(టి.లక్ష్మినారాయణ)
తోటపల్లి కాలువల ఆధునీకరణ పనుల సాధన సమితి ఆధ్వర్యంలో నేడు (జూలై 12) బూర్జా మండలం కొల్లివలస గ్రామంలో నిర్వహించిన రైతుల సదస్సులో ప్రసంగించాను. సదస్సుకు కా.అప్పల నాయుడు అధ్యక్షత వహించారు. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రముఖ న్యాయవాదులు, పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.
సదస్సులో ప్రసంగించడానికి ముందు వంశధార నదిపై నిర్మించబడిన గొట్టా బ్యారేజీని, ఎడమ ప్రధాన కాలువను, హీరమండలం రిజర్వాయరును, వంశధార – నాగావళి నదుల అనుసంధాన పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న కాలువను, నారాయణపురం ఆనకట్టను, ఒనిగడ్డ రిజర్వాయరు క్రింది చివరి ఆయకట్టు కాలువల వ్యవస్థను సందర్శించి, వివరాలను తెలుసుకున్నాను.
ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు:
1. వంశధార – నాగావళి నదుల అనుసంధాన పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర దృష్టి లోపించింది. వంశధార నది నుండి అనుసంధాన కాలువ నిర్మాణాన్ని చేపట్టి, వెన్నెలవలస గ్రామం సమీపం నుండి కాలువను దిగువ స్థాయిలో తీసుకెళ్ళి నారాయణపురం ఆనకట్ట వద్ద నాగావళి నదిలో కలపడం ద్వారా ఆశించిన సత్ఫలితాలు లభించవని రైతాంగం బలంగా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు న్యాయబద్ధంగా ఉన్నాయి.
2. వెన్నెలవలస గ్రామ సమీపం నుండి దాదాపు పది కి.మీ పొడవున ఎగువ భాగంలో, కొండల అంచున కాలువను నిర్మించి, ఒనిగడ్డ రిజర్వాయరులో నీటిని చేర్చడం ద్వారా బుర్జా మండలంలో 18,000 ఎకరాలకు సాగునీటి సదుపాయం కలుగుతుంది. ఒనిగడ్డ రిజర్వాయరు క్రింద ఉన్న 7,000 ఎకరాలు, నాగావళి నదిపై వినియోగంలో ఉన్న ఆరు ఓపెన్ హెడ్ కాలువల క్రింద ఉన్న 8,000 ఎకరాల స్థిరీకరణకు మరియు 3,000 ఎకరాల నూతన ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయడానికి అనువుగా ఉంటుంది. వంశధార – నాగావళి నదుల అనుసంధాన పథకంలో ఈ మౌలికమైన మార్పు అంశంపై తక్షణం రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగంలో నిష్ణాతులైన ఇంజనీర్లతో అధ్యయనం చేసి, సముచితమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.
3. వంశధార నదిపై నిర్మాణంలో ఉన్న రెండవ దశ ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న మొదటి భాగం నిర్మాణం ద్వారా 62,280 ఎకరాలకు మరియు వరద కాలువ నిర్మాణం ద్వారా 45,000 ఎకరాల కొత్త ఆయకట్టు మరియు ఎడమ, కుడి ప్రధాన కాలువల క్రింద 2,10,510 ఎకరాల స్థిరీకరణ లక్ష్యంగా నిర్దేశించుకోబడింది. అందులో భాగంగా 19 టియంసి నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మాణంలో ఉన్న హీరమండలం రిజర్వాయరు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.
4. ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వంశధార నదీ జలాల వినియోగంపై కుదిరిన ఒప్పందం మేరకు నదిలో లభించే 115 టియంసి నికర జలాల్లో సగభాగం అంటే 57.50 టియంసి.లను గొట్టా బ్యారేజ్ వద్ద ఆంధ్రప్రదేశ్ నీటి వాటాగా కేటాయించబడినా, ఆ మేరకు నీటిని సంపూర్ణంగా వినియోగించు కోవడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. వంశధార నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ తీర్పు కూడా ఆంధ్రప్రదేశ్ కు అనుకూలంగా ఉన్నది. రాజకీయ సంకల్పంతో ఒడిస్సా రాష్ట్రంతో చర్చల ప్రక్రియను త్వరితగతిన కొలిక్కితెచ్చి, వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం పూనుకోవాలి.
5. నాగావళి నదిపై నిర్మించిన తోటపల్లి బ్యారేజీ ద్వారా 64,000 ఎకరాల పాత ఆయకట్టు ప్రయోజనాలను పరిరక్షించడానికి మరియు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో కొత్తగా 1,20,000(అదనంగా గజపతినగరం బ్రాంచి కెనాల్ ద్వారా 15,000 ఎకరాలు) ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యాన్ని నిర్దేశించుకోబడింది. ఆ లక్ష్యాలను చేరుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. పాత కాలువల ఆధునీకరణ పనులను ప్రభుత్వం తక్షణం పూర్తి చేయాలి. బ్యారేజీ నుండి నీటి విడుదలకై నిర్మించిన తూముల సామర్థ్యాన్ని పెంచాలి. తద్వారా ప్రాజెక్టుకు ఎడమ వైపున ఉన్న 9 ఓపెన్ హెడ్ పథకాలు, కుడి వైపున ఉన్న మూడు ఓపెన్ హెడ్ పథకాల క్రింది ఆయకట్టు స్థిరీకరణకు చర్యలు చేపట్టాలి.
6. బాబు జగజ్జీవన్ రాం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అమలులో రాష్ట్ర ప్రభుత్వం క్షమించరాని జాప్యం చేస్తున్నది. 63.2 టియంసి గోదావరి జలాలను తరలించి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 3.21 లక్షల ఎకరాలు, విజయనగరం జిల్లా 3.94 లక్షల ఎకరాలు, శ్రీకాకుళం జిల్లాలో 85,000, మొత్తం 8,00,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రూపొందించిన పథకానికి నిధులు మంజూరు చేసి, యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణకు పూనుకోవాలి.
7. వెనుకబడ్డ ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణంపై రాజకీయ సంకల్పంతో ప్రభుత్వం పూనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 మేరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన రాయలసీమ – ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకంలో అంతర్భాగంగా సాగునీటి పారుదల ప్రాజెక్టులకు నిధులను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలి.
8. నదీ జలాల సద్వినియోగానికి, ప్రాజెక్టుల సాధన కోసం, రైతాంగ సమస్యల పరిష్కారానికి, రాజకీయ అనుబంధాలకు అతీతంగా రైతాంగం, ప్రజలు ఉద్యమబాట పట్టాలని సదస్సులో విజ్ఞప్తి చేశాను.
టి.లక్ష్మీనారాయణ
సాగునీటి రంగం విశ్లేషకులు