అంబేడ్కర్ – రాజ్యాంగం : కొన్ని చేదు నిజాలు

 

అంబేడ్కర్ – రాజ్యాంగం : కొన్ని చేదు నిజాలు

ఆదిత్య కృష్ణ  [7989965261]

రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26రిపబ్లిక్ డే మనకి తెల్సిందే. మరి నవంబర్ 26 ఏమిటి? రాజ్యాంగ సభలో చర్చలు పూర్తయినాక, 1949లో ఆ రోజున  ముసాయిదా ఆమోదించబడింది. ఏటా ఆరోజుని  రా జ్యాంగదినోత్సవంగా పాటించాలని కేంద్రం నిర్ణయించి ప్రకటించింది.   రాజ్యాంగం గురించి, రాజ్యాంగ శిల్పి డాక్టర్‌ అంబేడ్కర్ గురించి తెలియజెప్పే కార్యక్రమం ప్రతి ఏడూ జరపాలని మోదీ చెప్పారు.  అంబేడ్కర్ రాసినది అంటూ రాజ్యాంగం పేరిట,ఆయన పేరిట పాలకవర్గాలు ప్రజల్ని నిత్యం మోసగిస్తున్న దృష్ట్యా ఇటీవలచెలరేగిన మరో వివాదం దృష్ట్యాకూడా అంతగాప్రచారంలోలేనికొన్ని వాస్తవాల్నితెల్సుకోటం అవసరం. దానికే ఈ వ్యాసం.

“స్వతంత్రం వచ్చి 75 ఏళ్లయింది. దేశ అవసరాలు, ప్రజల ఆకాంక్షలు మారాయి. మన అభివృధ్ధి కుంటుపడిపోయింది. దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెసు, బీజెపీ విఫలమైనాయి. కేంద్రం పేరిట పెత్తనం,  అధికార దుర్వినియోగం, రాష్ట్రాల అధికారాలను హరించివేయటంవీటిలో ఆ ఇద్దరిదీ ఒకటే బాట. ఈ స్థితిలో దేశానికి కొత్త రాజ్యాంగం అవసరమని భావిస్తున్నాను. దీనిపై చర్చ జరగాలి”అన్నారు  ముఖ్యమంత్రి కేసిఆర్. దానికే గగ్గోలు పెడుతున్నాయి ఆ రెండు పార్టీలూ, మరికొన్ని శక్తులూ. దేశద్రోహం, అంబేడ్కరుకి, దళితులకూ  అవమానం అంటూ చిందులు తొక్కుతున్నారు కొందరునేతలు. కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన దశాబ్దాల  అనుభవంతో, బాధ్యతతో ఈ ప్రతిపాదన చేస్తున్నాను అన్నారు కేసిఆర్.  నదీజలాలపై రాష్ట్రాల  హక్కులను హరించే రీతిలో  ఎలాటి  సంప్రదింపులూ లేకుండా కేంద్ర బడ్జెట్లో  నదులను లింకు చేయటం గురించి కేటాయింపులు చేసే దాకా వెళ్లటాన్ని  ఉదహరించారు. ఐఏయస్ అధికారులపై  కేంద్ర పెత్తనాన్ని  ప్రస్తావించారు. ఇంకా అనేకం చెప్పారు. చర్చ చేద్దాం అంటే దానికే రాధ్ధాంతం చేసి తమ నిరంకుశత్వాన్ని బైటపెట్టుకుంటున్నారు. ఇందులో కొద్ది మంది వామపక్షీయులూ, ఇతర  మేధావులూ కూడా అనాలోచితంగా గొంతు కలిపి తమ అజ్ఞానాన్ని, లేదా అవకాశవాదాన్ని ప్రదర్శిస్తున్నారు.

అంబేద్కరు రాజ్యాంగంగా కొందరు పేర్కొనే రచన ‘స్టేట్స్ అండ్ మైనారిటీస్’; 1947లో రాజ్యాంగసభకు సమర్పించిన ఆ రచనలో  అంబేడ్కర్ పరిశ్రమల్లో  ప్రభుత్వ రంగాన్ని నొక్కిచెప్పారు; ప్రైవేటీకరణను వ్యతిరేకించారు. ఇన్స్యూరెన్సు రంగం ప్రభుత్వ మోనోపలీగా ఉండాలన్నారు. వీటికి విరుద్ధంగా  నేడు ప్రభుత్వాన్నే క్రోనీ పెట్టుబడుదారుల చేతుల్లో పెడుతున్న కేంద్ర పెద్దలు  అంబేడ్కర్ జపం చేయటం దగా కాదా?

ఈ సందర్భంగా గమనించాల్సిన కొన్ని అంశాలనిక్కడ క్లుప్తంగా ప్రస్తావించటమైనది.  వాటిద్వారా అనేక కట్టుకథలు బైటపడుతాయి. మొదటిది అంబేడ్కర్ ని,  ఆయన రాసిన రాజ్యాంగాన్ని  అవమానించారు అన్నదాన్ని చూద్దాం.  నిజానికి అంబేడ్కర్ కి ముసాయిదా రచనా కమిటీ చైర్మన్‌ బాధ్యతలు అప్పగించటం చాలా విచిత్రంగా జరిగింది. మహారాష్ట్రకి చెందిన ఆయన అక్కడి నుంచి ఎన్నిక కాలేదు. సరిగ్గా చెప్పాలంటే అప్పటి పాలక వర్గాల వారు,ముఖ్యంగా కాంగ్రెస్‌ నాయకులు, హిందూ మహాసభ వారు ఆయన ఎన్నిక కాకుండా అడ్డు పడ్డారు. (బీజెపీ వ్యవస్థాపకులైన శ్యామ ప్రసాద  ముఖర్జీ అప్పటి హిందూ మహాసభ ముఖ్య  నాయకుల్లో ఒకరు.) అలాంటి స్థితిలో  ఆయన  అవిభక్త బెంగాల్‌ నుంచి – నాటి బెంగాల్‌ శాసనసభలోని ఎస్సీ ఫెడరేషన్‌ సభ్యులు, ముస్లిం లీగ్‌ మద్దతుతో ఎన్నికయ్యారు.  ఐతే దేశ  విభజన,  పాకిస్థాన్‌ ఏర్పాటు క్రమంలో అంబేడ్కర్‌ ఎన్నికైన బెంగాల్‌ స్థానం తూర్పు పాకిస్థాన్‌లోకి  వెళ్లింది. ఆయన రాజ్యాంగ సభలో సభ్యత్వం కోల్పోయారు. ఆ క్రమంలోనే అంబేడ్కర్ ని  కొన్ని రాజకీయ అవసరాలకోసం కోఆప్షను ద్వారా రాజ్యాంగ సభలోకి మళ్లీ తీసుకున్నారు. కాబట్టి కాంగ్రెసు, బీజెపీలది అంబేడ్కర్  పై మొక్కుబడి భక్తే.  ఇవాళ అన్ని పార్టీల వారూ ఆయన పేరుని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు.

అంబేడ్కర్ రాజీనామా నిరంకుశత్వం

కొద్దికాలం నెహ్రూ కేబినెట్లో ఉన్న అంబేడ్కర్‌  కొన్ని  విభేదాలతో  1951 సెప్టెంబరు 27 నాడే తన రాజీనామా లేఖను ప్రధాని నెహ్రూకిచ్చారు. హిందూ కోడ్ బిల్ పాస్ చేసే దాకా ఆగానని ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ ఆ బిల్లుని హిందువుల నిరసనల దృష్ట్యా డ్రాప్ చేయమని నెహ్రూ చెప్పారు!  ఈ సెషన్ చివరి రోజున మీ రాజీనామాను అంగీకరిస్తాను అని చెప్పారు నెహ్రూ. అక్టోబరు 11 నాడు  పార్లమెంటులో రాజీనామా గురించిన  ప్రకటన చేయటానికి డిప్యూటీ స్పీకర్ అనుమతించారు అని అంబేడ్కర్ చెప్పారు. తీరా ఏదో సాకులు చెప్పి, సభలో ప్రకటనను చదివి విన్పించటానికి సైతం అనుమతించలేదు. నిరసనగా బయటికి వెళ్లిపోయిన అంబేద్కర్ ఆ వెంటనే పత్రికలకు విడుదల చేశారు. తన ప్రకటన ప్రతిని ముందే ఇచ్చి ఉంటే అనుమతించే వాడిని  అని ఆ తర్వాత  అన్నారు డిప్యూటీ స్పీకర్. ముందే ఇవ్వాలి అనటం ప్రీసెన్సార్షిప్ కాదా అని ప్రశ్నించారు ప్రసిద్ధ సభ్యులు కుంజ్రు, కామత్. రాజీనామా సందర్భంలో కూడా ఆయన పట్ల ఇంత నిరంకుశత్వంతో  వ్యవహరించారు!

అంబేడ్కర్‌ ఎప్పుడూ కాంగ్రెసులో లేరు.దాంతో  ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెసువారు ఆయన్ని ఓడిం చారు. ఆయన రాజ్యాంగ సభలో సభ్యుడు కాకుండా మొదట అడ్డుకున్నవారే 1952 ఎన్నికల్లో అంబేడ్కర్  అను చరుడైన ఒక మెట్రికులేటు (కజ్రోల్కర్)ని చీల్చి,  కాంగ్రెసు అభ్యర్థిగా  నిలబెట్టి, 14వేల మెజారిటీతో ఓడించారు. 1954లో ఒక ఉపఎన్నికలో పోటీ చేస్తే మళ్లీ – రెండుసార్లూ రిజర్వుడు నియోజకవర్గంలోనే -ఓడించారు.  తమ రాజకీయ అవసరాల్తో  రాజ్యసభకు కోఆప్షను ద్వారా రాని చ్చారు. అంటే కాంగ్రెసు ‘దొరలు’ ఆయనను స్వంత  బలంతో  లోక్‌సభకి ఎన్నిక కాకుండా చూశారు!పాలకవర్గాలు ‘రాజ్యాంగ శిల్పి’ గా చెప్పే అంబేడ్కర్ కి వారు చేసిన సన్మానం ఇది! దళిత నాయకులు సైతం  కప్పిపుచ్చే చేదు నిజాలివి.

ఇది స్వతంత్ర సార్వభౌమ రాజ్యాంగం అన్న మాటే ప్రశ్నార్థకం.  రాజ్యాంగ సభ 1946లో- స్వతంత్రం రాకమునుపే- ఎన్నికైంది. ఆ ఎన్ని కలు ఎవరు జరిపారు? బ్రిటిషు వలస పాలకులు. ఏ చట్టాల ఆధారంగా? 1935 గవర్న మెంట్‌ ఆఫ్‌ ఇండియా యాక్టు ప్రకారం జరిపిన ఎన్నికలవి. ఆ ఎన్నికల్లో ఓటర్లు ఎవరు? అప్పటికి వయోజన, సార్వత్రిక ఓటింగు విధానం ఇంకా అమల్లోకి రానేలేదు.  అప్పటి జన సంఖ్యలో సుమారు 10 శాతం మందికే ఓటు హక్కుండేది: వివిధ రాష్ర్టాల్లో అధికారం, పలుకుబడి గల కులీనులే- బాగా పన్నులు కట్టగల వారు, పెద్ద విద్యా  వంతులు- ప్రధానంగా ఓటర్లు; సామాన్యులకు ఓటు హక్కులేదు. ఇలా కులీన వర్గాల ద్వారా ఆయా రాష్ర్టాల్లో ఎన్నికైన ప్రతినిధు లు 292 మంది. వివిధ సంస్థానాల ప్రతినిధులు 93 మంది నామినేషను ద్వారా, ఇతరత్రా రాజ్యాంగసభ సభ్యులైనారు. ఇది స్వతంత్ర సార్వభౌమ, ప్రజాస్వామిక రాజ్యాంగం అనవచ్చునా? కాగా  సెక్యులర్, సోషలిస్టు అన్న పదాల్ని ఇందిరాగాంధీ 1975 ఎమర్జన్సీ కాలంలో, నిరంకుశత్వాన్నికప్పిపుచ్చుకోటానికి  చేర్చారు.

 ‘అంబేడ్కరు రాసిన రాజ్యాంగం’ గురించి:

1950 జనవరి 26 న అమలులోకి వచ్చిన రాజ్యాంగాన్ని ఎవరు, ఎలా రాశారు? అంబేడ్కర్ నిజానికి ఆముసాయిదా ”రచనా” కమిటీ ఛైర్మన్‌. పైన పేర్కొన్న కులీనుల సభ నిర్ణయాలకే వారు అక్షరరూపం ఇవ్వాలి. నిజానికి  బ్రిటిషువారే ఒక ముసాయిదాని రెడీగా వారిముందుకి తెచ్చిపెట్టారు. దాని రచయిత బెనెగళ్ నర్సింగ రావు (18871953); కేంబ్రిడ్జిలో చదువుకున్న ఐసియస్ ఆఫీసరు;  బ్రిటిషిండియాకి  రాజ్యాంగ సలహాదారుగా ఉండి, బర్మాకోసం, తర్వాత ఇండియాకోసం ముసాయిదాలు తయారుచేసిన వాడు; ఆయనతో పాటు అల్లాడి కృష్ణస్వామిఅయ్యరు వంటి ఏడుగురు నిపుణులతోకూడిన  డ్రాఫ్టింగు కమిటీకి చైర్మన్ అంబేడ్కర్.  పూర్వ ముసాయిదా ఆధారంగా కొత్త  డ్రాఫ్టుని రాసిన ప్రధాన  రచయిత యస్. యన్. ముఖర్జీ.1949 నవంబరు 26న ముసాయిదా ఆమోదం ఉపన్యాసంలో అంబేడ్కర్  వారందరి కృషికీ పేరుపేరునా నమస్కరించి మాట్లాడారు.“వారికృషి, పనితనం లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు”  అన్నారు. ఇంత కూ  ఆడ్రాఫ్టు అసలు మూలం ఏమిటి?

1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్టు’! ఆ యాక్టులోని 250 ఆర్టికల్సుని  దాదాపు యధాతథంగా దించేసారని, క్లాజు క్లాజు పోల్చి 500పేజీల పుస్తకంలో న్యాయనిపుణులు ప్రొ.కే ఎస్ శర్మ ముద్రించారు (Indian Constitution Unriddled, 2015).

ఇలా చాలా వివాదాస్పదంగా రూపొందినది.రాజ్యాంగం  గురించి అంబేడ్కర్  తాను రాయలేదని చెప్పి, ఘాటుగా విమర్శించారు. ఇందులో అనేక విషయాలని తనకి “ఇష్టం లేకపోయినాకిరాయి రచయితగా (‘hack’గారాసానని 1953సెప్టెంబరు 2నాడు రాజ్యసభలో అన్నారు. మళ్లీ ఎవరో అదే రెట్టిస్తే “ఈ రాజ్యాంగాన్ని తగులబెట్టటానికి నేను మొదటివాడిగా ఉంటాను. ఇది నాకక్కరలేదు. ఇది ఎవరికీ సూట్ కావటంలేదు,”  అని ఆనాడే ఆ సభలోనే కోపంగా అన్నారు. ఇవన్నీపార్లమెంటు రికార్డుల్లో నమోదై ఉన్నాయి.

1949 నవంబర్‌ 26న , పార్లమెంటులోనే అంబేడ్కరే ఏమన్నారో చూడండి: 1950 జనవరి 26న మనం వైరుధ్యాలమయమయిన జీవితంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో మనకు సమానత్వం ఉంటుంది. ఆర్థిక జీవనంలో అసమానత ఉంటుంది. రాజకీయంగా ఒక మనిషికి ఒకే ఓటు, ఒక ఓటుకి ఒకే విలువ ఉంటాయి. మన ఆర్థిక రాజకీయ వ్యవస్థ మూలంగా మన సామాజిక, ఆర్థిక జీవనంలో మనం ఒక మనిషికి ఒకే విలువ అన్న సూత్రాన్ని నిరాకరిస్తూనే ఉంటాం. ఈ వైరుధ్యాన్ని వీలైనంత త్వరగా తొలగించి తీరాలి. లేకపోతేఎంతో శ్రమించి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య సౌధాన్ని అసమానతలు అనుభవిస్తున్నవారు ధ్వంసం (explode) చేస్తారు’. సుదీర్ఘచర్చల తర్వాత, రాజ్యాంగ ముసాయిదా ఆమోదం సందర్భంగా పార్లమెంటులోనే  అంబేడ్కర్  చెప్పిన, అర్థవంతమైన, అక్షర సత్యాలైన పై మాటలను మళ్లీమళ్లీ గుర్తు చేసుకోటం అవసరం.

కేసిఆర్ చర్చనుకోరుతూ  అన్న మాటలు అంతకన్నా తీవ్రమైనవేమీ  కాదు; నేటి కేంద్ర పాలకుల వ్యవహారశైలిని చూస్తే రాజ్యాంగం పై విమర్శలు చేసిన అంబేడ్కర్  పై కూడా మరణానంతర భారతరత్నలాగే మరణానంతర  సెడిషన్ కేసో, ఊపా కేసోపెడతారేమో!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *