ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకుంటారా!
-టి. లక్ష్మీనారాయణ
1. సీనియర్ జర్నలిస్టు, ఆరోగ్య సమస్యలున్న సీనియర్ సిటిజన్ శ్రీ కొల్లు అంకబాబుగారిపై సిఐడి అక్రమ కేసు నమోదు, చట్ట వ్యతిరేకంగా అరెస్టు, నిర్భంధం, జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకొని విచారించాలన్న ప్రయత్నం ప్రజల స్పందన, రాజ్యాంగబద్ధమైన – చట్టబద్ధమైన పౌరుల హక్కుల పరిరక్షణలో న్యాయస్థానం కఠినంగా వ్యవహరించడంతో వికటించింది. మరి, ఇప్పుడైనా గుణపాఠం నేర్చుకుంటారా! నాది దింపుడు కళ్ళం ఆశే కావచ్చేమో!
2. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, వగైరా సామాజిక మాధ్యమాలు చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నాయి. వీటి వల్ల సమాజానికి మంచి, చెడు రెండూ జరుగుతున్నాయి. వాటి ద్వారా వెల్లువలా వచ్చిపడుతున్న వార్తలు, సమాచారంలో వాస్తవం పాళ్ళు ఎంతో! నిర్ధారించుకోవడం దుర్లభంగా పరిణమించింది. వాటిని నియంత్రించే చట్టాలు లేవు, యంత్రాంగం లేదు. న్యాయస్థానాలు సహితం ఈ సమస్యపై పదేపదే తీవ్రఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పూర్వరంగాన్ని గమనంలో ఉంచుకోవాలి.
3. శ్రీ అంకబాబుగారు వాట్సాప్ లో చక్కర్లుకొడుతున్న ఒక పోస్టును పార్వర్డ్ చేశారని, దానివల్ల ముఖ్యమంత్రి కార్యాలయం ప్రతిష్టకు భంగం కలిగిందన్నది అభియోగం. సోషల్ మీడియాలో వస్తున్న విశ్వసనీయతలేని వార్తలను ఇతరులకు చేరవేయడంలో ఎవరికి వారు స్వయం నియంత్రణ పాటించాలనండంలో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలస్తే, ఆ వార్తకు మూలాలెక్కడున్నాయో, సృష్టికర్త ఎవరో, అందులోని నిజమెంతో నేర పరిశోధనా సంస్థలు నిగ్గుతేల్చి, న్యాయ వ్యవస్థ ద్వారా నేరస్తులను చట్ట ప్రకారం శిక్షించాలి.
4. అంకబాబుగారికి 41 ఏ నోటీసు ఇచ్చారా? అని న్యాయస్థానం అడిగితే సమాధానం చెప్పుకోలేని దుస్థితిని సిఐడి పోలీసులు ఎందుకు ఎదుర్కోవాలి. ఒకటి, చట్ట ప్రకారం 41 ఏ నోటీసు ఇచ్చి, విచారణకు హాజరు కావాలని కోరలేదు. రెండవది, ఎవరినైనా అరెస్టు చేస్తే 24 గం.ల లోపు న్యాయస్థానం ముందు హాజరుపరచాలి. ఉదయం పూట అరెస్టుచేస్తే సాయంత్రం లోపు కోర్టు ముందు హాజరుపరచాలి కాబట్టి రాత్రి పూట అరెస్టుచేసి, తమ కస్టడీలో ఉంచుకోవడం తప్పు కదా! అంకబాబుగారి విషయంలో కూడా ఆ తప్పు చేశారు. ఈ చర్యలు చట్టాన్ని, ఉన్నత న్యాయస్థానం తీర్పులను అపహాస్యం చేయడమే కదా! ఈ తరహా చర్యల వల్ల పోలీసు వ్యవస్థ లేదా ప్రభుత్వం అప్రతిష్టను మూటగట్టుకోవడం తప్ప ఏం ప్రయోజనం వనగూడుతుందో అధికారంలో ఉన్న వాళ్ళు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలను సమాజం అసహ్యించుకుంటుందన్న భావనతో పాలకులకు కనువిప్పు కలిగితే ఆంధ్రప్రదేశ్ సమాజానికి మేలు చేకూరుతుంది.
5. పౌరుల ప్రతిష్టకు భంగం కలిగించే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిని శిక్షించే సమాజ నిర్మాణం జరగాలి.
(టి. లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు