(పీఎస్ అజయ్ కుమార్)
అక్కడ భూమి ఉంది, ఇళ్ళు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, చిన్న సేద్యం ఉంది, వెరసి అదొక ఊరు. ఉరుకొక పేరు….అయితే అదొక ఊరని రికార్డ్ కు ఎక్కించేం దుకు అధికారులకు చేతులాడడం లేదు… ఊరులేదని బుకాయిస్తే ఆ గిరిజనుల భూమి కాజేయడం ఈజీ అవుతుందా?
ఆ ఊరి పేరు కొత్తవీధి. అక్కడ జీవిస్తున్నవి 9 ఆదివాసి కోందు కుటుంబాలు. గ్రామం మొత్తం 65 సెంట్లు విస్తీర్ణంలో ఉంది. గ్రామం చుట్టూ చక్కని చెట్లు.
అక్కడ వ్యవసాయక భూమి ఉంది. పరిపాలన పరిభాషలో అది మెట్టు భూమి. దాని సర్వే నెంబర్ సంఖ్య 289, మొత్తం విస్తీర్ణం 37 ఎకరాలు 8 సెంట్లు. ఆ భూమిలో కొత్త వీధి ఆదివాసీలు, గుంటి ఆదివాసీలు గత 30 ఏళ్లుగా చేస్తున్న సాగుబడి ఉంది. జీడి తోటలు, పనస చెట్లు, టేకు వనాలు, మెట్టు ధాన్యాలు, బొబ్బర్లు, సిరి కందులు, సోళ్లు, జొన్నలు ఇలా పలు వ్యవసాయాలు ఉన్నాయి.
అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం డివిజన్, చీడికాడ మండలం, కోణం గ్రామ పంచాయతీ పరిధిలో ఈ గ్రామం ,ఆ సాగుబడి ఉన్నాయి. ఆ సంగతి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి తెలుసు. ఆ తెలిసిన సంగతులను వారెన్నడు రికార్డు చేయలేదు. ఆ కారణంగా భూమి మీద గ్రామం ఉంది కానీ రికార్డులో లేదు. ఆ గ్రామం చుట్టూ ఉన్న భూమిలో వ్యవసాయం ఉంది కానీ రికార్డులో లేదు.
2020 జూన్ 9న ఆ గ్రామానికి సర్వే సిబ్బంది ఒక రెవిన్యూ అధికారి వచ్చిన సాక్ష్యం ఉంది. ఆ రెవెన్యూ అధికారి నేడు అదే మండలంలో సీనియర్ క్లర్క్.
ఆ గ్రామానికి గ్రామ రెవెన్యూ అధికారి వచ్చిన సాక్ష్యం ఉంది. ఆ గ్రామానికి మండల సర్వేయర్ వచ్చిన సాక్ష్యం ఉంది.
ఆ గ్రామానికి డిప్యూటీ తాసిల్దారు భూమి బ్రోకర్లను వెంటబెట్టుకొని వచ్చిన సాక్ష్యం ఉంది.
సంఘం సహకారంతో ఆదివాసీలు తమను బెదిరించిన సర్వేయర్ పై సర్వే మరియు భూమి రికార్డుల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఆయన సదరు ఫిర్యాదును కాకినాడలో ఉండే డిప్యూటీ డైరెక్టర్ సర్వే మరియు భూమి రికార్డులు వారికి పంపారు. వారు సదరు ఫిర్యాదును విశాఖపట్నంలోనీ అసిస్టెంట్ డైరెక్టర్, సర్వే మరియు భూమి రికార్డులు వారికి పంపారు. వారు అనకాపల్లి ఆర్డీవో ఆఫీసులో ఉండే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ( DISO)వారికి పంపారు. అంతే..
ఇక భూమి బ్రోకర్లను వెంటపెట్టుకొని వచ్చిన డిప్యూటీ తాసిల్దార్ పై జిల్లా కలెక్టర్ గారికి ఆదివాసీల ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవడానికి గౌరవ కలెక్టర్ గారికి అప్పటినుంచి ఇప్పటివరకు సమయం దొరకలేదు.
2021 నవంబర్ నెలలో ఆదివాసీలు చీడికాడ తాసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు. తమ సాగులు పరిశీలించమని, తమ గ్రామం ఉన్న విషయాన్ని నమోదు చేయమని వారు కోరారు.
2022 జూన్ 13వ తారీకు నాడు సదరు గౌరవ తాసిల్దార్ 37 ఎకరాల 8 సెంట్ల భూమిని గిరిజనేతరుల పేరున బదిలీ చేశారు. సాగులో ఉన్న ఆదివాసీలకు తమ గోడు చెప్పుకోవడానికి ఆయన ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.
గత ఏడాది అంటే 2022 సెప్టెంబర్ 13 వ తారీఖున నర్సీపట్నం ఆర్డిఓ (RDO) గారు ఆ గ్రామానికి వచ్చారు. వారితోపాటు కొత్తగా విధులలోకి చేరిన చీడికాడ తాసిల్దార్ గారు కూడా వచ్చారు.
ఆదివాసీలు వారికి కుర్చీలు వేసి మర్యాద చేశారు. తమ ఆవాసాలను చూపారు, మూడు దశాబ్దాలుగా చెమట, రక్తం ధారపోసి తాము సాగులోకి తీసుకొచ్చిన తోటలు, దొడ్లు చూపించారు.
నవంబర్ నెలలో గౌరవ రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ వారు జిల్లా కలెక్టర్కు నివేదిక పంపారు. సర్వే నెంబర్ 289లో ఆదివాసీల గ్రామం ఉందని గాని, తాను స్వయంగా వెళ్లి ఆ గ్రామాన్ని చూశానని గాని, ఆ భూమిలో ఆదివాసీల సాగు అనుభవం ఉందని గాని రికార్డును మార్చే సమయంలో చట్ట ప్రకారం సాగులో ఉన్న ఆదివాసీలకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని గాని తన నివేదికలో ప్రస్తావించలేదు.
37 ఎకరాల భూమిలో 7 ఎకరాలు ప్రభుత్వానికి చెందిన సీలింగ్ మిగులు భూమినీ కూడా పట్టా భూమిగా మార్చేసి రికార్డు చేశారని మాత్రం రాశారు. అంటే, ఒక విఆర్ఓ, ఒక సర్వేయర్, ఒక డిప్యూటీ తాసిల్దార్, ఒక తాసిల్దార్, ఒక రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్… ఆ గ్రామాన్ని సందర్శించినా వారిలో ఉన్నారు… ఒక్కరంటే ఒక్కరు సర్వేనెంబర్ 289 లోనే ఆదివాసీల గ్రామం ఉందని గాని, ఆదివాసీల సాగులోనే 37 ఎకరాల భూమి ఉందని గాని కాగితం మీద పెట్టడానికి సిద్ధంగా లేరు. ఎందుకని?
అరుంధతిరాయి మాటల్ని అప్పు తెచ్చుకుంటే, మంత్రిగారి అనే సూపర్ రిచ్ …. గారికి… కొందు, కొండదోర ఆదివాసీలనే సూపర్ పూర్ భూములు కావలసి వచ్చింది.
ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు “జగనన్నకు చెప్పుకుందాం” అనే కొత్త ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. “ప్రభుత్వానికి చెప్పుకున్నాం చెప్పుతో కొట్టుకున్నాం” అనే పథకం అయ్యింది. ఇప్పుడు ఈ కొత్త పథకం సంగతి చూడాలి.
కొండకోనల్లో ఉన్న ఈ గ్రామానికి ఈరోజు వెళ్లాను. వారు పెట్టిన సిరి కందుల భోజనం తిన్నాను. అధైర్య పడవద్దని చెప్పాను. సాగు మన చేతిలో ఉంది, న్యాయం మన వైపే ఉంది… చట్టం కూడా మన వైపు వచ్చి తీరుతుంది. అది భరోసా…