(రెండు పగళ్ళు..ఒక రాత్రి.. శేషాచలంలో సాహస యాత్ర తరువాయి భాగం )
తిరుపతి జ్ఞాపకాలు-58
(రాఘవ శర్మ)
యుద్ధగళ.. చాలా గంభీరం.
తీర్థం ఎలా ఉన్నా, దీనికి చారిత్రక ప్రాధాన్యత ఉంది.
చరిత్ర యుగపు మానవుడు నివసించిన ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి.
కైలాస తీర్థం చూశాక, శనివారం సాయంత్రం నాలుగున్నరకు వాహనాల్లో యుద్ధగళకు బయలు దేరాం.
కుమార ధార, పసుపు ధార సమీపం నుంచి మా వాహనాలు యుద్ధగళ వైపు సాగాయి.
చీకటి పడే లోపు అక్కడికి చేరుకోవాలి.
మధ్యలో అన్నదమ్ముల బండను దూరం నుంచి చూశాం.
మా వాహనాలు చామల కోనను దాటాయి.
దూరంగా కొండకు అతి పెద్ద ఎర్రని బండ అతికించినట్టుంది.
రేపు తిరిగి వచ్చేటప్పుడు ఇవ్వన్నీ చూడచ్చనుకున్నాం.
దారి చాలా దారుణంగా ఉంది.
ఎప్పుడో వేసిన మట్టి రోడ్డు వర్షానికి కొట్టుకుపోయింది.
కొన్ని చోట్ల పరిచిన బండ రాళ్ళు బైటపడ్డాయి.
వర్షపు నీటి ప్రవాహం ఉన్న చోటల్లా గండ్లు పడ్డాయి.
ఈ దారిలో ఇటీవల ఏ వాహనమూ వెళ్ళిన ఆనవాళ్ళు కనిపించడంలేదు.
దారి మధ్యలో చెట్లు మొలిచాయి.
చీకటి పడబోతోంది.
గూగుల్ మ్యాప్‌లో దారి సరిగా కనిపించడం లేదు.
మూడు దారుల కూడలి వచ్చేసింది.
ఎటు వెళ్ళాలి?
ఎడమ వైపున దారి తలకోనకు వెళుతుంది.
తల కోన నుంచి యుద్ధగళకు పదిహేనేళ్ళ క్రితం ఆ దారినే నడుచుకుంటూ వెళ్ళాం.
తల కోన వైపు దారి కాకుండా నేరుగా వెళుతున్నాం.
ఈ దారి నరకాన్ని చూపించింది.
దారి పొడవునా కొండ రాళ్ళే.
వాహనాల వేగం తగ్గింది.
మా వాహనాలు ఎగిరెగిరి పడుతున్నాయి.
కొన్ని
వేగం ఎంత తగ్గినా అవి అదుపు తప్పుతున్నాయి.
క్రమంగా చీకటి పడుతోంది.
వాహనాలకున్న హెడ్‌లైట్లలో దారి సరిగా కనిపించడం లేదు.
దారికి ఇరువైపులా చెట్లు.
దారి మధ్యలోనూ మనిషెత్తు పెరిగిన బోద.
అక్కడక్కడా పందులు, ఎలుగు బంట్లు చేసిన గుంతలు.
గుంతల్లో పడుతూ లేస్తూ మా వాహనాలు అతి కష్టం పైన సాగుతున్నాయి.
నేను మధు బైక్ వెనుక కూర్చున్నాను.
మధు వాహనాన్ని ఎలా నడుపుతున్నాడో తెలియడం లేదు.
అందరూ మా వాహనాన్నే అనుకరిస్తున్నారు.
నిజంగా ఇది దారేనా? పొదల్లోకి దూసుకుపోతున్నామా?
లోయలోకి దొర్లుకు పోవడం లేదుకదా!?
అనుమానం కలిగింది.
నా వరకు నాకు భయమేసింది.
సాయంత్రం అయిదున్నరకే చీకటిపడింది.
మొత్తానికి మధు సాహసికుడు.
జీసస్ లాగా ‘ఫాలో మీ’ అన్నాడు అంతే..
వేరే దారి లేదు.
విరుప్పుంగల్ వీరునకు సగజం : వనతి
అందరూ అతన్ని అనుసరించారు.
ఆ రాళ్ళరహదారిలో దాదాపు గంటన్నర పాటు సాగిన మా ప్రయాణం ఒంటిని హూనం చేసింది.
మనసును ఆందోళనకు గురిచేసింది.
కొన్ని వాహనాలు పడిపోయాయి.
వెనక కూర్చున్న కొందరు వాహనాలనుంచి వెనక్కి పడిపోయారు.
అడుగడుగునా వాహనం దిగాల్సి వచ్చింది.
‘అర్జెంటుగా మ వైపు కాలు కింద పెట్టండి’ అన్నాడు మధు.
నేను పొరపాటున కుడికాలు కింద పెట్టాను.
నాకాలు పందులు చేసిన గుంతలో దిగింది.
అంతే..బండి లోంచి దొర్లుకుంటూ లోయ వైపు పడ్డాను.
నాశరీరం రెండు దొర్లులు దొర్లి అక్కడ ఆగిపోయింది.
దెబ్బలుతగల లేదు.
మళ్ళీ లేచి ప్రయాణం.
డాక్టర్ ప్రసాద్ బుల్లెట్ వెనుక కూర్చుని బుడుంగున రెండు మూడు సార్లు పడ్డారు.
‘పడ్డ వాడెప్పుడూ చెడ్డవాడు’ కాదన్నా.
‘విరుప్పుంగల్ వీరునకు సగజం’ అన్నారు చెన్నై నుంచి వచ్చిన వనతి.
దీనికి రెండర్థాలు.
‘యుద్ధంలో గాయపడడం వీరుడికి సహజం’.
‘పడడం వీరుడికి సహజం’.
మా బృందంలో ఏకైక మహిళ వనతి.
భర్త శంకర్‌తో పాటు చెన్నై నుంచి బెల్లెట్‌లో వచ్చింది.
‘దారి నాకు తెలుసు రండి’ అంటూ స్థిత ప్రజ్ఞుడిలా సాగిపోతున్నాడు మధు.
ఎట్టకేలకు యద్ధగళ సమీపించాం.
రాత్రి ఏడు దాటుతోంది.
ఒక పెద్ద చెట్టు కింద వాహనాలను ఆపేశాం.
పక్కనే ఏరు ప్రవహిస్తోంది.
ఒక పక్కటెంట్లు , మరొక పక్క వంటలు మొదలయ్యాయి.
నాలుగు పక్కలా నాలుగు పవర్‌బ్యాంక్‌లతో మధు లైట్లు అమర్చాడు.
యశ్వంత్ చలిమంట వేశాడు.
అంతా అలసిపోయారు.
అయినా ఎవరి పనులు వాళ్ళు చకచకా కానిచ్చేశారు.
వేడి వేడి చపాతీలు.. వేడి వేడి అన్నం..రకరకాల ఊరగాయలు..పెరుగు.
ఓహ్..అడవిలో ఇంతకంటే ఏం కావాలి?
భోజనాలు చేస్తూ తెలుగు, తమిళ కబుర్లు.
చలి మొదలైంది.
భోజనాలు ముగించి ఒకరొకరు గుడారాలలోకి దూరుతున్నారు.
పక్క నున్న ఏరు రొద చేస్తూ పారుతోంది.
యుద్ధగళలో చేరడానికి తన గళాన్ని సవరించుకుంటోంది ఏరు.
పగలంతా పడిన శ్రమకు పడుకోగానే నిద్రలోకి జారుకున్నాను.
తెల్లవారుజామునే గుడారాల్లోంచి మళ్ళీ కబుర్లు.
తమిళానికి, తెలుగుకు మధ్య వారధి గా మధు.
రాత్రి చీకట్లో వాహనాలపై చేసిన సాహసాలకు చమత్కారాలు.
‘నాకు ఇంగ్లీషు రాదు, తమిళం రాదు, హిందీ రాదు.
నాకు తెలుగు తప్ప వేరే భాష రాదబ్బా’ అనేశాడు తిరుమల రెడ్డి.
మహా నిర్మొహమాటి.
‘వచ్చే ట్రెక్‌లో తెలుగు వాళ్ళంతా తమిళంలో మాట్లాడాలి.
తమిళులంతా తెలుగులో మాట్లాడాలి’.
ఫత్వా జారీ చేశాడు మధు.
ఆ ప్రయోగం ఎలా ఉంటుందో ముందే ఊహించాం.
చలి ఒణికిచ్చేస్తోంది.
మాటలు నవ్విస్తున్నాయ్.
తెల్లవారక ముందే లేచి ఏం చేయాలి?
ముసుగుతన్ని పడుకున్నాం.
మనసు మాత్రం తెరుచుకుంది.
మాటలు దూది పింజల్లా ఎగురుతున్నాయి.
అయ్యప్పమాల వేసిన శివారెడ్డి ఎంత మాటకారి!
యశ్వంత్ అంత ఓపిక మంతుడు!
ఛ..ఈ అడవిలో అప్పుడే తెల్లారాలా!?
ఇంకాసేపుతెల్లారకపోతే ఎంత బాగుణ్ణు!
రాత్రంతా చలి మంట మండుతూనే ఉంది.
ఆ చలిలోనే లేచి మళ్ళీ సిద్ధమయ్యాం.
మా సామానంతా టెంట్లలో దూర్చేశాం.
యుద్ధగళ వైపు మా నడక మొదలైంది.
దీని అసలు పేరు రుద్రగళ.
అర్ధరాత్రి ఇక్కడ వీస్తున్న గాలులు చేసే శబ్దాలు యుద్ధనాదాలను తలపిస్తాయని అంటారు.
అందుకే దీనికి యుద్ధగళ అన్న పేరొచ్చింది.
ఎప్పుడొచ్చినా అలసిసొలసి నిద్రపోయాను.
ఆ యుద్ధనాదాలు వినలేదు.
ఏరు దాటుకుని యుద్ధగళ వైపు సాగుతున్నాం.
బ్రిటిష్ వారు ఎప్పుడో నాటిన నీలగిరి తైలం చెట్లు.
ఎంత లావుగా ఉన్నాయి!
అటవీశాఖ వారి బేస్‌క్యాంప్.
యుద్ధగళకు ఎప్పుడొచ్చినా మండు వేసవిలోనే వచ్చేవాళ్ళం.
పెద్దగా నీళ్ళుండేవి కాదు.
యుద్ధ గళలో నీళ్ళు బాగా ప్రవహిస్తున్నాయి.
తీర్థంలో కొందరు స్నానాలు చేశారు.
కొండ పై నుంచి అంచెలంచెలుగా దుముకుతూ ఏరు ముందుకు సాగుతోంది.
దుమికిన చోటల్లా శబ్దం చేస్తోంది.
హలాయుధ తీర్థం చూడాలని ఆ ఏటి వెంట అలా సాగుతున్నాం.
(ఇంకా ఉంది).
(రాఘవ శర్మ సీనియర్ జర్నలిస్ట్, ప్రకృతి ప్రేమికుడు, అలుపెరుగని ట్రెకర్)