(టి. లక్ష్మీనారాయణ)
రాజ్యాంగాన్ని రోజూ ఉటంకిస్తుంటారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలకు ఉన్నదా! లేదా! చట్ట సభలు లోపభూయిష్టమైన చట్టాలు చేస్తే న్యాయ సమీక్ష చేయాల్సిన బాధ్యతను రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు అప్పగించింది కదా!
ఆంధ్రప్రదేశ్ పునర్వ్వస్థీకరణ చట్టం – 2014 రాజ్యాంగబద్ధంగా చేయబడిందా! లేదా! అన్న అంశంపై న్యాయ సమీక్ష చేయాలని సుప్రీం కోర్టులో పలు వ్యాజ్యాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ అంశంపై ఎనిమిదేళ్ళ కాలయాపన తర్వాత అత్యున్నత న్యాయస్థానం విచారణకు సన్నద్ధమయ్యింది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్వస్థీకరణ బిల్లు -2014ను నాటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బిజెపి బలపరచింది. రాష్ట్ర విభజన – 374డితో ముడిపడి ఉన్న బిల్లు. రాజ్యాంగ సవరణతో కూడుకొన్న బిల్లు. సమగ్ర చర్చ అనంతరం, సభ్యులు కోరితే ఓటింగ్, 2/3 ఆధిక్యతతో ఆమోదించాల్సిన బిల్లు. సభలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. ఆనాటి లోక్ సభ సమావేశాలు ఏ తీరులో జరిగాయో ప్రపంచమంతా తిలకించింది. అటుపై రాజ్యసభలోనూ దాదాపుగా అదే తంతు నడిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఇది వాస్తవం.
ప్రస్తుత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీగారు 2014 ఎన్నికల ప్రచారంలో, “తల్లిదండ్రులను చంపి, బిడ్డను నడిరోడ్డుపై పడేశారని” రాష్ట్ర విభజనను అభివర్ణిస్తూ ఘాటు విమర్శలు చేశారు. సాధారణ ఎన్నికల తదనంతరం బిజెపి నేతృత్వంలోని ఎన్.డి.ఏ. కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రధాన మంత్రి మోడీగారు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్వస్థీకరణ చట్టం – 2014 అమలు బాధ్యతను నిర్వర్తిస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాగారు ఆ చట్టం అప్రజాస్వామిక పద్ధతుల్లో చేయబడిందని లోక్ సభ, రాజ్యసభ వేదికగా పలు సందర్భాలలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆ చట్టం రాజ్యాంగబద్ధంగా చేయబడిందా! లేదా! ఆ చట్టం లోపభూయిష్టంగా ఉన్నదా! లేదా! అన్న విషయాన్ని నిగ్గుతేల్చి, భవిష్యత్తులో అప్రజాస్వామికంగా చట్టాలు చేయడం, రాష్ట్రాల విభజన చేయడాన్ని నిరోధించడానికి న్యాయ సమీక్ష అవసరమే కదా! దానికి అభ్యంతరం చెప్పడమంటే రాజ్యాంగాన్ని ఖాతరు చేయకపోయినా, చట్ట సభలు అప్రజాస్వామికంగా చట్టాలను చేసినా సర్దుకుపోదామని సమర్థించడమే అవుతుంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమైనది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014కు సంబంధించి న్యాయ సమీక్షలో సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు కోసం ఎదురు చూడడం రాజ్యాంగంపై విశ్వాసం ఉన్న వారికి ఉండవలసిన లక్షణం.
