1. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విశ్రాంత డిజిపి ఆంజనేయరెడ్డి గారు అధికార పార్టీ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో “దొనకొండ” ప్రస్తావన చేశారు. ఆంజనేయరెడ్డి గారంటే నాకు గౌరవం ఉంది. ఆయన ఇంటర్యూ చదివాక స్పందించాలనిపించింది.
2. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు డిజిపిగా బాధ్యతలు నిర్వహించిన ఆంజనేయరెడ్డి గారు రాష్ట్ర విభజన తర్వాత చిన్నదై పోయిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ను నాలుగు డివిజన్లుగా విడగొట్టి సచివాలయాలను ఏర్పాటు చేయాలని సూచించారు, కానీ, పరిపాలనా వికేంద్రీకరణకు ఉద్దేశించబడిన రాజ్యాంగ సవరణలు 73 మరియు 74 ప్రకారం స్థానిక సంస్థలకు అధికారాలను, ఆర్థిక వనరులను, బాధ్యతలను బదలాయించాలని ఎందుకు సూచించ లేక పోయారో ఆశ్చర్యం వేసింది.
3. శాసనసభ ఏకగ్రీవ తీర్మానంతోనే కదా! అమరావతి రాజధానిగా నిర్ణయించబడింది. నాడు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించాయి కదా! రాజధానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు కాదా! నిర్మాణంలో ఉన్నది కదా! అమరావతి నుండే పాలన సాగుతున్నది కదా! హైకోర్టు కార్యకలాపాలు నిర్వహిస్తున్నది కదా! మరి, రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వహించిన వారు, ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న వాళ్ళు, సమాజం పట్ల బాధ్యతగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా రాజధాని అంశంపై ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారా? ఆంజనేయరెడ్డి గారు ఆలోచించాలి.
4. ప్రాంతాల మధ్య విభేదాలు లేకుండా, నీటి వనరులు ఉన్న ప్రాంతంలో, ముప్పయ్ వేల ఎకరాల భూమి సేకరించగలిగిన ప్రాంతంలో, రాష్ట్రానికి నడిబొడ్డులో రాజధానిని ఏర్పాటు చేయాలని, 2019 ఎన్నికలకు ముందు వై. యస్. జగన్మోహన్ రెడ్డి గారు తన నోటి గుండా చక్కటి మాటలు పలికినప్పుడు, శాసనసభ – రాష్ట్ర సచివాలయం – హైకోర్టు ఉన్న దాన్నే రాజధాని అంటారని నిర్వచించినప్పుడు, శాసనసభ వేదికగా అమరావతి రాజధానికి సంపూర్ణ మద్దతు తెలిపినప్పుడు, అమరావతిలోనే నివాసానికి ఇల్లు కూడా నిర్మించుకున్నాని ప్రజలకు తెలియజేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి వైఖరిపై స్పందించి, దొనకొండ ప్రతిపాదనను బలపరచమని ఆంజనేయరెడ్డి గారు నాడు ఎందుకు అడగలేకపోయారో?
5. మడమతిప్పని నైజం తనదంటూ నమ్మబలికి అధికార పీఠం ఎక్కగానే నిజస్వరూపాన్ని ప్రదర్శిస్తూ, దక్షిణాఫ్రికా నమూనాలో మూడు రాజధానులంటూ 180 డిగ్రీలు మడమ తిప్పి, రాజధానిని విశాఖపట్నానికి తరలిస్తానంటూ, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళన్న చందంగా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి వైఖరిపై ఆంజనేయరెడ్డి గారు ఎందుకు స్పందించలేదో! రాష్ట్ర రాజధానికి మీరు ప్రస్తావించిన దొనకొండ అనుకూలమైందా! కాదా! అన్నది ఇప్పుడు అప్రస్తుతం. రాష్ట్రానికి నడిబొడ్డులో ఉన్న అమరావతి నుండి విశాఖపట్నానికి రాజధానిని తరలిస్తే వెనుకబడ్డ రాయలసీమకు సౌలభ్యంగా ఉంటుందని ఆంజనేయరెడ్డి గారు భావిస్తున్నారా?
6. కడకు, కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కూడా విశాఖకు తరలించమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు వ్రాసింది కదా! కనీసం దానిపై ఆంజనేయరెడ్డి గారు ఎందుకు స్పందించలేదో!
7. అమరావతికి సరైన రోడ్డు సౌకర్యంలేదని, శ్మశానమని, ఎడారని, నోటికొచ్చినట్లు మాట్లాడారు కదా! ఈ పూర్వరంగంలో దొనకొండ ప్రస్తావన చేసిన ఆంజనేయరెడ్డి గారు దొనకొండకు ఉన్న మౌలిక సదుపాయాలపై కాస్త వివరిస్తే తెలుసుకోవాలని ఉంది.
8. అమరావతిలో రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు అవుతుందని, రాష్ట్ర బడ్జెట్ మొత్తాన్ని ఏళ్ళ తరబడి అమరావతిలో వెచ్చించాల్సి ఉంటుందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. మరొక వైపున విశాఖలో పది వేల కోట్లు ఖర్చు చేస్తే అంతర్జాతీయ స్థాయి రాజధాని అవుతుందని జగన్మోహన్ రెడ్డి సెలవిచ్చారు. మరి, దొనకొండలో అయితే ఎంత ఖర్చు అయ్యేదో! ఆంజనేయరెడ్డి గారే చెప్పాలి?
9. అమరావతి రాజధానికి కులాన్ని కూడా ఆపాదించిన ప్రబుద్ధులు అధికారాన్ని వెలగబెడుతున్నారు. మరి, దొనకొండలో అయితే…
10. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాటి చరిత్రను తవ్వుకుంటూ పోతే తెలుగు జాతి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడానికే దోహదపడుతుందని విజ్ఞులైన ప్రజలన్నా గుర్తించాలి.
-టి.లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు