-రాఘవశర్మ
రాజనగరం జాతర.
మరిచిపోలేని ఒక మహా సందడి. గుర్తుండిపోయే మహా సంరంభం. బాల్యంలో చెరగని చిరు ఆనందం.
జాతర ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే వాళ్ళం.
నవంబర్లో పౌర్ణమితో జాతర మొదలయ్యేది.
నెల రోజులుండే జాతరలో పక్షం రోజులు బాగా జరిగేది.
వనపర్తికి మూడు కిలోమీటర్ల దూరంలో రాజనగరం.
ప్యాలస్ కు పడమర దిశగా కొత్తకోట వెళ్ళే రోడ్డు లో వెళ్ళి, మరొక రోడ్డు లో కి చీలుతుంది.
హైస్కూల్లో చదివే రోజుల్లో సైకిళ్ళలో వెళ్ళేవాళ్ళం.
సైకిల్ నేర్చుకున్న కొత్తలవి.
కొత్తబిచ్చగాడు పొద్దెరగడన్నట్టు, సైకిల్ దొరికితే చాలు ఒదిలిపెట్టే వాణ్ణి కాదు.
మా ఇంట్లో సైకిల్ లేదు.
అప్పుడు మా నాన్నకు సైకిల్ రాదు.
నేను నేర్చుకున్నాక మా నాన్నసైకిల్ నేర్చుకున్నాడు.
చీకటి పడ్డాక తన సహ ఉద్యోగి షరీఫ్ మానాన్నను గ్రౌండ్లోకి తీసుకెళ్ళి సైకిల్ నేర్పించాడు.
సైకిల్ నేర్చుకునే ముందే హెర్క్ లెస్ సైకిల్ కొన్నాడు.
సైకిల్ కొనక ముందు కిరాయికి తీసుకుని తొక్కేవాణ్ణి.
ప్యాలెస్ ప్రధాన ద్వారం దాటాక వచ్చే చౌరస్తా పక్కనే సైకిల్ షాప్.
గంటకు రూపాయి, అర్ధ గంటకు అర్ధరూపాయి.
ఆరోజుల్లో ఎక్కువగా అట్లాస్ సైకిళ్ళే కిరాయికి ఇచ్చే వాళ్ళు.
కాస్త బలమైంది కావాలంటే హెర్క్ లెస్ ఎప్పుడో తప్ప దొరికేది కాదు.
నాజూకుగా, చాలా మెత్తగా పోవాలంటే ర్యాలీ సైకిల్.
బాటా చెప్పులు, ర్యాలీ సైకిలు, హిందూ పేపరు; నాజూకు తనానికి ఒక నమూనా.
మా పక్కింట్లో ఉండే పట్టాభిరామయ్య ర్యాలీ సైకిల్ కొన్నారు.
దాన్ని చూస్తూ ఆనందపడేవాణ్ణి.
ర్యాలీ సైకిల్ తొక్కాలని బలే మోజున్నా, దొరికేది కాదు.
హంబర్ సైకిల్ కూడా అంతే.
మా అమ్మ పోపుల డబ్బాలో దాచిన రూపాయో, అర్ధరూపాయో ఇస్తేచాలు, సైకిల్ తొక్కే వాణ్ణి.
అది కిరాయికి వచ్చే డొక్కు అట్లాస్ సైకిల్.
ఆరోజుల్లో ఆ డొక్కే నా పాలిట మహా గొప్ప.
సైకిల్ నేర్చుకున్నాక తొలిసారిగా వెళ్ళింది రాజనగరం జాతరకే.
రాజనగరం సమీపిస్తుండగా వాసుదేవమ్మ తోట.
చుట్టూ పెద్ద గోడకట్టి ఉండేది.
ఆ తోటలో రకరకాల వృక్షాలు.
లోనికెళితే ఎంత ఆహ్లాదంగా ఉండేదో!
లోపలే వనపర్తి రాజవంశస్తుల సమాధులు.
జాతరకు వెళ్ళినప్పుడల్లా వాసుదేవమ్మ తోటలోకి వెళ్ళి వచ్చేవాళ్ళం.
జాతర సమీపిస్తుంటే ఆరోజుల్లో అదొక వింత ప్రపంచంలా ఉండేది.
ఒకటే రద్దీ.
ఆరద్దీని దాటుకుని వెళ్ళడం అంటే, పద్మవ్యూహాన్ని ఛేదించినట్టుండేది.
రకరకాల వస్తువులు అమ్మే వాళ్ళు.
పిల్లలకైతే పీకలు, బూరలు, వేణువులు, రబ్బరు బెలూన్లు, రంగు రంగు కాగితాల కళ్ళ జోళ్ళు. జాతరలో పశువుల అమ్మకాలు, కొనుగోళ్ళు.
జాతరలో ఏదైనా ఒక వస్తువు కొనుక్కొస్తే మహాగొప్ప!
అదొక వినోదం, అదొక విభ్రాంతి.
జాతరలో నేను చూసిన ఒక వింత సంఘటన.
చుట్టూ జనం మూగి ఉన్నారు.
మధ్యలో ఏం జరుగుతోందో తెలియదు.
అరుపులు, ఈలలు, కేకలు, అంతా గోలగోల.
వాళ్ళలోకి దూసుకెళ్ళి చూశాను.
మధ్యలో ఒక మగ మనిషి, ఆడ మనిషి నిలుచుని ఉన్నారు.
వారి పక్కన ఇద్దరు పట్టే ఒక చుట్టు గుడిసె.
చుట్టూ మూగిన జనంలోంచి ఓ వ్యక్తి వాళ్ళమధ్యకు వచ్చాడు.
అతనికి డబ్బులిచ్చాడు.
ఆమెతో కలిసి అతను గుడిసెలోకి వెళ్ళాడు.
కాసేపటికి బైటికొచ్చి తలొంచుకుని వెళ్ళిపోయాడు.
చుట్టూ చేరిన వారి అరుపులు.
అర్థమైపోయింది అదొక విషాదం.
మానవ విషాదం.
స్త్రీ శరీరాన్ని అమ్ముకోవడం.
దూరంగా రెండు కర్రలు కట్టి, వాటి మధ్య కట్టిన తాడుపై ఒక చిన్నారి నడక.
కింద మరో వ్యక్తి డప్పు కొడుతూ డబ్బులు అడుక్కోవడం.
మరొక చోట బిడ్డను నేలపై పడుకోబెట్టి, కత్తితో నాలుకను కోయడం.
నోట్లోంచి రక్తం కారుతూ ఆ బిడ్డ గిలగిలా కొట్టుకోవడం!
కాసేపటికి ఏమీ జరగనట్టు ఆ బిడ్డ లేచి కూర్చోవడం.
ఓ వ్యక్తి డప్పు వాయిస్తుంటే మరో వ్యక్తి చర్లాకోనతో శరీరాన్ని కొట్టుకోవడం.
కోటి విద్యలు కూటి కొరకే!
నిజంగా ఇవి విద్యలా!?
బతకలేక బతక డానికి చేసే పాట్లు.
ఇలా ఎన్నో ఎన్నెన్నో వింతలు, విడ్డూరాలు.
జీవితంలా జాతర కూడా కొన్ని ఆనందాలు, కొన్ని విషాదాలు.
ఆనందాల్లో కలగలిసిపోయి, కనపడని కొన్ని విషాదాలు.
ఆరోజుల్లో జాతరకు కుటుంబంతో జట్కా బండిలో వెళ్ళే వాళ్ళం.
ఆ మూడు కిలోమీటర్లు ఒకటే రద్దీ.
ఆరోజుల్లో ఇంకా రిక్షాలు రాలేదు.
ఆటోల సంగతే తెలియదు.
సాయంత్రమైతే చాలు మట్టి రోడ్లో జట్కా బండ్లు దుమ్ము రేపుకుంటూ పరుగెత్తేవి.
టకటకట మంటూ గుర్రపు డెక్కల శబ్దాలు.
చర్లాకోనతో చక్రాలకు అడ్డం పెట్టి కర్ర్ ర్.. అంటూ జట్కా వాలా
చేసే శబ్దం.
ఆ శబ్దం వింటూనే అడ్డం వచ్చిన వారు పక్కకు తొలిగిపోయేవారు.
ఒంటరిగా సైకిల్లో వెళ్ళేవాణ్ణి.
ఇప్పుడు జాతర మారిపోయింది.
ఆధునికత సంతరించుకుంది.
రంగు రంగుల అందాలు, రకరకాల జియంట్ వీల్స్.
చుట్టుపక్కల గ్రామీణుల కొనుగోళ్ళకు రకరకాల వస్తువులు.
అదే సరదా, అదే సంరంభం.
కాకపోతే నాగరికత పెరిగింది, ఆధునికత సంతరించుకుంది.
ఇప్పుడు జట్కాలు లేవు, సైకిళ్ళు రావు.
అన్నీమోటారు బైకులు, కార్లు, జీపులు.
ఇప్పుడు జాతర కాదు, మినీ ఎగ్జిబిషన్.
అక్కడే శివాలయం.
అప్పటిలా లేదు, ఇప్పుడు కాస్త పునరుద్ధరించారు.
శివాలయానికి పక్కనే దేవుడు ఊరేగడానిక రథం.
దాని ముందే ఉట్టి కొట్టడానికి పాతిన రాతి కూసాలు.
దానికి ఈవల వనపర్తి రాజా అతిథి గృహం.
అక్కడికి అచ్చుతాపురం మరో రెండు కిలోమీటర్లు.
నా సహ విద్యార్థి సి.సి.రెడ్డి స్వగ్రామం.
హైస్కూలులోను, జూనియర్ కాలేజీ లోను అతను నాసహవిద్యార్థి.
అతను కూడా జర్నలిస్టే.
నలభై ఏళ్ళ తరువా కలుసుకున్నాం.
మా సహవిద్యార్థుల్లో మేం ఇద్దరమే ఇలా పత్రికారంగంలోకి వచ్చాం. సి.సి.రెడ్డి ‘నెనరు’ పుస్తకం రాశాడు.
మూడేళ్ళ క్రితం ఈ పుస్తక ఆవిష్కరణ కోసం అచ్యుతాపురం తీసుకెళ్ళాడు.
నాతో పాటు హైదరాబాదు నుంచి చాలా మంది జర్నలిస్టులు వచ్చారు.
జాతర జరిగే ప్రాంతాన్ని నాలుగున్నర దశాబ్దాల తరువాత మళ్ళీ రాజనగరం చూశాను. జాతర పక్షం రోజులే హడావిడి.
ఆ పక్షం రోజులే సంరంభం, సందడి.
జాతర లేని సమయంలో అంతా నిర్మానుష్యం.
మీ గత చరిత్ర జ్ఞాపకాల సమాహారం పారుటేరులా సాగుతూనే ఉంది. ఎన్ని ఎపిసోడ్లు రాసినా చదవడానికి మేము సిద్ధం. జీవన దారులు వేరయి బాల్య స్నేహితులు, ఉద్యమాల న్నేహితులు విడిపోయాక ఓ 20 లేదా 30 ఏళ్ల తర్వాత కలుసుకున్నప్పుడు పొందే ఆ మహదానుభూతిని ఈ మధ్యనే నేను కూడా ఆస్వాదించానండి. ఏదేమైనా మీ వల్ల తిరుమల ప్రాకృతిక చరిత్రే కాదు.. వనపర్తి చరిత్ర కూడా పునీతమవుతోంది. ఇలాగే సాగిపోండి. అభినందనలూ, ధన్యవాదాలూ..
జాతర లో వ్యభిచారం బహిరంగంగా. ….ఇది కొత్త విషయం నాకు.