ఊరంటే ఊరే
***
నీలిమబ్బులు
మెరపుచరుపులు చరుస్తూ
చిరుజల్లులు కురిపిస్తున్నప్పుడు
మా ఊరు కొత్త ఊపుతో
కళ్ళు నులుముకుంటూ లేస్తుంది!
తడిసిన మాఊరి అందాలు చూడాలంటే రెండుకళ్ళు సరిపోవు!
మబ్బులు కమ్మిన ఆకాశం
మా ఊరును తడిపి ముద్దచేస్తున్నవేళలో చూస్తే
అచ్చం ముతైదువులా ఉంటుంది!!
జల్లు స్నానం చేస్తూ
వయ్యారాలు పోతుంది!
ఊళ్ళో కొబ్బరి చెట్లు రోడ్లకు గొడుగులౌతాయి!
నల్లని తారురోడ్లు నిగనిగలు పోతాయి!
ఇంటి చూరుల్లో దాచిన గొడుగులు ముస్తాబైపోతాయి!
బంగ్లాపెంకుటిళ్ళు తలంటు స్నానం చేసిన పడతుల్లా సింగారాలుపోతాయి!
మా ఊళ్ళోని ఇంటి అరుగులు ఆటస్థలాలౌతాయి!
తొలకరి చినుకులు పడిన రోజు
ఆరుద్ర పురుగుల హడావిడి చూసి
రైతుల ముఖాల్లో కనిపించే చిరునవ్వులు
ఎన్ని డబ్బులు ఇస్తే చూడగలం?
ఊరంటే మాదే!
ఊసులన్ని మాతోనే పెనవేసుకుంటాయి!
ఊహలన్ని మాలోనే పొదిగొని ఉంటాయి!!
డా.గూటం స్వామి
(9441092870)