(యుద్ధ గళ..రాత్రి అడవిలో నిద్ర’ తరువాయి భాగం)
తిరుపతి జ్ఞాపకాలు-59
(రాఘవ శర్మ)
చుట్టూ ఎత్తైన కొండ.
గుండ్రంగా ఉన్న లోయ మధ్యలో పెద్ద నీటి గుండం.
ఒక పక్క కొండ చీలిక నుంచి జాలువారుతూ హోరెత్తుతున్న జలపాతం.
వయ్యారంగా ఎన్ని మెలికలు తిరుగుతోందో!
గుండంలో పడేసరికి దాని యవ్వారమంతా ముగిసిపోయి మూగవోతోంది..
యుద్ధ గళ సమీపాన ఉన్న హలాయుధ తీర్థం.
యుద్ధగళకు ఎన్ని సార్లు వచ్చినా, హలాయుధం మాట విననే లేదు!
శనివారం ఉదయం ఆ అవకాశం లభించింది.
యుద్ధ గళ ముందుకు సాగుతోంది.
దాని వెంట మేమూ సాగుతున్నాం.
చిన్న చిన్న కొండల పైనుంచి దుముకుతోంది.
రొద చేస్తూ ఒక్కో దగ్గర ఒక్కో రాగం ఆలపిస్తోంది.
దాని వెంటే నడుస్తున్నాం.
హలాయుధ తీర్థం చూడాలంటే లోయలోకి దిగాలి.
దారి సరిగా లేదు.
యశ్వంత్‌ను దారి కోసం పైలట్‌గా పంపారు.
దిగచ్చు కానీ, చాలా కష్టం అన్నాడు యశ్వంత్.
దిగలేనని నన్ను రావద్దన్నారు.
గుంజనలోకే దిగిన వాణ్ణి ఇదొక లెక్కా అని ధీమా వ్యక్తం చేశాను.
ఒకరొకరు దిగుతున్నారు.
ముందుగా తమిళ తంబిలు దిగేశారు.
లోయలోకి దిగడం ఎంత కష్టం?
నిట్ట నిలువునా దిగాలి.
ఏ మాత్రం జారినా దొర్లుకుంటూ పడిపోతాం.
అంతా మట్టి నేల.
పట్టు దొరకడం లేదు.
రాళ్ళు పట్టుకుంటే ఊడి వస్తున్నాయి.
చెట్ల కొమ్మలు పెళుసుగా ఉన్నాయి.
దేక్కుంటూ.. దేక్కుంటూ దిగుతున్నాం.
అదే క్షేమమనిపించింది.
పట్టుకోవడానికి చెట్లు కూడా దూర దూరంగా ఉన్నాయి.
గుంజనే దిగిన వాణ్ణంటూ బీరాలు పలికాను.
హాలాయుధంలోకి దిగడం నిజంగా ఎంత కష్టం!
ప్రకృతి ఎంత ప్రేమగా ఉంటుందో, అంత కఠినంగానూ ఉంటుంది.
తిరుమల రెడ్డి చెప్పిన ఈ తత్వం అప్పుడు గుర్తుకొచ్చింది.
హలాయుధంలోకి దిగాలంటే, ముందు గుంజనలోకి దిగగలగాలి.
సగం వరకు మట్టి.
అక్కడ నుంచి రాతి కొండ.
అది మరీ నిట్ట నిలువుగా ఉంది.
రాతి అంచులు పట్టుకుని ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు దిగుతున్నాం.
కొందరు సాయపడుతున్నారు.
ఎట్ట కేలకు అంతా దిగాం.
ఎదురుగుండా మహాద్భుత దృశ్యం.
కొండ అంతా వలయాకారంలో ఉంది.
మెలికలు తిరిగిన కొండకు ఒక పక్క చీలిక నుంచి జలపాతం జాలువారుతోంది.
ఎంత ఉదృతంగా వచ్చిపడుతోందో!
నీటి ముత్యాలను వెదజల్లుతోంది.
గుండం నుంచి ముందుకు సాగిపోతోంది.
అంతా ఈదుకుంటూ, ఈదుకుంటూ జలపాతం కిందకు చేరాం.
జలపాతం కింద నిలుచోడానికి రాయి ఉంది.
పై నుంచి పడుతున్న జలపాతం, నీటి ముత్యాలతో అభిషేకిస్తున్నట్టుంది.
జలపాతం కింద ఎంత సేపు నిలబడినా రాబుద్ది కాదు.
లోయలోకి దిగలేనని ఆగిపోతే, ఎంత కోల్పోయే వాణ్ణి.
జలపాతం కింద నిలబడితే…
జీవితమే సఫలము…
సాహస సుధా భరితమూ,
ఆనంద సుధామయమూ..
ఈ జీవితమే సఫలమూ… అని పాడుకున్నాను.
తలెత్తి చేస్తే గుండం పైన కొండ గుండ్రంగా ఉంది.
ఆ కొండ అంచుల్లో దాగున్న గబ్బిలాలు, మా అలికిడికి , అల్లరికి ఒక్క సారిగా లేచాయి.
టపటపా మంటూ రెక్కలల్లార్చాయి.
బెంగుళూరు నుంచి వచ్చిన, విశాఖకు చెందిన శ్రీరాం తప్ప అందరూ ఈతగాళ్ళే.
తెలుగు, కన్నడం మేళవింపుగా, ముద్దు ముద్దు మాటలతో శ్రీరాం గట్టునేకూర్చుని కబుర్లు చెపుతున్నాడు.
‘అందరినీ చూసి, ఆవేశపడిపోయి శ్రీరాం గుండంలోకి దూకేయడుకదా!
యశ్వంత్ నీవు శ్రీరాం దగ్గరే ఉండు.
అతనికి ఈతరాదు’ అరిచాడు దూరం నుంచి మధు.
శ్రీరాంను అంటిపెట్టుకునే ఉన్నాడు యశ్వంత్.
హలాయుధ తీర్థం నీళ్ళు ముందుకు సాగుతున్నాయి.
మరికాస్త ముందుకెళ్ళి చూస్తే, అక్క డి నుంచి లోయలోకి పడుతున్నాయి.
అదే అద్భుతమైన విష్ణుగండం.
హలాయుధ తీర్థం నుంచి జాలు వారేది విష్ణుగుండంలోకే.
మధ్యాహ్నం పదకొండున్నరవుతోంది.
మళ్ళీ ఎక్కడం మొదలు పెట్టాం.
దిగడం కంటే ఎక్కడం తేలిక అనిపించింది.
ఈ లోయలోకి దిగడం నిజంగా సాహసమే.
నాలాంటి వారికి మాత్రం దుస్సాహసమే!
(ఇంకా ఉంది)
(ఆలూరు రాఘవశర్మ సీనియర్ జర్నలిస్ట్, ప్రకృతి ప్రియుడు, తిరుపతి)