సోషల్ మీడియా ఇన్ని ఘోరాలు జరుగుతాయా?

సోషల్‌ మీడియా విష నాగులు

ఆవిడో ప్రముఖ జర్నలిస్టు. సోషల్‌ మీడియా పేరిట బీజేపీ విషనాగులు కట్టుకున్న పుట్టలను బద్దలు కొట్టిన యోధ! వాస్తవాల్లో విషాన్ని నింపి వక్రీకరించి.. నిజాలను సమాధి చేసి.. అసత్యాలను సమాజంపైకి వెదజల్లిన తీరును కండ్లకు కట్టిన సాహసి! దేశభక్తి ముసుగులో అత్యంత నీచమైన ప్రచారాలకు తెగించినవారి పశ్చాత్తాపాలను అక్షరీకరించిన తెగువ ఆమెది!

స్వాతి చతుర్వేది!! ఐ యామ్‌ ఏ ట్రోల్‌.. బీజేపీ, ఆరెస్సెస్‌ అంతర్జాల అంతఃపుర రహస్యాలను ఛేదించి.. శోధించి.. ఆమె రూపొందించిన పుస్తకం! అది పుస్తకం మాత్రమే కాదు.. వాట్సాప్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో కాషాయ మూకలు చేసే కనికట్టును, విద్వేష ప్రచారాల వెనుక గుట్టును విప్పి చెప్పిన రచన.

సమాజ హితాన్ని కాంక్షించి రచనలు చేసిన స్వాతి చతుర్వేది.. బీజేపీ, ఆరెస్సెస్‌కు కంటగింపుగా మారారు. ఫలితం.. ఒక మహిళ అని కూడా చూడకుండా అత్యంత దుర్మార్గంగా ఆమెపై ట్రోలింగ్‌ సాగింది! మొదట విస్మరించారు.. కొంతకాలం భరించారు. ఇక భరించలేని పరిస్థితిలో దాని అంతు చూసేందుకే ఆమె సిద్ధమయ్యారు. ఆ క్రమంలో రాసినదే ఈ పుస్తకం. ఆదివారం నాటి మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా ప్రస్తావించిన నేపథ్యంలో ఆ పుస్తకంలోని కొన్ని ముఖ్యాంశాలను పాఠకులకు పరిచయం చేసే ప్రయత్నం

స్వాతి చతుర్వేది ప్రముఖ పాత్రికేయురాలు. పలు వార్తా పత్రికలకు, టీవీ చానెల్స్‌కు పనిచేశారు. స్టేట్స్‌ మన్‌,ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌,హిందుస్థాన్‌ టైమ్స్‌ది ట్రిబ్యూన్‌,ఎన్‌డీటీవీ,ది వైర్‌,గల్ఫ్‌ న్యూస్‌,డక్కన్‌ హెరాల్డ్‌ వంటి పత్రికలలో ఆమె పాత్రికేయురాలిగా పేరు తెచ్చుకున్నారు.స్వాతి చతుర్వేదికి 2018లో రిపోర్టర్స్‌ వితౌట్‌ బార్డర్స్‌ నుంచి ‘ప్రైజ్‌ ఫర్‌ కరేజ్‌’ అవార్డు లభించింది.‘డాడీస్‌ గర్ల్‌’ అనేది ఆమె రాసిన మొదటి పుస్తకం.రెండవ పుస్తకం- ‘ఐ ఆమ్‌ ఎ ట్రాల్‌ః ఇన్‌సైడ్‌ ది సీక్రెట్‌ వరల్డ్‌ ఆఫ్‌ ది బీజేపీ స్‌ డిజిటల్‌ ఆర్మీ’. బీజేపీకి చెందిన ఆకతాయిలు మహిళలను ఆన్‌లైన్‌లో వేధిస్తున్న నేపథ్యంలో ఈ పుస్తకం బహుళ ప్రాచుర్యం పొందింది.

బీజేపీ సోషల్‌ మీడియా తమకు గిట్టని అనేక మంది ప్రముఖులను కించపరుస్తూ అబద్ధపు,విద్వేష ప్రచారం సాగిస్తుంటుంది. ఆ ప్రముఖులకు వ్యక్తిగతంగా అవమానకర మెసేజ్‌లు పంపుతూ మానసికంగా వేధిస్తుంది. ఇందులో మహిళలపైనైతే మరింత అవమానకరంగా దుష్ప్రచారం సాగిస్తుంది. ప్రఖ్యాత పాత్రికేయురాలు స్వాతి చతుర్వేదిపై కూడా బీజేపీ పెద్దల కన్ను పడింది.దీంతో ఆమెను ఆన్‌లైన్‌లో వెంటాడమని తమ సోషల్‌మీడియాకు ఆదేశాలు ఇచ్చారు.పొద్దున లేస్తూనే, తనపై అసభ్య వ్యాఖ్యలను చూసుకోవడం ఆమెకు బాధగా ఉండేది. ఆ మెసేజ్‌లు తనకు ఎవరైనా రాజకీయ నాయకుడికి సంబంధాన్ని అంటగడుతూ లేదా శృంగారం గురించి కల్పిత గాథలు వివరిస్తూ అత్యంత అసభ్యంగా ఉండేవి. కొన్ని నెలల పాటు వాటిని భరించిన స్వాతి చతుర్వేది బీజేపీ సోషల్‌ మీడియా పనితీరు, చేస్తున్న నిర్వాకంపై రెండేండ్లపాటు పరిశోధన జరిపారు. అందులో పనిచేస్తున్న వారితో కూడా మాట్లాడి ‘ఐయామ్‌ ఎ ట్రోల్‌’ పుస్తకాన్ని 2016లో రాశారు. అందులో కొన్ని ప్రధాన భాగాలను సంక్షిప్తంగా అందిస్తున్నాం.

దేశం కనీవినీ ఎరుగని స్థాయిలో బీజేపీ సృష్టించిన భయంకర, ఉన్మాద, విద్వేష, అబద్ధాల యంత్రాంగం

ఎన్నడూ చూడనంత అధమస్థాయి ప్రచారం

నేనొక పరిశోధనాత్మక విలేకరిని. భావప్రకటనా స్వేచ్ఛయే నాకింత కూడు పెడుతుంది. కొన్ని సంవత్సరాలుగా భారత ప్రభుత్వం ‘అధికారిక రహస్యాల చట్టం’ కింద ఇతర విలేకరుల మీద మోపినట్లే నామీద కూడా అనేక కేసులు బనాయించింది. నా ప్రచురిత కథనాల బలంతో, ఆత్మవిశ్వాసంతో నేను ఆ కేసులన్నీ ఎదుర్కొన్నా. అట్లాంటి నేనే స్వయంగా దక్షిణ ఢిల్లీలోని వసంత్‌ విహార్‌ పోలీస్‌ స్టేషన్‌లో @లుటిన్‌సిన్‌సైడర్‌ పేరిట నడుపుతున్న అనామక ట్విట్టర్‌ ఖాతాదారు మీద కేసు పెట్టా. 40 వేల మంది ఇతని ట్విట్టర్‌ ఖాతాను అనుసరిస్తున్నారు. గత ఆరు నెలలుగా ఈ ఖాతాదారు పథకం ప్రకారం నా మీద విష ప్రచారం చేస్తున్నాడు. ఒక రాజకీయవేత్తతో నాకు అక్రమ శారీరక సంబంధం అంటగట్టాడు.

తెల్లారి లేచి చూస్తే చాలు నా ట్విట్టర్‌ ఖాతాలో, వందలాది అసభ్యకరమైన నోటిఫికేషన్లు కనిపిస్తాయి. ‘రాత్రికి నా రేటు గురించి’, ‘రాత్రి పూట రతి రహస్యాల’ గురించి అత్యంత అసభ్యకరమైన రీతిలో నన్నొక కామ పిశాచిలా చిత్రీకరిస్తూ సందేశాలు పెడుతున్నారు. 21 ఏండ్ల నా వృత్తి గౌరవాన్ని చిదిమేసి సోషల్‌ మీడియాలో నన్నొక బజారు ఆడదానిగా చిత్రీకరించటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఇంటర్నెట్‌ దాడులకు ప్రత్యేక లక్షణం, లక్ష్యం ఉంటాయి. విలేకరిగా నా సుదీర్ఘ వృత్తిగత జీవితంలో నేనెన్నడూ ఎరుగనంత అధమస్థాయి అసభ్య, విద్వేష ప్రచారాన్ని చవిచూశాను. తెల్లవారుఝాముని అందరూ ఆస్వాదిస్తారు. కానీ, నేను మాత్రం వికారపు ఉదయాలను చూడాల్సి వచ్చింది. @లుటిన్‌సిన్‌సైడర్‌ పేరు పెట్టుకున్న ఖాతాదారు ఒక్కడే కాదు నామీద దాడులకు తెగబడింది. నిర్భయని బలాత్కారం చేసినట్లు నిన్నూ రేప్‌ చేస్తామని, ఏకే-47తో కాల్చివేస్తామని బెదిరింపులు వచ్చేవి. కశ్మీర్‌లో సైన్యం వాడుతున్న పెల్లెట్‌గన్‌ల కారణంగా శాశ్వత అంధులుగా మారుతున్న అమాయక పౌరుల గురించి కథనాలు రాసినందుకు నాపై ఇలా విరుచుకుపడ్డారు. ఆరు నెలలు ఓపికపట్టాను. ఇక నా వల్ల కాలేదు. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను.

నేను పెట్టిన కేసుకు జాతీయంగా,అంతర్జాతీయంగా ఊహించనంతటి స్పందన వచ్చింది.ట్విట్టర్‌ సదరు ఖాతాను సస్పెండ్‌ చేసింది.అయినాగానీ ఆ నిందితుడిని ఈరోజు వరకూ పోలీసులు అరెస్టు చేయలేదు. కారణంగా.. అతడికి ప్రభుత్వ పెద్దల దన్ను ఉండటమే.

 

వీళ్లంతా ఇంటర్నెట్‌ గూండాలు

‘ఈ ఇంటర్నెట్‌ పోకిరీలు అసభ్యకరమైన చిత్రాలు, అభ్యంతరకరమైన నికృష్ట రాతలతో తెగబడు తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే వీళ్లంతా ఇంటర్నెట్‌ గూండాలు. బీజేపీ మీదగానీ, మోదీ ప్రభుత్వం మీదగానీ, దేశభక్తికి సంబంధించిగానీ ఎవరన్నా సహేతుకమైన విమర్శ చేశారా ఇహ వారి ‘పని’ పట్టడమే ఈ ఇంటర్నెట్‌ గూండాల పని. ట్విట్టర్‌లో వీరంతా ఏ హిందూ దేవుడు/దేవత బొమ్మనో ముఖచిత్రంగా కలిగి ఉంటారు. లేదా, ఎక్కువమంది తమ ఖాతాను అనుసరించేలా ప్రేరేపించటానికి అందమైన యువతుల బొమ్మలు ముఖచిత్రాలుగా పెడుతుంటారు. ఈ గూండాలకు ఊరూ పేరూ ఉండవు.బీజేపీకి చెందిన అత్యున్నత స్థాయి వ్యక్తులు ఆఖరికి ప్రధాని నరేంద్రమోదీ కూడా వీరికి అనుచరులుగా (ఫాలోవర్లుగా) కొనసాగుతున్నారు.

*
ఇంటర్నెట్‌లో చెలామణి అవుతున్న ఈ విద్వేషభాష వాస్తవ ప్రపంచంలోకి కూడా దూసుకువచ్చేసింది. విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి,మాజీ సైన్యాధ్యక్షుడు వీకే సింగ్‌ తనను ప్రశ్నించిన జర్నలిస్టులను ‘సిక్యులర్‌ ప్రెస్టిట్యూట్‌’ (సెక్యూలర్‌ జర్నలిస్టులను వ్యభిచారులు అనే అర్థం వచ్చే విధంగా వాడిన పదం) అనే మాట వాడాడు. ఆ వెంటనే బీజేపీ మంత్రులు,ఇంటర్నెట్‌ పోకిరీలు దీనిని అందిపుచ్చుకున్నారు. బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్‌సింగ్‌.. మాయావతిని ఉద్దేశించి ‘వ్యభిచారి కన్నా హీనం’ అన్న మాట ఉపయోగించాడు.

** *
2016లో హోలీ రోజున ఢిల్లీలో డాక్టర్‌ పంకజ్‌ నారంగ్‌ హత్యోదంతాన్ని తీసుకోండి.డాక్టర్‌ నారంగ్‌ను ముస్లింలు హత్య చేశారని,మీడియా ఈ వాస్తవాన్ని దాచి పెడుతున్నదని రాహుల్‌రాజ్‌ పేరుగల వ్యక్తి (ఇతడికి ట్విట్టర్‌లో 77,900 మంది ఫాలోయర్లున్నారు) ట్వీట్‌ చేశాడు.

ఈ ప్రచారం మూలంగా మత విద్వేషాలు తలెత్తేలోపే ఢిల్లీ పోలీసులు వెంటనే డాక్టర్‌ నారంగ్‌ హత్య గురించి జరుగుతున్నది అబద్ధపు ప్రచారమని స్పష్టంగా వివరణ ఇవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ, ఈ విద్వేషప్రచారాన్ని ప్రారంభించిన వ్యక్తి మీద ఎలాంటి కేసు పోలీసులు పెట్టలేదు.

శోభాడే మీద దిగజారుడు వ్యాఖ్యలు బీజేపీ నాయకుడు కేంద్రమంత్రి గోపీనాథ్‌ ముండే హఠాన్మరణం గురించి 2014 జూన్‌ 3న ప్రముఖ రచయిత్రి శోభాడే సంతాపసూచకంగా ఇలా ట్వీట్‌ చేశారు.. ‘దిగ్భ్రాంతికరమైన వార్త- ముండే మరణవార్త ఎంతటి విషాదం. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక.కుటుంబానికి చెడ్డ రోజులు వచ్చాయి.నా ప్రగాఢ సంతాపం’ (గోపీనాథ్‌ ముండే మరణం వెనుక కుట్ర ఉందన్న ఊహాగానాలు అప్పట్లో చెలరేగాయి). దీంట్లో ఏమైనా అభ్యంతరకరమైనది ఉందా? కానీ, రాహుల్‌రాజ్‌ ఇలా స్పందించాడు.‘హాయ్‌ శోభా ఢే. నీ బాధ నాకు అర్థమైంది.చాలా రోజులుగా పడక సుఖానికి దూరంగా ఉన్నట్లున్నావ్‌.మరీ అంతగా వెంపర్లాడకు’. ఇట్లాంటి అసభ్య రాతగాడి ట్విట్టర్‌ ఖాతాని మన ప్రధాని మోదీ కొన్నేళ్లుగా ఫాలో అవుతున్నారు.

ఇలాంటి వాళ్లని ఫాలో అవుతున్న ప్రధాని మోదీ
నరేంద్రమోదీ ట్విట్టర్‌ ఖాతాకు 21.6 లక్షల మంది ఫాలోయర్లున్నారు.ఆయన 1375 ఖాతాలకు ఫాలోయర్‌గా ఉన్నారు.సమాచారహక్కు చట్టాన్ని అనుసరించి సేకరించిన వివరాల ప్రకారం.. @నరేంద్రమోదీ, @ప్రైమ్‌మినిష్టర్స్‌ఆఫీస్‌ (పీఎంఓ) ఖాతాలను ఆయనే స్వయంగా నిర్వహిస్తుంటారు. అటువంటప్పుడు, ఇంటర్నెట్‌లో అత్యంత నికృష్ట పోకిరీలుగా చెలామణి అవుతున్న వారిని మోదీ ఎందుకు ఫాలో అవుతున్నట్లు? మోదీ ఫాలో అయ్యే 26 ట్విట్టర్‌ ఖాతాలు.. ఇతర రాజకీయపార్టీల నేతలు, పత్రికా విలేకరులు ప్రత్యేకించి మహిళలు, మైనార్టీలు, దళితుల మీద నిత్యం తిట్ల దండకాలు అందుకోవటం,లైంగికంగా అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయటం,హత్య చేస్తానని బెదిరించటం చేస్తూ ఉంటాయి. ఈ గూండాలు తమని తాము గర్వించే హిందువుగానో,దేశభక్తుడిగానో, నమోభక్తుడిగానో చెప్పుకుంటారు. వందేమాతరం, భారత్‌ మాతాకీ జై అన్న నినాదాలను జోడించు కుంటారు.ప్రధాని మోదీ తమ ఖాతాను అనుసరిస్తున్నారని గొప్పగా చెప్పుకోవటానికి మోదీ బొమ్మని తమ ఖాతాలకు ముఖచిత్రంగా వాడుతుంటారు.‘మోదీ మహాశయా! ఇదేం అన్యాయం.ఇట్లాంటి పోకిరీల ఖాతాలను మీరెందుకు అనుసరిస్తున్నారు?’ అని ప్రశ్నిస్తే మోదీగారు మౌనవ్రతం పాటిస్తారు.

ఈ పుస్తకం అచ్చులో వచ్చే సమయానికి ఇలాంటి ఇంటర్నెట్‌ గూండాల మీద పోలీసు కేసులు నమోదైనా,వారి ట్విట్టర్‌ ఎకౌంట్లు ఒకసారి రద్దయినా కూడా వారి ఖాతాల నుంచి మోదీ దూరంగా జరగలేదు.అంతేకాదు, తాను అనుసరిస్తున్న 150 ట్విట్టర్‌ ఖాతాదారులందరినీ పోగేసి 2015 జూలై 1న ప్రధాని అధికారిక నివాసంలో ‘డిజిటల్‌ సంపర్క్‌’ పేరిట ఇష్టాగోష్టి సమావేశం నిర్వహించారు మోదీ.

సాఫ్ట్‌వేర్‌ కంపెనీలా పని విధానం

ఢిల్లీలోని అశోకారోడ్‌లో ఉన్న కేంద్ర బీజేపీ ఐటీ విభాగాన్ని చూస్తే ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మాదిరి అనిపిస్తుంది. దీనికి నేషనల్‌ డిజిటల్‌ ఆపరేషన్‌ సెంటర్‌ అని పేరు. అక్కడ గుంపులు గుంపులుగా టెక్కీలుగా పిలువబడే ఉద్యోగులు కనబడుతూ ఉంటారు. వీరంతా చిన్న చిన్న ఇంజినీరింగ్‌ కాలేజీలు డిగ్రీలు పూర్తి చేసుకొని వచ్చిన నవ యువతీ, యువకులు. ఎక్కువమంది అబ్బాయిలే.

ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఆఫీసుకు వచ్చి పని చేసినట్లే పని చేసుకుపోతారు. వీరిలో ఓ 30 మందికిపైగా యువతీ యువకులతో నేను మాట్లాడాను.తమ పేరు బయటికి రానీయకూడదనే షరతు మీద నాతో చాలా విషయాలు చెప్పారు. ఏ రోజుకి ఆ రోజున సోషల్‌ మీడియాలో హాష్‌ట్యాగ్‌ల ద్వారా ఏ అంశాన్ని ట్రెండ్‌ చేయాలో నిర్ణయిస్తారట. మోదీకి వ్యతిరేకంగా నోరు విప్పిన ప్రముఖులలో ఎవరో ఒకరినిగానీ, జర్నలిస్టులనుగానీ ఎంపిక చేసుకొని బూతుల దాడి మొదలుపెడతారట.

ఇంత నికృష్టమైన అబద్ధాలు, బూతులు ఎలా రాయగలరు అని అడిగితే..‘చూడండి! మాకు ఇది ఆకుకి సున్నం రాసినంత ఈజీ.మామూలు జనానికి మేం పథకం ప్రకారం దాడి చేస్తున్నాం అని తెలియదు. దాంతో దిగ్భ్రాంతికి గురవుతారు. మీలాంటి జర్నలిస్టులకు ఒక అంచనా ఉంటుంది కాబట్టి వెంటనే బ్లాక్‌ చేస్తారు.అది కూడా మాకు పైచేయి కిందే లెక్క.

థాయ్‌లాండ్‌ కనెక్షన్‌

ఆమ్‌ఆద్మీపార్టీ సోషల్‌మీడియా అధిపతి అంకిత్‌లాల్‌ బీజేపీ సోషల్‌మీడియా విభాగానికి నకలు తయారుచేసి ఆ విభాగం పనితీరును గుర్తించారు. ఇంటర్నెట్‌ ఎనలిటికల్‌ టూల్స్‌ ఉపయోగించి ఒక పరిశోధన ప్రతిని నాకు అందించారు. ఇది కరెక్టేనని ఇంగ్లండ్‌కు చెందిన ఇండిపెండెంట్‌ టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌ సిద్ధార్థ భాస్కర్‌ తేల్చిచెప్పారు.

అంకిత్‌లాల్‌ అధ్యయనం ప్రకారం.. థాయ్‌లాండ్‌లో ఉన్న ట్విట్టర్‌ ఖాతాలు రోజువారీగా మోదీ హాష్‌ట్యాగ్‌తో ఉన్న బీజేపీ సందేశాలను పోస్ట్‌ చేస్తున్నాయి. ఈ థాయ్‌లాండ్‌ హాష్‌ట్యాగ్‌లను మోదీ, స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా వాడారు. దీనివెనుక 2 మతలబులున్నాయి.

1. బీజేపీ సోషల్‌ మీడియా కేంద్రాలు ఏ ప్రాంతం నుంచి పని చేస్తున్నాయి, ఎవరై ఉంటారు అన్న విషయాలు తెలియకుండా ఉండటానికి వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌లను వాడుతుంటారు. వీటిద్వారా ఢిల్లీలో ఉన్న వ్యక్తులు ఎక్కడో లండన్‌లో ఉన్న వినియోగదారులకు మాత్రమే లభ్యమయ్యే సమాచారాన్ని రహస్యంగా చేజిక్కించుకోవచ్చు. అలాగే ఈ నెట్‌వర్క్‌ల సాయంతో దొంగ ట్విట్టర్‌ ఖాతాల ద్వారా రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి చేయవచ్చు. ఒకే సమాచారాన్ని వందల ఖాతాల నుంచి వ్యాప్తి చేయవచ్చు.

2. పై కారణం కాదు అనుకుంటే.. థాయ్‌లాండ్‌లో ఉన్న ఏ మార్కెటింగ్‌ ఏజెన్సీ ద్వారానో బీజేపీ ఇంటర్నెట్‌ ప్రచారానికి పూనుకోవచ్చు. అరవింద్‌ కేజ్రీవాల్‌ మీద కేజ్రీవాల్‌ఫండ్స్‌, ఉడ్తాపంజాబ్‌ వంటి హాష్‌ట్యాగ్‌ల ద్వారా దాడి జరిగినప్పుడు.. హీట్‌మ్యాప్స్‌ ద్వారా ఆ దాడి ఆచూకీ గుర్తించి వివరాలు తెలుసుకోగలిగారు అంకిత్‌లాల్‌.

రాంమాధవ్‌ నేతృత్వం

సోషల్‌మీడియాను ఎలా వాడుకోవాలో బీజేపీకి అసలైన శిక్షణను ఇచ్చింది తమిళనాడుకు చెందిన ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయంసేవకులు. వీరికి నాయకత్వం వహించింది ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ పట్టా పొంది ఆ తర్వాత పూర్తిస్థాయి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా మారిన వ్యక్తి రాం మాధవ్‌. మొదట్లో ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవటానికి ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలు మొండికేశాయి.కానీ,దీంతో ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆయన నచ్చ చెప్పారు.బీజేపీ సోషల్‌ మీడియా కార్యకలాపాలన్నీ ఇప్పుడు బెంగళూరు నుంచి కొనసాగుతున్నాయి. 1947లో, 1948లో (మహాత్మాగాంధీ హత్య కారణంగా..), 1975లో, 1977లో, 1992లో ఆర్‌ఎస్‌ఎస్‌ నిషేధానికి గురైంది. అభద్రత, చట్టపరమైన శిక్షలకు భయపడిన కారణంగా ఆర్‌ఎస్‌ఎస్‌ తన సంస్థాగత నిర్మాణాన్ని రహస్యంగా శాఖల ప్రాతిపదికన ఏర్పర్చుకుంది.కాబట్టి, సోషల్‌మీడియాలో కూడా ఇదే పనివిధానాన్ని బాగా ఆరితేరినతనంతో అమలు చేస్తున్నది.

పుకార్లే పనివిధానం

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, హిందుస్థాన్‌ టైమ్స్‌ వంటి పత్రికలలో 40 ఏండ్లపాటు పని చేసిన ప్రముఖ పత్రికా సంపాదకుడు, మాజీ ఎంపీ హెచ్‌ కే దువా ఇలా చెప్పారు.. ‘ఆర్‌ఎస్‌ఎస్‌ ఎలాంటి పరిస్థితులకైనా ఇట్టే అలవాటు పడి పోతుంది. పుకార్ల ప్రచారమే దానికి పెట్టనికోట. అందులో వారు ప్రావీణ్యం సాధించేవారు. ప్రచార మాధ్యమంలో మార్పు ఉండొచ్చేమోగానీ పుకార్ల ప్రచారాన్ని మాత్రం ఆర్‌ఎస్‌ఎస్‌ మానలేదు’

మహిళలే టార్గెట్‌

వీరంతా జర్నలిజంను వృత్తిగా ఎంచుకున్న ఆధునిక మహిళలు. తమ రంగంలో ఉన్నత స్థానాలకు ఎదిగి ప్రశంసలు పొందుతున్నవారు.టీవీలలో వీరిని చూసి స్ఫూర్తి పొందిన బాలికలు దేశంలో ఎందరో ఉన్నారు. వీరిలో సిద్ధాంతరీత్యా బీజేపీని వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తం చేసినవారు, కేంద్ర మంత్రి కుమారుడి కుంభకోణాన్ని బయట పెట్టిన వారూ ఉన్నారు. ఇంకేం… బీజేపీ పెద్దల ఆగ్రహానికి గురయ్యారు. వెంటాడి వేధించడం కాదు, వీరిని మానసిక క్షోభకు గురి చేసేందుకు బీజేపీ మూక కొత్త పద్ధతి ఎంచుకుంది. విదేశాలలో ఉద్యోగమో, కార్యక్రమమో అంటూ నమ్మించి మోసం చేస్తున్నది. ఈ కుట్రలకు మోసపోయిన కొందరు మహిళల వివరాలు…

నిధి రజ్దాన్‌

నిధి రజ్దాన్‌ ప్రముఖ టీవీ న్యూస్‌ యాంకర్‌. తన కెరీర్‌లో ఉచ్ఛ స్థితికి చేరుకున్నారు.హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆమెకు అధ్యాపకురాలిగా ఉద్యోగం లభించినట్టు సమాచారం అందడంతో ఎగిరి గంతేశారు. ఈ విషయాన్ని గర్వంగా అందరికీ చెప్పు కున్నారు. ఉన్న ఉద్యోగాన్ని మానేసి పోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంకా అమెరికాకు వెళ్ళడానికి ముందే తనకు చేరుతున్న సమాచార మంతా బోగస్‌ అని తేలింది.

రోహిణీ సింగ్‌

ఒక కేంద్ర మంత్రి కుమారుడి కుంభకోణాన్ని 2017 బయట పెట్టడం రోహిణీ సింగ్‌ ఘనత. అయితే ఇందుకు ఆమె వేధింపులకు గురి కావాల్సి వచ్చింది. 2019 ఆగస్టులో ఆమెకు ట్విటర్‌ ద్వారా తౌసీఫ్‌ అహ్మద్‌ అనే వ్యక్తి నుంచి మెసేజ్‌ వచ్చింది. తమది కూడా లక్నో అని పరిచయం చేసుకుని మాట కలిపాడు. ప్రస్తుతం హార్వర్డ్‌ కెనెడీ స్కూల్‌లో మాస్టర్స్‌ చేస్తున్నానని చెప్పుకున్నాడు.తాము ఉన్నత స్థాయి మీడియా కాన్ఫరెన్స్‌ జరుపుతున్నామని అతిథిగా రావాలని ఆహ్వానించాడు. ఖర్చలన్నీ హార్వర్డ్‌ పెట్టుకుంటుందని తెలిపాడు. ఇదొక గొప్ప అవకాశమని ఆమెకు ఆనందం వేసింది. తౌసీఫ్‌ ఆమెను పాస్‌పోర్ట్‌ ఇతర వివరాలు అడిగాడు. ఆ తరువాత అలెక్స్‌ హర్ష్‌మన్‌ అనే వ్యక్తి తన సహ విద్యార్థి అంటూ పరిచయం చేశాడు. అయితే తనకు అందిన ఆహ్వానం అలెక్స్‌ హర్ష్‌మన్‌ జిమెయిల్‌ నుంచి ఉందే తప్ప హార్వర్డ్‌ అధికారిక ఇమెయిల్‌ కాదు. దీంతో ఆమెకు అనుమానం వచ్చింది. వీరి ఇరువురి ఫోన్‌ నంబర్లు అమెరికావి కాదు. దీంతో ఇదంతా మోసమని ఆమె పసిగట్టారు.

జైనబ్‌ సికిందర్‌

ప్రముఖ పాత్రికేయురాలైన జైనబ్‌ సికిందర్‌ అల్ప సంఖ్యాకవర్గాలపై సాగుతున్న వివక్షపై వార్తలు రాస్తుంటారు. మోదీ పాలనపై విమర్శలు చేశారు. ఈమెకు కూడా 2019లో తౌసీఫ్‌ అహ్మద్‌ పేర ఒక ట్విట్టర్‌ మెసేజ్‌ వచ్చింది. హార్వర్డ్‌లో హై పవర్డ్‌ మీడియా కాన్ఫరెన్స్‌ ఉంది రావాలంటూ ఆహ్వానం అందింది. హార్వర్డ్‌ పేర మహిళలకు మోసాలు సాగుతున్న విషయం తెలువనందు వల్ల నిజమే అనుకున్నారామె. బోస్టన్‌లో ఉంటున్నానని చెప్పుకుంటున్న తౌసీఫ్‌ ఫోన్‌ నెంబర్‌ దుబాయికి చెందినది. అయినా తనకు ఆహ్వానం అందిన ఆనందంలో ఆమె పట్టించుకోలేదు. తౌసీఫ్‌ ఆ తరువాత అలెక్స్‌ను పరిచయం చేశారు. పర్యటన ఏర్పాట్లు చెబుతూ ఆమెకు హోటల్‌ గదిని కూడా బుక్‌ చేశామని, అది బాగా ఉందని వారు చెప్పారు. అయితే తనకు ఆహ్వానం హార్వర్డ్‌ నుంచి అధికారికంగా కావాలని ఆమె అడగడంతో వారు చాటింగ్‌ మానేసారు.

మరో పాత్రికేయురాలు

మరో పాత్రికేయురాలు కూడా 2019లో తాను మోసపోయినట్టు టైమ్స్‌కు వెల్లడించారు. కానీ ఆమె వ్యక్తిగత కారణాల వల్ల తన పేరు బయట పెట్టడానికి ఇష్టపడటం లేదు. తనతో అమెరికా నుంచి మాట్లాడుతున్నామని చెప్పుకుంటున్న వారి ఫోన్‌ నంబర్‌ యూఏఈ కి చెందినది కావడంతో ఆమె అప్రమత్తమయ్యారు. ఆమె వారితో మాట్లాడటం మానేసినా, వారు వదిలిపెట్టలేదు. వారు అప్పటికే హార్వర్డ్‌ ఉద్యోగుల సంతకాలు కాపీ చేశారు. విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ నుంచి అధికారిక లెటర్‌హెడ్‌ను కాపీ చేశారు. కానీ ఈ పాత్రికేయురాలు మోసాన్ని గ్రహించారు. ఈలోగా వారు మరో ట్విటర్‌ ఖాతాతో సీమా సింగ్‌ అనే మహిళను రంగంలోకి దింపారు. నీవు అందంగా ఉన్నావు, ఇద్దరం కలిసి స్నానం చేద్దామంటూ అసభ్య మెసేజ్‌లను ఆమె పంపింది. తాను బైసెక్సువల్‌నని ఫ్రాంక్‌ఫర్ట్‌లోని ఫలానా బ్యాంక్‌ ఉద్యోగిననీ తెలిపింది. కానీ విచారణ జరిపితే ఆ బ్యాంకులో ఈ పేరు గల ఉద్యోగులు ఎవరూ లేరని వెల్లడైంది.

సాధవి ఖోస్లా.. నిలువెత్తు విరక్తి

బీజేపీ సోషల్‌ మీడియా సెల్‌ సాగిస్తున్న వికృత, విద్వేష ప్రచారాన్ని అర్థం చేసుకోవాలంటే, అందులో పనిచేసిన సాధవి ఖోస్లా అనుభవం తెలుసుకోవాలి. పంజాబ్‌ విశ్వవిద్యాలయంలో మేనేజ్‌మెంట్‌ కోర్సు చదివిన సాధవి ఆరేండ్లు అమెరికాలో ఉన్న తరువాత భారత్‌కు తిరిగి వచ్చారు. ఢిల్లీలో సొంత కంపెనీ నడుపుకొంటున్నారు. అమెరికాలో ఉన్న సంబంధాల దృష్ట్యా ఆమెకు భారీ వ్యాపారం సాగేది.

ఖోస్లా సోషల్‌ మీడియా నడుపుతున్న తీరును ప్రశంసిస్తూ 2013లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ నుంచి ఫోన్‌ రావడంతో ఆమె సంతోషానికి హద్దులు లేవు. ఆమె అమెరికాలో ఉన్నప్పుడు భారీగా బీజేపీకి చెందిన మెసేజ్‌లు వచ్చేవి. రాజీవ్‌ గాంధీకి వ్యతిరేకంగా కుట్ర చేసింది సోనియానేనని, ప్రియాంకకు మతిభ్రమించిందనీ, రాహుల్‌ హిందువేతర యువతిని వివాహమాడి తన పిల్లలను రహస్యంగా దాచి పెట్టాడని ఇలా అడ్డమైన అబద్ధాలను అల్లి పంపించేవారు. మోదీ దేశాన్ని ఉద్ధరించే నాయకుడంటూ అందులో ఉండేది. వాటితో ప్రభావితురాలైన సాధవి బీజేపీ సోషల్‌ మీడియా సెల్‌లో అవకాశం రావడంతో వెంటనే అందులో దూకేశారు. అదొక భారీ యంత్రాంగం మోదీ, అమిత్‌ షాలతో సన్నిహితంగా ఉండే అరవింద్‌ గుప్తా ఈ సోషల్‌ మీడియా సెల్‌కు ఇంచార్జి. ఆయన ఏమి చెప్తే అదే చేయాలి. ఖోస్లా తన మార్కెటింగ్‌ నైపుణ్యాన్నంతా ఉపయోగించి బీజేపీకి ప్రచారం చేసేవారు. రాత్రివేళ భోజనం కూడా చేసేవారు కాదు. అమెరికాలో సొంత బిజినెస్‌ దెబ్బతిన్నది. అయినా దేశానికి సేవ చేస్తున్న అనే భ్రమలో ఉండేది.

బీజేపీ ఎన్నికలలో గెలిచిన తరువాత అచ్చేదిన్‌ వస్తాయని భావించారామె. కానీ బీజేపీ గెలిచిన తరువాత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టక పోగా విద్వేష ప్రచారం పెరిగి పోయింది. పంజాబ్‌లో డ్రగ్స్‌ మొదలైన సమస్యలను ప్రధాని దృష్టికి పంపించినా స్పందన లేకపోవడం ఆమెను నిరాశపరిచింది. మహిళలను అగౌరవ పరిచే బూతులు పంపించాల్సి వచ్చేది. మహిళలకు వారిపై అత్యాచారం చేస్తామనే బెదిరింపులు పంపడానికి ఖోస్లాకు మనసొప్పలేదు. మహిళా జర్నలిస్టు బర్ఖాదత్‌ను అసభ్య రాతలతో ట్రోల్‌ చేయడం నచ్చలేదు. సినీ హీరోలు అమీర్‌ ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌లపై విద్వేష ప్రచారం చేయడం కూడా ఆమెకు ఇష్టం లేదు. కానీ అక్కడ పై వారు ఏది చెప్పినా చేయాల్సిందే.

సాధవి ఖోస్లా ఇంటిలో మూడు తరాల వారు కాంగ్రెస్‌ నాయకులు. తాను చేస్తున్న పని పెద్ద తప్పుగా వారికి తోచేది. తల్లి ఒకసారి ‘ఏమైంది బిడ్డా అచ్చేదిన్‌’ అని అడిగింది. సాధవీ! అమెరికాలో మన బాబును చిన్నప్పుడు చూసుకున్న ఆయా పాకిస్థానీ ముస్లిం అనేది గుర్తున్నదా అని భర్త అడిగినప్పుడు తానెంత మత దురభిమానిగా మారిపోయిందో అర్థమైంది. దీంతో బీజేపీ సోషల్‌ మీడియా సెల్‌ నుంచి బయట పడ్డారామె. స్వాతి చతుర్వేది ఆ రోజుల గురించి అడిగినప్పుడు బోరున ఏడ్చారు.

(ఇది నమస్తే తెలంగాణ నుంచి పునర్ముద్రితం)

(ఐయామ్‌ ఎ ట్రోల్‌ పుస్తకానికి తెలుగు అనువాదం.
‘నేనొక అంతర్జాల పోకిరిని’- ప్రజాశక్తి ప్రచురణ నుంచి కొన్ని భాగాలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *