కృష్ణా నదీ జలాల పంపిణీలో అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న కర్నూలులోనే కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఇచ్చిన పిలుపుకు రాయలసీమ వ్యాప్తంగా అనూహ్య స్పందన వచ్చిందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రకటించారు.
గురువారం రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో చేపట్టిన రాయలసీమ ధర్మదీక్ష ను విజయవంతం చేసిన రైతాంగానికి, రైతు, ప్రజా సంఘాల నాయకులకు అభినందనలు తెలిపారు.
ఈ దీక్ష నేపథ్యంలో సంతకాల సేకరణకు పిలుపునిచ్చామని, కేవలం రెండు రోజుల వ్యవధిలోనే రాయలసీమ వ్యాప్తంగా దాదాపు ఆరువేల పై చిలుకు మందితో సంతకాల సేకరణ జరగడం రాయలసీమ ప్రజల మనోభావాలకు, ఆకాంక్షలకు ఇదొక బలమైన నిదర్శనమని ఆయన తెలిపారు.
కర్నూలు, కడప,అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల ప్రజల నుండి సేకరించిన సంతకాల పత్రాలను రాయలసీమ ధర్మదీక్ష వేదికగా రైతు, ప్రజా సంఘాల ప్రతినిధులు తమకు అందజేసారని, ఈ పత్రాలతో పాటు కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలు జిల్లాలో ఏర్పాటు పై సవివరణలతో కూడిన ఉత్తరాన్ని ముఖ్యమంత్రి గారికి పంపవలసిందిగా కోరుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి అందజేశామని తెలిపారు.
కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటు గురించి రాయలసీమ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొని పోయినప్పుడు వారు ఎంతో సానుకూలంగా స్పందించారని ధర్మధీక్ష వేదికగా రైతు ప్రతినిధులు తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసారు.
కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటు దిశగా ప్రభుత్వం పునః సమీక్ష చేయాల్సిన అవసరాన్ని పాణ్యం శాసన సభ్యులు కాటసాని రామభూపాల్ రెడ్డి, పత్తికొండ శాసన సభ్యురాలు కంగాటి శ్రీదేవి, ప్రొద్దుటూరు శాసన సభ్యులు రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, మైదుకూరు శాసన సభ్యులు శెట్టిపల్లి రఘురామిరెడ్డి, కర్నూలు శాసన సభ్యులు హఫీజ్ ఖాన్, కౌడుమూరు శాసన సభ్యులు జె. సుధాకర్, శాసన మండలి సభ్యులు రమేష్ యాదవ్, నంద్యాల శాసన సభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి, ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి లకు రైతు ప్రతినిధులు వివరించారని, దానికి స్పందించి వారు ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొనిపోతూ వ్రాసిన ఉత్తరాలు ఇచ్చారని తెలిపారు. రైతు ప్రతినిధులు ప్రజాప్రతినిధుల నుండి సేకరించిన ఉత్తరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపామని ఈ సందర్భంగా ఆయన వివరించారు.
కృష్ణానది బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటుకు ఉత్తరాలు వ్రాయడంతో పాటు, ఈవిషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకొనిపోతామని ప్రజాప్రతినిధులు తెలిపినందుకు, వారికి హృదయ పూర్వక అభినందనలు తెలుపుతున్నామని దశరథరామిరెడ్డి తెలిపారు.
కృష్ణానది సక్రమ నీటి నిర్వహణతోనే రాయలసీమ నీటి హక్కులకు భరోసా లభించే నేపథ్యంలో, ముఖ్యమంత్రి గారు కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులోనే ఏర్పాటు దిశగా పునఃసమీక్ష చేయలని ఆయన విజ్ఞప్తి చేసారు.
సీమ ప్రజా ప్రతినిధులు కూడా ప్రజల మనోభావాలను గౌరవించి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని పోయి కృష్ణా నది బోర్డు కర్నూలులో ఏర్పాటుకు కృషి చేయాలని దశరథరామిరెడ్డి విజ్ఞప్తి చేసారు.