దాని వెనక వెయ్యేళ్ల కిందటి ఒళ్ళు గగుర్పొడిచే కథ–
-రెడ్డి రత్నాకర్ రెడ్డి, చరిత్ర పరిశోధకుడు
రాజులు పోయారు. రాజ్యాలు కూలినై . సమాజ హితం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరులు మాత్రం చరిత్రలో నిలిచిపోయారు. వీరుల త్యాగాలకు గుర్తుగా ప్రతిష్టించిన విగ్రహాలను వీరగల్లులు అంటారు.
సతి సహ గమనం చేసిన , శివ సాయుజ్యం పొందిన స్త్రీలు సైతం సతి శిలలుగా , గ్రామ దేవతలుగా పూజించబడుతున్నారు . సతి శిలలు వీరగల్లులలో ఒక భాగమే. వీరగల్లులు తెలంగాణలోనే కాకుండా దేశమంతట కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి.
వీరగల్లులను ఆ వీరుడి కుటుంబ సభ్యులు , బంధువులు, స్థానిక గ్రామస్థులు లేదా రాజు కానీ ప్రతిష్టించేవారు. అనేక వీరగల్లులకు ప్రత్యేకంగా గుడులు నిర్మించబడ్డాయి. నిత్య ఆరాధన కూడ జరిగేది.
ఒక్కో వీరగల్లు ఒక్కో వీరోచితమైన కథ చెబుతుంది.
గ్రామ సంక్షేమం కోసం, కాకతీయ సామ్రాజ్యం కోసం శివుని సన్నిధిలో ఆత్మార్పణం చేసుకున్న వనపర్తి సతి శిలది మాత్రం వెయ్యేళ్ల కిందటి ఒళ్ళు గగుర్పొడిచే కథ.
ఆనాటి భక్తి విశ్వాసాలకు అనుగుణంగా “ఒక వనిత తనకు తానే కత్తితో శిరస్సును ఖండించుకుని ప్రాణత్యాగం చేసిన యోధురా”లిని గూర్చి ఒక శిల్పం కథ ఇది.
శిల్పం చెప్పిన కథ
————————
“శివుని గుడి కాడ గెడ కర్ర ( వెదురు బొంగు) పాతిండ్రట” తెల్లారగట్ల అందరి నోటా ఇదే ముచ్చట. ఊరంతా అట్టుడికి పోతున్నది.
ఆమె మాత్రం ఉన్న వాటిలో చక్కటి చీర ధరించింది .ఊరి పొలిమేరల్లో ఉన్న శివుని గుడి దిక్కు నడిచింది. ఆలయం పక్కనే ఉన్న పెద్ద చెరువు ఉంది. చెరువు లోకి దిగే ముందు గాజులు, శరీరం మీద ఉండవలసిన ఇతర ఆభరణాలు త్యజించింది. చెవి దుద్దులు , మెడలో సాదా సీదాగా ఉన్న ఒక గొలుసు మాత్రమే మిగిలి ఉన్నాయి. సిగ ముడి విప్పింది. శివ నామ స్మరణ చేస్తూ మూడు మునకలు వేసింది. సూర్యుడిని కమ్మిన కారు మబ్బుల వలే , ఆమె కాంతి వంతమైన ముఖాన్ని శిరోజాలు అన్ని వైపులా కప్పేసాయి. జుట్టును రెండు చేతులతో వెనకకి తోసి , వెను తిరిగి చూడకుండా రుద్రేశ్వరాలయం వైపుకు కదిలింది. అప్పటికే పదుల సంఖ్యలో అక్కడికి వచ్చిన గ్రామస్తులు ఆమె వెనుకే కదిలారు. ఆలయ దక్షిణ ముఖ ద్వారం ముందున్న రెండంతస్తుల మంటపం ముందు ఒక క్షణం నిలబడింది. రెండవ ప్రతాపరుద్ర చక్రవర్తి క్రీ.శ.1293లో ప్రతిష్ట చేసినట్లు చెబుతున్న శాసనంపై ఉన్న శివ లింగంపై ఆమె చూపు నిలిచింది. సూర్య చంద్రులున్నంత కాలం తమ సామ్రాజ్యం సుభిక్షంగా ఉంటుందని మనసులోనే అనుకుంది. ముందుకు కదిలి ఆలయం లోపల ఉన్న నంది ముఖాన్ని తాకింది.గర్భ గుడి ద్వారానికి ఇరువైపుల చెక్కిన కలశాల వలే ఆమె హృదయం మోయలేనంత భక్తి విశ్వాసాలతో బరువెక్కింది. ఒక దీర్ఘ శ్వాస వదిలి శివ లింగాన్ని తదేకాత్మతో స్పృశించింది. విభూది ధరించింది. శివ లింగం ముందు ఉన్న ఖడ్గాన్ని చేతిలోకి తీసుకొని కళ్ల కద్దుకుంది.
