మోదీకి లక్షలాది ‘తెలంగాణ చేనేత’ పోస్ట్ కార్డులు

 

*లక్షలాది పోస్ట్ కార్డులను ప్రధానమంత్రి మోడికి పంపిన నేతన్నలు*

• చేనేతపై జిఎస్టిని పూర్తిగా రద్దు చేయాలన్న నినాదంతో పోస్టు కార్డుల ఉద్యమం

• రాష్ట్రంలోని వివిధ జిల్లాల నేతన్నలు రాసిన లక్షలాది ఉత్తరాలు హైదరాబాదులో ప్రదర్శన

• నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో లక్షలాది ఉత్తరాలను ప్రదర్శించిన నేతన్నలు

• కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి కి వ్యతిరేకంగా నినాదాలు చేసిన నేతన్నలు

• జీఎస్టీని రద్దు చేయడంతో పాటు, నేతన్న సంక్షేమ కార్యక్రమాలను పునరుద్ధరించాలని కేంద్రానికి డిమాండ్

• నిజాం కాలేజ్ నుంచి ఆబిడ్స్ వరకు ర్యాలీగా వెళ్లి జనరల్ పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ కార్డులను పోస్ట్ చేసిన వందలాది నేతన్నలు

 

చేనేత పైన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నేతన్నలు ప్రధానమంత్రి మోడీకి రాసిన లక్షలాది ఉత్తరాలను ఈరోజు హైదరాబాదులో ప్రధానమంత్రి కార్యాలయానికి పోస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన లక్షలాది ఉత్తరాల సంచులతో నేతన్నల సంక్షేమ సంఘాలు, చేనేత కార్మిక సంఘాలు మరియు నేతన్నల సామాజిక వర్గాలు, పార్టీ లీడర్లు హైదరాబాదులోని నిజాం కాలేజీ గ్రౌండ్లో భారీగా ప్రదర్శించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వందలాది నేతన్నలు నిజాం కాలేజ్ నుంచి ఉత్తరాలను తీసుకొని అబిడ్స్ లోని జనరల్ పోస్ట్ ఆఫీస్ వరకు భారీగా ఒక ర్యాలీని నిర్వహించారు.

అంతకుముందు నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన వేదిక వద్ద లక్షలాది ఉత్తరాలను ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చేనేత కార్మికులకు సంబంధించిన భవిష్యత్తును అగమ్య గోచరం చేస్తున్న చేనేత వస్త్రాల జీఎస్టీ ని పైన పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు నేతన్నల సంక్షేమానికి గతంలో ఉన్న జీవిత బీమా మరియు యార్న్ సబ్సిడీ వంటి కార్యక్రమాలను పునరుద్ధరించాలని, రద్దు పరిచిన హ్యాండ్లూమ్ మరియు పవర్ లూమ్ వంటి బోర్డులను వెంటనే తిరిగి ఏర్పాటు చేయాలని నినదించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్ రమణ మరియు మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నదని, వారికి ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసి, వారిని చేనేత వృత్తి నుంచి దూరం చేస్తున్నదని ఎల్ రమణ ఆరోపించారు. ఒకప్పుడు గాంధీ మహాత్ముడు దేశ స్వాతంత్రం కోసం అత్యంత కీలకమైన ఆయుధంగా వాడిన చేనేత ఉత్పత్తులపైన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీఎస్టీ విధించడం అత్యంత దారుణం అన్నారు. పైగా ఐదు శాతం ఉన్న జీఎస్టీ ని చేనేత వస్త్రాలపై 12 శాతానికి పెంచేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర చేసిందని, దేశవ్యాప్తంగా వచ్చిన నిరసనల వలన ప్రస్తుతం దాన్ని ఆపి ఉంచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేనేతపైన ఉన్న ఐదు శాతం జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలన్న ఏకైక నినాదంతో తెలంగాణ రాష్ట్రంలోని నేతన్నలు లక్షలాది పోస్ట్ కార్డులను ప్రధానమంత్రికి రాశారని, ఇప్పటికైనా దేశవ్యాప్తంగా ఉన్న నేతన్నల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం చేనేతపైన జిఎస్టిని పూర్తిగా రద్దు చేయాలని, అప్పటిదాకా తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని ఎల్ రమణ తెలిపారు.

లక్షలాది పోస్ట్ కార్డులను ప్రధానమంత్రి మోడీకి పంపించడం ద్వారా చేనేత కార్మికులు తమ దుఃఖాన్ని, బాధను ప్రధానమంత్రి కి తెలియజేసే ప్రయత్నాన్ని చేశారని, ఈ పోస్ట్ కార్డులను అందుకున్న తర్వాత ఆయినా ప్రధానమంత్రి వెంటనే స్పందించి చేనేత పైన జిఎస్టిని పూర్తిగా రద్దు చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్ భాస్కర్ డిమాండ్ చేశారు.

నిజాం కాలేజీ నుంచి అబిడ్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లిన నాయకులు నేతన్నలు, తమ వెంట తీసుకువచ్చిన లక్షలాది ఉత్తరాలను ప్రధానమంత్రికి పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, పవర్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గూడురి ప్రవీణ్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కర్నాటి విద్యాసాగర్, వివిధ పద్మశాలి సంఘాల ప్రతినిధులు, రాష్ట్రంలోని చేనేత కార్మికుల సొసైటీలు, వాటి ప్రతినిధులు భారీ ఎత్తున తరలివచ్చిన వివిధ జిల్లాల నేతన్నలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *