రూపాయి విలువ పడిపోతాఉంది…ఆపెడమెలా?

 

ఒక్కరోజులోనే 90 పైసల కంటే దిగజారిన రూపాయి దుస్థితి.

అమెరికాలో వడ్డీరేట్లు పెంచితే, రూపాయికి ఏం రోగం వచ్చింది?

 

ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

సరిగ్గా ఈ రైటప్ ను రాస్తున్న సమయంలో మన భారత దేశ కరెన్సీ రూపాయి విలువ డాలర్ విలువతో పడిపోతోంది. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో డాలర్ విలువతో మన రూపాయి విలువ ₹80.60 కి దిగజారింది. నిన్నటి వరకూ ₹79.70 వద్ద ఉండేది. అది ఈ సాయంత్రం లోపుగా మరింత పడిపోతుందా? యదాస్తితి వుంటుందా? లేదా కొంత తగ్గుతుందా? ఇవన్నీ శేష ప్రశ్నలే!

ఇప్పుడు భారత రిజర్వ్ బ్యాంకు (RBI) తక్షణమే రంగప్రవేశం చేసి, రూపీ విలువ నియంత్రణ కోసం ఎన్ని బిలియన్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాలో! అందువల్ల ఇప్పుటికే 80 బిలియన్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ఆవిరైపోయిన మన నిల్వలు ఇంకెన్ని తరిగి పోతాయో మరి!

గత అర్థరాత్రి అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లు పెంచితే, మన రూపాయి ఎందుకు దిగజారుతోంది? కల్పిత కథలూ, పుక్కిటి పురాణ గాధలూ విన్నాం. వాటిలో మాయల ఫకీరు ప్రాణం కథ తెల్సిందే. ఇప్పుడు నిజ ప్రపంచంలో సైతం ఎక్కడో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య సమీక్ష చేసుకొని వడ్డీరేట్లు పెంచితే, మన రూపాయి దిగజారడం విడ్డూరంగా లేదూ!

మరోమాట. డాలర్ ఇండెక్స్ ప్రకారం డాలర్ విలువ కూడా గత ఇరవై ఏళ్ళలో అత్యధికంగా పెరగడం గమనార్హం. అది ఈరోజు 111 కి పెరగడం గమనార్హం. ఆ పెరిగిన డాలర్ విలువతో పోల్చితే యెన్, యూరో, పౌండ్ వంటి సంపన్న దేశాల కరెన్సీల విలువ సైతం పడిపోతోంది. అందుకే స్వతసిద్దంగా భారత కరెన్సీ విలువ ఎంత పడిపోయిందో, పెరిగే డాలర్ విలువతో అది సాపేక్షంగా ఎంతమేరకు పడిపోయిందో మరో పరిశీలనాంశం.

రూపాయి విలువ నిన్నటి వరకూ ₹79.70 వద్ద ఉంది. ఈరోజు ఉదయం 11 గంటల సమయానికి ₹80.60 ఉంది. ఈవిధంగా వేగంగా రూపాయి విలువ పడిపోతున్న పరిణామం భారత దేశ ప్రజల జీవన ప్రమాణాల్ని మరింత దిగజారుస్తుంది. మరీ ముఖ్యంగా శ్రామికవర్గ ప్రజల బ్రతుకుల్ని ఇంకా దిగజారుస్తుంది. దానికి వ్యతిరేకంగా ఉద్యమ కర్తవ్యాల్ని చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అందుకై దీక్ష వహిద్దాం.

 

గమనిక:- ఈ రైటప్ ముగించి 11-45am కి మరోసారి చెక్ చేస్తే రూపాయి విలువ మరో 12 పైసలు తగ్గి ₹80.72 కి దిగజారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *