-బొజ్జా దశరథ రామిరెడ్డి
భిన్న సంస్కృతులు, మతాలను గౌరవిస్తూ న్యాయమైన, స్వేచ్చాయిత, సంఘటిత భారతదేశాన్ని కొనసాగించడానికి “భారత్ జోడో యాత్ర” ను చేపట్టినందుకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, లోకసభ సభ్యులు శ్రీ రాహుల్ గాంధీ గారికి అభినంధనలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రప్రథమంగా రాయలసీమలో యాత్రను రాహుల్ గాంధి గారు చేపట్టడాన్ని స్వాగతిస్తున్నాము.
అభివృద్ధి చెందిన ప్రాంతాల సమస్యలే దృష్టికి తీసుకొని వెళ్ళడం, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత నివ్వడం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాటి నుండే మొదలైంది. రాయలసీమ ప్రాంత రాజకీయ నాయకులే ఎక్కువ కాలం పార్టీ అధ్యక్షులుగా, ప్రభుత్వ అధినేతలుగా ఉన్నా , ఆ పరంపర కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రప్రధమంగా రాయలసీమలోనే మీరు యాత్రను మొదలు పెట్టినప్పటికి వెనుకబడిన రాయలసీమ ప్రాంత ఆశలను, ఆకాంక్షలను మీకు స్వయంగా విన్నవించడానికి అవకాశం కల్పించడంలో మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకత్వం మరొక్కసారి విపలమైంది.
అభివృద్ధి చెందిన ప్రాంతాల సమస్యలను మీ దృష్టికి తీసుకొని రావడానికి “అమరావతి రైతులతో” సమావేశం రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో మంగళవారం నిర్వహించారు. కానీ మీతో “రాయలసీమ రైతుల” సమావేశం ఏర్పాటుకు మీ పార్టీ నాయకులు సహకరించలేదు. ఈ సంఘటన చరిత్ర పునరావృతం కాదు, చరిత్ర కొనసాగింపుగా మేము భావిస్తున్నాము.
మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకత్వం రాజకీయ దృక్పథంతో అమరావతి రైతుల సమావేశం ఏర్పాటు చేసిందని భావిస్తున్నాము. ఇదే సందర్భంలో రాయలసీమ రైతులతో సమావేశం నిర్వహించకపోవడం, రాయలసీమ జీవన్మరణ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, రాయలసీమ ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని మేము భావిస్తున్నాము.
రాయలసీమ రైతాంగ సమస్యలను, రాయలసీమ బతుకు తెరువు సమస్యలను స్వయంగా మీకు తెలపడానికి అవకాశం కల్పించాలని, వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటున్నాము.
(బొజ్జా దశరథ రామిరెడ్డి,అధ్యక్షుడు, రాయలసీమ సాగునీటి సాధన సమితి)
చాలా చక్కగా చెప్పారు