(భూమన్)
ఈ మాటంటే చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. ఇది పచ్చి నిజం. ఎంతో ధనిక రాష్ట్రంగా పేరు పొందిన కాలిఫోర్నియా రాష్ట్రం నీటి ఎద్దడికి ఉడకాడబోతున్నది. నేను వచ్చినప్పటినుండి గమనిస్తున్నా ఇంట్లో మొక్కలకు నీళ్లు పడుతున్నప్పుడు, లాన్స్ తడుపుతున్నప్పుడు మా అబ్బాయి హెచ్చరిస్తున్నాడు. నీటిని పొదుపుగా వాడాలని ఈ రాష్ట్రం డ్రాట్ రాష్ట్రమని. పక్కింట్లో 50 ఏళ్లుగా కాపురం ఉంటున్న అమెరికన్ పదే పదే DROUGHT(కరువు) గురించి పలవరించటం విన్నాను. వాళ్లింట్లో వున్న చెట్లన్నీ ఎందుకయ్యా ఎండబెట్టావూ? అంటే మాకు నీటి ఎద్దడి కదా అన్నాడు. చుట్టు పక్కల వారందరి నోటా ఈ DROUGHT అనే మాట తరచూ వినిపిస్తూండటం నాకూ ఆశ్చర్యం గానే అనిపించింది.
మన రాయలసీమలో నీటి కట కట, కరువు కాటకాదులు, వర్షా భావ పరిస్థితులు, ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తికాని నీటి ప్రాజెక్టులు, నీటి కోసం ఉద్యమాలు ఇవన్నీ గుర్తుకొచ్చినాయి. మన ప్రాంతం నీటి కొరతతో వెనుకబడిన ప్రాంతంగా ముద్ర వేసుకుంటే, అమెరికా దేశంలో ధనిక వంతమయిన రాష్ట్రంగా పేరొంది TECH CENTER, HOLLYWOOD కేంద్రంతోపాటూ ప్రపంచంలోనే అత్యధికంగా పండించే ఆల్మండ్ కింగ్ గా ప్రసిద్ధిగాంచిన కాలిఫోర్నియాలో ఇదేమి పరిస్థితి రా స్వామి అనిపించింది.
LOS ANGELS నుండి SAN RAMON కు దాదాపు ఏడుగంటలు కారులో ప్రయాణిస్తూంటే దారి పొడవునా కొండల వరస, సుందర దృశ్యాలతో పాటు, ఎకరాలెకరాలు పచ్చగా ఉన్న పంట పొలాలతో ఎంతో ఆకట్టుకున్నాయి. తీరా చూస్తే మన ప్రాంతంలో నీళ్ళు లేక ఎండి పోయిన చీనా చెట్లు, అరటి తోటలు మాదిరిగానే ఇక్కడ ఆల్మండ్ చెట్లన్నీ ఎండి పోవటం చూసినాను. వేళ్లతో సహా పెరికి పారేసినారు. ఆల్మండ్ ఎక్కువ నీరు తాగుతుంది. నీళ్లు కరువై పంట సర్వ నాశనమయింది. ప్రపంచంలోనే అత్యధికంగా పండించే రాష్ట్రం ఇదే. 80% ప్రపంచానికి ఆల్మండ్ ఇక్కడ నుండే ఎగుమతి అవుతుంది. దారంతా IS GROWING FOOD A CRIME? అనే నినాదాలు చూసాను. నీటి ఎద్దడి వల్ల ఆల్మండ్ చెట్లను పెంచొద్దని ప్రభుత్వ నిర్భందం.
కాలిఫోర్నియాలో ఇక్కడి సానుకూల పరిస్థితుల వల్ల 400 రకాల పంటలు పండుతాయి. వీటిల్లో ఆల్మండ్, ఆపిల్, ద్రాక్ష, స్ట్రాబెర్రీస్, వాల్ నట్స్, ఆవకాడో, టమోట, పిస్తా, లెట్టూస్, ఆరంజి, చీనా, నిమ్మ, బ్రొక్కోలి, ఆప్రికాట్, బార్లీ, అత్తి, కీర, ఖర్జూరం లాంటివి ప్రధానమయినవి. సాక్రమెంటోలో వరి కూడ పండుతుంది. పశువుల పెంపకం, పందులు, గుర్రాలు, చేపల పెంపకం ఉండనే ఉంది. పూల పెంపకం గురించి చెప్పాల్సిన పనేలేదు.
కాలిఫోర్నియాలో THE STATE WATER PROJECT ఉంది. 1960 నుండి ఈ ప్రాజెక్టు 29 డ్యాములు,18 పంపింగ్ స్టేషన్స్, 5 విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులను నిర్మించింది. 970 కి.మీ పొడవు కాల్వ నిర్మాణాన్ని ఏర్పాటు చేసింది. ఆరొవిల్లి డ్యామ్ చాలా పెద్దది SWP నిర్మాణాల్లో. CENTRA WATER PROJECT 3మిలియన్ల ఎకరాలకు నీరందిస్తున్నది.
మొత్తం ఈ నీటి వ్యవస్థ 5,680,000 ఎకరాలకు నీరందించటంతో పాటు, 30 మిలియన్ల మంది దాహార్తి తీరుస్తున్నది.
ఉపరితల నీరు, భూగర్భజలం, నదీ నదాల నీటినంతా వొడిసి పట్టడమేగాకుండా ఇప్పటికిప్పుడు సముద్ర నీటిని కూడ శుద్ధి చేసి వాడకంలోకి తీసుకొస్తున్నది కాలిఫోర్నియా. సియారా కొండలు మంచువి. అవి కరిగి నీరుగా మారినప్పుడు దాన్ని వొడిసి పడుతున్నారు.
నీటి వ్యవస్థంతా CALIFORNIA COASTAL COMMISSION ఆధ్వర్యంలోనే ఉంటుంది. నీటి యుద్ధాలు రాకుండా, అన్ని చోట్లకీ వేటికి నీరు అందించే ప్రక్రియనంతా ఈ Commission పర్యవేక్షిస్తుంది.
SACRAMENTO, SANJOAQUIN నదీ వ్యవస్తే కాలిఫోర్నియాకు అత్యంత కీలకం. కాలిఫోర్నియా నీటి గుండం ఇది మాత్రమే.
ఈ నదీ వ్యవస్తే కాకుండా టాహో సరస్సు, ఓన్స్ వ్యాలీ, మోనో సరస్సు, క్లియర్ సరస్సులతో పాటు ఐదు ముఖ్యమయిన నదులు ట్రినిటీ, సాక్రెమెంటో, అమెరికన్, స్టానిస్లాస్, సాన్ జోక్విన్ ముఖ్యమయినవి. వీటన్నిటికన్నా CENTRAL VALLEY PROJECT ఆధ్వర్యంలోని శాస్తాడామ్ చాలా ముఖ్యమయినది. అంతకు మించి కొలరాడో నీరు 65% వ్యవసాయానికి, దాహార్తికి, కర్మాగాలరాలకు ఉపయోగపడుతున్నది. ఇంత పకడ్బందీ నీటి వ్యవస్థ వున్న కాలిఫోర్నియా తరచు నీటి ఎద్దడికి గురి కావటమే రాష్ట్రాన్ని పీడిస్తున్నది. 2014-2018 నీటి ఎద్దడి చాలా తీవ్రమయినది. 2018లో నీటి ఎద్దడి మూలాన జరిగిన కార్చిచ్చులో 180 మిలియన్ డాలర్ల నష్టం జరగటం మనం విన్నాము.
ఈ సంవత్సరం కూడ అత్యంత తీవ్రమయిన క్షామాన్ని ఎదుర్కోబోతున్నది. WATER EMERGENCY ప్రకటించే అవకాశం కూడ ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.
పసిఫిక్ మహాసముద్రంలోని అట్టడుగున్న ఉల్లగడ్డల ఆకారంలో ఉన్న ఖనిజాన్ని వెలికి తీయబోతున్న కాలిఫోర్నియా, 1840లలో GOLD RUSH చూసిన ఈ రాష్ట్రం వ్యవసాయపు సంక్షోభం వల్ల దాదాపు 10,000కి ఉపాధి కోల్పోయేలా చేసింది.
ప్రపంచ దేశాల మధ్యన అత్యంత ధనిక రాష్ట్రంగా పేరుగాంచిన కాలిఫోర్నియాలో జరుగుతున్న ఈ పరిణామాలు మన ప్రాంతాలకు గుణపాఠాలు కావాలి,.
దీని కంతటికీ కారణం వాతావరణలో వస్తున్న పెనుమార్పులని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ ప్రకృతిని నాశనం చేసినా ఆ ప్రభావం మొత్తం భూగోళమంతా విస్తరించేట్టుగా ఉంది. సునామీలు, సముద్రాలు ఉప్పొంగటాలు, కార్చిచ్చులు సర్వసాధారణమయ్యేట్టుగా ఉంది.
కాలిఫోర్నియాలో ఎండ తీవ్రత అట్టాంటిట్టాంది కాదు. ధగ చాలా చాలా హెచ్చు. నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. మన దగ్గర 50 సెంటీగ్రేడ్ ఎండనైనా తట్టుకోవచ్చు గానీ, ఇక్కడ 38C దగ్గరే మన పని అయిపోతుంది. అంతటి తీవ్ర ఉష్టోగ్రతల వల్లనే నదుల్లో నీరు ఆవిరికావటం, రిజర్వాయర్లల్లో నీటి మట్టం తగ్గటం, భూగర్భ జలాలు అడుగంటడం, సముద్రం పోటెత్తటం లాంటి ఉపద్రవాలు ఇక్కడ మామూలు వ్యవహారాలు. అదీ వాతావరణపు పెను ప్రభావం. ఈ విపత్తు వల్లనే వర్షాభావం. అదే మానవాళి పట్ల ఉగ్ర రూపం. జీవితాల పట్ల ఒక శాపంగా మారుతున్నది.
ఇంకో ముఖ్యమయిన సంగతి నేను గమనించిందేమిటంటే ఇక్కడి వాళ్లల్లో నీటి చైతన్యం ఉంది. DROUGHT వల్ల నీటిని పొదుపుగా వాడ్డం గమనించినాను. బాగా CRISIS ఏర్పడినట్టయితే LAWNS కప్పిపెడతారు లేదా ఎండ బెడతారు. చెట్లకు నీళ్లు పట్టరు.
మనమయితే ఇక్కడ ముడ్డికి మూడు ముంతలు, వొంటికి వంద చెంబులు వాడి పారేస్తాం.
అక్కడ వాడకంలోని నీటినంతా RECYCLE చేసి తిరిగి వాడకంలోకి తెస్తారు.
కాలిఫోర్నియాలోని 50 కౌంటీస్ ప్రస్తుతం క్షామ అత్యవసర పరిస్థితిలో ఉన్నాయి.
నీరే ప్రాణాధారం. నీరే నాగరికతకు చిహ్నం. అట్టాంటి నీటి పట్ల సైద్ధాంతిక, శాస్త్రీయ దృక్పథం ఉంది గనకనే కాలిఫోర్నియా ఈ నీటి దుస్థితిని తట్టుకుని నిలబడగలుగుతోంది.
ఈ పరిణామాలన్నీ గమనిస్తూంటే వెనుకబడ్డ మన రాయలసీమ ప్రాంత భవిష్యత్తు ఆందోళనకరంగా అనిపిస్తున్నది. ఇక్కడ సముద్రపు లోతుల్లో ఖనిజాన్ని వెలికి తీస్తూంటే, మన దగ్గర పుల్లరిన్ బయటకు తీసుకొచ్చేగ తేలేదు. మన వొడ్లను ఆనుకుని ప్రవహిస్తున్న నీటిని వొడిసి పట్టుకునే ఆసరానే లేదు వొక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా పరిపూర్ణం కాలేదు. ఏళ్ల తరబడి సాగుతున్న సిద్దేశ్వరం అలుగు, పోతిరెడ్డి పాడు తూములు వెడల్పు, గాలేరు-నగరి, హంద్రీ నీవ, తెలుగు గంగ ప్రాజెక్టులు పరిపూర్తి గగనంగా మారుతూండటం అత్యంత ఆవేదననూ ఆగ్రహాన్నీ కలిగిస్తున్నది.
వాతావరణ మార్పులు అత్యంత ధనిక రాష్ట్రంగా పేరుబడ్డ కాలిఫోర్నియానే గడగడ లాడిస్తుంటే. తొలిదశలోనే వున్న మన వెనుకబడిన రాయలసీమ భవిష్యత్తు ఆందోళనకరం కాదా? ఇప్పుడు కాకపోతే ముందు ముందు మన రాయలసీమకు దాపురిస్తే తట్టుకోవటం ఎట్లాని?? ముందు చూపుతో గట్టి నీరుపారుదల వ్యవస్థను ఏర్పరచుకోకపోయినట్టయితే క్షామం కాదు, భయంకరమయిన కరువులవాత పడవలసి వస్తుంది.
1876 సంభవించిన దారుణమైన ధాతు కరువు రాయలసీమ ప్రజలను గగ్గోలు పరిచింది. పరాయి పాలకులను సైతం కరిగించిన ఈ కరువు నూటికి నలభైమంది ప్రజానీకాన్ని పొట్టన పెట్టుకుంది. నాటి ధాతు కరువుతో కళ్ళు తెరిచిన బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలకు తాత్కాలిక సహాయ చర్యలు చేబట్టడమేగాక, పలురకాల పరిశోధనలు గూడా జరిపించింది. ఈ పరిశోధనల మూలంగా రాయలసీమ ప్రాంతం అతిత్వరలో ఎడారిగా మారడానికి సిద్ధంగా వుందని స్పష్టమైంది. సర్ ఆర్థర్ కాటన్, సర్ మెకంజీ వంటి బ్రిటిష్ ఇంజనీర్లు రాయలసీమకు నీటిపారుదల సౌకర్యాలను కల్పించే అవకాశాలకోసం పరిశోధనలు ప్రారంభించారు. గుర్రాలమీద సిబ్బందితో ప్రయాణంచేసి నదులు, కొండలు, గుట్టలు క్షుణ్ణంగా సర్వే చేశారు. రాయలసీమ జిల్లాలలో సాగులోవున్న మొత్తం 74 లక్షల ఎకరాలకుగాను 39 లక్షల ఎకరాలకు నీటిపారుదల కల్పించే పథకాలను రూపొందించారు.
సాంకేతిక పరిజ్ఞానం పరిమితంగా వున్న ఆ రోజుల్లో రాయలసీమ ప్రాంతం సశ్యశ్యామలం చేయాలనే చిత్తశుద్ధితో నాటి పరాయి పాలకులు రూపొందించిన ప్రణాళికలు చూసి సంతోషించాలో, చంద్రమండలం మీద నివాసాలు ఏర్పాటుచేసుకునే స్థాయికి ఎదిగిన నేటి సాంకేతిక పరిజ్ఞానం చూసి గర్వపడాలో, ఆ నాటి పాలకుల ప్రణాళికలు నేటికి పూర్తికాకుండా నత్తనడకతో కొనసాగిస్తున్న మన పాలకుల నిర్లక్ష్యానికి చింతించాలో అర్థం కాని అయోమయ స్థితిలో వున్నాము.
-భూమన్ , కాలిఫోర్నియా
02/09/2022.
మీరు వ్రాసిన వ్యాసం అక్షర సత్యం సార్. బ్రిటిష్ వారు వేసిన రైల్వే లైన్లనే ఇప్పటికీ మనం వినియోగిస్తున్నాం. కొత్తగా చాలా తక్కువ పొడవు(1 – 2) రైల్వే లైన్లు వేసారు.
అలాగే చిన్న డ్యామ్స్ మల్లిమడుగు, కళ్యాణిలని సరైన మెయిన్ టైనెన్స్ లేక పాడైపోతున్నాయి. సంబంధిత శాఖలు చర్యలు తీసుకుంటే బాగుండేది. అలాగే ప్రతి ఏడు సముద్రం పాలవుతున్న కృష్ణ, గోదివరి జలాల్ని న్యాయబద్దంగా మళ్ళిస్తే కొంతవరకు సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో.