రాఘవ శర్మ
పాలిటెక్నిక్ పెట్టిన కొత్తల్లో పుట్టిన పిల్ల లంతా పెరుగుతున్నారు. బుడిబుడి నడకలతో అడుగులు నేర్చుకుంటున్నారు.
తల్లి దండ్రుల చేతులను విదిలించుకుని మరీ నడుస్తున్నారు.
మాటల మూటలైపోతున్నారు.
పచ్చని చెట్ల మధ్య వారి మనసు విచ్చుకుంటోంది.
కళ్ళముందున్న తెల్లని ప్యాలెస్ నేలకు దిగిన చందమామనిపిస్తోంది.
నడక నుంచి పరుగులు మొదలైనాయి.
ప్యాలెస్ చుట్టూ లేగ దూడల్లా గెంతుతున్నారు.
జింక పిల్లల్లా పరుగులు తీస్తున్నారు.
చెట్లెక్కుతున్నారు, ప్యాలెస్ మెట్లెక్కుతున్నారు.
అదే లోకమనుకుంటున్నారు.
అక్కడి నుంచి బైట ప్రపంచాన్ని చూస్తున్నారు.
చీకూచింతా లేని జీవితం, అవధులు లేని ఆనందం.
ప్యాలెస్ ఆవరణలో రెండు పిల్ల సైన్యాలు తయారయ్యాయి.
ఒక సైన్యానికి నాయకురాలు శైలజ.
ఆమెకు కుడి ఎడమలుగా సరళ, ఉష.
శైలజ తెల్లగా, సన్నగా, పొడుగ్గా ఉండేది.
పిల్లల మధ్య అంతఃపుర కాంతిలా వెలిగిపోయేది.
జీసెస్ ‘ఫాలోమీ’ అన్నట్టు, పిల్ల సైన్యమంతా ఆమెను అనుకరించేది.
నాయకత్వ లక్షణాలు ఉన్నాయి.
పిల్లలంతా సీతాకోక చిలుకల్లా చెట్ల మధ్యనే ఎగురు తున్నారు.
ప్యాలెస్ చుట్టూ పరుగులు తీస్తున్నారు.
ప్యాలెస్ వెనుక నుంచి మెట్లెక్కి పై అంతస్తుకు చేరుతున్నారు.
అక్కడి నుంచి పరిసరాలన్నిటినీ పరికిస్తున్నారు.
ఆ సైన్యంలో మగ పిల్లలంతా మరీ చిన్న వాళ్ళు, ఆడపిల్లలే ఎక్కువ.
అది ప్రమీల సామ్రాజ్యంలా ఉంది.
ప్యాలెస్ ముందున్న ఫౌంటెన్లో దిగి ఆడేవారు.
వారి ఆటలన్నీ సుకుమారములు, సుందరములు.
శైలజను ‘సివిలెడ్డు బిడ్డ’ అనేవారు వాచ్మెన్ లు, అటెండర్లు.
సివిల్ విభాగాధిపతి కె.ఎల్.నరసింహం ఏకైక ముద్దుల పట్టి.
ఎలక్ట్రికల్ విభాగాధిపతి సోమసుందరం నాయుడు కుమార్తె సరళ.
ప్రిన్సిపాల్ రామిరెడ్డి కుమార్తె ఉషా.
ప్యాలెస్ ఆవరణలో ఇంగ్లీషు మీడియం స్కూలు వెలిసింది. ఆత్మానంద స్కూలు హెడ్మాస్టర్ గోపాలాచారి.
సన్నగా, తెల్లగా, పొడుగ్గా, నెరిసిన గిరజాల జుట్టుతో ఉండేవారు.
ఆ స్కూల్లో ప్యాలెస్ ఆవల నివసించేవారు కూడా చేరేవారు. అలా చేరిన వారిలో గోరిమా మేనల్లుడు సయ్యద్ జమీల్ కూడా.
ఆత్మానంద ఇంగ్లీషు మీడియం స్కూల్లో ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. స్కూలంతా పెద్ద సందడి సందడిగా ఉండేది.
శైలజ ఇప్పుడు అమెరికాలో స్థిరపడింది.
భర్త, పిల్లలు, మనవలతోపాటు ఆమె తండ్రి కూడా ఇప్పుడు అక్కడే ఉన్నారు.
ఉషా విద్యారంగం లో పల్మొనాలజిస్ట్ గా అమెరికాలో స్థిరపడింది.
సరళ చెన్నైలో నివాసం.
రెండవ పిల్ల సైన్యం మాది.
మా సైన్యంలో మగపిల్లలెక్కువ, ఆడ పిల్లలు తక్కువ.
రామిరెడ్డి మారుతల్లి కుమారుడు మోహన్ రెడ్డి కూడా మా సైన్యంలో సభ్యుడే.
చిత్తూరు జిల్లా మర్రిమాకులపల్లెలో ఉండేవాడు.
వేసవిసెలవుల్లో వనపర్తి వచ్చేవాడు.
వేసవి కాలంలో అతనే మా సైన్యాధిపతి.
మిగతా రోజుల్లో దళపతి లేని దళం మాది.
చుక్కాని లేని నావ అయినా సమిష్టి కార్యాచరణ.
మోహన్ రెడ్డి ఎత్తుగా, లావుగా, బలిష్టంగా ఉండేవాడు.
మా అందరికంటే పొడుగు, పెద్దవాడు.
అన్నంటే చచ్చే భయం.
తోటల్లో కెళ్ళి మామిడి కాయలు కోసుకుని తినేవాడు.
కాపలా దారులు వెంట బడితే పరుగో పరుగు.
అతన్ని చూసే జామకాయల కోసుకు తినడం నేర్చుకున్నాం.
ప్యాలెస్ అవరణలో ఉన్న జామతోటకు దక్షిణ సరిహద్దులో ఒక ఇంటిపైకి జామ చెట్టువాలి ఉండేది.
ఆ ఇంటి మిద్దెకు అనుకుని వెడల్పాటి ఇనుప కరెంటు స్తంభం వేసి ఉంది.
ఆ స్తంభం పట్టుకుని మిద్దెక్కి జామకాయలు కోసుకుని తినే వాళ్ళం.
అలా తినే జామకాయలు ఎంత రుచిగా ఉండేవో!
ఇప్పుడు ఎంత డబ్బులుపెట్టి కొనుక్కున్నా ఆ రుచిరాదు.
మాపిల్ల సైన్యంలో ముత్యాలప్ప అన్న నారాయణప్ప పిల్లలు, వర్క్ షాప్ ఫోర్మెన్ సీతాపతి పిల్లలు, ఇంకా కొందరుండేవారు.
మాది చాలా అల్లరి సైన్యం.
చెట్లెక్కడం, కోతి కొమ్మచ్చి ఆడడం.
చింత చెట్టెక్కి చిగురు కోసుకు తినడం.
రేగి చెట్టెక్కి రేగి పళ్ళు తినడం.
రోజుకొక్క సారైనా ప్యాలెస్ పైకెక్కి చుట్టూ పరికించడం.
ప్యాలెస్ ఎక్కినప్పుడల్లా మోకాళ్ళు, మోచేతుల నిండా గోడలకున్న తెల్లని సున్నం అంటించుకోవడం.
ప్యాలెస్ అవరణలో అటలు చూడడం, పాటలు వినడం.
ఒక సారి రేగిచెట్టెక్కినప్పుడు పైనుంచి కిందపడ్డాను.
ఒళ్ళు తెలియలేదు.
కళ్ళు తెరిచి చూసేసరికి ఇంట్లో పడుకున్నాను.
కుడిచేతి మణికట్టు ఎముక విరగడంతో కట్టుకట్టారు.
తిట్టకుండా మానాన్న సానుభూతి వచనాలు పలకడం అదే తొలిసారి.
ఇప్పటికీ మణికట్టు ఎముక కాస్త బైటికి పొడుచుకుని ఉంది.
కట్టు తీసేవరకు స్కూలు ఎగ్గొట్టాను.
‘జరుగుబాటు ఉండాలే కానీ, అసుపత్రిలో పడక ఎక్కినంత సుఖం ఎక్కడా ఉండదు’.
అప్పుడే ఆ నానుడి నాకు అనుభవంలోకొచ్చింది.
మా ఆటలన్నీ కోతి కొమ్మచ్చి, గోలీలు, గోడుం బిళ్ళ.
ఇసుకలో కబడ్డీ ఆడితే మోకాళ్ళు దోక్కుపోయేవి.
హాకీ, క్రికెట్ ఆడాలని ఉన్నా, బ్యాట్లుండేవి కావు.
హాకీ బ్యాట్ కోసం చెట్లెక్కి కాస్త ఒంపున్న కొమ్మల్ని కొట్టుకొచ్చే వాళ్ళం.
ప్యాలెస్ ఆవరణంతా పర్యవేక్షించే బాధ్యత కంఠీరవాచారిది.
పంచ కట్టుకుని, తెల్లగా, ఎప్పుడూ నోట్లో పాన్ నములుతూ ఉండేవాడు.
చెట్టుకొడుతున్న శబ్దం విని మేమెవరో తెలియక కంఠీరవాచారి పెద్దగా అరిచాడు.
అంతే..భయంతో కత్తివదిలేసి, చెట్టు నుంచి దూకి పారిపోయాం.
సంస్థాన సైన్యం విడిది చేసే చోటు ఫౌజ్ గుట్ట.
ప్యాలెస్ కు ఆగ్నేయ దిక్కున, వర్క్ షా ప్ వెనుక భాగంలో ఉన్న ఫౌజ్ గుట్టకు అప్పుడప్పుడూ వెళ్ళే వాళ్ళం.
మా జీవితంలో అదే తొలి ట్రెక్కింగ్.
ఫౌజ్ గుట్ట చివరి వరకు వెళ్ళొచ్చే సరికి చాలా అలసిపోయేవాళ్ళం.
అక్కడంతా నిర్మానుష్యం.
అయినా నదురు లేదు, బెదురు లేదు.
ఫౌజ్ గుట్టలో గోరింటాకు, చింతబలకాయలు(సీతాఫలం) కోసుకొచ్చే వాళ్ళం.
ఫౌజ్ గుట్టకు, వర్క్ షాపుకు మధ్య విశాలమైన ఖాళీ జాగా.
మధ్యలో ఒంటరిగా పెద్ద మర్రిచెట్టు.
చందమామ కథల్లో చెప్పినట్టు దానికొక పెద్ద తొర్ర.
చీకటిపడితే ఆ తొర్రలో ఎవరైనా దాక్కున్నారేమో నన్న భయమూ. ఆ భయంతో చీకటిపడకముందే ఇల్లు చేరేవాళ్ళం.
ఈత నేర్చుకోవడం ఆరోజుల్లో నా జీవిత ధ్యేయం.
మానాన్నకు ఈత రాదు.
జాతకాలపైన అచంచల విశ్వాసం.
నాకు నీటి గండం ఉందని అంతులేని నమ్మకం.
నన్ను బావుల దగ్గరకు వెళ్ళనిచ్చేవాడుకాదు.
నాన్న నిద్రపోవడం చూసి ఈతకు వెళ్ళే వాణ్ణి.
అప్రాంతంలో అన్నీ పెద్ద పెద్ద దిగుడుబావులే.
తల్లి దండ్రులే దగ్గరుండి పిల్లలకు ఈతనేర్పించేవాళ్ళు.
కోస్తా జిల్లాలు ఇందుకు భిన్నంగా ఉండేవి.
అక్కడ అన్నీ పంట కాలువలే.
మత్స్యకారుల పిల్లలకు తప్ప, ఇతరులకు ఈత నేర్చుకునే అవకాశం లేదు.
కోస్తా జిల్లాల నుంచి వచ్చిన వారికి ఈత వచ్చేది కాదు.
అయిదు లీటర్ల ఖాళీ కిరసనాయిలు డబ్బా మూతకు సీలు వేయించి, దాన్ని నడుకుము కట్టుకుని అందరితో కలిసి మోటబావిలో దూకేవాడిని.
ఆ డబ్బాలకు మానాన్న రంద్రాలు పొడిచి పనికిరాకుండా చేశాడు ఒక సారి.
నా కంటే చిన్న వాళ్ళు ఈత కొడుతున్నారు.
ఆముదపు బెండ్లు నడుముకు కట్టుకుని మోట బావిలో దూకే వాణ్ణి.
నడుమంతా ఒరుసుకుపోయేది.
ఎన్నాళ్ళు ఆ బెండ్లు కట్టుకుని దూకుతావ్? తీసి దూకేయ్ అన్నారెవరో.
అంతే..దూకేశాను.
పైకి రాలేకపోయాను.
మా పనిమనిషి శేషమ్మ చిన్న కూతురు లక్ష్మి చాలా బలంగా ఉండేది.
పుట్టగోచీ పెట్టి బావిలో దూకింది.
నా జుట్టుపట్టుకుని పైకి లాక్కొచ్చింది.
అప్పుడు నావయసు పన్నెండు, పదమూడేళ్ళు.
దాంతో ఈతకు రెండు మూడేళ్ళ విరామం.
టెన్త్ పరీక్షలు రాయడానికి గద్వాల వెళ్ళాం.
పొద్దున పరీక్షలైపోగానే మధ్యాహ్నం బావులపైన పడేవాళ్ళం.
అందరూ ఈత కొడుతుంటే గట్టున కూర్చునే వాడిని.
వెనుక నుంచి వచ్చి ఒక్క తోపు తోశాడెవడో.
ఈదుకుంటూ గట్టుకొచ్చేశాను.
కిరసనాయిలు డబ్బాలు, ఆముదపు బెండ్లు కట్టుకుని ఏడాది పైగా నేర్చుకున్న ఈత ఫలితం అది.
అంతే.. ఈత విషయంలో మళ్ళీ వెనక్కి చూడలేదు.
ఈత భయమూ పోయింది, ఈత కోరికా తీరింది.
ఆదివారం వచ్చిందంటే చాలు, మేడి బావో, కప్పగంతుల బావో నా ప్రియనేస్తాలైపోయేవి.
ఈత నా జీవితంతో పెనవేసుకు పోయింది.
ఒక్క సారి నేర్చుకుంటే జీవితాంతం మర్చిపోలేం.
దానికి మరుపంటూ ఉండదు.
మనకు తెలియకుండానే కాళ్ళూ చేతులు ఆడుతుంటాయి.
నీటి గుండాలు కనిపిస్తే చాలు పూనకం వచ్చేస్తుంది. దూకేయాలనిపిస్తుంది.
ఇంటర్ చదివేటప్పుడు ఆదివారం వచ్చిందంటే కప్పగంతుల బావికి వెళ్ళే వాణ్ణి.
బావి చుట్టూ పచ్చటి పొలాలు.
మా లెక్చరర్లు కూడా ఒకరిద్దరు వచ్చే వాళ్ళు.
ఆ బావిదగ్గరే వాళ్ళు బట్టలు ఉతుక్కునే వాళ్ళు.
వాటిని ఆరేసుకుని ఈదులాడే వాళ్ళు.
ఒక్కొక్కళ్ళు ఎన్ని విన్యాసాలో!
నా బట్టలు నేను ఉతుక్కోవడం వాళ్ళనుంచే నేర్చుకున్నాను.
ఎప్పుడో తప్ప మేడి బావికి వెళ్ళే వాళ్ళం కాదు.
మూడు నెలల క్రితం వనపర్తి వెళ్ళాను.
ఒకప్పటి మేడి బావి, కప్పగంతుల బావి ఆనవాళ్ళు లేవు.
అన్నీ పూడిపోయాయి.
విస్తరిస్తున్న నగరం బావుల్ని, కుంటల్నీ మింగేసింది.
కొత్త తరాన్ని ఈతరాని వారిగా చేసేసింది.
(ఆలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్ట్, రచయిత, ట్రెక్కర్. తిరుపతి)
చాల బాగా రాసార్