మూలం: బెన్ ఓక్రి,
అనువాదం:డాక్టర్. యస్. జతిన్ కుమార్
1
మునుపెన్నటికంటే కూడా మనకిప్పుడు కవిత్వం చాలా అవసరంగా వుంది. అది వినిపించే కఠోరమైన వాస్తవం మనకు అవసరం. వినిపించు కోవడంలోని మర్మం పరోక్షంగా తెలియజెప్పే ప్రభావ వంతమైన కవిత్వం మనకు అవసరం.
చేతిలో తుపాకులతో పోరాడుతూ, బాంబులతో వాదించుకుంటున్న ఈ ప్రపంచంలో-మన పక్షం, మన మతం, మన రాజకీయాలు మాత్రమే సరైనవని వెర్రిగా నమ్ముతూ, యుద్ధం వైపు ప్రాణాంతకంగా పరుగులు తీస్తున్న ఈ ప్రపంచం లో – మనలోని అత్యున్నతమైన లక్షణాలను తట్టి మాట్లాడే స్వరం మనకు అత్యవసరం.
మన ఆన౦దాలని, మన బాల్యాలనీ ఆవిష్కరిస్తూ, మన వ్యక్తిగత, జాతిపర జీవితంలోని చిక్కు ముడులను విప్పుతూ మాట్లాడే ఒక స్వర౦ మనకు అవసర౦. మన సందేహాలను, మన భయాలను పోగొడుతూ, నక్షత్రాల ఊసులతో ఊహాతీతమైన కోణాలను స్పృశిస్తూ, మనల్నిమానవీయం చేసే, సజీవ స్పందనలు నింపే స్వరం ఒకటి మన కవసరం.
2
రాజకీయాల కంటే కవిత్వం మనకు ఆత్మీయ మైనది. నడవడంలా, తినడంలా అది మనలో భాగం. మనకు అంతర్గత మైనది. పుట్టుక తోనే మనం కవిత్వం, శ్వాస అనే స్థితిలో పుడతాం. జననం ఒక కవితాత్మక స్థితి: ఆత్మ(భావ స్పూర్తి) దేహంగా మారే క్షణమది. మరణం మరో కవితాత్మక స్థితి: శరీరం మళ్ళీ ఆత్మగా (భావంగా) మారే సమయమది. ఇది పూర్తి చేయబడిన అద్భుత వృత్తం. అగణిత నిశ్శబ్దంలోకి తిరిగి ముడుచుకునే జీవితంలో వినపడని శ్రావ్యత అది .
జనన మరణాల మధ్య మన దైనందిన జీవితం ఏమిటి? కవితాత్మకంగా సాగే ద్వంద్వాల ఉనికి కాక మరేమిటి? అంతరంగానికీ, బాహ్యానికీ మధ్య వింత సయోధ్య కాక మరేమిటి? కాలం శాశ్వత మనిపించే ఆంతరిక భావనకీ, అశాశ్వతమై కనిపించే బాహ్య సాక్ష్యానికీ మధ్య విచిత్రమైన సంయోగం కాక జీవితం ఏమిటి?
3
రాజనీతిజ్ఞులు రాజ్యానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతారు. కవులు జీవిత మౌలిక లయాత్మకతను ప్రతిధ్వనించడానికి మనకు తోడ్పడతారు. పదాల గణాల గతులతో, ప్రత్యేకమైన వాగ్విలాసంతో కవితాఖండికలు సృజించి- జీవితం యొక్క మార్మిక స్పందనలను తెలియజేస్తారు.
కవిత్వం మనలో ఒక అంతర్గత సంభాషణను ప్రారంభిస్తుంది. స్వంత సత్యాన్వేషణ కు మన వ్యక్తిగత ప్రయాణాన్ని సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కవిత్వ స్వరాలను ఒకచోట చేర్చి హృదయాలకు ఒక పండుగ చేద్దాం. కలల ప్రదేశంగా మార్చుదాం. మన మనస్సులను కవిత్వ నిత్యావసరాల అకాడమీగా చుక్కల కింద పేర్చుదాం
4
కవిత్వం అంటే కవులు రాసేది మాత్రమే కాదు. కవిత్వం అంటే మానవత్వం ప్రవహించే ఆత్మ సవ్వడుల మహానది. భూ గర్భంలో దాగిన ఈ నదిని, అక్కడక్కడా, తమ జలపాత మంటి ధ్వనితో, అంతర్నిహిత భావార్ధంతో, అపురూప శైలీ శిల్ప లావణ్యం తో కవులు ఒక క్షణం పాటు పైకి తీసుకువస్తారు.
5
పురాతన ప్రవక్తలు, దైవ దూతలు ఇప్పుడు మౌనంగా ఉండవచ్చు; దేవతలు మనతో లేదా మన ద్వారా మాట్లాడే అనేక మార్గాలను ఇప్పుడు మనం ఎంతమాత్రం నమ్మక పోవచ్చు. కానీ జీవించడం అంటేనే-మనం అనేక ఒత్తిళ్ళ కు, సమాజ కాంక్షలకు, అస్తిత్వపు వింత స్థితులు, కోరికలు, వివరించలేని మనోభావాలు, కలలు, లౌకిక జీవితపు అనేక ఉద్వేగాలకు కేంద్ర బిందువులు గా మారటమే.
6
మనం, మన విభేదాలపై, వ్యత్యాసాలపై ఎక్కువగా దృష్టి పెడతాము. కానీ కవిత్వం ఆశ్చర్య జనకమైన, మనలోని సారూప్యతలను, పోలికలను వెలికి తీస్తుంది. మనమ౦దర౦ ఒక సుదూర కుటు౦బ సభ్యుల మనే నిగూఢమైన భావానికి అది మనల్ని తిరిగి తీసుకుని వెళుతుంది. మనలోని ప్రత్యేకమైన గుణాలను, విశ్వజనీనమైన భావాలను కూడా అది ప౦చుతుంది.
మనకు రాజకీయాల కంటే కవిత్వం ఎక్కువ కావాలి. కవిత్వపు అవకాశాలను మనం నిరంతరం వృద్ధి చేసుకోవాలి . నిజమే కవిత్వం తప్పనిసరిగా ప్రపంచాన్ని మార్చుతుందని చెప్పలేము.(కొందరు నిరంకుశులు కూడా కవులుగా ప్రసిద్ధి చెందారు, అంటే చెడ్డ కవులు.) కాని కవిత్వం మన మనస్సులను బంగారు లోకంలోకి, ప్రశ్నల ప్రపంచంలోకి నడిపించి; మనలోని లోతైన, సున్నితమైన మానవత్వాన్ని స్పృశించినంత కాలం, అది ఎల్లప్పుడూ మంచినీ, జీవన సౌందర్యాన్నీ పెంచి, ఈ ప్రపంచంలో-తుపాకుల, ద్వేషాల శబ్దాన్ని నెమ్మదిగా దుర్బలం చేసే బలమైన శక్తిగా ఉంటుంది.
7
కవిత్వపు ఈ ఉత్కృష్ట స్థితికి కారణం చాలా సులభమైనది. ఏ ప్రణవనాదం ఈ సమస్త సృష్టికి ప్రేరణ ఇచ్చిందని మార్మికులు నమ్ముతారో ఆ దివ్య శబ్ద వారసత్వమే కవిత్వం.
కవిత్వం, దాని అత్యున్నత స్థాయిలో, స్వల్ప మోతాదుల్లో, విశ్వ సృజనాత్మక సజీవ శక్తిని తనలో నిక్షిప్తం చేసు కుంది. ఒక దాన్ని రూపొందించి, మార్పులు, పరివర్తనలు చేసే సృజనాత్మకత అవతారమే కవిత్వం. ఇది ఏమీ లేదనుకునే దాని నుంచి కూడా దేనినో సృష్టిస్తుంది. .
పదాలు ఎంత తేలికయినవి. ఎంత నిస్సారమైనవి. సత్యమనే ఈకతో ఒక పదాన్ని తూచలేము. కానీ అవే పదాలు, హృదయంలో, ఊహలో, కలలో, యుగయుగాలుగా ప్రతిధ్వనిస్తున్నప్పుడు, పిరమిడ్ల వలె చిరకాలం పటిష్టంగా నిలబడి వున్నాయి. అవి ఎంత బరువుగా ఉన్నాయో! గాలి కంటే తేలికైన పదాలు, జీవం అద్దుకుని కాలంతో పాటు అద్భుత రహస్యం గా శాశ్వతమైపోతాయి. కవిత్వం మనలోని భగవంతుడిని సూచిస్తుంది, మనలోని ఉన్నత అస్తిత్వాలను ప్రతిధ్వనింపజేస్తుంది.
8
కవులు మీ నుండి ఏమీ కోరుకోరు, మీ అంతరంగం గొంతును మీరు వినిపించుకోవాలని తప్ప. వారు రాజకీయ నాయకుల మాదిరిగా మీ ఓట్లను కోరుకోరు.
గాలిలో కనిపించని మాయాజాలం నుండి మీరు మీ మొదటి శ్వాసను తీసుకున్నప్పుడు ఈ విశ్వంతో మీరు చేసుకున్న ఒప్పండం ప్రకారం జీవించాలని మాత్రమే నిజమైన కవులు కోరుకుంటారు.
[ ఫ్రమ్ ‘ఎ టైమ్ ఫర్ న్యూ డ్రీమ్స్’ -2011]