు బృందం డోలు వాద్యాలతో మంగళధ్వని వినిపించారు.
అదేవిధంగా శ్రీమతి శైలజ బృందం మధురంగా గాత్ర సంగీత కార్యక్రమం నిర్వహించారు. లింగాష్టకం, కాలభైరవాష్టకంతోపాటు గరుడ గమన తవ…, భోశంభో…, నిను విడచి ఉండలేనయా… తదితర కీర్తనలు ఆలపించారు. అనంతరం శ్రీమతి జ్ఞానప్రసూన వీణ, శ్రీ చెన్నయ్య వేణువు, శ్రీ రమేష్ మృదంగం, శ్రీ శంకర్ మృదంగంపై ప్రదర్శించిన వాయిద్య విన్యాసం భక్తులను ఆకట్టుకుంది.