(భూమన్)
బాగా చలి. మంచు కురుస్తూన్న రోజులు . మంచి సీజను అడవి చుట్టి రావడానికి. ఈ కాలంలోనే ప్రకృతిలో స్నానం చేసి రావాలి . ఆ ఆనందం, ప్రకృతి హేల అద్భుతంగా ఉంటుంది. అడవికి ఎన్ని మార్లు పోయినా ప్రతిసారి కొత్త గానే ఉంటుంది.
ఎర్రెడ్ల మడుగు కు ఇంతకు మునుపు ఐదారు సార్లు పోయినా , మళ్లీ పోవడానికి అక్కడి జలపాతాలు సోయగాలు ,హోయలే ప్రధాన కారణం.
దాదాపు 40 మంది యువతి, యువకులు ,పిల్లలతో కలసి బాలపల్లి నుండి బయలుదేరినాము.
అన్ని వంకలు, వాగుల్లో నీళ్లు పోతున్నాయి. మంచు పొగల మధ్య ఆ ప్రయాణం గొప్ప థ్రిల్లింగ్ గా ఉంది. చాలా మంది మోటర్ బైక్స్ , స్కూటర్స్ లో వస్తున్నారు .
దారంతా బురద బురద, గుండ్రాళ్ల మధ్యన చాకచక్యంగ, ఒకరికొకరు తోడుగా, దాదాపు గంట సేపు ప్రయాణం చేసి ఎర్రెడ్ల మడుగు చేరుకున్నాము.
బాగా వాన పడినప్పుడు చూడాలని ఎన్ని మార్లు అనుకుంటున్న కుదిరేది లేదు . వాన పడిన రెండు మూడు రోజులకి ప్రవాహ వేగం తగ్గిపోతుంది. నిండుగా పారుతున్నప్పుడు గుంజన , గుండాలకోన , సాలింద్ర కోన , కంగు మడుగు, కైలాస తీర్థం , తుంబురకోన చూడాలని ఆశ. ఆ సమయంలో దారులన్నీ అసాధ్యాన్నిస్తాయి గనుక కుదరడమే లేదు . ఏదో ఒక రోజు బాగా పారుతున్న కాలాన ఆ ఉదృత దృశ్యాన్ని కనులారా చూడాలి .
ఎర్రెడ్ల మడుగు చాలా ఆకర్షకంగా ఉంటుంది .ఒడ్లు ఎర్రగా ఉంటాయి . అప్పుడెప్పుడో రెడ్లు ఈ సందన పశువులను మేపి గాట కట్టటం వల్ల ఈ పేరు వచ్చిందని , అదేదో కాలంలో ఎర్రెడ్ల పేరుతో ఒక గుంపు నివసించిందని అంటారు. చరిత్ర సరిగా రాయబడక పోవటం వల్ల దేనికి సరైన ఆధారం లేదు . పైగా శేషాచలం అడివి గిరిజన గూడాలన్నీ ఖాళీ అయిన ప్రాంతం . రెడ్ శాండర్స్ విరివిగా ఉన్న ప్రాంతం .స్మగ్లర్స్ కి రాజ్యం . దారి పొడవునా కొట్టేసిన చెట్లను, ఉన్న చెట్లను చూస్తూ పోతున్నాము .ఎంత విలువైన సంపద చిందర వందరగా దొంగల పాలవుతున్నది గదాని ఆగ్రహం . జన సంచారమే ఉండి ఉంటే smuggling కి ఆస్కారమే ఉండేది కాదు గదా ?
ఎర్రెడ్లమడుగు ఒంపు సొంపులు చాలా ఆకర్షకంగా ఉంటాయి . దేవతీర్థం , సిద్ధలేరు , అన్నదమ్ముల బండ , వాగులన్నీ ఇక్కడికే జారుకుంటాయి . ఆ ప్రవాహపు అంచు లెంబడి పెద్ద పెద్ద గుండ్లు ఎగ పాక్కుంటూ,పక్క దార్లల్లో గుట్టలు ఎక్కుకుంటూ పోతుంటే , ఆ నడకే ఒక అన్వేషణ గా ఉంటుంది . గుబురుగా చెట్ల మధ్యన, పక్కల్లో పట్టుచీర అలంకరించుకున్నట్లు , ఆ రాల వరుసలు , కానువిందు చేస్తున్న ఆ ప్రకృతి లో తడుస్తూ నీటి వాలు ప్రవాహ సంగీతం లో అందరం మనసు ను పారేసుకుంటూ , ఐక్యం చేసుకుంటూ ఒకరికొకరం సహకరించుకుంటూ నడుస్తుంటే , ఆ నడతే ఒక దివ్యగావేషణగా ఉంది.మధ్య మధ్యలో తుంపర వాన . జారుడు , పడుతున్న లేస్తున్న వాళ్ళు , వస్తున్న వాళ్లు ,గాయపడుతున్న వాళ్లు , దేన్నీ లెక్క చేయకుండా ముందుకు అడుగేయడమే ట్రక్కింగ్ లక్షణం, లక్ష్యం . దారి పొడవునా సన్న సన్నటి జలపాతాలు దాటుకుంటూ చివరికి పోతే అదొక అత్యద్భుత నీటి సౌందర్యం .
దాదాపు 300 అడుగుల ఎత్తు నుండి ప్రవహిస్తున్న జలపాతాన్ని చూసి ప్రతి ఒక్కరం ఆశ్చర్యం , ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయినాము. ట్రెక్కర్లు దానికి కార్తికేయ తీర్థం అని పేరు పెట్టినారు . నిజానికి వాటి ఒరిజినల్ పేర్లు ఎవరికీ తెలియవు . ఎవరికి తోచినట్టు వారు పిల్చుకుంటున్నారు . ఆ జలపాతపు అంచు చేరు కోటానికి అందరూ చక చకా ఎక్కేస్తుంటే ఎందుకు లెమ్మని కింద నే ఈ తాడుతుంటే , భాస్కర్ , విశ్వనాథ్ , శీను , యుగంధర్, శ్రవణ్ మేమున్నాం రండి సార్ అని ప్రేమగా , అత్యంత వాత్సల్యముతో ఒకరికొకరు దాటిగా ఏర్పడి తాడు కట్టి ఎక్కించటం గొప్ప గగనమే.
అదొక గొప్ప సాహసం .ఆ సాహసం చేయకపోతే ఆ మడుగు సౌందర్యాన్ని చూడలేక పోయేవాన్ని .బాగా ఈతాడి దిగేటప్పుడు తాడు అవసరం లేకుండా అత్యంత సులువుగా దిగిరావడం విశేషమే .ఆచరణ నేర్పించేస్తుంది .తీరా దిగొచ్చినాక ఇట్టాంటి సాహసాలు మళ్లీ చెయ్యరాదని మాత్రం గట్టిగా నిర్ణయించుకున్నాను . కొన్ని తగవు . ఎక్కడ ఆపాల్లో అక్కడ ఆపడం మంచిదని గట్టి సంకల్పం చెప్పుకున్నాను. అడవి, ప్రకృతి చాలా గుణ పాఠాలు చెబుతుంటుంది . అడవిలో ఏనుగులను తప్పించుకుంటాం, చిరుతల బారి నుండి కాపాడుకుంటాం, ఎలుగుబంటి లతోనూ ఎదురుకుంటాం మన సమాజం లోనే అడుగు పెడుతూనే మతం, కులం ,ఆర్థిక వ్యత్యాసం లాంటి దుర్మార్గాలని ఎదుర్కొటమే పెద్ద సమస్య గా ఉంది .
తిరిగొస్తు మళ్లీ ఒక జలపాతం . దాని పేరు కైవల్య తీర్థం . అట్టంటివి చిన్న పెద్ద నీటి పరుగుల్ని చూస్తూ , దూకాల్సిన చోట దూకుతూ , ఈత ఆడుతూ అడవి , నీరు , ప్రకృతి , మానవ సమాజాల్ని బేరిజు వేసుకుంటూ, గొప్ప అనుభూతుల్ని గుండెల్నిండా ప్రోగు చేసుకొని రాత్రికి బయటికొచ్చినాము .
ఇట్టాంటి అడవి ప్రయాణాలు , ప్రకృతి బాటలు ప్రతి ఒక్కరికి చేరువలో ఉండాలని నా సంకల్పం . అందుకు ఎంతో మంది తోడవుతున్నారు . ఈ మా నడకల వల్ల ఇప్పటికి దాదాపు కొన్ని వేల మంది touch లోకి వచ్చినారంటే ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను.
WE ARE NOT NOW THAT STRENGTH WHICH IN OLD DAYS MOVED EARTH AND HEAVEN, THAT WHICH WE ARE, WE ARE, ONE EQUAL TEMPER OF HEROIC HEARTS,
MADE WEAK BY TIME AND FATE, BUT STRONG IN WILL TO STRIVE, TO SEEK, TO FIND, AND NOT TO YIELD”.
ULYSSES.
THIS POEM REMIND S US MANY .
BHUMAN