*రూపాయి విలువ 50 పైసలు పెరిగితే వాపు తప్ప బలుపు కాదు.*
-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
గత శుక్రవారం (29న) అమెరికన్ డాలర్ తో పోల్చితే ఇండియన్ రూపాయి విలువ 50 పైసలు పెరిగింది. ఒకరోజు ముందు గురువారం డాలర్ విలువతో రూపాయి మారకపు విలువ 79.75 ఉంది. శుక్రవారం 79.25 కి విలువ పెరిగింది. ఇది గత ఏడాదిలో అత్యధిక పెరుగుదల. అంటే గత ఏడాదిలో ఇంత ఎక్కువ పెరగడం మొదటిసారి. దీనికే కార్పోరేట్ ఆర్ధిక వర్గాలు తెగ మురిసి పోతున్నాయి. నిజానికి రూపాయి కోల్పోయిన బారెడు విలువలో తిరిగి మూరెడు విలువను కూడా రాబట్టుకోలేదు. కనీసం జానెడు విలువను కూడా రాబట్టుకోలేదు. అది కనీసం బెత్తెడు కూడా కాదేమో! పైగా రూపాయి వాస్తవ క్షీణతా ధోరణి తొలగింది కూడా లేదు. కానీ పాలకవర్గాలు మరియు ఆర్ధిక ప్రాబల్య వర్గాలు మురవడమే కాదు. బడా కార్పోరేట్ మీడియా దేశ ప్రజల్లో అపోహ కలిగిస్తోంది. ఇక రూపాయికి అదృష్ట దశ రానున్నదని కీర్తించడం హాస్యాస్పదమైనది.
రాము, సోము ల మధ్య పోలిక కథను చెప్పుకునే అవసరం వచ్చింది.
రాము బరువు 75 కేజీలు. సోము బరువు 70 కేజీలు. సోము అనారోగ్యం పాలై రోజురోజుకూ నీరసించి పోతున్నాడు. 70 నుండి 69 కీ, తర్వాత 68కీ, ఇంకా 65 కేజీలకూ తగ్గాడు. తూకంలో ఇద్దరి మధ్య తొలుత వుండే 5 కేజీల తేడా 10 కేజీలకి దిగజారింది. ఇంతలో ఒకరోజు రాము కూడా అనారోగ్యం పాలై, బరువు తగ్గాడు. రాము రెండు కేజీల బరువు తగ్గాడు. ఆరోజు తూకం వేస్తే రాము బరువు 73 కేజీలుంది. సోము బరువు అరవై నాలుగున్నర కేజీలు ఉంది. ఇద్దరి బరువుల మధ్య తేడా ఎనిమిదిన్నర కేజీలు ఉంది. నిజానికి సోము కూడా మరింత నీరసించి మరో అరకేజీ తగ్గాడు. ఇద్దరి మధ్య తేడా ఎనిమిదిన్నర కేజీలకు మారింది. ఒకవేళ సోము బరువు తగ్గకుండా 65 కేజీల వద్ద యధాతధంగా ఉందని అనుకుందాం. అప్పుడు కూడా ఇద్దరి మధ్య తేడా 10 కేజీలకు బదులు 8 కేజీలే ఉన్నట్లు లెక్క! పోల్చి చెప్పే లెక్క వేరు. పోల్చకుండా చెప్పే లెక్క వేరు. ఇది నిజానికి సోము బలపడినట్లు ఎలా అవుతుంది?
గత శుక్రవారం రూపాయి బలపడ్డ ఘన చరిత్ర కూడా పైన పేర్కొన్న సోము పరిస్థితి వంటిదే.
అమెరికా ట్రజరీ ఈల్డ్స్ గత గురువారం ఎక్కువ స్థాయిలో పతనమైనది. ఆ కారణంగా బ్రిటీష్ పౌండ్, EU యూరో, జపాన్ యెన్, స్విస్ ఫ్రాంక్ ల విలువతో పోల్చితే అమెరికన్ డాలర్ విలువ తగ్గింది. ఆ సమయంలో అమెరికా డాలర్ బలుపు ఒకింత తగ్గింది. భారత రూపాయి విలువ పెరిగిందని మురిసి పోయేది కాదు.
దీనివల్ల డాలర్ @ ₹80 శీర్షిక తో రాసే నా సీరియల్ కి ప్రాసంగీకత తగ్గదని మిత్రులకు స్పష్టం చేస్తున్నా. దానికి గల ప్రాధాన్యత యధావిధిగా ఉంటుందని స్పష్టం చేస్తున్నా.
బిజినెస్ పేజీల్ని చదివే మిత్రులు, ఆర్ధిక వ్యవస్థ పరిశీలక మిత్రులు రూపీ విలువ పెరుగుతోందని ఎంతో కొంత అపోహపడే అవకాశం ఉంది. అందుకే ఈ చిన్న వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా.