‘తిరుమల దృశ్య కావ్యం’ ఆవిష్కరణ సభలో ఆచార్య వకుళాభరణం రామకృష్ణ
తిరుపతి :
‘తిరుమలదృశ్యకావ్యం’ చూడడానికి వచనంలా ఉంది. కానీ, చదువుతుంటే కవిత్వంలా ఉంది. చూడగలిగినంత మేరకనిపించగలిగినంత దృశ్యం. ఇది చిత్రం కాదు, ఇదొక దృశ్యం అన్నారు ప్రముఖ చరిత్ర కారులు, సాహితీవేత్త ఆచార్య వకుళాభరణం రామకృష్ణ. ఎస్వీ యూనివర్సిటీ లైబ్రరీ సెమినార్ హాలులో ఆదివారం ఉదయం రాఘవ శర్మ రచించిన ‘తిరుమల దృశ్య కావ్యం’ను ఆవిష్కరించి ప్రసంగించారు. శేషాచలం కొండలలో ఉన్న ప్రకృతిని అనుభవించి, పలవరించి, అక్షర రూపం పెట్టిన పుస్తకం. ప్రకృతిలో లీనమైన వాక్యం, ప్రకృతిలో మమేకమై రాసిన కావ్యం. కృష్ణ శాస్త్రిలా తాదాత్య్యం చెంది రాసిన కావ్యం. అంటూ వివరించారు.
సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ రచయిత ఆచార్య మధురాంతకం నరేంద్ర మాట్లాడుతూ, శేషాచలం కొండలను చూస్తే ఆనందంగా ఉంటుంది. అది ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధం వల్ల. కమర్సి కమర్షియలైజేషన్ వల్ల ఆ అందాన్ని పోగొట్టుకుంటున్నాం. మానవుడు వెళ్ళని చోటంతా అందంగానే ఉంటుంది. మానవుడు వెళితే దాన్ని నాశనం చేస్తాడు. ‘తిరుమల దృశ్య కావ్యం’ చదవడమంటే మళ్ళీ ప్రకృతిలోకి వెళ్ళడం. సాహిత్యంలో ప్రకృతి ప్రధాన పాత్ర పోషిస్తుంది అని వివరించారు.
సభలో అతిథిగా పాల్గొన్న అటవీ రేంజర్ అధికారి ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ శేషాచలం కొండల్లో వందల తీర్థాలు ఉన్నాయి. ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క ప్రాశస్త్యం ఉంది. కొన్ని తీర్థాలకు వెళ్ళడం చాల కష్ట సాధ్యం. అడవిలోకి వెళ్ళాక అడవిని ప్రేమించడం మొదలుపెడతాం అన్నారు. పుస్తక రచయిత రాఘవ శర్మ మాట్లాడుతూ పాతికేళ్ళ నుంచి శేషాచలం అడవుల్లో ఎలా తిరిగింది తన అనుభవాలను వివరించారు. సభలో పలువురు ట్రెక్కర్లు, సాహితీ వేత్తలు, విద్యావేత్తలు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
‘డేర్ డెవిల్ ట్రెక్కర్’ మధుసూదన్ ఆహ్వానం పలికిన ఈ పుస్తకావిష్కరణ సభలో సాహితీ వేత్త డాక్టర్ ప్రేమావతి, రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ మొహన్ రెడ్డి పాల్గొన్నారు.