పడకేసిన పందికోన రిజర్వాయర్

*పందికోన రిజర్వాయర్ అసంపూర్తి పనులను తక్షణమే పునః ప్రారంభించి, పూర్తి చేయాలి

*పందికోన రిజర్వాయర్ ను కూడా అలగనూరు రిజర్వాయర్ లాగా పశువుల ఆవాసంగా మార్చొద్దు

 

 

కృష్ణా, తుంగభద్ర నదులు రాయలసీమ ద్వారా గలగల ప్రవహిస్తున్నప్పటికి రాయలసీమ త్రాగు నీటికి, సాగునీటికి అలమటిస్తుందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

మంగళవారం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని పందికోన రిజర్వాయర్ ను రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ఆద్వర్యంలో రైతు ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు సందర్శించారు.
ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ…

రాయలసీమ హక్కుగా వినియోగించుకోవల్సిన నీటిని నిలుపుకొనడానికి కావలసిన రిజర్వాయర్లు, కాలువలు నిర్మించక పోవడంతో ఆ నీరంతా రాయలసీమకు దిగువనున్న కోస్తా ప్రాంతాలకు తరలిపోతున్నదని, దీనితో కృష్ణా నది కోస్తా ప్రాంతాలను సస్యశ్యామలం చేయడమే కాకుండా అక్కడ చేపల చెరువుల అభివృద్ధికి కూడా దోహదపడుతున్నదని, అన్ని వనరులతో అభివృద్ధి పధంలో ముందు ఉండాల్సిన రాయలసీమ ప్రాంతం, పాలకుల నిర్లక్ష్యం, లోపభూయిష్టమైన విధానాలవలన వెనుకబాటుకు గురైందన్నారు.

ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాజెక్టులు సక్రమ నీటి వినియోగం పొందలేక పోవడానికి గల కారణాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, పాలకులపై ఒత్తిడి పెంచేందుకు రాయలసీమ ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమంను రాయలసీమ సాగునీటి సాధన సమితి చేపట్టిందని ఆయన వివరించారు.

పందికోన రిజర్వాయర్ ను హంద్రీనీవా ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా చేపట్టడం జరిగిందని, హంద్రీనీవా ప్రాజెక్టు కు 1987 వ సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం శంకుస్థాపన చేసిందన్నారు. శంకుస్థాపన చేసిన పాలకులు గాని తదనంతరం అధికారంలోకి వచ్చిన పాలకులు గాని ప్రాజెక్టు నిర్మాణాన్ని మొదలు పెట్టని విషయాన్ని గుర్తు చేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2005లో పనులు మొదలు పెట్టి 2012 నవంబర్ 12 న భగీరథ యాత్ర చేసి హంద్రీనీవా మొదటి ఫేజ్ ను జాతికి అంకితం చేసారన్నారు.

అంటే ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన 18 సంవత్సరాల వరకు ఎలాంటి పురోగతిలేదనీ, ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన 25 సంవత్సరాలకు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయి జాతికి అంకితం చేసారని వివరించారు. ప్రాజెక్టు జాతికి అంకితం చేసిన 10 సంవత్సరాల తరువాత కూడా నేటికి పందికోన రిజర్వాయర్ నుండి నిర్దేశించిన 61400 ఎకరాల ఆయకట్టులో 25 శాతం ఆయకట్టుకు కూడా నీరందడం లేదని ఆయన విమర్శించారు. నీరు అందిస్తున్న ఆ కొద్దిపాటి ఆయకట్టుకు కూడా ఎన్ని రోజుల వరకు, ఏ పంటలు వేసుకోవడానకి నీరందిస్తారో స్పష్టంగా చెప్పలేని పరిస్థితులలో ప్రభుత్వం ఉందన్నారు.

ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు

1. పందికోన రిజర్వాయర్, రిజర్వాయర్ నుండి ప్రధాన కాలువల, అనేక డిస్ట్రిబ్యూటరీల, పంట కాలువల నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటం.

2. హంద్రీనీవా ప్రాజెక్టు నిర్వహణకు తగినట్లుగా ప్రధాన కాలువల, రిజర్వాయర్ల సామర్థ్యాన్ని చేపట్టకపోవడం.

