బకాసుర వధ అలంకారంలో అల‌మేలుమంగ‌

 

*తిరుప‌తి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల్లో మూడో రోజైన మంగళవారం ఉదయం ముత్యపుపందిరి వాహనంపై బకాసుర వధ అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. ముద్దులొలికించే ముత్యాలు అలిమేలుమంగకు ప్రీతిపాత్రమైనవి. స్వాతికార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపుచిప్పల్లో పడి మేలుముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో తెలియజేశారు.

తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలుమంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం చేకూరుతుందని విశ్వాసం. మధ్యాహ్నం 12.30 నుండి 2.30 గంటల వరకు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, గంధంతో అభిషేకం చేస్తారు. కాగా సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు సింహ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులను కటాక్షించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *