(రాఘవ శర్మ)
శ్రీశ్రీ పైన ప్రత్యక్ష యుద్ధం జరిగితే, గరికపాటి రాజారావు పైన పరోక్ష యుద్ధం జరిగిందని, వీరిద్దరినీ నైతికంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేశారని ప్రముఖ రంగస్థల, సినీ కళాకారుడు, సాహిత్యకారుడు కాకరాల అన్నారు.
వైద్యం కోసం తిరుపతి వచ్చిన సందర్భంగా ఆయనను బుధవారం కలిసినప్పుడు కొన్ని ముఖ్యమైన చారిత్రక విషయాలను ఇలా గుర్తు చేశారు.
ఆ జ్ఞాపకాలను ఆయన మాటల్లోనే విందాం.
‘శ్రీశ్రీని 1955 ఎన్నికల్లో తమ తరపున ప్రచారం చేయమని కమ్యూనిస్టు పార్టీ కోరింది.
అందుకు అంగీకరించి ఆయన ప్రచారం చేస్తున్నారు.
ఆ ప్రచార క్రమంలో కొంత కాలం సక్రమంగా సాగింది.
ఆ తరువాత ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు.
ఇంచు మించు ఆనాడు పత్రికారంగంలో ఉండే ప్రఖ్యాతులైన వారందరూ కలిసి శ్రీశ్రీ పైన దాడి మొదలు పెట్టారు.
ఇది ‘దొంగ దాడి’ అనే రూపంలో రికార్డయ్యింది.
దాని ప్రకారం వీరందరూ కూడా ఆయన్ని ఒంటరిని చేసి, దాడి కొనసాగించేటప్పటికీ, ఆయన తట్టుకుంటూ నెట్టుకొచ్చారు.
శ్రీశ్రీ మానసికంగా సమతౌల్యత తప్పే విధంగా ఆ సమయంలో వారు ఒక వ్యూహాత్యకంగా ప్రయత్నించారు.
దాన్ని తట్టుకుని శ్రీశ్రీ ప్రచారం చేస్తూ ఉండగా, ఆయన సమతౌల్యత తప్పే సమయంలో చలసాని వంటి మిత్రులు గమనించి ఆయన్ని రక్షించే ప్రయత్నం
చేశారు.
కానీ, ఆ ప్రయత్నంలో శ్రీశ్రీ సమతౌల్యత అదుపు తప్పుతున్నాడనే పరిస్థితికి వచ్చిన తరువాత, ఆయనను మానసిక వైద్యశాలలో చేర్చారు.
ఆ ఆస్పత్రి నుంచి ఆయన వచ్చేలోపు నార్త వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో పత్రికా సంపాదకులంతా శ్రీశ్రీకి వ్యతిరేకంగా ఒక వైపు, నార్ల చిరంజీవి గారు ఒక్కరే శ్రీశ్రీ వైపు నిలబడి సాహిత్య యుద్ధం కొనసాగింగారు.
అందరూ కట్టకట్టుకుని శ్రీ శ్రీని ఇబ్బంది పెడుతున్నారని, నార్ల చిరంజీవి నిలబడ్డారు.
నార్ల వెంకటేశ్వరరావు నాయకత్వంలోనే శ్రీశ్రీకి వ్యతిరేకంగా దాడి చేశారు.
నార్ల చిరంజీవి ‘దొంగ దాడి’ అనే పుస్తకంలో దీని గురించి చాలా వివరంగా రాశారు.
ఆ సాహిత్యం సారాంశంగా చివరికి తేలిందేమిటంటే, శ్రీశ్రీ తట్టుకోగలిగిన మేరకు తట్టుకున్నారు.
అదుపు తప్పుతున్నాడనుకున్నప్పుడు ఆస్పత్రిలో చేర్చారు.
బైటికొచ్చాక తాను ఏ వైపు ఉంటున్నారో ఆ వై పే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని శ్రీశ్రీ ప్రకటించారు.
ఈ దాడిలో పత్రికా రచయితలందరికీ వ్యతిరేకంగా శ్రీశ్రీ తరపున నిలబడి పోరాడిన వారు నార్ల చిరంజీవి ఒకే ఒక్కరే.
శ్రీశ్రీ ఆస్పత్రి నుంచి బయటకి వచ్చి, కమ్యూనిస్టు పార్టీ తరపున పనిచేశారు.
నార్ల వెంకటేశ్వరరావు నాయకత్వంలో పత్రికా సంపాదకులందరూ ఆ దాడి చేశారు.
వాళ్ళ దంతా ఫౌల్ గేమని చివరికి నిరూపితమైంది.
శ్రీశ్రీ బైటికొచ్చిన తరువాత మళ్ళీ తేరుకుని, ఇదివరకు ఏ కమ్యూనిస్టు పక్షంతో ఉన్నారో, అదే పక్షంలో కొనసాగుతూ వచ్చారు.”
గరికపాటి రాజారావుకు అనుంగు శిష్యుడైన కాకరాల ఆయన పైన కూడా ఎలా యుద్ధం జరిగిందో ఇలా వివరించారు.
“శ్రీశ్రీ పైన సూటిగా యుద్ధం చేస్తే, గరికపాటి రాజారావు పైన పరోక్ష యుద్ధం చేశారు.
ఆంధ్ర ప్రజానాట్యమండలికి కార్యదర్శిగా, ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోసియేషన్ (ఇఫ్తాకు బాధ్యుడిగా రాజారావు వ్యవహరించారు.
ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోసియేషన్ తొలి సమావేశానికి వెళ్ళిన వారి నాయకత్వంలో కాకుండా, అధిష్టానం ఆ బాధ్యతలను రాజారావుకు అప్పగించింది.
రాజారావు అనుయాయులుగా ఉన్న వారే ఆయనకు సహాయ నిరాకరణ చేస్తూ వచ్చారు.
రాష్ట్రపతి రాధాకృష్ణన్ సమక్షంలో ఇఫ్తా తరపున ‘జై భవాని’ నాటకం ఆడడానికి హైదరాబాదు తీసుకెళ్ళారు.
కానీ, ఇఫ్తా తరపున కాకుండా, రాఘవ కళాసమితి తరపున వేస్తున్నట్టుగా అక్కడి కెళ్ళాక చెప్పారు. తిరిగి వచ్చే ముందు రాజారావును సమాధాన పరచడానికి ప్రయత్నించారు, కానీ, ఆయన సమాధానపడలేదు.”
(ఆలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)