(వనపర్తి ఒడిలో-8)
-రాఘవ శర్మ
ప్యాలెస్ అవరణలో ఆడిటోరియం. అనేక ఆలోచనలకు, ఆనందాలకు అది వేదిక.
కళాశాల వార్షికోత్సవాల్లో ప్రముఖుల ఉపన్యాసాలు.
పాటలు, నాటకాలు, నాట్యాలు, సినిమాలు, బహుమతి ప్రదానాలు.
లెక్కలేనన్ని సాంస్కృతిక కార్యక్రమాలు.
ప్యాలెస్ కు దక్షిణ దిశగా ఆడిటోరియం ఉండేది.
ఆడిటోరియంలో కార్యక్రమం జరగబోతోందంటే చాలు సందడే సందడి.
విద్యార్థుల్లోనే కాదు, కాలేజి సిబ్బందిలోను, వారికుటుంబ సభ్యుల్లోనూ.
పిల్లల్లో ఇక చెప్పనవసరం లేదు.
ఊహ తెలిసినప్పటి నుంచి అందులో చూడని కార్యక్రమం అంటూ లేదు.
ఆడిటోరియం వద్ద చాలా క్రమశిక్షణ ఉండేది.
ఎ న్ సీ సీ విద్యార్థులు అడిటోరియం వద్ద బందోబస్తు డ్యూటీ నిర్వహించేవారు.
కాలేజీలో అడుగడుగునా ప్రిన్సిపాల్ కె. రామిరెడ్డి పాలనా సామర్థ్యం కనిపించేది.
ముందు రెండు మూడు వరుసల్లోని కుర్చీల్లో బోధనా సిబ్బంది.
వారి వెనుక బెంచీల్లో కాలేజీ విద్యార్థులు.
బాల్కనీలో సిబ్బంది కుటుంబ సభ్యులు.
నాలాంటి చిన్న పిల్లలం ముందు పరిచిన జంపఖానాపై కూర్చునే వాళ్ళం.
ఈ సుత్తి ఉపన్యాసాలు ఎప్పుడైపోతాయా అని ఎదురు చూసేవాళ్ళం.
నాటకాలు చూడవచ్చని.
అయితే అందుకు భిన్నంగా జరిగింది.
అది 1966, 67 అనుకుంటా.
జ్వాలా ముఖి ప్రసంగిస్తున్నారు.
ఆయన చెప్పే ప్రతి మాటకు విద్యార్థులు చప్పట్లుకొడుతున్నారు.
అధ్యాపకుల ముఖాల్లోనూ చిరునవ్వులు.
జ్వాలాముఖి చాల ఉద్వేగంగా మాట్లాడుతున్నారు.
మాటలు మంటలను పుట్టిస్తున్నాయి.
విద్యార్థులు అంతే ఉద్వేగంగా స్పందిస్తున్నారు.
నా వయసు అప్పుడు పదకొండేళ్ళు.
జ్వాలాముఖి మాట్లాడుతున్నమాటల్లో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. అయితే, ఒక్క మాట మాత్రం శాశ్వతంగా గుర్తుండిపోయింది.
అది జీవితాంతం.
‘జంజం తెంచేశాను’ అన్నారు జ్వాలాముఖి.
అంతే, ఆడిటోరియం అంతా చాలా సేపు చప్పట్లు మారుమోగాయి. జ్వాలాముఖి జంజం ఎందుకు తెంచేశారా! అని నాకప్పుడు అర్థం కాలేదు .
దానికి వీళ్ళు చప్పట్లు ఎందుకు కొడుతున్నారో! అదీ తెలియడంలేదు.
‘జంజం తెంచేశాను’ అన్న మాట మాత్రం నా మనసులో నిలిచిపోయింది.
డిగ్రీ చదువుతున్నప్పుడు, నా పంతొమ్మిదవ ఏట నేనుకూడా ఆపని చేసినప్పుడు అర్థమైంది.
జ్వాలాముఖి జంజం ఎందుకు తెంచేసింది, విద్యార్థులు చప్పట్లు ఎందుకు కొట్టింది.
జ్వాలాముఖి మాట్లాడాక మాట్లాడవలసిన ఒక ప్రముఖ వక్త మాట్లాడలేదు.
‘జ్వాలాముఖి గారు ఇంత బాగా మాట్లాడాక, నేను మాట్లాడడానికి ఏముంటుంది?’ అని దణ్ణం పెట్టి కూర్చునేశారు.
అదొక ఉద్వేగ కాలం.
ఉద్యమాలకు ఊపిరు లూదుతున్న కాలం.
అవినీతి, ఆశ్రితపక్షపాతం, కులతత్వానికి, కుళ్ళుకు వ్యతిరేకంగా యువత గొంతెత్తుతున్న కాలం.
‘స్వాతంత్ర్య’ భ్రమలు తొలగిపోతున్న కాలం.
ఆరుగురు దిగంబరకవులూ ఈసమాజానికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన కాలం.
ఈ అసమసమాజంపై వారు విరుచుకుపడ్డారు.
వారిలో జ్వాలాముఖి ఒకరు.
ఆ ఒక్క కంఠం కోట్లాది యువకుల గొంతై మోగింది.
ఆయనకు ఊపిరి ఉన్నంత కాలం ఆయన కంఠం మోగుతూనే ఉంది.
నేను వింటూనే ఉన్నాను.
‘వెయిన్లో మెషిన్ గన్ రెయిన్’లా ప్రవహిస్తూనే ఉంది.
ఒక సారి అతిథులుగా జ్వాలాముఖితోపాటు నిఖిలేశ్వర్ కూడా వచ్చారు
ఆ అడిటోరియంలో వేసే నాటకాల్లో విద్యార్థులే కాదు, అధ్యాపకులూ నటించేవారు.
మా బాబాయి ధర్మవరపు రాంగోపాల్ పాలిటెక్నిక్ చదవుతున్నాడు.
నాటకాలు వేసేవాడు.
ఒక సారి ‘మోడ్రన్ యముడు’ ఏకపాత్రాభినయం వేశాడు.
తెర తొలుగుతుంది.
సన్నగా, పొడుగ్గా, టక్ చేసుకున్నాడు మోడ్రన్ యముడు.
ఒక చేతిలో గధలా పుచ్చుకున్న పప్పుగుత్తి.
మరో చేతితో సైకిల్ తోసుకుంటూ రంగస్థలంపైకి వస్తాడు.
సైకిల్ హ్యాండిల్ కు పెద్ద తాడుచుట్ట చిట్టి ఉంటుంది.
‘ఎవరు స్వామీ తమరు?” అంటుంది తెర వెనుక నుంచి ఓ ఆడ గొంతు.
‘ఆ..హ్ నన్నే ఎరుంగ కుంటివా సావిత్రి?. నా బాటాబూటును చూచైననూ నేనెవరో తెలుసుకొనకుంటివా?
నా ఈ పప్పుగుత్తి గదాయుధంబైనను చూచి నన్నెరుగవా?
నాయీ పాశంబైననూ నామాక్షరములు తెలియ చెప్పకున్నవా? సావిత్రీ’ అంటూ తలపట్టుకుంటాడు.
‘ఏల వచ్చితిరి స్వామి?”
‘నీ పతిప్రాణములు గొనిపోవుటకు వచ్చితిని’
‘స్వామీ.. పతి లేనిచో నా గతి ఏమి?’
‘నీ కేమి సావిత్రి, అనేక మంది సినీ హీరోలుండగా!’
ఈ ద్వందార్థాలకు విద్యార్థులు ఈలలు, కేకలు, గోలగోల.
‘తప్పదు సావిత్రి. నీ పతిప్రాణములు గొనిపోక తప్పదు’ అంటూ తాడు ఒక వైపునక విసురుతాడు.
ఆ తాడును అవతల సావిత్రి పట్టుకుంటుంది.
ప్రేక్షకులకు సావిత్రి కనిపించదు.
‘వదులుము సావిత్రి సావిత్రి వదులుము.
నా కర్తవ్యమునకు అడ్డుతొలుగుము’
‘నేను వదలను స్వామి. నా పతి ప్రాణములే నాకు ముఖ్యము’
‘ఒదులుము సావిత్రి ఒదులుము. నా పాశము ఒదులుము.’
‘నా పతిప్రాణములు వదలనంత మటుకునేను పాశమును వదలను’
‘అయ్యో సావిత్రి..నీవు పాశము వదలని ఎడల నా ఉద్యోగము పోవును’
‘నేను వదలను స్వామి వదలను’
‘సావిత్రీ నిన్ను వేడుకుంటున్నాను. అసలే ఆడపిల్లలు కలవాడిని. ఉద్యోగము పోయినచో జీవించుట కష్టము.
నీ పతి ప్రాణములు విడుచుచున్నాను
ఒదులుము’
‘అటులనే ఒదిలితిని స్వామి’ అంటూ తాడు వదిలేస్తుంది.
‘హమ్మయ్య.. ఈ రోజునకు బతికిపోయితిని. బుద్ధి వచ్చినది. ఇలాంటి పతివ్రతల జోలికి ఎన్నడూ పోరాదు’ అంటూ సైకిల్ తోసుకుంటూ వెళ్లిపోతాడు.
తెరపడిపోతుంది.
హాలంతా చప్పట్లు మారుమోగాయి.
ఈ హాస్య నాటకంలో ఎంత సరదా ఉన్నా, సావిత్రిని కించపరిచేలా ఉంది.
నాకు గుర్తున్న నాటకం ఇది.
పాలిటెక్నిక్ అయిపోయాక మా బాబాయి హైదరాబాదు విద్యుత్ విభాగంలో చేరాడు.
నాటకాలు వదలలేదు.
ఏ.ఆర్.కృష్ణకు శిష్యుడయ్యాడు.
మాలపల్లి నాటకంలో సంగదాసు పాత్ర వేశాడు.
అలాగే చోరామస్వామి ‘తుగ్లక్’ నాటకంలో తుగ్లక్ గా నటించాడు.
ఈ రెండూ బాగాపేరు తెచ్చాయి.
రవీంద్ర భారతిలో తరచూ నాటకాలు వేసేవాడు.
తరువాత సినిమా అవకాశాలు వచ్చాయి.
శాంబెనగల్ తీసిన ‘ఒక ఊరి కథ’లో ఒకప్రధాన పాత్రలో నటించాడు.
గౌతం ఘోష్ తీసిన ‘మాభూమి’ సినిమాలో కార్మిక నాయకుడుగా నటించాడు.
చిరంజీవి నటించిన స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ లోనూ నటించాడు. ఇలా కొన్ని అవకాశాలు వచ్చాయి.
ఉద్యోగం ఉంది. సినిమా వెంట పడలేదు.
ఇలా ఎంతో మంది విద్యార్థులలో దాగి ఉన్న కళానైపుణ్యాలను వెలికి తీయడానికి ఈఆడిటోరియం వేదికైంది.
అలాగే అధ్యాపకులు కూడా.
నాకు తెలిసి సివిల్ విభాగాధిపతి కె.ఎస్.నరసింహం కూడా ఒక నాటకంలో వేషం వేశారు.
ఆయన సన్నగా, కాస్త పొడుగ్గా, అందంగా ఉండేవారు.
అందుచేత పెళ్ళికొడుకు వేషం ఇచ్చారు.
ఆప్పటికే ఆయనకు పెళ్ళై ఒక కుమార్తె కూడా ఉండడంతో అందరూ నవ్వుకున్నారు.
ఆడిటోరియంలో శనివారం, ఆదివారం సినిమాలు వేసేవారు.
కాలేజీ ఆవరణలోనే వారానికి రెండు సినిమాలు.
ప్యాలెస్ దాటి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు.
చదువుతో పాటు విద్యార్థులకు వినోదం.
శనివారం హిందీ సినిమా అయితే, ఆదివారం ఇంగ్లీషు సినిమా.
ఎప్పుడైన తెలుగు సినిమా వేసేవారు.
16 ఎం.ఎం. స్క్రీన్ ఉండేది.
సినిమా ఏకబిగిన వేసేవారు కాదు.
నాలుగు రీళ్ళుగా ఉండేది.
రీలు తీసి రీలు వేసేవారు.
ఏరోజు ఏసినిమానో ప్యాలెస్ మొదటి అంతస్తులో ఉండే నోటీస్ బోర్డులో ముందు రోజు వేసేవారు.
వాటిని చూసి ఆనందం.
హిందీలో ఎక్కువగా దేవానంద్ సినిమాలు వచ్చేవి.
రాజ్ కపూర్, దిలీపు కుమార్ సినిమాలు కూడా వేసేవారు.
ఇంగ్లీషు సినిమాల్లో చార్లీచాప్లిన్వి ఎక్కువ.
భాష అర్థం కాకపోయినా వాటిలో లీనమైపోయేవాళ్ళం.
“ఆ అడిటోరియంలో ఒక పుష్కరకాలం ఎన్ని సినిమాలు! ఎన్ని నాటకాలు! ఎన్ని ఆనందాలో! వాటికోసం ఎన్ని ఎదురుచూపులో!
ఉత్తేజ కరమైన ఆసక్తికరమైన ఆనందదాయకమైన వనపర్తి విశేషాలు అభినందనలు