(భూమన్)
కాలిఫోర్నియాలో మరో చెప్పుకోవాల్సిన అద్భుతం రెడ్ వుడ్స్. రెండు రకాలయిన రెడ్ వుడ్స్ ఉత్తరం కాలిఫోర్నియాలో వుంటే మరొక రకం మధ్య చైనాలో ఉంది.
ప్రపంచంలోనే ఈ అరుదయిన రకపు REDWOOD మాన్లు ఇక్కడే ఉన్నాయి. 150 మిలియన్ల సంవత్సరాల క్రితం నాడే పుట్టి అన్నీ పోగా అక్కడక్కడా ఈ సముద్రపు వొడ్డున పరిరక్షింపబడుతున్నాయి. సెకోయిమాలో ఒక్కొచెట్టు ఎత్తు 380 అడుగులు ఉంటుంది. 70 FLOOR APARTMENTS ఎత్తు. చుట్టుకొలత 21 మీటర్లు. బెరడు 3 అంగుళాలు. ఇక్కడ చెట్టు మధ్యన కార్లు పోతూండటం విశేషం. ఆర్మ్ స్ట్రాంగ్ పార్కులో ఒక్కోమాను ఎత్తు 310 అడుగులు చుట్టుకొలత 14 మీటర్లు. బెరడు రెండు అంగుళాలు. 1400 సంవత్సరాల నుండి ఇవి బతుకుతున్నాయి. 2000 సంవత్సరాలు వీటి జీవన కాలము. 805 ఎకరాల్లో ఈ REDWOOD చెట్లున్నాయి. మ్యూర్ వుడ్స్ కు GOLDEN GATE మీదుగా ప్రయాణించి SANFRANCISCO కు 15 కి.మీ దూరంలో వున్న పార్కుకు వెళ్లినాము. దగ్గరకు పోయే కొద్దీ వాతావరణంలో పెనుమార్పులు గమనించాను. SAN RAMON నుండి మంచి ఎండల్లో బయలు దేరితే ఇక్కడి చల్లటి వాతావరణం, పొగమంచు, సన్న సన్నటి చినుకులు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు బెట్టినట్టయింది.
554 ఎకరాల్లో ఉన్న ఈ REDWOODS లోకి అడుగు పెట్టడమే కొత్త లోకంలోకి అడుగేసినట్టే. అంతంతటి చెట్లను నేను ఎప్పుడు చూడలేదు. ప్రతి చెట్టూ మేఘాలను ముద్దాడుతున్నాయి. నిటారుగా ఉన్న ఆ మానులను చూసి ఉక్కిరి బిక్కిరిగా అనిపించింది. మధ్యలో నది, ఇరువైపులా వేసిన చెక్కదారులు, వాటినానుకొని మెట్ల దారులు, ఎంత చక్కటి వైభోగమో ఆ వాతావరణంలో ఆ పచ్చటి వైభవాన్ని కళ్ళారా అనుభవించి పరవసించవలసిందే.
నేను తిరుగాడిన అడవుల్లో కంతా ఇంతటి అద్భుతమయిన చోటును మరెక్కడా చూడలేదు.
1900లలో WILLIAM KENT అనే అతను ఈ స్థలాన్ని ప్రభుత్వానికి రాసిచ్చినాడు, ఈ REDWOOD ప్రత్యేకతను తెలుసుకుని, వీటిని శాశ్వతంగా పరిరక్షించాలనే పట్టుదలతో ఇస్తూ ఇస్తూ అమెరికాలో FATHER OF FOREST గా పేరుగాంచిన JOHN MUIR పేరు పెట్టాలనే షరతు పెట్టినాడు. అదీ ఈ ప్రకృతి ప్రేమికుడి చేష్ట. JOHN MUIR THE FATHER OF NATIONAL PARKS IN USA.
ఈ పార్కులో ఒక్కో చెట్టు ఎత్తు 250 అడుగులు ఉంటుంది. 784 సంవత్సరాలుగా ఉన్నాయి.
ఏమిరా ఇక్కడి ప్రత్యేకత అంటే MUIR WOODS, THATS ALL అంటారంతా.
ఈ చెట్లు ఇంత కాలం జీవించి వుండటానికి ప్రధాన కారణం వీటి బెరళ్ళల్లో వుండే TANNIN అనే పదార్థమట. దీని వల్ల చెట్టును పురగూ, పుట్రా కాని, చెదలు గాని ఏ రకమయిన రోగమూ వచ్చే అవకాశమే లేదంట.
ఎండాకాపు, పొగ మంచు, కార్చిచ్చు ఈ REDWOODS కు ప్రాణ వాయువు అని తెలుసుకుని ఆశ్చర్యపోయినాను. అగ్గివల్ల బాక్టీరియా, ఫంగీ కాలి చస్తే, బలమయిన బెరళ్ల వల్ల చెట్టు నిలదొక్కుకుంటుదంట. పైగా అగ్ని కీలల వల్ల రాలే బూడిద చెట్టుకు మంచి ఎరువుగా ఉపయోగపడుతుందట.
REDWOODS ARE FIRE RESISTANTS AND FIRE KINGS గా ప్రఖ్యాతి చెందినాయి.
అక్కడక్కడ పడిపోయిన, వాలిపోయిన చెట్లను చూస్తే ఆ మొద్దులో ఉన్న రింగులు నన్ను ఆకట్టుకున్నాయి. ఏమిరాని విచారిస్తే ఈ రింగుల వల్లనే చెట్టు జీవన కాలం తెలుసుకోవచ్చునట. వొకటి వెలుతురు, చీకటిగా వుంటే మరొకటి గొందులు గొందులుగా అల్లుకుని ఉన్నాయి. ఈ రింగుల వల్ల కురిసిన వర్షపాతాన్ని కూడ లెక్క గడతారట.
వీటి కాయలు పైన్ చెట్ల కాయలు మాదిరిగానే ఉన్నాయి. ఒక్కోకోన్ లో 50 నుండి 60 వరకు విత్తనాలుంటాయి.
ఈ REDWOOD అడవుల్లో నివసించిన అతి ప్రాచీనమయిన గిరిజన తెగ MIWOK. ఈ జాతిని యూరోపియన్లు సర్వనాశనం చేసి వీటిని దురాక్రమణ చేసుకున్నారు. 1800 ప్రాంతాల్లో మిగిలిన 90 శాతం మంది CALIFORNIA GOLD RUSH లో ప్రాణాలు కోల్పేతే, ఆ మిగిలిన ఉద్దాపిచ్చామంది పార్కులో కూలీనాలీ చేసుకుని జీవనం సాగిస్తున్నారు.
ఆ చెట్లు మధ్యన BENJOHNSON DIPSEA అనే TRAILS ఉన్నాయి. అంతా రెండుగంటల్లో ముగించి, వొక చెట్టు మొదలు గుహలాగా ఉంటే అక్కడ కూర్చుని ఈ చెట్ల అందాలను గుర్తు చేసుకుంటూ బిత్తర పోయినాను. ఇంత సుందర మయిన ఈ ఎత్తయిన ఆకృతులను చూడ్డమే వొక ధ్యానం, వొక ఆనందం.
కాలిఫోర్నియా హైకింగులకు, మార్మికతకు, ఐటికి, LGBTQ కి, కొండలు, పర్వతాలకు పసిఫిక్ మహాసముద్రపు పోకళ్ళకు అన్నింటికీ మించి ఈ REDWOOD వైచిత్రికి ప్రసిద్ధం.
ఈ REDWOOD విత్తులు మన దేశపు వాతావరణంలో ఎక్కడయినా బతికే పరిస్థితి ఉందా? ఎట్లాగయితే మన ఎర్రచందనపు చెట్టు మరెక్కడా జీవించలేవో ఇవీ అంతేనేమో?
-భూమన్, కాలిఫోర్నియా
28/08/2022