నాడు గుజరాత్ లో మన్మోహన్ సింగ్ ఫోటో పెట్టారా?

 

” రేషన్ షాప్ లో ప్రధాని మోదీ ఫోటో పెట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనడం అసంబద్ధం”

టి. హరీశ్ రావు, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

కేంద్ర నిధులు వినియోగిస్తే మోదీ ఫోటో పెట్టాల్సిందే అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడటంలో ఔచిత్యం లేదు. ఎన్డీఏ హయాంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి గా మోదీ ఎప్పుడైనా రేషన్ షాపులో మన్మోహన్ సింగ్ గారి ఫోటో పెట్టారా.. ఆనాడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్టారా… ఇలా ప్రజలెన్నుకున్న ప్రజా ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలపై ఇలాంటి ఒత్తిడి తేవడం ఎంత వరకు సబబు.

నిర్మలా సీతారామన్ గారు. మీరు కేంద్ర ప్రాయోజిత పథకాలు చాలా వరకు ర ద్దు చేశారు. అంతే కాదు కేంద్ర పథకాలల్లో మీ నిధుల వాటా తగ్గించి , రాష్ట్రాల వాటా పెంచడం జరిగింది. కొన్ని పథకాల లక్ష్యాలు, రాష్ట్రాల ప్రయోజనాలకు తగినట్లు లేవు. అనవసరమైన పథకాలు అమలు చేస్తూ, రాష్ట్రాల వాటా పెంచి మాపై భారం వేయడం తప్ప కేంద్రం రాష్ట్రాలకు చేసిన మేలు ఏంటి. పనికి ఆహార పథకం లాంటి మంచి పథకాలపై కొర్రీలు వేస్తూ, వాటికి నిధులు తగ్గిస్తూ, కొత్త నిబంధనలు పెడుతూ నిర్వీర్యం చేస్తున్నారు. ఇవన్నీ కేవలం కేంద్రం రాష్ట్రాలపై పథకాల పేరుతో పెత్తనం చేయడం తప్ప సమాఖ్య విలువలను పెంచే విధంగా ఉందా మీరే ఆలోచించండి.

నీతి ఆయోగ్ నియమించిన ముఖ్యమంత్రుల ఉపసంఘం కేంద్ర ప్రాయోజిత పథకాల సంఖ్యను తగ్గించి, ఐచ్ఛిక పథకాలను ( ఆప్షనల్ ) ప్రవేశపెట్టాలని తద్వారా రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతుందని సిఫారసు చేసింది. ఈ సిఫార్సులపై మీరు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రుల ఉపసంఘం కొంత అనుభవపూర్వకంగా, శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఇచ్చిన సిఫారసులు కేంద్రానికి ఎందుకు నచ్చలేదో ప్రజలకు వివరిస్తే బాగుండేది. అది వదిలేసి ఫోటోల కోసం రాద్ధాంతం చేయడం చూసి తెలంగాణ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజల అవసరాలా…ప్రచార ఆర్భాటాలా.. అని మాట్లాడుకుంటున్నారు.

FRBM చట్టాన్ని పునఃసమీక్షించడానికి సంబంధించి పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సు గురించి మీడియా ప్రశ్నిస్తే మీరు కేంద్ర ఆర్థిక మంత్రి గా సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కరోనా మహమ్మారి దృష్ట్యా, రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి రుణాలు తీసుకునే పరిమితులను పెంచామని చెప్పి తప్పించుకున్నారు. కేవలం సిఫారసు మాత్రమే, దాన్ని మేం ఎందుకు ఆమోదించాలన్న రీతిలో మాట్లాడటం సరి కాదు. మాకు నచ్చిందే మేం చేస్తాం.. మేం ఎవరి సిఫారసులు పట్టించుకోం అన్నది మీ విధానమా

రాజ్యాంగం ప్రకారం రుణాలను నియంత్రించే హక్కు కేంద్రానికి ఉందని చెప్తున్నారు. కాని అదే కేంద్ర ప్రభుత్వం మాత్రం రుణ పరిమితులను దాటి ఎలా అప్పులు చేస్తోంది.రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన అధికారాలు కల్పించిందా. కేంద్రం తన ఆదాయ, వ్యయాల మధ్య సమతుల్యత కోసం, ద్రవ్యలోటు లక్ష్యాలను అధిగమించడం కోసం బడ్జెట్ వెలుపల రుణాలు తీసుకుంటుంది. కాని రాష్ట్రాలు మాత్రం బడ్జెట్ వెలుపల రుణాలు తీసుకోవద్దని నియంత్రించడం ఏ విధంగా న్యాయం. ఒక దేశంలో చట్టం అందరికీ ఒకే విధంగా ఉండాలి కాని…కేంద్రానికి ఒకలా..రాష్ట్రాలకు ఒకలా ఉండటం అన్యాయం కాదా

భారతదేశంలో రెసిషన్ ఉండదని నిర్మలా సీతారామన్ గారు మీరు చెప్తోంది. వాస్తవాలకు విరుద్దంగా ఉంది. స్థిర ధరల వద్ద 2016-17లో జీడీపీ 8.26% నుండి 2018-19లో 6.53%కి ఆ తర్వాత 2019-20లో 3.66%కి జిడిపి వృద్ధి క్షీణించడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం కాదా. అంతేకాకుండా దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రూపాయి బలహీనపడటం, ద్రవ్యోల్బణం వంటి ఇతర సమస్యలు దేనికి సంకేతాలో కేంద్ర మంత్రిగా చెబితే బాగుండేది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, పెట్రోల్, డిజీల్ , గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి బతుకు భారంగా ఉంటే.. అంతా బాగుందని చెప్పుకోవడం స్వోత్కర్ష తప్ప మరేమి లేదు.

తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారాన్న ప్రశ్నకు కేంద్ర మంత్రిగా అన్ని తెలిసి మీరు అవాస్తవాలు మాట్లాడారు. విభజన హమీలు అమలు చేయడం వివక్ష కాదా , మాకు న్యాయబద్దంగా మీ వద్ద నుంచి రావాల్సిన 7,103 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వకపోవడం వివక్ష కాదా..ప్రస్తుత సంవత్సరంతో సహా మూడేళ్ల పాటు రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు విడుదల చేయకపోవడం, NIMZ రద్దు, ఏ వైద్య కళాశాల, నవోదయ విద్యా సంస్థలను మంజూరు చేయకపోవడం వంటివి వివక్ష కాదా.. ఐటీఐర్ ను రద్దు చేయడం వివక్ష కాదా..బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీఇవ్వకపోవడం వివక్ష కాదా.. IIM వంటి జాతీయ ప్రాముఖ్యత ఉన్న విద్యా సంస్థను ఇవ్వక పోవడం వివక్ష కాదా…బల్క్ డ్రగ్ పార్క్ రాష్ట్రానికి తిరస్కరించడం వివక్ష కాదా, అయితే తెలంగాణ రాష్ట్రమే కదా బల్క్ డ్రగ్స్‌లో ప్రధాన ఉత్పత్తిదారు. రాష్ట్రంలోని ఏ నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు ఇది వివక్ష కాదా.. ఇలా చెప్పుకుంటే పోతే మీరు వివక్ష చూపిన సందర్భాలు కోకొల్లలు. తెలంగాణ పై వివక్ష చూపలేదని చెబితే తెలంగాణలో ఏ ఒక్కరూ నమ్మరు ఇది వాస్తవం.

సెస్సురూపంలో వచ్చే నిధులు రాష్ట్రాలకే వెళ్తాయిని చెప్పారు. పన్నుల వాటా ఎగ్గొట్టడం తప్ప ఇందులో ఉన్న మతలబు ఏంటి. బలమైన కేంద్రం బలహీనమైన రాష్ట్రాలు అనే మీ కుట్రలో భాగమే కదా..సెస్సుల వసూళ్లు
రాష్ట్రాలకు న్యాయబద్ధంగా రావాల్సిన పన్నుల వాటా తగ్గించి కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చేసేందుకే ఈ రీతిలోవ్యవహరిస్తోంది. రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తే, రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రం ఖర్చు చేసేవీలుంటుంది. కాని సెస్ రూపంలో వసూలు చేసి కేంద్రం తన ఇష్టం వచ్చిన రీతిలో, అంటే తమకు ఇష్టమైన రాష్ట్రాలకు ఇవ్వడం, తమకు అనుకూలంగా లేని రాష్ట్రాలకు మొండి చేయి చూపడం చేస్తోంది. ఇలా ఆర్థిక అధికారాలు తమ దగ్గర పెట్టుకుని రాష్ట్రాలపై పెత్తనం చేయాలని చూస్తోంది. రాష్ట్రాలు కేంద్రం వద్ద మోకరిల్లాలని చూస్తోంది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్దం కాదా . 2022-23 కేంద్ర బడ్జెట్‌ పరిశీలిస్తే స్థూల పన్ను ఆదాయంలో సర్‌చార్జిలు , సెస్‌లు దాదాపు 20% వాటాను కలిగి ఉన్నాయి. దీని ఫలితంగా, చట్టబద్ధంగా రాష్ట్రాలకు రావాల్సిన 41% పన్ను వాటా ,రాష్ట్రాలకు దక్కడం లేదు. కేంద్ర పన్నులలో రాష్ట్రాలకు అందుతున్న వాటా కేవలం 29.6% మాత్రమే. సర్ ఛార్జిలు, సెస్ లు కేంద్ర ఖజనాకు వెళుతుంది తప్ప రాష్ట్రాలకు పంచాల్సిన అవసరం లేదు. ఇది బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బ తీసే కుట్ర కాదా నిర్మలా జీ.

ఉచితాలు వద్దంటూ పేదలకు మీరు చేస్తోన్న అన్యాయంపై ఆర్థిక శాఖ మంత్రిగా లెక్కల బూచి చూపారు. లక్షల కోట్ల రుణాలు ఎవరి ఆమోదంతో మీ ప్రభుత్వం కార్పోరేట్లకు రద్దు చేశారో దేశ ప్రజలకు ముందు సమాధానం ఇవ్వాలి.లఆహారం మరియు ఎరువుల సబ్సిడీలు వంటి ఆదాయ వ్యయాలను తీర్చడానికి బడ్జెట్‌కు వెలుల రుణాలను తీసుకోవడం ప్రారంభకులు మీరే కదా.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో GSDP వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్. స్వంత పన్ను రాబడిలో అత్యధిక వృద్ధి కలిగి ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఇలాంటి వృద్ధి రేటుతో ఉన్న తెలంగాణ అప్పులను తీర్చగలిగే స్థోమత ఉన్న రాష్ట్రం. 2019-20 లో జీఎస్డీపీ నిష్పత్తికి రుణం 23.5 శాతం మాత్రమే ఉంది. అప్పుతో పోల్చితే జీఎస్డీపీ నిష్పత్తి 35.4 శాతం వరకు ఉంది. కొన్ని రాష్ట్రాల రుణపరిమితి జీఎస్డీపీ నిష్పత్తి 42.5 శాతం ఉంది. ఆర్థికంగా ప టిష్టంగా ఉన్న రాష్ట్రాలకు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న రాష్ట్రాలకు ఒకే రుణపరిమితి విధించడం సరి కాదు. ఇది ప్రగతి శీల రాష్ట్రాలకు తీరని అన్యాయం చేయడమే. అన్ని రాష్ట్రాలను ఒకే గాటాన కట్టడం అసలు అనుసరణీయమైన పద్ధతేనా.. రుణాలు తీసుకోకుండా, పేదలకు రాయితీలు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించడం రాజకీయ ప్రేరేపితమైన చర్య కాదా నిర్మలా సీతారామన్ గారు.

వ్యవసాయ రుణ మాఫీ పై అర్థసత్యాలు మాట్లడారు. వంద మంది రైతుల్లో 5 గురికి మాత్రమే రుణ మాఫీ జరిగిందని చెప్పారు . రాజ్య సభలో 12.03.2021వ తేదీన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి స్పష్టమైన సమాధానం పార్లమెంట్ వేదికగా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఆగష్టు 2014లో 36 లక్షల మందికి 17 వేల కోట్ల రుణ మాఫీ ప్రకటించదని చెప్పారు. మేం రెండు విడతల్లో ఇప్పటి వరకు 5.43 లక్షల మందికి రుణా మాఫీ చేయడం జరిగింది. వ్యవసాయ రుణ మాఫీవల్ల లబ్ధి పొందిన వారి శాతం 55.4 శాతం కాగా మీరు చెప్పింది అర్థసత్యమేనని గ్రహించాలి.

 

రైతుల ఆత్మహత్యలపైన తెలంగాణపై బురద జల్లే ప్రయత్నం చేశారు నిర్మలా సీతారామన్ గారు. హోం మంత్రిత్వ శాఖ అధ్వర్యంలోని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2019 నుండి2021 వ రకు ఆత్మహత్యలు ఎక్కువ ఉన్న రాష్ట్రాలజాబీతా తయారు చేసింది. ఆ నివేదిక ప్రకారం మూడేళ్లలో తెలంగాణ తెలంగాణలో ఆత్మహత్యలు లేవని తేల్చి చెప్పింది. రైతుల కోసం గొప్పగా మాట్లాడుతున్నరు. నిర్మలా సీతారామన్ గారు. 2018-19 ఆర్థిక సంవత్సరం నుండి వరుసగా 9 వ్యవసాయ సీజన్లలో 65 లక్షల మందికి 57 వేల 880 కోట్ల రూపాయలను రైతు బంధు పేరుతో పెట్టుబడి సాయంగా అందించాం. కోటీ 50 లక్షల ఎకరాల సేద్యంకోసం రైతులు సాయం చేశాం. ఈ నాలుగేళ్లలో మేంరైతులు అందించిన సాయం. ఒక్కో వ్యవసా పంపుసెంట్ కు 18,167 రూపాయసు ఉచిత విద్యుత్ కోసం రాష్ట్రం భరిస్తోంది. ఇలా 25.78 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నం.
నిర్మలా సీతారామన్ గారు మీ పార్టీ అధికారంలో ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతులకు ఇన్ని వేల కోట్లు ఖర్చు చేశారా..చేస్తే ఆరాష్ట్రం పెరు చెప్పండి. మేం రైతుల కోసం అమలు చేస్తోన్న పథకాలు మీ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నాయా..మీరు నిజంగా రైతులను కలిస్తే వారే చెప్పేవారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందో. మీరు రాజకీయ నేతలను కలుస్తే వాళ్లేం చెప్తారు. రైతులకు మేం ఏం చేయకపోతే ఇటీవలే 50 లక్షల 19 వేల మెట్రిక్ టన్నల ధాన్యం ఎలా సేకరించడం జరుగుతుంది. ఇది కళ్ల ముందు కనబడే వాస్తవం కాదా.. మీరే కదా తెలంగాణ ధాన్యం కొనలేమని కొర్రీలు పెట్టి చెతులేత్తేసింది.
రైతుల కోసం మీరు మాట్లాడాల్సి వస్తే 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హమీ ఏమయింది. దాని మీద శ్వేత పత్రం విడుదల చేసిన తర్వా విడుదల చేయండి. ఎంత మది రైతుల ఆదాయం రెట్టింపు అయిందో ఆ రైతుల పేర్లను వెల్లడించండి.

కేంద్ర ఆర్థిక మంత్రి వర్యులు శ్రీమతి నిర్మలా సీతా రామన్ గారు కాలేశ్వరం ప్రాజెక్ట్ కు డీపిఆర్ తయారు చేయ లేదని శుద్ద అబద్దం చెప్పడం శోచనీయం. డిపిఆర్ సమర్పించకుండానే కేంద్ర జల సంఘం అన్నీ రకాల అనుమతులు ఇవ్వడం ఎట్లా సాధ్యం అయ్యిందో మంత్రి గారు చెప్పాలి. కేంద్ర జల సంఘం అన్నీ అనుమతులు ఇచ్చిన తర్వాతనే కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ వారి Technical Advisory Committee కూడా ప్రాజెక్టుకు రూ. 80,190 కోట్లకు అనుమతిని జారీ చేసింది.

కేంద్ర ఆర్ధిక శాఖ నుంచి Investment clearance కోసం ప్రతిపాదనలు ఆగష్టు 2018 న సమర్పించడం జరిగింది. వారు కోరిన అన్ని వివరణలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమర్పించింది. అయినా కూడా గత 4 ఏళ్ళు గా Investment clearance ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం కావాలని జాప్యం చేస్తున్నది. Investment clearance వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వ వలసి వస్తుందనే కారణం తో దాన్ని పెండింగ్ లో పెట్టడం నిజం కాదా ? కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వ మని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం పెడ చెవిన పెట్టింది. ఇప్పుడేమో ప్రాజెక్ట్ కు Investment clearance లేదని సాకు చూపిస్తున్నది. ఇది కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా ?

అదనపు 1 టిఎంసి నీటిని ఎత్తిపోయడానికి అవసరమయ్యే ఖర్చును కూడా జత చేసి సమగ్రమైన డిపిఆర్ ను కూడా కేంద్ర జల సంఘానికి మే నెలలోనే ప్రభుత్వం సమర్పించడం జరిగింది. కేంద్ర జల సంఘ ఆ డిపిఆర్ ను పరిశీలించి ఆమోదించి ఇటీవలే GRMB పరిశీలన కోసం పంపడం జరిగినది. GRMB లో ఈ సమగ్రమైన డిపిఆర్ ను పరిశీలిస్తున్నది. ఈ విషయాలేమీ తెలుసుకోకుండానే కేంద్ర మంత్రి హోదాలో అవాస్తవాలు మాట్లాడడం తగదు.

నిధుల వినియోగంలో ఎటువంటి అవినీతి జరుగా లేదని 22-07-2021 న కేంద్ర జల శక్తి సహాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు లోక్ సభ లో ఒక ప్రశ్న కు సమాదానమిస్తూ చెప్పారు. కాలేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు సహా అన్ని సాగు నీటి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వమే తన స్వంత నిధులతో నిర్మిస్తున్నదని పేర్కొన్నారు.

రాష్ట్రానికి వచ్చి మూడు విమర్శలు..ఆరు అబద్దాలు ఆడి రాజకీయం చేస్తానంటే తెలంగాణ సమాజం ఊరుకోదు. తెలంగాణలో ఈ పాచిక పారదని బీజేపీ పార్టీ గుర్తించాలి. తెలంగాణ ప్రజలను మీ అవాస్తవాలతో గందరగోళ పరుద్దామనుకుని మీరే గందరగోళంలో పడ్డట్టు అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పైన, సీఎం కేసీఆర్ పైన, ప్రభుత్వ పథకాలపైన పూర్తి స్పష్టతో ఉన్నారు. ఇలాంటి కుట్ర రాజకీయాలకు స్వస్తి చెప్పాలని బీజేపీ పార్టీకి, కేంద్ర మంత్రులకు నా సూచన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *