(భూమన్)
దారి పక్కన చెట్టు క్రింద
ఆరిన కుంపటి విధాన
కూర్చున్నది ముసల్దొకతె మూలుగుతూ… ముసురుతున్న ఈగలతో వేగలేక
ముగ్గుబట్ట వంటి తలా
ముడతలు తేరిన దేహం కాంతిలేని గాజు కళ్ళు
తన కన్నా శవం నయం
ఇది విశ్వ కవితని అమెరికా
నా పర్యటనలో ప్రత్యక్షంగా దర్శించినాను. శ్రీ శ్రీ చెప్పిన యదార్థ క్షుదార్తి దృశ్యాలెన్నింటినో కాలిఫోర్నియా నలు దిక్కులా చూసినాను. ఇట్టాంటి అన్నార్తులు, కూడు, గూడు లేని దీనార్తుల నిందరినో డేట్రాయిట్, వాషింగ్టన్ న్యూయార్క్, బోస్టన్, డల్లాస్, చికాగోలలో…. అన్నింటికన్నా అత్యంత ధనిక రాష్ట్రంగా టెక్ పుట్టిల్లు కాలిఫోర్నియా రాష్ట్రంలోనూ అత్యధికంగా ఈ ధీనులు, భ్రష్టులు, బాధా సర్ప ద్రష్టులు ఉండటం అత్యంత విషాదము… దుఃఖ భరితము. కూడులేని, గూడులేని
పక్షులారా, భిక్షులారా
సఖుల వలన పరిచ్యుతులు జనుల వలన తోరస్కృతులు సంఘానికి బహిష్కృతులు
చూశానమ్మా … చూశానయ్యా కో కొల్లలుగా ఎందరెందరినో…
మరందరినో
భారతదేశంలోని సగం రాష్ట్రాలను కొనేయగలిగినంత సంపద కలిగిన ఆపిల్, గూగుల్, ఫేస్బుక్ వంటి సంస్థలకు నిలయమైన కాలిఫోర్నియా రాష్ట్రంలో దాదాపు రెండు లక్షలకు పైగా వీధుల్లో.. రైలు కట్టల అంచంల్లో, టెంట్ సిటీలో ఉండటం చూసినాను.
లాస్ట్ ఏంజెల్స్, సాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో రోజురోజుకు వీరి సంఖ్య పెరుగుతుండడం పెట్టుబడి దారి విధానం దుర్లక్షణం. వీరిని బిక్షగాళ్ళు, బీదవారు అని కాకుండా ఎక్కువగా ఇల్లు లేని వారు అని వ్యవహరిస్తారు.
వీధుల్లో పాల్ హోల్డర్స్ గా పేరు పడ్డ వాళ్లని కొన్ని వందల్లో చూసినాను. శాన్ జ్యోస్ నుండి లాస్ ఏంజెల్స్ కు ప్రయాణిస్తూ రైలు కట్టంబడి ఉడ్డలు ఉడ్డలుగా ఉన్న వారిని వదల సంఖ్యలో చూసినాను.
అమెరికా లాంటి Affluent Society లో జనం పలు రకాలైన ఊహల్లో ఉంటారు. దగ్గరగా చూస్తే గాని నిజం బోధపడదు. కూలీలు, ప్లంబర్స్, గార్డ్నర్స్, క్లీనర్స్ బ్రతుకుతెరువు కోసం నానా తిప్పలు పడే వారితోపాటు ఈ హోమ్ లెస్ జనం లక్షల్లో ఉండటమే ఈ ధనిక అగ్రరాజ్యపు పెట్టుబడిదారీ విధానపు వైచిత్రి.
ఇంత ధనిక దేశంలో ఆఫ్ట్రాల్ కొన్ని మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తే వీరిని ఉద్ధరించడం పెద్ద పని కాదు కదాని మనలాంటి వాళ్లకు అనిపిస్తూ ఉంటుంది. వాళ్లను.. వీళ్లను అడిగితే వీళ్లకు సహాయం చేయడం అంటే ‘సోమరిపోతుల్ని’ తయారు చేయడమేనని ఎక్కువమంది ముక్తకంఠంతో చెప్పటం విని ఆశ్చర్యపోయాను.
ఇక్కడ ఎవరి బతుకు వారు బతకవలసిందే ఇట్టాంటి వారిపట్ల ఎవరిని కన్సర్న్ గాని సానుభూతి కానీ ఉండదు సరిపడా ఇల్లు లేకపోవడం వల్లనే ఇటువంటి పరిస్థితి దాపురించిందని నచ్చదప్ప చూస్తున్నారు ఈ ఉత్సాహానికి Mental illness, Drugs addiction, Poverty, Lgbtq, Sexul abuse, Pregnancy, Rape, Alcoholics, Hiv infectors,. Skin disorders లాంటి కారణాలు ఎన్నో చెబుతారు.
వీధుల్లో వీరితో మాటలు కలపాలని ప్రయత్నిస్తే నా చుట్టూ ఉన్నవారు వారించారు. వీరిలో వైలెంట్ పీపుల్, డ్రగ్ మాఫియాకు సంబంధించిన వారు ఉంటారని కాల్చేసే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. అది నిజమే. నేనున్న రోజుల్లో అకారణంగా ఇద్దరిని చంపేసిన ఘటన విన్నాను.
ఇళ్లల్లో కలిసి ఉండలేక పోతున్నవారు, ఇళ్ళ నుండి బయటకు గెంటేయబడిన వారు వీళ్ళల్లో ఎక్కువగా ఉండటం మరింత విషాదం. అట్లాంటి యువతీ యువకులు వందల్లోనే ఉన్నారు. ఈ వీధిలోనే టెంట్ సిటీలో వీళ్ళ సంసారాలు… ఇక్కడే సెక్స్.. పిల్లల్ని కనటం.. రోగాలు కొని తెచ్చుకోవటం, మధ్య యుగాలనాటి Tuberculosis, Typhus కొని తెచ్చుకోవడం సాధారణమైపోతున్నది.
వీళ్ళ కోసం కొన్ని రాష్ట్రాలు నెలకు 500 డాలర్లు మనిషికి ఒకరికి ఇస్తామని మరికొన్ని సేవా సంస్థలు ఆసుపత్రి సౌకర్యాలు, తిండి, గుడ్డ సమకూరుస్తాయని విన్నాను.
పెట్టుబడిదారీ విధానపు క్రూరత్వానికి, అమానుషత్వానికి ఈ హోం లెస్ వారు ఒక మచ్చుతునక. 24 సంవత్సరాలు కూడా నిండని వారు వీళ్ళల్లో ఉండటం ఏమిటి? అట్లాంటి వారిని త్రో అవే యూత్ అని అనడం ఏమిటి ? మరికొందరినేమో రన్నవే యూత్ అని అంటున్నారు.
వీళ్లను వీధుల నుండి ఖాళీ చేయించడానికి తరచూ వాటర్ గన్స్ ప్రయోగిస్తారని విని గుండెలవిసిపోయాయి. వీరి సమస్యకు పరిష్కారం కనుక్కోవటం కన్నా…. కనుచూపుల్లో ఉండరాదనే దాష్టికం వ్యవస్థ పట్లనే అసహ్యాన్ని కలిగిస్తున్నది.
ఒక్క లాంచ్ ఏంజెల్స్ నగరంలోని 13 బ్లాక్స్ లో 7 వేలమంది నివసిస్తున్నట్లు అంచనా. ఇక్కడే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హాలీవుడ్ ఉంది.
అన్ని సమస్యల కన్నా ఈ హోమ్ లెస్ సమస్య అత్యంత తీవ్రమైనదిగా భావించి 2018 లో ఎమర్జెన్సీ ప్రకటించారట. రోజుకు 900 మంది చచ్చిపోయే అథో జగత్సహోదరులకు అదీ జవాబు.
ఆయుధాలు కలిగి ఉన్నవారు, హోమోఫోబియో, ట్రాన్స్ ఫోబియాకు చెందినవారు వయలెంట్ పీపుల్ చొరబడినవారు ఉన్నారన్న ఈ హోమ్ ప్లేస్ కమ్యూనిటీకి నీళ్లు, శానిటేషన్, ఆరోగ్య సమస్యలు ఎలా? ఎట్లా?
” క్లీన్ ది సిటీ” పేరిట తరచూ జరిగే అత్యాచారాల మూలాన కొన్ని వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
శాన్ జోష్లో రోస్ పార్క్ వద్ద నడుచుకుంటూ పోతున్నప్పుడు ఆ తుప్పల్లో కొన్ని పదుల సంఖ్యలో వీరిని చూసి భయమేసింది. బతుకుపట్ల విరక్తి కలిగింది. ఇంతటి ఈ విస్తారమైన హోమ్ గ్లాస్ లను “ది జంగిల్స్” గా పిలుస్తున్నారు.
అత్యంత క్రూరమేమిటంటే 1999లో గోల్డెన్ గేట్ పార్క్ దగ్గర ఉన్న వారిని తరిమి కొట్టడానికి రాత్రింబవళ్లు హెలికాప్టర్లు Infrared camaras తోటి తిరిగేవట.
అంతేగాని శాశ్వత పరిష్కారానికి నోచుకోని ఈ దీన హృదయ విదారక గాధ ఎక్కడికి దారితీస్తుంది? Netflix లో ” Lead me home” తప్పక చూడండి.
” నేను చూశాను… నిజంగా మూర్తి భవత్ దైన్యాన్ని…. హైన్యాన్ని క్షుభితాశ్రు కల్లోల నీరధుల్ని, గచ్ఛతే శవాకార వికారుల్ని”.
ఇది ఏ నాగరికతకు పలశ్రుతి?
ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి?
– బాలగంగాధర తిలక్
(భూమన్ ప్రముఖ రచయిత , ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.)