నేటి వాన కవిత

ప్రకృతి పరవశించిన వేళ!

*****

పచ్చని చీర
కట్టుకున్న ప్రకృతి కొప్పులో
ఎర్రటిపూలు తురిమినట్టు
ఎంత అందంగాఉందో కదా ఈ తావు!
గుబురుగా అల్లుకున్న కొబ్బరి చెట్లు
చల్లగా వీచే పిల్లగాలులు
వీచే గాలి కుదుపులకు
ఉలిక్కిపడి లేచే పక్షుల అలికిడులు!

ఎంత రమ్యంగా ఉందో ఈ తావు!
ఇటుగాపోయే వాళ్ళకెవరికైనా
కళ్ళుకుట్టు వలసిందే!
ముగ్ధమనోహర సౌందర్య రాశిలాఉన్న ఈ దారి
చూపరుల్లో చైతన్యం నింపవలసిందే!

ఎంత సొబగులు కురిపిస్తుందో ఈ దారి!
అలరించే పక్షుల కిలకిల రావాలు
మంత్ర ముగ్ధులను చేసే
ప్రకృతి కాంత సందడులు
మైమరపించే పూల పరిమళాలు!
ప్రమోద పారవశ్యం లో
గిరికీలు కొట్టే మనసు దోబూచులు!
ఇటుగా వెళ్ళేవారిలో ఏవో ఉద్విగ్న భావనలు!

ఇక్కడ కాసేపు ఆగితే చాలు
నయనాలనిండా హరితవర్ణాలు అల్లుకుంటాయి!
మనసునిండా తన్మయింపజేసే ఆలోచనలు విచ్చుకుంటాయి!
గుండెలనిండా ప్రకృతి అందాలు ఆవహిస్తాయి!

ఈ అందాలను ఇప్పుడే
చూపుల్లో నింపుకుంటాను!
దోసిటపట్టి తనివితీరా జుర్రుకుంటాను

డా.గూటం స్వామి
(9441092870)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *