డాక్టర్. యస్. జతిన్ కుమార్ (ఫోన్: 9849806281)
[20-11-2022 న విశాఖపట్నంలో జరిగిన భారత చైనా మిత్రమండలి రెండు తెలుగు రాష్ట్రాల సంయుక్త రాష్ట్ర మహాసభల సందర్భంగా రాసినది]
భారత చైనా ప్రజల మైత్రీ బంధము, సాంస్కృతిక సంబంధాలు శతాబ్దాల తరబడి కొనసాగుతూ వస్తున్నాయి. ఈ రెండు దేశాల జనాభా ప్రపంచ జనాభాలో దాదాపు మూడవ వంతుకు పైగా వున్నది. వీరి సంబంధాలు ప్రపంచ జనాభాపై గొప్ప ప్రభావాన్ని కలిగి వుంటాయి. గతంలో అవి ప్రపంచ నాగరికతపై, పరిణామాలపై తమదైన ముద్రను వేశాయి. తమ మైత్రికి మార్గదర్శకంగా భారత చైనాలు రూపొందించుకున్న పంచశీల ఒప్పందం, ఏ దేశాల మధ్య నయినా నెలకొల్పు కోవలసిన సంబంధాలకు ప్రాతిపదిక గా, కరదీపికగా మారింది. అయితే ఈ మైత్రీ యాత్రలో కొన్ని పొరపొచ్చాలు, ఘర్షణలు, ఆటంకాలు, అడ్డంకులు కొంతకాలంగా నెలకొని వున్నాయని అందరికీ తెలిసిందే. కానీ ఇవి శాశ్వతం కాదనీ, ఇరు దేశాలు ఒకరికొకరు పోటీ కాదని, ఇరువురూ ఒకరికొకరు సహకరించుకోవాలనీ భారత చైనా మిత్రమండలి భావిస్తున్నది.
ఇరు దేశాల స్నేహ సంబంధాల చరిత్రలో అనేక ఉజ్వల ఘట్టాలు మనముందు వున్నాయి. అందులో ఒకటి – మన సంబంధాలకు అత్యున్నత ప్రతీకగా, అంతర్జాతీయ మానవతకు రూపంగా నిలిచిన డాక్టర్ ద్వారకానాథ్ శాంతారాం కోట్నీస్ జీవిత స్పూర్తి. 10-10-1910 న భారత దేశం షోలాపూర్ నగరంలో జన్మించి, 9-12-1942 న చైనాలో అసువులు బాసిన 32 సంవత్సరాల యువకుని జీవన వికాసం ఒక చారిత్రక ఆదర్శంగా మనముందు వుంది. తను వైద్య విద్య ను అభ్యసిస్తున్నప్పుడే బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక భారతీయ ఉద్యమాల వారసత్వా న్ని పుణికి పుచ్చుకుని, జాతీయ భావాలను, దేశభక్తిని నింపుకున్న కోట్నీస్- అంతర్జాతీయ మానవతావాదిగా మారటానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ సమయంలో చైనా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చైనా ప్రజలు జపాన్ ఫాసిస్ట్ దురహంకారానికి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటాలపట్ల ఆయన సహానుభూతిని పెంచుకున్నాడు. చైనా కమ్యునిస్ట్ పార్టీ అభ్యర్ధనపై భారత కాంగ్రెస్ పంపిన ఒక వైద్య సహాయ బృందంలో స్వచ్చందంగా చైనా వెళ్ళాడు. తాను స్వయంగా యుద్ద భూమిలో నిలబడి రోజుకు 18 గంటలు పైగా వైద్య సేవలు అందించాడు. మిగతా డాక్టర్లు తిరిగి ఇండియా వచ్చేసినా తాను అక్కడే వుండిపోయాడు. యుద్ధ రంగంలోనే పనిచేస్తున్న ఒక నర్సును [చైనా యువతి] వివాహమాడాడు.వారికి ఒక కొడుకు జన్మించాడు. ఫాసిస్టుల పై చైనా తప్పకుండా విజయం సాధిస్తుంద నే విశ్వాసంతో వారికి తన లాటి డాక్టర్ల అవసరం చాలా వుందని భావించి, అక్కడి అతి శీతల వాతావరణం వల్ల తన ఆరోగ్యం శిధిలమవుతున్నా, లెక్కచేయకుండా అహర్నిశలూ పని చేస్తూ అక్కడే మరణించాడు.
భారత స్వాతంత్ర్య ఉద్యమ దీప్తికి, చైనా విముక్తి పోరాట ధృతికీ, మానవాళి సాగించిన ఫాసిస్టు వ్యతిరేక సమరశీల శౌర్యానికి, అంతర్జాతీయ మానవతా సంఘీభావానికి, భారత చైనాల మధ్య సౌహార్దానికి అత్యుత్తమ ఉదాహరణగా నిలిచిన డాక్టర్ కోట్నీస్ జీవితం అజరామరం. మనకు ఎనలేని మానవతా వారసత్వ సంపదను అందించిన ఉత్తమ భారత పుత్రుడు కోట్నీస్. ఆ మహోన్నత త్యాగాన్ని గుర్తించిన చైనా ప్రభుత్వం ఆయన స్మృతి చిహ్నంగా వైద్యశాల లు, మ్యూజియంలు నెలకొల్పి ఇప్పటికీ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నది. భారత సందర్శనకు వచ్చిన చైనా ప్రధాని అధ్యక్షులు డాక్టర్ కోట్నీస్ కుటుంబీకులను కలసి మాట్లాడి తమ గౌరవాన్ని ప్రకటిస్తారు. ఆయన స్పూర్తితో రెండు దేశాల మధ్య స్నేహ సహకారాలు పునరుద్ధరించు కోవాలని ప్రతిపాదిస్తారు. ఆయన గౌరవార్ధం ఇప్పటికీ భారత-చైనా సంయుక్త మెడికల్ మిషన్స్ నిర్వహిస్తున్నారు. భారత చైనా మిత్రమండలి డాక్టర్లు 2019 వరకు ఆ బృందాల లో పాల్గొన్నారు. కరొన విపత్తు తరువాత ప్రస్తుతం ఈ బృందాల మార్పిడి జరగటం లేదు. భారత- చైనా మిత్రమండలి కూడా డాక్టర్ కోట్నీస్ స్మృతిని ఒక స్పూర్తి దీపంగా పదిల పరచుకుంటున్నది, ప్రజలకు గుర్తు చేస్తున్నది.
ఈనాటి జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులలో భారత, చైనాలు ఐక్యంగా సామ్రాజ్యవాద వ్యతిరేక సమరం సాగించ వలసిన ఆవశ్యకత వుంది. భారత దేశం పై సామ్రాజ్యవాదుల పట్టు, ప్రభావం, ఆర్ధిక దోపిడి కొనసాగుతూనే ఉన్నం దున మన ప్రజలకు ఈ పోరాటం మరింత ఎక్కువగా అవసరం. ఆర్ధికంగా పలు సంక్షోభాలలో చిక్కుకుని, పెట్టుబడి దారీ ప్రపంచం అల్లాడి పోతున్నది. కొరోనా ప్రభావం వారిని మరింతగా కుంగదీసింది. దాని నుంచి బయటపడడానికి తన యుద్ధసామగ్రిని, ఆయుధాలను అమ్ముకుని డబ్బు చేసుకుంటున్నది. తన పెత్తందారీతనంతో, వివిధ ప్రాంతీ య విభేదాలను రగిలించి ప్రపంచాన్ని యుద్దజ్వాలల లోకి నెడుతున్నది.
మరో పక్క చైనా కోరోనా పై ప్రజా యుద్ధం చేస్తూనే, మానవాళి అభివృద్ధికి శాంతియుత పరిస్థితులు నెలకొనాలని అనేక ప్రత్యామ్నాయ మార్గాలను ప్రతిపాదిస్తున్నది. ఉక్రైన్ యుద్ధం, తైవాన్ విషయంలో ఎంత సంయమ నంతో, శాంతికి తోడ్పడే రీతిలో వ్యవహరిస్తున్నదీ ప్రపంచమంతా గమనించింది. అనేక దేశాలలో మౌలిక వసతులు నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నది. ఆయా దేశాల భౌతిక వనరులను, సహజ సంపదలను ఆ దేశాల అభివృద్ధికి ఉపయోగ పడేలా సహాయం చేస్తున్నది. ఉమ్మడి భాగస్వామ్యం గల మానవాళి భవిష్యత్తును నిర్మించటానికి సిద్ధం చేస్తున్నది. ఈ పరిస్థితు లలో భారత దేశం కూడ, సామ్రాజ్యవాద ప్రభావం నుండి బయటపడి ఒక స్వతంత్ర, స్వయం పోషక వ్యవస్థ ను నెలకొల్పుకొవాలి. మన అవసరాలకు అనుగుణమైన ప్రజానుకూల అభివృద్ధి మార్గాన్ని అనుసరించాలని మిత్ర మండలి భావిస్తున్నది.
ఇందుకోసం చైనా అనుసరించిన అభివృద్ధి విధానాలను అధ్యయనం చేసి, అవసరమైన అంశాలలో వారి సహకారం తీసుకుని భారత జాతీయ ప్రయోజనాలకు అనుగుణమైన విధానాలు చేపట్టాలని మిత్రమండలి డిమాండ్ చేస్తున్న ది. పరస్పర అవగాహన, రెండవవారి ఆకాంక్షల పట్ల గౌరవముతో, ఇచ్చి పుచ్చుకునే ధోరణితో తమ మధ్య వున్న సమస్యలను సర్దుబాటు చేసుకుని, ఒక శాంతియుత, అభివృద్ధి పంధాలో నిలవగలవని మిత్రమండలి ఆశిస్తున్నది. విశ్వసిస్తున్నది. చైనాతో ఒక ప్రక్క 125 బిలియన్ డాలర్ల విలువగల వాణిజ్యం నిర్వహిస్తూనే ప్రజలలో మాత్రం చైనా వ్యతిరేక ప్రచారానికి పూనుకుంటున్న వైఖరి సమస్యల పరిష్కారానికి తోడ్పడదు. మన పాలకులు పొరుగు దేశాలతో, ముఖ్యంగా చైనాతో అన్ని రంగాలలో మైత్రిని అభివృద్ధి చేసుకుని ఆసియా దేశాల మన్ననలు పొందాలి. పొరుగు దేశాలతో మిత్ర సంబంధాలు ఏర్పరచుకుంటే యుద్ధ విధానాలు అనుసరించే అవసరం వుండదు. పొరుగు దేశాలతో మైత్రీ సంబందాలు దేశ రక్షణకు పెట్టని గోడలు అని గుర్తు చేస్తున్నది. కోట్ల కోట్ల పెట్టుబడులను యుద్ధ సన్నాహాలకు కేటాయించడం మాని, వాటిని అభివృద్ధి పథకాలకు కేటాయించ గలుగుతాము.
డా. కోట్నిస్ వెలిగించిన మైత్రీ స్పూర్తిని గుర్తుచేస్తూ రెండు తెలుగు రాష్ట్రాలలోని భారత చైనా మిత్ర మండలి శాఖలు ఈ నెలలో డా. కోట్నీస్ 110వ జయంతి సభలు అనేకంగా నిర్వహించాయి. సంయుక్తంగా విశాఖపట్నంలో 20-11-22న రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నాయి. బలమైన ప్రజా ఉద్యమం మాత్రమే మైత్రీ వారధులు నిర్మించి శాంతిని నెలకొల్పుతుంది కనుక భారత- చైనా మిత్ర మండలి ఈ ఉద్యమ విస్తృతికి అందరి తోడ్పాటును అభ్యర్ధిస్తున్నది.
[రచయిత భారత చైనా మిత్రమండలి జాతీయ కార్యవర్గ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి]