రేకా కృష్ణార్జునరావు,
(అధ్యక్షుడు, మంగళగిరి బుధ్ధ విహార)
<<
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, కుంచనపల్లి గ్రామ పరిధిలో అరవింద అనే పేరుగల ఒక హైస్కూల్ ఉంది. ఆ అరవింద హైస్కూల్ విద్యా సంస్థల అధినేత గౌరవనీయులు చాగంటి వెంకట రెడ్డి గారు. వారు ది. 04-11-2022 ఉదయం అనారోగ్యంతో తుదిశ్వాస వీడారు. ఆయన మరణం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని బౌద్దులకు దిగ్భ్రాంతిని కలిగించింది. వెంకటరెడ్డి గారితో వ్యక్తిగత పరిచయం ఉన్న వారి బంధువులు, మిత్రులు అంతా శోకతప్త హృదయంతో విలవిల లాడి పోయారు.
చాగంటి వెంకట రెడ్డి గారు రైతుబిడ్డ, గుప్తదాన శీలి, మానవతావాది, జ్ఞాన ప్రేమికుడు, పేద విద్యార్థులకు సైతం మేలైన విద్య అందాలనే సదాశయంతో అరవింద విద్యా సంస్థను స్థాపించిన ఉదార స్వభావుడు.
వెంకటరెడ్డి గారు 1948 సంవత్సరం డిసెంబర్ 13వ తేదీన కుంచనపల్లి గ్రామంలో చాగంటి సాంబిరెడ్డి- ఎర్రమ్మ దంపతులకు ఐదవ సంతానంగా జన్మించారు. వెంకటరెడ్డి గారికి నలుగురు అక్కలు, ఇద్దరు తమ్ముళ్ళు- తన తల్లి దండ్రులకు తనతో కలిపి మొత్తం ఏడుగురు సంతానం.
వెంకటరెడ్డి గారి భార్య ఆదిలక్ష్మి గారు. భర్తకు తగిన ధర్మపత్ని. ఆ పుణ్య దంపతులకు ఒక కుమారుడు, పేరు చంద్రశేఖరరెడ్డి- ఒక కుమార్తె, పేరు ఇంద్రాణి. చంద్రశేఖరరెడ్డిని అందరూ *రాజా* అని పిలుస్తారు.
వెంకటరెడ్డి గారు తమ పిల్లల చిన్న వయసులో వారి చదువుల విషయంలో అనేక ఇబ్బందులు పడవలసి వచ్చింది. తమ గ్రామంలో ఇంకా ఎంతో మంది అలాంటి ఇబ్బందులు పడుతూ ఉండే వాళ్లు. ఆ ఇబ్బందులను అధిగమించేందుకు, ఇతర పిల్లలకు కూడా మంచి విద్యను అందించేందుకు 1986 సంవత్సరంలో తానే స్వయంగా ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేసి నడిపారు వెంకటరెడ్డి గారు. దానికి *ఊటీ పబ్లిక్ స్కూల్* అని పేరు పెట్టారు. కనీసం హైస్కూల్ స్థాయి విద్య కూడా లేని వెంకటరెడ్డి ఒక విద్యాలయాన్ని ప్రారంభించటం చూసి ఆనాడు చాలా మంది ఆశ్చర్య పోయారు.
ఆ *ఊటీ పబ్లిక్ స్కూల్* తదనంతర కాలంలో అంటే 1990 సంవత్సరంలో వెంకటరెడ్డి గారి పిల్లలు చంద్రశేఖరరెడ్డి(రాజా), ఇంద్రాణి గార్లు స్కూల్ మేనేజ్ మెంట్ ను స్వయంగా చేపట్టారు. ఇక అప్పటి నుండి ఆ స్కూల్ పేరు *అరవింద హైస్కూల్* గా మారింది. రాజా గారికి అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలపై మంచి ఆసక్తి ఉండేది. దానికి అనుగుణంగా ఆయన పూర్తిగా స్కూల్ నిరవహణ బాధ్యతలను చూసే వాడు- ఇంద్రాణి గారికి విద్యా బోధన పట్ల ఆసక్తి ఎక్కువ. అందుచేత ఆమె స్కూల్ ప్రిన్సిపాల్ గా బాధ్యతలను చూసే వారు.
వెంకటరెడ్డి గారి పిల్లల ఆధ్వర్యంలో అరవింద హైస్కూల్ దిన దినాభి వృద్ధి చెందింది- అంతకు ముందు స్కూల్ నిర్వహణలో ఎదుర్కొన్న అనేక సమస్యలు రాజా గారి నిర్వహణలో అధిగమించటం జరిగింది.
వెంకటరెడ్డి గారు తమ గ్రామంలో స్కూల్ నఢపాలనే సదాశయాన్ని కొనసాగించటానికి – ఈనాడు కోట్లు విలువ చేసే ఆయన సొంత బంగారు భూముల్లో కొంత భాగం, ఆనాడు చౌకగా వేల రూపాయల్లో విక్రయించ వలసిన గడ్డు పరిస్థితులను కూడా ఆయన చవి చూశారు.
అరవింద హైస్కూల్ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే అరుదైన విద్యా సంస్థగా రాష్ట్రంలో ఖ్యాతి గాంచింది. అరవింద విద్యా సంస్థ ఎడ్యుకేషన్ రంగంలో నిరంతరం రీసెర్చ్ సెంటర్ గా పని చేస్తుంది. ఇక్కడ ఎప్పుడూ విద్యా విషయాలపై రాష్ట్ర స్థాయి సమావేశాలు, చర్చలు జరుగుతుంటాయి. రుషి వాల్యూస్ టీచింగ్ టాపర్స్, ప్రఖ్యాత విద్యావేత్తలు శివరామ్, పరిమి, చుక్కా రామయ్య వంటి ఎంతో గొప్ప ప్రముఖులు స్కూల్ సిలబస్ ఎలా ఉండాలి, విద్యా బోధన సృజనాత్మకంగా ఎలా ఉండాలి అనే విషయాలపై ఇక్కడ మేథో మదనం చేస్తుంటారు.
చాగంటి వెంకటరెడ్డి గారు ఏదైనా మంచి పనికి నేను సైతం అంటూ ఎప్పుడూ ముందు ఉండే మహా మనిషి, బౌద్దాభిమాని, గుప్తదాన శీలి, మృదు స్వభావి , మితభాషి, మంచి మనసున్న అరుదైన వ్యక్తి.
ఐదు వందలు దానం చేసి, దాని ప్రచారం కోసం ఐదు వేలు ఖర్చు చేసే ఘనులు ఉన్న నేటి సమాజంలో ఎప్పుడూ, ఏనాడూ తాను చేసిన దానం పది మందిలో ప్రచారం కావాలని కోరుకోని అరుదైన గుప్తదాన శీలి వెంకటరెడ్డి గారు.
వారి ఆశీస్సులతో రూపు దిద్దుకున్న అరవింద ఆర్ట్స్ రూపొందించిన అనేక సామాజిక కళా రూపాలకు రాష్ట్ర స్థాయి గుర్తింపు రావటం ముదావహం.
2010 జనవరి 10వ తేదీన వెంకట్రెడ్డి గారి కుటుంబానికి అతి పెద్ద షాక్ తగిలింది. ఈ ప్రాంతంలో స్నేహశీలి గా, విద్యారంగ పరిశోధకునిగా, మనసున్న మారాజుగా ఎంతో మంది ప్రశంసలు పొందిన, వెంకటరెడ్డి గారి కుమారుడు చంద్రశేఖరరెడ్డి(రాజా) గారు 40 సంవత్సరాల యువ వయస్సులో విష జ్వరం తీవ్రంగా ప్రబలటంతో అకాల మరణానికి గురైనారు. అంతటి తీవ్ర విషాదం నుండి కూడా వెంకటరెడ్డి గారు అతి కొద్ది రోజుల్లోనే జనన- మరణాల ప్రకృతి ధర్మాన్ని యధార్ధ రీతిలో అర్ధం చేసుకుని తేరుకున్నారు.
మంగళగిరి బుధ్ధ విహార కార్యక్రమాలకు వెంకట రెడ్డి గారు అందించిన చేయూత అంతా ఇంతా కాదు. ఆయనకు బుద్ద విహార అధ్యక్షుడు కృష్ణార్జునరావు అంటే ఎనలేని అభిమానం. బౌద్దాన్ని త్రికరణ శుద్ధిగా పాటించ మంచి మనిషి కృష్ణార్జునరావు అని ఆయన పదుగురి దగ్గర ప్రశంసించే వారు. ఆయన మంగళగిరి బుధ్ధ విహారకు ఎప్పుడూ కొండంత అండగా ఉండే వారు.
మంగళగిరి బుధ్ధ విహార చొరవతో రూపొందిన ఆంధ్రప్రదేశ్ బౌద్ద మహాసమ్మేళనం, బుద్దభూమి మాసపత్రిక వారి విద్యాలయం లోనే పురుడు పోసుకున్నాయి.
రేకా కృష్ణార్జునరావు తాను రాసిన *బౌద్ద ధర్మామృతం* పుస్తకాన్ని చాగంటి వెంకటరెడ్డి-ఆయన సతీమణి ఆదిలక్ష్మి గార్లకు అంకితం ఇచ్చి తన కృతజ్ఞతను తెలుపుకున్నాడు. కృష్ణార్జునరావు రాసిన మరో పుస్తకం *దాన విశిష్టత* ను వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
అరవింద విద్యా సంస్థ ఎప్పుడూ బుద్ధుడు-జిడ్డు కృష్ణమూర్తి- గిజుభాయి తత్వాలనుండి పరిశోధనాత్మక చర్చలు చేసి, తమ ప్రాంగణం నుండి విద్యా రంగానికి జ్ఞాన వితరణ చేయటం అనేది రాష్ట్రం లోని ప్రముఖులందరికీ విదితమే!
వెంకట రెడ్డి గారు తమ విద్యాలయంలో జరిగే సభలకు, సమావేశాలకు విచ్చేసిన ఆత్మీయ మిత్రులకు తాను దగ్గర ఉండి స్వయంగా భోజనం ఏర్పాట్లు చూసే వారు. మంగళగిరి బుద్ధ విహార తల పెట్టిన దాదాపు అన్ని కార్యక్రమాలకు వెంకట్రెడ్డి గారు ఉచితంగా భోజన సదుపాయం చేసే వారు.
అలాగే మంగళగిరి బుద్ధ విహార 2015 ఫిబ్రవరిలో మంగళగిరి అరవింద స్కూల్ లో జరిపిన *రాష్ట్ర బౌద్ద సదస్సు* కు విచ్చేసిన 600 మంది ప్రతినిధులకు కూడా వెంకటరెడ్డి గారు ఉచితంగానే భోజన సదుపాయం కల్పించారు.
వెంకటరెడ్డి గారు అప్పుడప్పుడు రేకా కృష్ణార్జునరావుకు ఫోన్ చేసి పలకరించే వారు. *మీరు రాసిన పుస్తకాలు నా తల దగ్గర పెట్టుకుని ఎప్పుడూ పదే పదే చదువుతున్నా* అని చెప్పే వాడు. మంగళగిరి బుధ్ధ విహార కార్యదర్శి పామర్తి రవి గారు నిర్వహించిన అనేక దమ్మ యాత్రలలో వెంకటరెడ్డి గారు సతీ సమేతంగా రెండు సార్లు పాల్గొన్నారు. ఈ రెండు దమ్మ యాత్రల్లో వెంకటరెడ్డి గారు మంగళగిరి బుధ్ధ విహార సభ్యులతో 20 రోజులు పూర్తిగా గడపటం అనేది మరపురాని మధురానుభూతి అని చెప్ప వచ్చు.
======================
<<<<<<<<<<<<>>>>>>>>>>>>
2013వ సంవత్సరంలో విజయవాడ వాస్తవవ్యులు బౌద్దాభిమాని సుంకర కృపాకరరావు గారి ప్రోత్సాహం, వితరణతో మంగళగిరి బుధ్ధ విహార విజయవాడ పుస్తక మహోత్సవంలో *బుద్దభూమి* బుక్ స్టాల్ ను ఏర్పాటు చేసినప్పుడు, ఆ బుక్ స్టాల్ ను మొట్ట మొదట వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయించటం జరిగింది. వెంకటరెడ్డి గారు ప్రతి సంవత్సరం దాదాపుగా ఆ పుస్తక మహోత్సవం జరిగినన్ని రోజులు బుద్దభూమి బుక్ స్టాల్ కు వచ్చి చాలా సేపు కూర్చుని సంతోషంగా గడిపేవారు. అక్కడ కొంత సమయం కూర్చోవటం అనేది ఆయనకు ఒక ధార్మిక కాలక్షేపంగా ఉండేది.
2017వ సంవతసరం నుండి బుద్దభూమి బుక్ స్టాల్ నిర్వహణను ఉదయగిరి నివాసులు, నిరంతర బౌద్ద ప్రచారకులు షేక్ లియాఖత్ ఆలీ బోధి గారు చూస్తున్నారు. వారు విజయవాడలో బుక్ స్టాల్ లో ఉన్న 12 రోజులకు ఈనాటికి కూడా వెంకటరెడ్డి గారే భోజనం, నివాస వసతి ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా వెంకటరెడ్డి గారు బౌద్దానికి, బుద్దభూమికి ముఖ్యంగా మంగళగిరి బుధ్ధ విహారకు చేస్తున్న సాయం, అందిస్తున్న చేయూత చాలా విలువైనది- విస్మరించలేనిది.
2
జిడ్డు కృష్ణమూర్తి ఆలోచన-తత్వం పై జరిగే చర్చలు, సమావేశాల్లో వెంకటరెడ్డి గారు ఎప్పుడూ ఆసక్తిగా పాల్గొనే వారు. వారి జీవితం నిరంతరం ధార్మిక కార్యక్రమాలతో పెనవేసుకుని సాగుతూ ఉండేది.
కీర్తి శేషులు చాగంటి వెంకట రెడ్డి గారు బౌద్దానికి, సమాజానికి చేసిన బహుముఖ సేవలను మననం చేసుకుని, ఆ మహానుభావునికి మంగళగిరి బుధ్ధ విహార ది. 12-011- 2022 న మంగళగిరిలో ఒక ప్రత్యేక సభను ఏర్పాటు చేసి శ్రద్ధాంజలి ఘటించింది.
అలాగే ది. 16- 11- 2022న కుంచనపల్లి అరవింద హైస్కూల్ లో వెంకటరెడ్డి గారి వేలాది అభిమానుల మధ్య ఘనంగా సంస్మరణ సభ జరిగింది. ఈ సంస్మరణ సభలో పాల్గొన్న పముఖులు ఎంతో మంది తమకు ఎంతగానో సహకరించ ఓ పెద్ద దిక్కును కోల్పోయామని తమ బాధను వ్యక్తం చేశారు.
వెంకటరెడ్డి గారితో మంగళగిరి బుధ్ధ విహారకు 20 సంవత్సరాల ఆత్మీయ బంధం ఉంది- అది బుద్ధుని దమ్మంతో పెనవేసుకుని ఉంది. ఈ రెండు దశాబ్దాల కాలంలో వెంకటరెడ్డి గారితో మంగళగిరి బుధ్ధ విహారకు చెప్పలేనన్ని మధుర స్మృతులు ఉన్నాయి. మంగళగిరి బుధ్ధ విహార కార్యక్రమాలకు ఎప్పుడూ ఓ భరోసాగా ఉండే ఓ అదృశ్య హస్తాన్ని ఆ సంస్థ కోల్పోయిందన్నది మాత్రం బాధాకరమైన వాస్తవం.