గుడికి రెండో వైపున భూమిలో పాతిన గెడ కర్ర ( వెదురు బొంగు) వద్దకు గ్రామ ప్రజలు పరుగు పరుగున వచ్చి చేరుతున్నారు. గెడ కర్ర కింద ఉన్నతాసనం ( కూర్చి పీట) వేసి ఉంది. మహిళలు, పిల్లలు గుడి వైపుకు రాకూడదని అప్రకటిత నిషేదం విధించబడింది. అయినప్పటికీ నిషేధాజ్ఞలు దాటుకొని కొంత మంది మహిళలు గెడ కర్ర చుట్టూ గుమి గూడిన జనంలో కలసి పోయారు. కొన్ని కొత్త ముఖాలు కనిపిస్తున్నాయంటే ఇరుగు పొరుగున ఉన్న ఊళ్ళో వారికి కూడా విషయం తెలిసిపోయిందనీ ఇట్టే అర్థమవుతుంది.
గుడి ముందు నిల్చున్న భక్తులు, అధికారులు,గ్రామస్తులు దారి ఇస్తుండగా అమే వారి మధ్య నుండి గెడ కర్ర వైపు నడిచింది.దారి పొడవునా ఆమెను దండం పెడుతూ “హర హర మహాదేవ శంభో శంకర” అని గొంతెత్తి నినదిస్తున్నారు. గెడ కర్రకు దగ్గరగా ఉన్న వారంతా ఒక్కసారిగా దూరంగ జరిగారు. ఆమె గెడ కర్రను కింది నుంచి పైదాకా చూసింది. కర్రను వంచడానికి సహాయంగా వస్తున్న ఒకరిద్దరిని వారించింది. తానే స్వయంగా ఎడమ చేతితో వంచుకొని కింద ఉన్న పీటపై కూర్చుంది. ఇంకా తడి ఆరని విరబోసిన వెంట్రుకలలోంచి కొన్నింటిని ఒక పాయగా తీసి గెడ కర్రకు బిగుతుగా ముడి వేసుకుంది. చుట్టూ ఉన్న వారందరికీ నమస్కారం చేసింది.”హర హర మహాదేవ శంభో శంకర” అంటూ చుట్టూ ఉన్న వారు ప్రతి నమస్కారం చేశారు.
ఆమె కళ్ళు మూసుకొని ” తన గ్రామాన్ని, ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచ” మని చేతులు పైకెత్తి శివుణ్ణి ప్రార్థించింది.
పూజించిన కత్తిని కుడి చేత ధరించి కత్తి అంచును పరీక్షించింది.
శిరోజాలతో ముడి వేసిన గెడ కర్రను ఎడమ చేతితో పట్టుకుంది. కుడి చేయి వేగంగా కదిలింది. కత్తికి పదును పెట్టినవాడి పని తనం సూర్యుని వెలుతురు తాకి జిగేల్ మన్నది.ఒకే ఒక్క వేటుకు శిరస్సు ఖండించబడింది. ఎడమ చేతి పట్టు వదలగానే గెడ కర్ర విసురుగా మొండంతో విడివడి శిరస్సుతో పైకి లేచింది. ఆ విసురుకి చుట్టూ ఉన్న వారిపై రక్తం చిమ్మింది. తల నుండి కిందికి రక్తం కారుతుండగా శరీరం కిందకు ఒరిగిపోయింది.
తల్లి దండ్రులకు ఏవో మాటలు చెప్పి , ఇంట్లోంచి బయట పడి వచ్చిన యువకులు, అత్తా మామలను ఒప్పించి చూడాలనుకొని వచ్చిన మహిళలు ధైర్యం చాలక ఆ క్షణంలో కళ్లు మూసుకున్నారు. మరికొందరు మధ్యలోనే వెళ్ళి పోయారు. ఎంతో జీవితం చూసిన కొద్ది మంది మాత్రమే గుండెని అర చేతిలో పట్టుకొని చూసారు. చాలా మంది వచ్చినప్పటి నుండి దేవుడికి దండం పెట్టుకునే ఉన్నారు.
అసమానమైన ఆమె త్యాగం చరిత్రలో నిలిచిపోవాలనీ, ఎల్లప్పుడు అమెను గౌరవించాలని నిర్ణయించు కున్నారు. ఆమె జ్ఞాపకార్థం ఒక వీరగల్లు(సతి శిల) వేయాలని నిర్ణయించారు. తమ క్షేమం కోసం త్యాగం చేసిన వీర వనితకు ఒక గుడి నిర్మించారు.
ఇదిగో ఈ రోమాంచితమైన చారిత్రక ఘట్టాన్ని తెలిపే వెయ్యేళ్ళ కింది శిల్పం
ఇటీవల వెలుగు చూసింది.
జనగామ జిల్ల లింగాల ఘనపురం మండలం వనపర్తి గ్రామ శివారులో కాకతీయుల నాటి శివాలయం సమీపంలో పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి తన క్షేత్ర పర్యటనలో గుర్తించారు.
వనపర్తి సతి శిల 5 అడుగుల ఎత్తైన శిల్పం .రెండు భాగాలుగా ఉంది. కింది భాగంలో గెడ కర్రకు ముడి వేసుకొని ఖండించుకున్న స్త్రీ శిల్పం వుంది. పై భాగంలో శివ సాయుజ్యం పొంది, అర్దపద్మాసనంలో , కరండమకుట దారియై , కుడి చేత్తో ఆశీర్వదిస్తున్న దేవతామూర్తిగా కనిపిస్తుంది . ఆమెకు ఇరువైపులా వింజామరలతో సేవలు చేస్తున్న పరిచారికలు ఉన్నారు.
ఇటువంటి శిల్పాలను సతి శిలలు లేదా ఆత్మార్పణ శిలలు అంటారు. ఇవి వీరగల్లు శిల్పాలలో ఒక భాగం. చనిపోయిన వీరుల జ్ఞాపకార్థం వేసిన స్మారక శిలలే వీరగల్లులు. కొన్ని చోట్లా గ్రామ దేవతలుగా పూజించ బడుతున్నారు. పువ్వులనూ, ధూప దీపాలు జంతు బలులను సమర్పించడం ద్వారా వీరులను కొలుచుకుంటారు.
వనపర్తిలో వీరులకు గుడి ఉంది. ప్రస్తుతం కూలిపోయింది. ఇక్కడ ఇతర వీరులు , యుద్ధంలో మరణించిన సైనికులు, భైరవ శిల్పం ఉన్నాయి.
నాటి వీరుల నిస్వార్థత, త్యాగం, ధైర్యం ,సాహసం, భక్తి విశ్వాసాలు వంటి ఉదాత్త గుణాలు , నాటి సామాజిక ఆచారాలు, సంస్కృతిని భవిష్యత్తు తరాలకు తెలిపే శిల్పం ఇది. గెడ కర్రకు శిరస్సు ఉండి ఆత్మార్పణకు సిద్ధంగా ఉన్న శిల్పాలు అక్కడక్కడ ఉన్నాయి. ఒకటి రెండు చోట్ల మొండెం నుండి విడవడ్డ శిరస్సుతో ఉన్న పురుష శిల్పాలు వెలుగు చూసాయి. స్త్రీ శిల్పం వెలుగు చూడటం ఇదే మొదటిసారి.
వర్తమాన సమాజంలో పాలకులు వుంటారు.పోతారు. దేశ భక్తులు మాత్రం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారనే సందేశం నిలబెట్టుకోవాలి.
ఆనాటి సామాజిక చరిత్ర నుండి విలువైన పాఠాలు నేర్చుకోవాలి. నేడు దేశం కోసం, భవిష్యత్ తరాల మనుగడ కోసం, ఈ కాలానికి అనుగుణంగా మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటో తెలియజేసే ఇటువంటి చారిత్రక ఆధారాలను పరిరక్షించుకోవాలి.
దేశంలోనే అత్యంత అరుదైన సతి శిల ఇది. మీరు వార్త రాశాక ఆ శిల్పం రక్షించ బడుతుందన్న నమ్మకం ఏర్పడింది