నిజంగానే నేను సిగ్గుపడుతున్నా
నేను నిజంగానే సిగ్గుపడుతున్నా.
కాకతీయుల కళావైభవం
పేర రాచరికానికి పట్టం
గట్టి సైనికపటాలంతో
కళా రూపాల ప్రదర్శనలతో చిందు లేస్తున్న
సిగ్గిడిసిన పాలకుల చూసి
నేను సిగ్గుపడుతున్నా.
అత్యద్భుతమైన
కాకతీయుల కళా సంపదలు
నేల కూలినా పట్టించుకోని
నెనరు లేని పాలకుల చూసి నేను సిగ్గుపడుతున్నా.
ఎవరు అవునన్నా
కాదన్నా ఖరాఖండిగా
కాకతీయ వంశపు
రాజేనని
కమల్ చంద్ర భంజ్ దేవ్ ను రప్పించి పూలవర్షం గుప్పించి గులాముల్లా వంగీ వంగి
మోకరింతలు జరిపిన
ఆత్మ గౌరవం లేని
అజ్ఞాన పాలకుల చూసి
అదే పనిగా నేనుసిగ్గుపడుతున్నా
ఓరుగల్లుకే తలమానికమైన
వేయి స్థంభాల గుడి
కళ్యాణ మండపం నిర్మాణం
దశాబ్ధాలు గుడిస్తున్నా
పూర్తి చేయక మాటలకే
పరిమితమైన
పనికి రాని పాలకుల చూసి
నేను సిగ్గు పడుతున్నా.
వరంగల్ కోటలు
బీటలుబారి
కూలిపోతున్నా
కందకాలన్నీ
కబ్జాలవుతున్నా
పట్టించుకోని
కబోది పాలకుల జూసి
నేను సిగ్గుపడుతున్నా.
ప్రపంచ వారసత్వ సంపదగ
గుర్తించిన రామప్ప గుడి ఘణపురం కోట గుళ్ళ అభివృద్ధికి
ఆమడ దూరంగా జరిగిన
అధ్వాన్న పాలకుల జుసి
నేను నిజంగా నే
సిగ్గు పడుతున్నా.
—-నల్లెల్ల రాజయ్య
హనుమకొండ