(భూమన్)
మా ఇంటి ఎదురుగా రోజూ గమనిస్తున్న ఇద్దరు ఆడవాళ్ళను చాలా కాలంగా అక్క చెల్లెళ్లనుకున్నాను. నిదానంగా తెలిసింది వారిరువురు పెళ్లి చేసుకున్న ఇద్దరు ఆడవారని ఎంత ముచ్చటగా కలిసి మెలసి జీవిస్తున్నారో గమనించి చాలా తెలుసుకున్నాను వారి గురించి. మరింత సంతోషించాను. 30 ఏళ్లుగా సంసారం చేస్తున్న బంధం వారిది. ఇరువైపుల బంధువులు, మిత్రులు అంగీకరించి, ఆదరిస్తున్న బంధం వారిది. అలాగే పొరుగున మరో “గే” జంట కూడా నన్ను ఆకట్టుకుంది. గత పాతికేళ్లు గా వీరు పెళ్లి చేసుకుని హాయిగా వారి వారి పనుల్లో రాణిస్తున్నారు.
కాలిఫోర్నియా LGBTQ (Lesbian, Gay, Bisexual, Tansgender And Queer) friendly రాష్ట్రంగా పేరు పొందింది. SANFRANCISCO, LOSANGELS, OAKLAND, BERKELEY, SANJOE లలో వీరు ఎక్కువమంది. వీరికి కార్యశాలలు ఉన్నాయి. ప్రత్యేకంగా బార్లు, రెస్టారెంట్లు, పార్కులు, సమావేశ మందిరాలు ఉన్నాయి. ఏ ఆటంకాలు లేకుండా హాయిగా జీవిస్తున్నారు. ప్రతి సంవత్సరంలో జూలైలో PRIDE MARCH అత్యంత వైభవంగా జరుపుకుంటారు. FILM FESTIVALS నిర్వహిస్తుంటారు. అమెరికాలో చాలా రాష్ట్రాల్లో వీరి పెళ్ళిళ్లు చట్టబద్దం.
అమెరికాలో తొలి చట్టబద్ధమయిన పెళ్లి 1971లో జరిగింది. స్వలింగ సంపర్కులు జేమ్స్ మైఖేల్, రిచర్డ్ జాన్ జాక్ బేకర్ పెళ్ళి చేసుకున్నారు.
వీటిని గమనించిన నాకు అమెరికా బయలుదేరే ముందు కేరళ రాష్ట్రానికి చెందిన ఆధిలా నసారిన్, ఫాతిమా నూరాల ఉదంతం గుర్తొచ్చింది. వారిరువురూ సౌదీ అరేబియాలో చదువుకుంటూ ఆకర్షింపబడినారు. పెళ్ళి చేసుకున్నారు. 24 ఏళ్ళ ఆ మహిళలిద్దరినీ కేరళకు తిరిగొచ్చిన తర్వాత వారి తల్లిదండ్రులు పెట్టిన చిత్ర హింసలు వర్ణనలకు అలవి కానివి. కానీ, వారు గట్టిగా నిలబడి కేరళ హైకోర్టు ద్వారా ఉపశమనం పొందినారు. ఇక్కడి వారు వారికి గట్టిగా మద్ధతిస్తున్నారు. ఆర్థికంగా ఆదుకోడానికీ ముందుకొస్తున్నారు.
మనుషులు ఆడ, మగ గానీ కాదు రకరకాలుగా పుడుతున్నారు. మగ మగ ఆకర్షణ, ఆడ ఆడ ఆకర్షణ, మగ, ఆడ, ఆడ ఆకర్షణలకు గురికావటం వింటున్నాము చూస్తున్నాము. ప్రకృతిలో పుటకలు ఒకే రకంగా లేవు. పుటకే కొందరికి శాపం గావటం అత్యంత విషాదం. అటూ, ఇటూ గాని వారిగా పిలవబడే వీరి బతుకులు అత్యంత దయనీయంగా మారటమే దుఃఖ భరితం.
తరచి చూస్తే ఆడ, మగ కాని ఈ మూడవ రకం వ్యక్తులు మనకు ద్వాపరయుగం నుండే కనిపిస్తారు. మహావీరుడైన అర్జునుడు అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్నది బృహన్నల వేషంలోనే. మహా వీరుడైన భీష్ముని వధించడానికి అర్జునునికి సహకరించిన శిఖండి ఆ కోవలోని వ్యక్తే. అంతఃపురాలలో రాణుల రక్షణకు వీరిని వినియోగించుకునేవారు. మహాభారతంలోని “ప్రాతగామి” పాత్ర ఇందుకు ఉదాహరణ. భాగవతం లోని ప్రహ్లాదోపాఖ్యానంలో సృష్టి అంతా ఈశ్వరమయమేనని తెలుపుతూ ప్రహ్లాదుని నోటివెంట వచ్చిన ఈ పద్యం భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మికతకు అద్దం పడుతుంది.
కలడంబోధి, కలండు గాలి, గలడాకాశంబునం, గుంభినిం
గలడగ్నిన్, దిశలం బగళ్ళ నిశలన్, ఖద్యోత చంద్రాత్మలం
గలడోంకారంబున ద్రిమూర్తుల త్రిలింగవ్యక్తులందంతటం
గలడీశుండు గలండు తండ్రి, వెదకంగానేల నీయా యెడన్
తాత్పర్యం: “ భగవంతుడు సముద్రములో, గాలిలో, ఆకాశంలో, భూమిలో, అగ్నిలో, దిక్కుల్లో, రాత్రింబవళ్ళలో, సూర్యచంద్రులలో, ఓంకారములో, బ్రహ్మవిష్ణు మహేశ్వరుల్లో, స్త్రీపుంస నపుంసకాదుల్లో, అన్నింటా ఉన్నాడు. ప్రత్యేకించి ఇక్కడ అక్కడ అని వెతికే అవసరమే లేదు.”
చాణక్యుడి అర్థశాస్త్రంలో, వాత్యాయనుడి కామ సూత్రాలలో వీరి ప్రస్తావనవుంది. ఖజురహో దేవాలయాలలోని శిల్పాలలో స్వలింగ సంపర్కుల బొమ్మలెన్నో వున్నాయి. కావున ఈ రకం వ్యక్తులు అనాదిగా వున్నవారేనని తెలుస్తోంది. కానీ మన సమాజం వీరిని తమతో సమానంగా భావించడానికి సిద్ధంగా లేదన్నది వాస్తవం.
నా పిల్లప్పుడు మా ఈదర పల్లెలో అటూ ఇటూ గాని వ్యక్తిని “ఇండ్రోడా” అని ఎగతాళి చేయటం గుర్తుకొస్తున్నది. వారిని ఇంట్లో నుండి తరిమేయటం, హీనంగా చూడటం మనందరికీ తెలుసును. మనసు పెట్టి చూడలేదు. హిజ్రాలు, కొజ్జాలుగా పిలవబడే వారి జీవితాలు “ఒక హిజ్రా కథ” చదివిన తర్వాత గదా బాగా తెలిసొచ్చింది. వసుదేంద్ర కథలు చాలా వివరంగా చెప్పొచ్చినాయి కదా. ఆరోజుల్లో FIRE హిందీ సినిమా, WATER మూవీ ఎంత సంచలనం.
మన ఊళ్ళల్లో వీధుల్లో, అంగళ్ల దగ్గర, రైల్వే స్టేషన్ లలో, బస్ స్టేషన్ లలో అడుక్కునే ఎంత మంది అభాగ్యులను మనం చూసీచూడనట్టు, హీనంగా అనుకోలేదు. 1969లో న్యూయార్కులో వీరున్న రెస్టారెంటులో కాల్పులు జరిపి కొందరిని పొట్ట పెట్టుకున్న దగ్గర నుండి LGBTQ ల గమనం మరింత ఐక్యమై, పెను ఉద్యమంలో ముందుకు దూసుకుపోతున్నది. RAINBOW జెండాలతో ప్రపంచమంతా రెపరెపలాడుతున్నది. మన దేశంలో ఆర్టికల్ 377 రద్దు దగ్గర నుండి రంగుల రాట్నమై తిరుగుతున్నది.
దళితులు, మైనారిటీలు, బ్లాక్స్, అనాధలు, అభాగ్యులు, అధోజగత్సహోదురుల మాదిరిగా వీరిది మనం పట్టించుకోవాల్సిన చరిత్ర. వారు వేరు గాదని మనలోని వారేనని భరోసా ఇవ్వవలసిన క్షణమిది.
వారి IDENTITY ని గొప్పగా విప్పి చెబుతున్న వైనం చరిత్రాత్మకం. మనమందరం ఎంతో ఇష్టపడే సేపియన్ లాంటి అద్భుతమయిన పుస్తకాల నందించిన YUVAL NOAH HARARI వొక “గే”. గొప్ప చరిత్రకారుడు. విపాసన ధ్యానం “నా జీవితాన్ని మార్చేసింది”. అని గర్వంగా ప్రకటించిన ఈ కాలపు మేధావి. YAHAV అనే మరో గేని పెళ్లి చేసుకుని ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా అద్భుత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొన్నటికి మొన్న కరోనా విపత్తులో WHO కి కొన్ని మిలియన్ డాలర్ల విరాళాలు ఇవ్వటం చూసినాము.
మన దేశంలోనూ ఇప్పుడిప్పుడే పట్టణ ప్రాంతాల్లో వీరంతా జతగా PRIDE MARCH లు నిర్వహిస్తున్నారు. ముంబాయిలో ప్రతి ఏటా QUEEN FILM FESTIVAL నిర్వహిస్తున్నారు. బెంగుళూరులో, పూణే లో, ఢిల్లీలో, జైపూరు, ఆగ్రా లాంటి చోట్ల వీరి ఉనికి ప్రస్పుటం. తమిళనాడు రాష్ట్రం MALE, FEMALE, TRANSGENDER గా గుర్తింపునిచ్చింది.
కరణ్ జోహార్ లాంటి సెలబ్రటీలు, సావిత్రి లాంటి రచయితల వల్ల మన సమాజమూ LGBTQ IDENTITY ని ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నది. HOLLYWOOD లో, క్రీడాకారులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు మరింత మంది మేం “ఫలానా” అని చెప్పుకోవటం వల్ల ఇప్పుడిప్పుడే చైతన్యం రగిలి జనాభాలో 20% గా వున్న వీరి జీవితాలు వెలుగులోకి వస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఇంత జరుగుతున్నా అక్టోబరు 11 ను LGBTQIA + కమ్యూనిటీ రోజుగా ఘనంగా జరుపుకుంటున్నా కాలిఫోర్నియాలో 40 శాతం మంది ఇళ్ళు లేని వాళ్లల్లో LGBTQ వాళ్లని తెలిసి చాలా శోచనీయంగా అనిపిస్తున్నది. ఇప్పుటికే ఇళ్ల నుండి గెంటి వేయబడుతున్నవారు, సంఘ బహిష్కృతులు మన దేశంలో మాదిరిగానే అధికంగా ఉండటం వీరి ఈ ప్రయాణం ఎంతటి ముళ్ల బాటో తెలియజెబుతున్నది.
ఏ దేశ చరిత్ర చూసినా, ఏ పుటలు వెదికినా శోక భరితమయిన అక్షర సమూహమీ వర్గం.
“మేమేమి చేస్తి మమ్మాపాపం
మా కేలనమ్మా ఈ శాపం
కాలు చేయిలోపమైనా
కొక్కిరాయి రూపమైనా
కంటిచూపు కరువైనా
వినికిడి లోపమున్నా
అయ్యో పాపమంటారే
మేమేమైనా కోరితిమా
మా అమ్మానాన్నలను
ఆ లోపముతో కనమని
వారైనా తలచితిరా ఆలాంటి
సంతానమివ్వమనీ ఆ దేవుడిని
ఏపాప మెరుగని మా కేల ఈ
చిన్నచూపు….
సమసమాజమని, సమతా వాద
మని వాదింతురే….
ఆ సమతలో మా ఉనికేది???
ఆ సమాజంలో మా స్థాన మేది?
కనబడని దేవుడిని కొలుస్తారు గాని
కంటెదురుగా ఉన్నమేము కానరామా??
లేక మేము మీ చూపుకు ఆనమా….
మాకూ ఉందొక ఐక్యత
మా ఐక్యతే మాకు తోడు నీడ
ఆ నీడలో హాయిగా ఆనందంగా
బతుకుతాం…. బతికి చూపుతాం….
ఇదే మాకు మేము పెట్టుకున్న ఆన…..”
ఇది మా జెండర్. మా జీవితం.
మా ప్రామిస్.. అంటున్న వీరి ఆవేదనను అర్థం చేసుకుందాం.
వీరిని అక్కున చేర్చుకుందాం. వీరి తరఫున నిలబడదాం. వీరి హక్కుల కోసం, స్వేచ్ఛకోసం నినదిద్దాం. వీరూ మనలోని వారేనని చాటి చెబుదాం.
Don’t hate because they are different
As that’s Still upto you
in fact, you should be proud of them
For they came out to you.
(భూమన్, శాన్ రామన్,కాలిఫోర్నియా, 21/08/2022)