ఈ అంశంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టగానే తగుదునమ్మా అంటూ ఆంధ్రప్రదేశ్ తరుపున వకాల్తా పుచ్చుకొన్న సీనియర్ న్యాయవాది, ఈ అంశంపై విచారణ అవసరం లేదని, పెండోరా బాక్స్ తెరవడం ఎందుకని అత్యున్నత న్యాయ స్థానానికి విన్నవించడం అత్యంత బాధ్యతారాహిత్యం. ఆయన కాంగ్రెస్ పార్టీ క్రియాశీల నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఫీజు తీసుకొని న్యాయవాదిగా వ్యవహరిస్తున్న పెద్దమనిషి. ఆయన వాదన తీవ్ర గర్హనీయమైనది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. గొంతులో వెలక్కాయ పడ్డట్లయ్యింది. జరిగిన తప్పును సమర్థించుకోలేక, రాష్ట్రం కలిసే పరిస్థితి ఉంటే సమర్థించడానికి తామే మొదటి వరసలో ఉంటామన్న అసంబద్ధమైన, పరిపక్వతలేని వ్యాఖ్య ఒక ముఖ్య సలహాదారుడు చేశారు. దాంతో అటూ ఇటూ కోడు గుడ్డుపై ఈకలు పీకే పని రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నది.
సుప్రీం కోర్టులో జరిగే విచారణ సందర్భంలో రాష్ట్ర విభజనతో నవ్యాంధ్ర ప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చి, న్యాయం కోసం పోరాడే చక్కటి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014లో కడప ఉక్కు కర్మాగారం, దుర్గరాజపట్నం ఓడరేవు, రైల్వే జోన్, పారిశ్రామిక అభివృద్ధికి రాయితీలు, వెనుకబడ్డ రాయలసీమ – ఉత్తరాంధ్ర ప్రాంతాలకు బుందేల్ ఖండ్ – కాలహండి నమూనాలో అభివృద్ధి పథకం, రెవెన్యూ లోటు భర్తీ, రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం జాతీయ ప్రాజెక్టు, విద్యా సంస్థల ఏర్పాటు, నదీ జలాల పరిష్కారం, ఉమ్మడి ఆస్తుల విభజన, వగైరా అంశాలు పొందుపరిచారు. చట్టంలో ఏదైనా నిర్దిష్టంగా పేర్కొనాలి. అలా పేర్కొనలేదు. కొన్నింటి విషయంలో పరిశీలిస్తాం, కొన్నింటిపై అధ్యయనం చేస్తాం, కొన్నింటి విషయంలో ఇస్తాం, ఇలా మోస పూరిత వాగ్దానాలు చేశారు. చవతి తల్లి ప్రేమ కనబరిచారు. ఆ లోపభూయిష్టమైన చట్టాన్ని అడ్డం పెట్టుకొని మోడీ ప్రభుత్వం గడచిన ఎనిమిదిన్నర ఏళ్ళలో అధ్యయనం చేశాం, లాభదాయకంకాదని అధ్యయన నివేదికలు అందాయంటూ ఆంధ్రప్రదేశ్ కు దగా చేస్తున్నది. విద్యా సంస్థల వరకు చట్టంలో ఉన్నదాని ప్రకారం నెలకొల్పారు. నిర్మాణంలో ఉన్నాయి. అమరావతి, పోలవరం, రెవెన్యూ లోటు భర్తీ విషయంలో కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో అలసత్వం, బాధ్యతారాహిత్యం, నిరాకరణ వైఖరి ప్రదర్శిస్తున్నది. ప్రత్యేక తరగతి హోదా ముగిసిన అధ్యాయమంటూ తిరస్కరిస్తున్నది. ఈ అన్ని అంశాలపై పదునైన వాదనలు వినిపించి, హక్కుగా సాధించుకునే కృషి రాష్ట్ర ప్రభుత్వం అంకిత భావంతో చేయాలి.
సంకుచిత రాజకీయ లబ్ధి కోసం రాజకీయ పార్టీలు పాకులాడకుండా ఆంధ్రప్రదేశ్ విస్తృత ప్రయోజనాల కోసం, భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బాధ్యతగా వ్యవహరిస్తే ప్రజలు హర్షిస్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అంధ్రప్రదేశ్ భవిష్యత్తు పట్ల చిత్తశద్ధి ఉంటే తక్షణం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, అందరి నుండి సూచనలు తీసుకొని, సమిష్టి అవగాహనతో సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలి, వాదనలు సమర్థవంతంగా వినిపించాలి.
(టి. లక్ష్మీనారాయణ, కమ్యూనిస్టు – సామాజిక ఉ్యమకారుడు)