(వనపర్తి ఒడిలో-11)
-రాఘవశర్మ
నేను ఐదవ తరగతి చదువుతున్నాను.
ఆ రోజు రాత్రి భారీ వర్షం కురిసింది.
పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి.
వనపర్తిలో వరదలు చూడడం నాకు అదే తొలిసారి, అదే చివరి సారి.
చెరువుల కట్టలు తెగి నీళ్ళు నివాస ప్రాంతాల్లోకి వచ్చేశాయి.
ప్రభుత్వాసుపత్రిలోకి కూడా వచ్చేశాయి.
ప్యాలెస్ ప్రధాన ద్వారం దాటాక వచ్చే చౌరస్తా పక్కనే బస్టాండు.
బస్టాండుకు కాస్త దగ్గరలో పోలీస్ స్టేషన్.
పోలీస్ స్టేషన్ను ఆనుకునే విశాలమైన కాంపౌండ్లో ప్రభుత్వాస్పత్రి.
వచ్చి పడుతున్న వరద ఎంత పెరుగుతుందో తెలియదు.
ఆస్పత్రిలో రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
పాలిటెక్నిక్ విద్యార్థులు రంగంలోకి దిగారు.
తాళ్ళు కట్టుకుని రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అలా సేవలందించిన విద్యార్థుల్లో మా పెదనాన్న కొడుకు ఆలూరు వెంకటేశ్వరరావు కూడా ఉన్నాడు.
అప్పుడున్న లేడీ డాక్టర్ విద్యార్థులందరినీ పేరు పేరునా పిలిచి అభినందించింది.
ఆ లేడీ డాక్టర్ అందాన్ని ఆస్వాదించడంలో భాగంగానే విద్యార్థులంతా రంగంలోకి దిగి ఆ సాహసం చేశారన్నది వారిలో ఒకరి వ్యాఖ్య.
మర్నాడు కాస్త తెరిపిచ్చింది.
ఆరోజు మే 27, 1964.
ఇళ్ళలోంచి అంతా బైటికొచ్చారు.
అలా బైటికొచ్చిన వారిలో సివిల్ విభాగాధిపతి కె.ఎల్. నరసింహం కూడా ఉన్నారు.
వరద గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.
వరద కంటే పెద్ద వార్తను మోసుకొచ్చాడు సత్యం.
`నెహ్రూ చనిపోయాడు’ అన్నాడతను.
అక్కడున్న వారంతా నిశ్చేష్ట లై పోయారు.
అందరిలో ఒక విషాధం గూడుకట్టుకుంది.
అది రేడియో నుంచి వెలువడిన వార్త.
ఆరోజుల్లో మా ఇంటికి ఆంధ్రప్రభ వచ్చేది.
హైదరాబాదులో అచ్చయినా, ఆ పేపరు ఎప్పుడో మధ్యాహ్నం పైన కానీ ఇంటికి వచ్చేది కాదు.
నెహ్రూ మరణ వార్త ఆ మర్నాడు పేపర్లో వచ్చింది.
బాపట్లకు చెందిన రంగనాయకులు కూడా ఆ కాలేజీలో పనిచేసే వారు.
రంగనాయకులు చిన్న కొడుకే సత్యం, అప్పుడు పదో, పదకొండో చదువుతున్నాడు.
మా ఇంటికి తూర్పు వైపున ఉండే పోర్షన్లో ఉండేవారు.
నెహ్రూ గురించే అంతా చర్చ జరిగింది.
నెహ్రూతో ఈ కాలేజీకి విడదీయరాని అనుబంధం.
ఇక్కడి ఉద్యోగుల జీవితాలు ఆ కాలేజీతో ముడిపడి ఉన్నాయి.
ఒక ప్రైవేటు పాలిటెక్నిక్ ను ప్రారంబించడానికి, ప్రధానిగా నెహ్రూ ఢిల్లీ నుంచి మారుమూల వనపర్తికి రావడమే విశేషం.
(పాలిటెక్నిక్ ప్రారంభ విషయాలు రెండవ భాగంలో ఉన్నాయి)
రోజులు గడిచిపోతున్నాయి.
అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి హైస్కూలు కొచ్చాను.
ఏడవ తరగతిలో చేరాను.
చతురస్రాకారంలో చుట్టూ గదులు, మధ్యలో ఖాళీ జాగా.
హెడ్ మాస్టర్ ముందు ప్రార్థనకు చిన్న వేదిక.
తెలుగు చెప్పడానికి వెంకటరెడ్డి సార్, ఆంజనేయులు సార్ వచ్చేవారు.
ఆంజనేయులుది గుండ్రటి ముఖం, నుదుటున చిన్న బొట్టు.
వెంకటరెడ్డిది కోలముఖం.
ఇద్దరూ తెల్లగా, జంటకవుల్లా ఉండేవారు.
ఒకరు పాఠం చెపుతుంటే మరొకరికి లీజర్.
లీజరైనా మరొకరు చెపుతున్న క్లాస్ దగ్గరకే వచ్చేవారు.
అంతా నేలపైనే కూర్చునే వాళ్ళం.
టీచరు మాత్రం బ్లాక్ బోర్డు ముందు ఒక కుర్చీ ఉండేది.
ఎవరైనా ఒక తెలుగు పద్యం చెప్పగలరా? అన్నారు ఆంజనేయులు సార్.
ఎవ్వరూ లేవలేదు.
కొద్ది నిమిషాలు అంతా నిశ్శబ్దం.
వాళ్ళిద్దరూ అందరి ముఖాలూ చూస్తున్నారు.
ఎంత సేపీ మౌనం!?
మా ఎత్తును బట్టి క్లాసులో కూర్చోపెట్టేవారు.
నా ఎత్తును బట్టి ముందు వరుసలో కూర్చునే వాడిని.
తరగతిలో ఎత్తులోనే కాదు, వయసులోనూ అంతా నాకంటే పెద్ద వాళ్ళు.
మూడు నుంచి ఎకాఎకి ఐదులోకొచ్చి పడ్డాను కనుక.
చేతులు కట్టుకుని నిలబడ్డాను.
ఒణుకుతూ, ఒణుకుతూ పద్యం చెప్పడం మొదలు పెట్టాను.
‘ఎవ్వనిచే జనించు జగమెవ్వని నుండు లీనమై ఎవ్వని యందు డిందు పరమేశ్వడెవ్వడనాధి మధ్య లయుడెవ్వడు సర్వము తానైనా వాడెవ్వడు వానినాత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెద’
భాగవతంలోని పోతన పద్యం.
నేను పద్యం చెపుతున్నంత సేపు ఆంజనేయులు సార్, వెంకటరెడ్డి సార్ల ముఖాల్లో చిరునవ్వుతో కూడిన ఆనందం.
ఆంజనేయులు సార్ నా దగ్గరకొచ్చి భుజం తడుతూ శభాష్ అన్నారు.
వెంకటరెడ్డి సార్ దగ్గరకొచ్చి ‘నువ్వు ఏం తప్పుచేశావని ఒణుకుతావ్. బాగా చెప్పావ్. ధైర్యంగా ఉండు. తప్పు చేయనప్పుడు తండ్రికి కూడా భయపడకు’ అన్నారు. ‘తప్పు చేయనప్పుడు తండ్రికి కూడా భయపడకు”.
ఆ ఒక్క మాటే బక్కగా ఉండే నాకు ఏనుగంత బలాన్ని తెచ్చిపెట్టింది.
ఆ ఒక్క మాట నా జీవిత గమనాన్నే మార్చేసింది.
కొండంత అండగా నిలబడింది.
హేతుబద్ద ఆలోచన పెంచింది.
జీవితంలో ఇప్పటికీ ఆమాట వెంటాడుతూనే ఉంది.
మా నాన్నకు ఎప్పుడూ భయపడేవాడిని.
ధైర్యంగా ఆయనకు సమాధానం చెప్పడం నేర్చుకున్నాను.
ఆ ఒక్క మాటతో..
పొద్దున్నే మా నాన్న భగవద్గీత చదివేవాడు.
పజ్జెనిమిదవ అధ్యాయం అయిపోగానే కొబ్బరికాయ కొట్టేవాడు.
ఏ రోజు పజ్జెనిమిదవ అధ్యాయం అయిపోతుందో అంచనా లేదు.
పదిహేనో, పదహారో అధ్యాయం వచ్చేసరికి ‘జేబులో డబ్బులు తీసుకుని కొబ్బరికాయ తీసుకురా’ అనేవాడు.
జేబులో కరెక్టుగా నలభై పెసలే ఉంచేవాడు.
ఆరోజుల్లో కొబ్బరికాయ నలభై పైసలు.
గబగబా కమాను వరకు వెళ్ళి చిట్యాల నరసింహయ్య దుకాణంలో కొబ్బరికాయ తెచ్చేవాడిని.
కమాను వరకు అంటే దాదాపు ఒకటిన్నర, రెండు కిలోమీటర్లు ఉంటుందనుకుంటా.
ఒక్కొక్క సారి నేను తెచ్చిన కొబ్బరికాయ కుళ్ళిపోయేది.
కొబ్బరికాయ కొట్టాక కుళ్ళితే తిరిగి తీసుకునేవాడుకాదు.
చూసి తీసుకురాకూడదా అని మా నాన్న నన్ను అరిచేవాడు.
దీంట్లో నా
తప్పేముంది?
కొట్టకముందు అది కుళ్ళిందని గమనిస్తే, ఇచ్చేసి మంచిది తెచ్చేవాడిని.
అది కుళ్ళిందో, లేదో కొట్టక ముందు పెద్దవాళ్ళకే తెలియనప్పుడు, పన్నెండేళ్ళ వయసులో నాకెలా తెలుస్తుంది?
అదే అడిగే వాడిని.
మా నాన్నకు కోపమొచ్చేది.
భగవద్గీత వంటి తాత్విక గ్రంథాలు మనిషిలో హేతుబద్ధ ఆలోచనను పెరగనివ్వవు.
ప్రశ్నించనివ్వవు.
ప్రశ్నిస్తే నేరమవుతుంది.
‘చేసేది నేనే, చేయించేది నేనే. నువ్వ నిమిత్త మాతృడవు’
భగవద్గీత చెప్పే తాత్వికత.
హేతు బద్ధ ఆలోచనే లేకపోతే మానవ నాగరికత ఇంతగా ఎదిగేదికాదు.
అటవిక దశలోనే ఆగిపోయేది.
మా వెంకటరెడ్డి సార్ చెప్పిన ఒక్క మాట మానాన్న దగ్గరేప్రయోగించాను.
ఆయన ఆగ్రహానికి గురయ్యాను.
ఎవరికి ఇష్టమున్నా, లేకున్నా హేతుబద్ధంగా వ్యవహరించడం నా వరకు నాకు ఒక తృప్తినిచ్చింది.
మాసైన్స్ టీచర్ బ్రహ్మయ్య సార్ భూమ్యాకర్షణ శక్తి గురించి చెపుతూ, న్యూటన్ గురించి వివరించాడు.
చెట్టుపై నుంచి తలపై పడ్డ యాపిల్ కిందకే ఎందుకు పడింది? పైకెందుకు వెళ్ళ లేదు? అని తనను తాను ప్రశ్నించుకోబట్టే భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని కనుగొన్నాడు.
ఎంత సజీవ ఉదాహరణలతో చెప్పేవారో!
న్యూటన్ తనను తాను ప్రశ్నించుకోకపోతే, భూమ్యాకర్షణ శక్తి తెలిసేది కాదు.
సైన్స్ ప్రశ్నించమంటుంది.
మతం నమ్మమంటుంది.
ఆగస్టు పదిహేను, జనవరి 26 వస్తోందంటే చాలు, మాలో ఉత్సాహం ఉరకలెత్తేది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వాళ్ళం.
ముందు రోజు నిక్కరు చొక్కాను సిద్దం చేసుకునే వాళ్ళం.
ఉతికాక చెంబిస్త్రీ చేసేవాళ్ళం.
మా ఇంట్లో ఇస్త్రీ పెట్టె లేదు.
మా నాన్న గుడ్డలు చాకలి ఇస్త్రీ చేసుకొచ్చేవాడు.
ఒక ఇత్తడి గిన్నెలో మండే నిప్పులు పోసి, పటకారుతో ఆ గిన్నెను పట్టుకుని, జాగ్రత్తగా ఇస్త్రీ చేసేవాడిని.
రాత్రి నిద్రపట్టేది కాదు.
ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూసే వాళ్ళం.
పొద్దున్నే లేచి సిద్ధమై స్కూలుకు వెళ్ళే వాళ్ళం.
తెల్లవారు జామున ఐదు గంటలకు ప్రభాతభేరి మొదలయ్యేది.
జాతీయ జెండాలు పట్టుకుని వరుస క్రమంలో ఊరంతా తిరిగే వాళ్ళం.
‘దేశమును ప్రేమించు మన్నా’ అంటూ గురజాడ ‘దేశభక్తి గీతం’లోని ఒక్కొక్క చరణం టీచర్ పలుకుతుంటే, మేమంతా కోరస్ అందుకునే వాళ్ళం.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని గుర్తు చేసేవాళ్ళం.
ఆ చీకట్లోనే ఊరంతా తిరిగే వాళ్ళం.
ఆరోజుల్లో తారు రోడ్లు లేవు, అన్నీ కంకర రోడ్లే.
కాళ్ళంతా దుమ్మురేగేది.
ఒక్కొక్క సారి కిందపడి మోకాలు చిప్పలు దోక్కుపోయేవి.
ఆయినా లెక్కచేసేవాళ్ళం కాదు.
‘దేశ భక్తి’ గీతాలాపనతో ఊరంతా మేలుకొనేది.
ఒక పక్క కాళ్ళు నొప్పులు పెడుతున్నా, మరొక పక్క ప్రభాత భేరి అయిపోతుంటే బాధ.
మళ్ళీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే వాళ్ళం.
హెడ్ మాస్టర్ రామిరెడ్డి తెల్లని పంచ కట్టుకుని, తెల్లని చొక్కా వేసుకుని నల్లగా, పొట్టిగా ఉండేవారు.
హెడ్ మాస్టర్ వెనుక టీచర్లంతా నిలుచునే వాళ్ళు.
హెడ్మాస్టర్ జాతీయ జెండా ఎగరేస్తుంటే, ఎదురుగా తరగతి వారిగా వరుసల్లో నిలుచుండే వాళ్ళం.
వార్షికోత్సవానికి నాటకాలువేసే వాళ్ళం.
నేను రెండే రెండు నాటకాలు వేశాను.
నాటకాలు వేయడానికి నెల రోజుల ముందు నుంచి రిహార్సల్స్ చేసే వాళ్ళం.
ఒక నాటకంలో మామ గారి పాత్ర వేశాను.
సన్నగా పొట్టిగా ఉండే నాకు పంచకట్టి, చొక్కా వేసి, తెల్లగా తలకు పౌడర్ కొట్టారు.
కోడలు పొడుగ్గా ఉంటుంది.
కోడలు పాత్ర నా క్లాస్ మేటే వేశాడు.
రిహార్సల్స్ జరుగుతున్నాయి.
కోడలి చెంప పైన కొట్టాలి.
గట్టిగా కొట్టాను, పాపం ఆపాత్ర వేసినతనికి నిజంగా కళ్ళు తిరిగినంత పనైంది.
‘అంత గట్టిగా కొడితే ఎట్లా? నీ దెబ్బకు వాడు డైలాగులు మర్చిపోతాడు’ అన్నాడు నాటకం నేర్పించే సార్.
‘డైలాగులు నేనేం మర్చిపోను గట్టిగానే కొట్టు’ అన్నాడు కోడలు వేషం వేసినతను నాటకం రక్తి కట్టాలని.
మరొక నాటకంలో నేను టీచర్ వేషం వేశాను.
టీచర్ పొట్టిగా ఉండాలి, స్టూడెంట్ పొడుగ్గా ఉండాలి.
టీచర్ బెత్తం పుచ్చుకుని స్టూడెంట్ను కొట్టాలి.
వాడు నాకు అందనంత ఎత్తు.
అందుకుని కుర్చీ ఎక్కి కొట్టాలి.
అలాగే కుర్చీ ఎక్కి స్టూడెంట్ను కొట్టాను.
పిల్లలంతా నవ్వులే నవ్వులు.
రామాంజనేయులు సార్ సన్నగా, నల్లగా పొడుగ్గా ఉండేవారు.
సోషల్ స్టడీస్ చెప్పేవారు.
ఆయన మంచి హాకీ క్రీడాకారుడు.
పొద్దున్నే స్కూలు గ్రౌండ్ కెళ్ళి పిల్లల కు హాకీ నేర్పించేవారు.
నోట్లో విజిల్ పెట్టుకుని వారితో పాటు ఆడుతూ నేర్పించేవారు.
మంచి హాకీ టీం తయారు చేశారు.
స్కూలు సమయాల్లో చేతిలో బరికె ఉండేది.
ప్రార్థనకు ఆలస్యమైతే చాలు ఆ బరికె తో ఒక్కటిచ్చేవారు.
ఆ దెబ్బను తిప్పించుకుని క్లాసులోకి పరిగెత్తే వాళ్ళు.
నేనైతే ఆ బరికె దెబ్బలకు భయపడి, ఎప్పుడూ లేటుగా వెళ్ళలేదు.
ఒక్క సారి కూడా దెబ్బలు తినలేదు.
రామాంజనేయులు సార్ ను చూస్తే పిల్లలు భయపడే వారు.
స్కూలులో క్రమశిక్షణను అలవాటు చేసేవారు.
హిందీ చెప్పే యాసిన్ సార్ పొడుగ్గా, షేర్వాని వేసుకుని వచ్చేవారు.
మంచి ఒడ్డు పొడుగు ఉండే సాధాకర్ రెడ్డి సార్ బయాలజీ చెప్పేవారు.
ఆరోజుల్లో కాంపోజిట్ లెక్కలు చెప్పడానికి రఘునాథ రెడ్డి అనే ఒకే ఒక్క టీచర్ ఉండేవారు.
‘మా పిల్లవాడిని కాంపోజిట్ లో చేర్పించాలి’ అని తల్లి దండ్రులు లేఖ రాసిస్తేనే అందులో చేర్చే వారు.
కాంపోజిట్ తీసుకుంటేనే పాలిటెక్నిక్లో చేరడానికి, ఇంటర్లో ఎంపీసీ తీసుకోవడానికి వీలుండేది.
మిగతా అందరికీ జనరల్ లెక్కలే.
జగదీశ్వరయ్య జనరల్ లెక్కలు చెప్పేవారు.
సర్దార్సింగ్, రాంప్యారీ టీచర్ భార్యాభర్తలు.
మూడు నెలల క్రితం వనపర్తి వెళితే అక్కడ స్కూలు లేదు.
దాన్ని పడగొట్టేసి కాస్త దూరంగా కొత్త భవనం కట్టారు.
మేం చదువుకున్న స్కూల్ కనిపించ లేదు.
మనసులో దిగులు దొంతరలు పేరుకుపోయాయి.
Every piece of memories is a masterpiece. Continue……