3. శ్రీశైలం రిజర్వాయర్ లో మన హక్కు ఉన్న నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో దిగువకు వదులుతూ నీటిని కృష్ణా జిల్లా చేపల చెరువుల, సముద్రం పాలు చేస్తుండం.

అసంపూర్తిగా ఉన్న పందికోన రిజర్వాయర్ పనులను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టి కర్నూలు జిల్లాలోని వెనుకబడిన పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆలూరు నియోజకవర్గంలో 61400 ఎకరాలకు నీరు అందించాల్సి ఉన్నప్పటికీ హంద్రీనీవా ప్రాజెక్టు మొదటి ఫేజ్ ఫేజ్ పూర్తి అయ్యిందని జాతికి అంకితం చేసిన పది సంవత్సరాల తరువాత కూడా ఈ ఆయకట్టుకు నీరందంచే పరిస్థితులను కల్పించడంలో గత పాలకులందరు విఫలమయ్యారని, ప్రస్తుత ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకు వేసి తాను అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరంలో అనగా జులై 8, 2020 న జి వో నెం 365 ద్వారా నత్త నడకన నడుస్తున్న ఈ పనులను కూడ పూర్తిగా నిలుపుదల చేసిందని విమర్శించారు. అంతటితో ఆగకుండా ఈ ప్రాజెక్టుల పనులు కోసం ఎలాంటి ప్రతిపాదనలు ఐదు సంవత్సరాల వరకు చేపట్ట కూడదని కూడా జీ వో లో పొందుపరచడం దారుణమన్నారు.

పందికోన రిజర్వాయర్ దయనీయ పరిస్థితి దర్శనమిస్తున్నప్పటికి, హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణం మా ఘనతే అంటే మా ఘనతే అని గత, ప్రస్తుత పాలకులు ప్రచార ఆర్బాటాలు చేస్తున్నారనీ, ఈ ప్రచార ఆర్బాటాలలో పందికోన రిజర్వాయర్ పై త్రాగునీటికి ఆధారపడిన ప్రజల దుస్థితి, సాగునీటికై ఆధారపడిన రైతుల దుస్థితిని సభ్య సమాజానికి కనపడకుండా పోతున్నదని, ఇప్పటికైనా ఈ ప్రాంత సమాజం మేల్కొని తమ హక్కులపై రాజకీయ పార్టీలను నిలదీయకపోతే ఇంకా వందేళ్ళెనా పందికోనా పరిస్థితిలో ఎలాంటి పురోగతి ఉండకపోగా, అలుగనూరు రిజర్వాయర్ లాగా పందికోన రిజర్వాయర్ కూడా పసుపుల ఆవాసంగా మారినా ఆశ్చర్య పోవాల్సిన అవసరంలేదన్నారు. పాలకులు ఇప్పటికైనా స్పందించి నిర్మాణాల పునః ప్రారంభానికి కార్యాచరణ చేపట్టాలనీ, శ్రీశైలం రిజర్వాయర్ లో రాయలసీమ హక్కు ఉన్న నీటిని ఒక బొట్టు కూడా దిగువకు వదలకుండా ఆపడానికి పోరాడాలనీ అన్ని రాజకీయ పార్టీలను కోరారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఏరువ రామచంద్రారెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి కర్నూలు జిల్లా కన్వీనర్ కె.సుదర్శనరెడ్డి, డి టి ఎఫ్ నాయకులు రత్నం ఏసేపు, బస్తిపాడు రామకృష్ణారెడ్డి, ప్రజా సంఘాల నాయకులు RCC రాజకీయ ఆర్గనైజర్ రాజు, ఎమ్మిగనూరు నాగన్న, గోనెగండ్ల S.N.మహబూబ్ వలి, పందికోన సుబంభాష, బతకన్న, నరసన్న, మారెప్ప, లోకేష్, నీలకంఠ, శ్రీనివాసులు, సూరిబాబు, పెద్దరంగన్న పందికోన రిజర్వాయర్ గ్రామాల ఆయకట్టు రైతులు పాల్గొనగా పందికోన రిజర్వాయర్ D.E లు, A.E.లు క్షేత్ర స్థాయిలోని సాంకేతిక విషయాలు వివరించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *