తిరుపతి జ్ఞాపకాలు-53
(రాఘవశర్మ)
గుండం చిన్నదే కావచ్చు.
పడుతున్న జలధార చాలాపెద్దది!
జలపాతం ఎత్తు చిన్నదే కావచ్చు.
రాత్రి కురిసిన వర్షానికి చాలా ఉదృతంగా దుముకుతోంది!
ఎర్రటి కొండలనడుమ బహిర్గతమైన తెల్లటి తీర్థం అది!
కింద ఉన్న హలాయనతీర్థానికి నిత్యం నీటి ప్రవాహాన్ని దింపుతోంది.
కపిలతీర్థం సిగలో మరో సిరిమల్లె ఈ భరధ్వాజస తీర్థం.
తన నెత్తిన మరో అయిదు తీర్థాలను మోస్తోంది.
శుక్రవారం ఉదయం జీవకోనకు వెళదామనుకున్నాం.
నలుగురం కలసి బయలుదేరాం.
ముందుగా అనుకోనట్టు భరద్వాజస తీర్థం వైపు మా అడుగులు సాగాయి.
“సిరికిం జెప్పడు,శంఖు చక్రమున్ చేదోయిసంధింపడున్” అన్న గజేంద్రం మోక్షంలోని పద్యం గుర్తుకు వచ్చింది.
చేతిలో నీళ్ళబాలిళ్ళు లేవు, కాళ్ళకు నీ క్యాపులు లేవు.
భుజాన బ్యాగూ లేదు, ఆహారపదార్థాలు అసలే లేవు.
ఇవ్వేవీ లేకుండా ఎలా కదిలామో తెలీదు!
ఇది అనుకోని ట్రెక్.
గత ఆదివారం వెళ్ళిన హలాయధ తీర్థం దారిలోనే మా నడక సాగింది.
అదే అడవిలో నడక, అదే తిరుమల రాతి కొండకు పాకడం.
వెనక్కి తిరిగి చూస్తే కొండ సానువుల్లో పెరిగిన దట్టమైన అడవి.
అడవికి ఆవల ఈ మూలనుంచి ఆ మూల వరకు, కనుచూపు మేర విస్తరించిన తిరుపతి నగరం.
ఎదురుగా తిరుమల కొండ.
నిద్రిస్తున్న అతి పెద్ద సరీసృపం లా ఉంది.
వర్షాకాలం వచ్చిందంటే చాలు, తిరుపతి వాసులకు ఎంత కనువిందుచేస్తుందో!
ఎదురుగా ఉన్న కొండంతా జలపాతాలే!
నిత్యం జలజలా జారుతుంటాయి.
నిజంగా తిరుపతి వాసులు ఎంత అదృష్ట వంతులు!
చూసే హృదయం ఉండాలే కానీ, ఎంత ప్రకృతి సౌందర్యం!
ఎన్ని నగరాలకున్నదీ అవకాశం, ఒక్క తిరుపతికి తప్ప!
కొండ ఎక్కుతూ ఎక్కుతూ హలాయుధ తీర్థం హోరును వింటూనే పైకి ఎక్కాం.
దారి సరిగా లేదు.
ఎదురుగా వచ్చిన కొమ్మలను విరుచుకుంటూ, జాగ్రత్తగా బోదలో అడుగులు వేస్తూ సాగాం.
పెద్ద శ్రమ అనిపించలేదు.
అదే భరద్వాజస తీర్థం.
ఎంత సేపు చూసినా తనివి తీరదు.
చుట్టపుచూపుగావచ్చిన ఈ నలుగురు ట్రెక్కర్లను కన్నెత్తి చూడదు, పన్నెత్తి పలకరించదు.
తన భాష తనదేఅన్నట్టు, తన యాస తనదే అన్నట్టు, తన ఘోష తనదే!
కొండకు ఆనుకుని ఎక్కడో పైన దూరంగా తేనెతట్టు.
మా అలికిడి ఇంకా వినలేదు.
తేనెటీగలు ఒకటొకటిగా బైటికొస్తున్నాయి.
ఇక ఇక్కడ ఉండడం క్షేమం కాదు.
తాటికొండ అనుభవంతో నిశ్శబ్దంగా వెనుతిరిగాం.
మళ్ళీ కాసేపటికి కొండ నుంచి ఈ రణగొణ ధ్వనుల్లోకి ఊడిపడ్డాం.