డాక్టర్ యస్. జతిన్ కుమార్
( 19-10-22న గ్లోబల్ టైమ్స్ కథనం, సంక్షిప్త అనువాదం)
[చైనాలో అంతులేని అవినీతి వుందని, ముఖ్యంగా పార్టీ అధికార వర్గం లోనే ఇది వేళ్లూనుకుని వుందని పెద్ద ప్రచారం సాగుతూ వుంటుంది. డెంగ్ జియావో పింగ్ ప్రారంభించిన మార్కెట్ సరళీకరణ సంస్కరణలతో వరదలా వచ్చిన ఆర్ధిక అభివృద్ధి, నిరంతర “సంస్థాగత పరిణామాలలో”అవినీతి చిలువలు వేసింది. ఆర్థిక సంస్కరణలను చేపట్టిన తూర్పు ఐరోపా మధ్య ఆసియా వంటి ఇతర ఆర్థిక వ్యవస్థల లో కూడా ఇలాగే అవినీతి పెరిగింది. వాటి మాదిరిగానే, సంస్క రణ-యుగపు చైనా కూడా అవినీతి స్థాయిలో పెరుగుదలను చవిచూసింది. దానిని గుర్తించి ఎప్పటికప్పుడు తగిన నివారణోపాయాలను చేపడుతున్నారు. 2012లో అధ్యక్షుడు జి జీన్ పింగ్ అవినీతి వ్యతిరేక పోరాటం తన ప్రాధమ్యాలలో ఒకటని ప్రకటించి ప్రక్షాళన మొద లు పెట్టారు. అధ్యక్షుడే అవినీతి వుందని ప్రకటించారని వక్రీకరించి పాశ్చాత్య మీడియా పేట్రేగి పోయి చైనా సమాజం ఆవినీతితో మురిగిపోయిందని దుష్ప్ర చారం తో ముంచెత్తారు. కానీ జీనపింగ్ సారధ్యంలో సాగుతున్న అవినీతి వ్యతిరేక ప్రజా యుద్ధాన్ని మాత్రం వారు చూడ నిరాకరించారు. చైనా చేసిన ప్రయత్నాల వల్ల అవినీతి అరికట్టబడింది . ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వారి 2021 కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ లో 180 దేశాలలో చైనా 66 వ స్థానంలో, ఇండియా 85 వ స్థానంలో ఉన్నాయి,180 స్థానంలో వున్నదేశం అత్యంత అవినీతికరమైన ప్రభుత్వ రంగాన్నికలిగి ఉందని భావిస్తారు. తమ దేశాలలో అవినీతి పెనుభూతంలావున్న ప్పటికీ దాన్ని గుర్తించకుండా మరుగు పరిచి, దాన్నిసాధారణ అంశంగా పరిగణించే వీరు, చైనా తానొక ఉన్నత స్థాయి నైతిక,సాంస్కృతిక సమాజం లా పరిణమించే క్రమంలో సమూలంగా ఏరి వేస్తున్న అవినీతి కలుపు ని, అందుకోసం విధిస్తున్న శిక్షలను చూపి దుష్ప్రచారం చేస్తున్నారు. 20 వ జాతీయ కాంగ్రెస్ లో చేసిన సమీక్ష చైనాలో వున్నవాస్తవ పరిస్థితిని మన ముందు వుంచుతున్నది. అవినీతిపై వారి సమరం కొనసాగబోతున్న తీరును వివరిస్తున్నది. అవినీతి జాడ్యం చైనాలో కంటే ఎక్కువ విస్తరించి వున్న అనేక ప్రజాస్వామ్య దేశాలు, మన దేశం తో సహా అవినీతి ని అరికట్టటానికి ఏమి చేస్తున్నాయనే ప్రశ్న మనలో చెలరేగుతుంది]
చైనా లో కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) కేంద్ర కమిటీ (సిపిసి) ప్రధాన కార్యదర్శి జి జిన్పింగ్ సిపిసి20 వ నేషనల్ కాంగ్రెస్ కు ఇచ్చిన ఒక నివేదికలో కొత్త శకంలో దేశ, జాతి లక్ష్యాలను సాధించాలంటే ముందుగా పార్టీ తనను తాను సిద్ధం చేసుకోవాలని, దానికి పూర్తి కఠినమైన స్వీయ పాలనను అమలు చేసే పార్టీ నిర్మాణాన్నిమెరుగుపరచాలని నొక్కిచెప్పారు. వాటిలో “అవినీతికి వ్యతిరేక౦గా కఠినమైన, దీర్ఘకాలిక పోరాట౦లో విజయ౦ సాధి౦చడ౦” అనే నిర్దేశం ఉ౦ది.
2012 లో 18 వ సిపిసి జాతీయ కాంగ్రెస్ నుండి, దేశం యొక్క క్రమశిక్షణ, తనిఖీ, పర్యవేక్షణ అధికారులు 46లక్ష లకు పైగా కేసులను దాఖలు చేశారు, 553 కేంద్ర పాలిత అధికారులు, 25,000 మంది డిపార్ట్మెంట్ లు లేదా తత్సమానమైన ప్రధాన స్థానాలకు చెందిన 25,000 మంది అధికారులు, కౌంటీ స్థాయిలో 1,82,000 మంది అధికారులపై అధికారిక క్రిమినల్ కేసులు నమోదు చేయబడ్డాయి. “చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో అవినీతికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధం” విపరీతమైన విజయాన్ని సాధించింది. ఆ కృషి మొత్తంగా ఏకీకృతం చేయబడింది. 10 సంవత్సరాల క్రితంతో పోలిస్తే అవినీతి-వ్యతిరేక అంశం ఈనాడు ప్రజలను అంతగా ఆకర్షించే అంశం కాదు. ఎందుకంటే వారికి అవినీతి నేడు బాధించే అంశంగా లేదు.ఇది సామాజిక స్థాయిలో అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో అఖండ విజయం సాధించారనడానికి స్పష్టమైన వ్యక్తీకరణ. సంబంధిత సామాజిక వివాదాలు తగ్గిపోయాయి, ఇది పార్టీ దేశం యొక్క అవినీతి వ్యతిరేక కృషిపై ప్రజలకు ఎక్కువ నమ్మకం,విశ్వాసం ఉందని చూపిస్తుంది -పదవిలో వున్నారా, లేదా పదవీ విరమణ చేసారా అనే దానితో సంబంధం లేకుండా, ఏ ప్రాంతం లేదా ఏ కార్యరంగం అనేది పరిగణించ కుండా, అవినీతి విషయంలో ఆరోపణలు వున్నఅందరినీ విచారించి నేర నిర్ధారణ చేస్తారు ఎవరినీ మినహాయించరని ఋజువయ్యింది. అధికారులు జవాబుదారీగా ఉండాలి. పార్టీ యొక్క ఎయిట్-పాయింట్ రెగ్యులేషన్ పట్ల బద్దులయి వుండాలి. ఈ రోజు మనం వెనక్కి తిరిగి చూస్తే, 18 వ సిపిసి జాతీయ కాంగ్రెస్ తరువాత జిన్పింగ్ చేసిన అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ ఎంత చిత్త శుద్ధితో అమలు జరిపినదీ మనం గుర్తించవచ్చు”అది ఎవరయినా, వారి స్థానం ఎంత సీనియర్ అయినా, పార్టీ క్రమశిక్షణ లేదా జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తే, వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తారు. వారు తీవ్రంగా శిక్షించబడతారు.
ఇవి డొల్ల మాటలు కాదు.”నిర్మొహమాటంగా చెప్పాలంటే, 10 సంవత్సరాల క్రితం, సిపిసి అవినీతిపై పూర్తిగా పోరాడగలదా” అని అనుమానించిన వారు చాలా మంది ఉన్నారు, అంతేకాదు ఈ అవినీతి పై పోరాటం సుస్థిరంగా సాగదని కూడా అనేకులు భావించారు. అవినీతి అనేది వేలాది సంవత్సరాలుగా మానవ సమాజంలో నిర్మూలించ బడని దీర్ఘకాలిక వ్యాధి. ఇది ఇప్పటికీ అన్ని దేశాలు,ముఖ్యంగా పారిశ్రామికీకరణ ప్రక్రియలో ఎదుర్కొంటున్న ఒక సాధారణ సమస్య. సిపిసి దానిని ఏవిధంగా పరిష్కరిస్తుంది? అని సందేహ పడ్డారు. అయితే వారు ఎలా వ్యవహరించినదీ తెలియ జెప్పే ఉదాహరణలుగా కొన్ని సంఘటనలు చూద్దాము.
ఈ సంవత్సరం ఆర్థిక రంగంలో ప్రధాన వ్యాజ్యాలతో సహా, స్థిరమైన, నిర్ణయాత్మక మైన, అవినీతి వ్యతిరేక ప్రయత్నలు గొప్ప విజయాలను సాధించాయి. పార్టీ కమిటీ మాజీ సభ్యుడు, చైనా బ్యాంకింగ్ రెగ్యులేటరీ కమిషన్ వైస్ చైర్మన్ అయిన కై ఎషెంగ్ యొక్క బహిరంగ ప్రాసిక్యూషన్ ఒక ఇటీవలి ఉదాహరణ, అతను లంచాలు తీసుకు న్నట్లు, అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి.జూన్ 1న, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనాలో ఉన్న క్రమశిక్షణా తనిఖీ మరియు పర్యవేక్షణ బృందం ఎనిమిది కేంద్ర నిబంధనలను ఉల్లంఘించిన 8 కేసులను నివేదించింది. వాటిలో, పార్టీ కమిటీ మాజీ సభ్యుడు, చైనా బ్యాంక్ నోట్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ చెన్ యావోమింగ్ యొక్క అవినీతి ప్రవర్తన గురించి వివరాలు వెల్లడించబడ్డాయి. నివేదిక ప్రకారం, అధికారిక విధుల నిర్వహణలో, సమస్యలను పరిష్కరించటంలో నిష్పాక్షికతను ప్రభావితం చేసే బహుమతులను చెన్ స్వీకరించాడు. క్రమశిక్షణ తప్పాడని, చట్టాన్ని ఉల్లంఘించాడని చెన్ పై అభియోగాలు వచ్చాయి. 2021 డిసెంబరు 8న క్రమశిక్షణా సమీక్ష, పర్యవేక్షణ దర్యాప్తులో ఈ విషయం ఉంచబడింది. ఆర్థిక రంగంలో అవినీతి వ్యతిరేక ప్రయత్నాలు గణనీయ మైన ఫలితాలనుఇచ్చాయి. ఆర్థికాభివృద్ధికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి, ప్రభుత్వం చురుకైన, నిర్ణయాత్మక ప్రయత్నాలు చేయటానికి ఆర్థిక వ్యవస్థలోని దాదాపు 30 మంది సీనియర్ అధికారులను తొలగించి నట్లు మీడియా నివేదికలు తెలిపాయి.
19వ కేంద్ర కమిటీ ఆర్థిక విభాగాలను సరిదిద్దడం, మెరుగుపరచడంపై నివేదికను సమీక్షించేందుకు చైనా కమ్యూ నిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ పొలిటికల్ బ్యూరో జూన్ 17 న సమావేశమైంది. అవినీతి వ్యతిరేక ప్రచారాల కోసం తనిఖీ పని ఫలితాలను పరిశీలించింది, భవిష్యత్తు కృషి కోసం దృక్పథాలను విస్తరించింది. ఆర్థిక యూనిట్లలో కొన్ని అసాధారణ సమస్యలను, దాగి ఉన్న ప్రమాదాలను గుర్తించి పరిష్కరించారు. కేడర్లు,అట్టడుగు స్థాయి పార్టీ సంస్థల నిర్మాణం బలోపేతం చేయబడింది. ఆర్థిక విషయాలలో పార్టీ నాయకత్వాన్ని బలపరచడం, బలోపేతం చేయడం, ఆర్థిక ఉత్పాతాలను నివారించడం, పరిష్కరించడం, సంస్కరణ- సృజనాత్మకతలను పెంచాల్సిన అవసరాన్ని ఈ సమావేశం నొక్కి చెప్పింది.”భ్రష్టు పట్టడానికి ధైర్యం చేయకు” అనే వాక్యం పెద్దఎత్తున ప్రదర్శించబడింది, “అవినీతిపరుడు కాలేడు” అనే వాక్యం పంజరంలా దృఢంగా మారుతూ వచ్చింది. “అవినీతి పరులుగా ఉండటానికి ఇష్టపడవద్దు” అనే స్పృహ గణనీయంగా పెరిగింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో అఖండ విజయం సిపిసి తనను తాను సంస్కరించుకునే ధైర్యాన్ని కలిగి ఉన్న పార్టీ అనీ, అవినీతిపై పోరాడటం అనేది అత్యంత పరిపూర్ణమైన స్వీయ సంస్కరణ అని లోతుగా చూపిస్తుంది. వాస్తవానికి, పెద్ద సంఖ్యలో అభివృద్ధి చెందుతున్న దేశాలు అవినీతి సమస్యను పరిష్కరించడంలో ఇబ్బందుల కారణంగా రాజకీయ సంక్షోభంలో పడ్డాయి. వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధి కూడా స్తంభించింది, అయితే పాశ్చాత్య రాజకీయ పార్టీలను సాధారణంగా పెట్టుబడి నుండి విడదీయలేము . అవి పెట్టుబడి తరఫున మాట్లాడతాయి. అవి పెట్టుబడుల ప్రతిధ్వనులే. “అవినీతిని చట్టబద్ధ౦ చేయడ౦”, “అవినీతికి రాజీపడడ౦” అనేవి వారికి చాల సాధారణ విషయాలని పాశ్చాత్య రాజకీయాల గురి౦చి అనుకు౦టున్నారు.
ఈ నేపథ్యంలో, కొత్త శకంలో దాని సంస్థాగత, చట్టపరమైన ప్రయోజనాలపై ఆధారపడటం ద్వారా అవినీతిపై పోరాడటంలో సిపిసి సాధించిన గొప్ప విజయం చారిత్రాత్మకమైనది మాత్రమే కాదు, ప్రపంచ ప్రాముఖ్యత గలది కూడా. కొత్త శకం యొక్క దశాబ్దంలో, స్వచ్ఛమైన ప్రభుత్వ నిర్మాణం, అవినీతి వ్యతిరేక కృషితో ప్రజల సంతృప్తి 10 సంవత్సరాల క్రితం వున్న 75 శాతం నుండి నేడు 97.4 శాతానికి పెరిగింది. ఈ ప్రక్రియలో అనేక అపార్థాలు సరి దిద్దబడ్డాయి. “ధనవ౦తులు పదవులు పొ౦దడ౦, పదోన్నతులు పొ౦దడ౦” అనే ఊహాకల్పనలు అ౦తక౦తకూ దిగజారిపోయాయి, “అధికారిగా ఉ౦డడ౦, ధనవ౦తునిగా మారడం అనేది నిర్మూలించాలి” అనే ఉపదేశ౦ మేల్కొలుపుతో౦ది; పెద్ద సంఖ్యలో మొండి,దీర్ఘకాలిక వ్యాధులు కూడా నిర్మూలించబడ్డాయి. నాలుక కొనపై అవినీతి, చక్రం మీద అవినీతి, క్లబ్ హౌస్ లో వికృతమైన ఆచారాలను ఎండగట్టారు.
కొన్ని స౦వత్సరాల క్రిత౦, చైనా అద్భుత౦పై ప్రప౦చ౦ శ్రద్ధ చూపిస్తు౦డగా, సింగపూర్ కు చె౦దిన లియాన్హే జావోబావో, ఆర్థికాభివృద్ధికి స౦బ౦ధి౦చిన కథతో పాటు, చైనా “తక్కువ కళ్లు చెదిరే” ఒక కథను కలిగివు౦టు౦దని పునరుద్ఘాటి౦చాడు- నాగరికతను పునరుద్ధరి౦చే కథ. సిపిసి తనను తాను సంస్కరించుకోవడానికి ధైర్యం చేయడమే కాదు, అదే దాని స్వభావం కూడా. చైనా కమ్యూనిస్టు పార్టీ చైనా ప్రజలలో అధిక సంఖ్యాకుల ప్రాథమిక ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది, పార్టీకి దాని స్వంత ప్రత్యేక ప్రయోజనాలంటూ ఏమీ లేవు. అంతేకాదు ఇది ఏ ఆసక్తి సమూహాలు, ఏ అధికార సమూహాలు లేదా ఏ ప్రత్యేక గ్రూపు ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించదు. “1.4 బిలియన్ల మంది విఫలం కాకుండా అనర్హులైన కొన్నివేలమందిని కించపరచ” గల రాజకీయ ధైర్య సాహసా లు వున్నాయి. “పులులతో పోరాడటం,” “ఈగలను తొలగించడం”,”నక్కలను వేటాడటం” అనే వివిధ కార్యక్రమా లతో, పూనికతో రాజకీయ ధైర్యసాహసాలు అబ్బిన పార్టీ. తన”సారాన్ని, రంగును, స్వభావాన్ని కాపాడుకునే టట్లు” చూసుకోవటానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంది. ఇది సిపిసి యొక్క ఉద్దేశ్యం, స్వభావాలకు స్పష్టమైన ప్రతిబింబం మాత్రమే కాదు, కొత్త శకంలో సిపిసిని గమనించడానికి,అర్థం చేసుకోవడానికి బాహ్య ప్రపంచానికి ఒక ముఖ్యమైన ప్రారంభ బిందువు.
20వ సిపిసి నేషనల్ కాంగ్రెస్కు ఇచ్చిన తన నివేదికలో, “అవినీతి ఉద్భవించే ప్రదేశాలు, పరిస్థితులు ఉన్నంత కాలం, మనం శంఖం పూరిస్తూనే ఉండాలి. అవినీతికి వ్యతిరేకంగా మన పోరాటంలో ఒక్క నిమిషం కూడా విశ్రమించ కూడదు” అని జిన్పింగ్ అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే, అవినీతి వ్యతిరేకంగా పోరాటం కూడా విశ్వసనీయతను సంతరించుకోవాలి. సిపిసి కున్న రాజకీయ నిబద్ధత ఏ విధంగానూ పెదవి సేవ కాదు. దాని మాటలకు-క్రియల కు పొంతన కూర్చే రాజకీయ స్వభావం, చెప్పిన దాన్నిచేసి చూపే రాజకీయ సామర్థ్యం కూడా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం ద్వారా ప్రదర్శించబడతాయి.
18 వ సిపిసి జాతీయ కాంగ్రెస్ నుండి, సిపిసి ఏకమై, కొత్త శకంలో పేదరికానికి వ్యతిరేకంగా చేసిన పోరాటం కావొచ్చు, ఆర్థిక చిక్కులను నివారించడానికి, పరిష్కరించ టానికి చేసిన దీర్ఘకాలిక పోరాటాలు కావొచ్చు, లేదా నీలి ఆకాశాన్ని తిరిగి తీసుకురావడానికి చేసే కాలుష్య నివారణ పోరాటాలు కావచ్చు, వాటిని అచంచల నిబద్ధతతో, నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి ప్రజలను నడిపించింది. “పరిపూర్ణమైన ఖడ్గాన్ని తయారు చేయడానికి 10 స౦వత్సరాలు పడుతు౦ది.” అన్న నానుడిని అనుసరించింది. సంఘ సంస్కరణకు నాయకత్వం వహించే పార్టీకి, స్వీయ సంస్కరణ పట్ల కూడా స్పష్టమైన వైఖరి తో పాటు, నిజమైన కార్యాచరణ కూడా వున్నదని కాలం రుజువు చేస్తూనే ఉన్నది. ఈ రకమైన లక్షణాలు, ఈ దార్శనికత, బాధ్యత నెరవేర్చటం ప్రపంచంలోని ఈ అతిపెద్ద పాలక పార్టీ అనుసరించే అభివృద్ధి తర్కం, అదే దాని విజయ నియమావళి. అందువల్లనే అక్కడ అవినీతిని అదుపులో వుంచ గలుగుతున్నారు.