ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలలో వినాయక చవితి ఉత్సవాలకు విగ్రహాలను ప్రతిష్టించే విషయాన్ని క్రమబద్దం చేస్తున్నారు. వినాయక చవితి వేడుకలకు పోలీస్ వారి అనుమతి తప్పనిసరి చేేశారు. విగ్రహాల ప్రతిష్ట విధానానాన్ని
ప్రకాశం జిల్లా SP శ్రీమతి మలిక గర్గ్ వివరించారు. వివరాలు ఇవే.
మండల పరిధిలో గణేష్ “విగ్రహ ప్రతిష్ఠ, పందిళ్ళు/మంటపాలు ఏర్పాటు చేసుకోవాలి అనుకున్న వారు ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులతో కమిటీగా ఏర్పడి వారి పూర్తి వివరాలతో దగ్గర లో ఉన్న పోలీస్ స్టేషన్ నందు పర్మిషన్ తీసుకోవాలి.
వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకునే వారు సంబంధిత స్థల యజమాని లేదా పంచాయితీ, గ్రామ అధికారుల అనుమతి తప్పనిసరి.
* వీటితో పాటు ఫైర్, విద్యుత్ శాఖల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఆయా విభాగాలు సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పందిళ్ళు/మంటపాలు వద్ద ఇసుక మరియు నీళ్ళను ఏర్పాటు చేసుకోవాలి.
* పందిళ్లు/మంటపాలలో అగ్నిప్రమాదాలు జరుగకుండా జాగ్రతలు తీసుకోవాలి. విద్యుత్ వైర్లను మరియు ప్రకాశవంతమైన లైట్ల వినియోగంలో జాగ్రతలు వహించాలి. ఎలక్ట్రిక్ షార్ట్ సర్య్కూట్ జరుగకుండా వైరింగ్ జాగ్రత్తగా చేయించుకోవాలి.
* గణేష్ ప్రతిమల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన మార్గం మరియు విగ్రహ నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను విధిగా తెలియజేయాలి.
* పందిళ్ళు/మంటపాలు వద్ద శబ్ధకాలుష్య క్రమబద్దీకరణ మరియు నియంత్రణ నింబంధనలు-2000 ప్రకారం స్పీకర్లను ఉపయోగించాలి. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వాడాలి.
* రాత్రి వేళల్లో మంటపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్ కమిటీ వారి ప్రతినిధులు కాపలా ఉండవలెను. ఎవరికి వారు తగు భద్రతా ఏర్పాట్లు చేసుకొనవలెను. రాత్రి సమయాలలో పందిళ్ళు/మంటపాలలో విలువైన వస్తువులు ఉంచరాదు.
* వినాయక పందిళ్ళు గాని, విగ్రహం పెట్టే ప్రదేశం గాని రోడ్డుపైన ఉండరాదు. బ్యానర్లు/ ప్లెక్సీలు రోడ్డుపైన రాకపోకలకు అంతరాయంగా పెట్టరాదు. వినాయక చవితి ఉత్సవాల సమయంలో బాణసంచాలను ఉపయోగించరాదు.
* ఊరేగింపు సమయంలో పోలీస్ వారి అనుమతి లేకుండా వేషధారణలు, ఎక్కువ శబ్ధము వచ్చే వాయిద్యాలు అనగా డి.జే., తదితరాలకు అనుమతి ఉండదు.
* పందిళ్ళ వద్ద మరియు ఊరేగింపు సమయాలలో అనుచిత ప్రదర్శనలు, అసభ్య నాట్య ప్రదర్శనలు జరుగకుండా మరియు మద్యం లేదా మత్తు పదార్ధాలను సేవించిన వారు లేకుండా ఉండే విధంగా ఉత్సవ నిర్వాహకులు బాధ్యత వహించాలి.
* నిమజ్జన ఊరేగింపుకు అనుమతించిన సమయం, నిమజ్జనకు కేటాయించిన ప్రదేశం మరియు ఊరేగింపునకు కేటాయించిన మార్గములలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి.
* ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ ఇబ్బంది కలుగకుండా రద్దీని నివారించేందుకు మరియు భద్రత కొరకు తగినంత మంది కమిటీ సభ్యులు, ఉత్సవ నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలి.
పైన తెలిపిన వాటిని విధిగా పాటిస్తూ తప్పని సరిగా పోలీస్ వారి అనుమతి పొందవలసి ఉంటుంది.