కుల సమస్యపై విప్లవ కమ్యూనిస్టుల దృక్పథం 

 

 [ భారత విప్లవ పంథా రూపకర్త  కామ్రేడ్ దేవులపల్లి వేంకటేశ్వర రావు రచనల నుండి సంకలనం. కామ్రేడ్ డి. వి.1-06-1917 న జన్మించారు.12-07-1984 న మరణించారు. 105 వ జయంతి సందర్భంగా ఈ వ్యాసం]

                                                              

డాక్టర్. యస్. జతిన్ కుమార్

 

భారతీయ కమ్యూనిస్టులు కుల సమస్యను విస్మరించారని ఒక ప్రచారం జరిగింది, ఆ అభిప్రాయం  చుట్టూ అనేక సిద్ధాంతాలు అల్లబడ్డాయి. ఆరోపణలు చేయబడ్డాయి. కొంతమంది కమ్యూనిస్టులు ఆ ఆరోపణలు నిజమని ఒప్పుకుంటారు కూడా. కాని అది పూర్తిగా నిజం కాదు. కామ్రేడ్ దేవులపల్లి వేంకటేశ్వరరావు కు [డి.వి.] కుల సమస్య గురించి చాలా ముందుగానే అవగాహన ఉండేది. కుల భేదం లేకుండా పీడిత వర్గాలను మిలిటెంట్ పోరాటాలుగా ఏకం చేయడంపైనే ఆయన దృష్టి సారించారు.

ఆయన  తన విశిష్ట  రచన “భారత జనతా ప్రజాతంత్ర విప్లవం  కార్యక్రమం, ఒక వివరణ” లో కుల సమస్యను కొంత విపులంగా ప్రస్తావించారు. [కమ్యూనిస్టు విప్లవకారులపై ప్రభుత్వం పెట్టిన చారిత్రాత్మక హైదరాబాదు కుట్ర కేసు విచారణ సందర్భంలో హైదరాబాద్ అడిషనల్ సెషన్స్ జడ్జి కోర్టులో- కామ్రేడ్ డి. వి. 1971 డిసెంబర్14-18 మధ్య చదివి వినిపించిన ప్రకటన అది. ఇది విప్లవ కమ్యూనిస్టుల కార్యక్రమం, ఎత్తుగడల వివరణ. అందువల్ల ఇది కోర్టు స్టేట్ మెంటు గా ప్రసిద్ధి పొందింది] భారతీయ చరిత్ర, పురాణాలు, సమాజాలని నిశితంగా అధ్యయనం చేసిన వ్యక్తిగా, సాధారణ ప్రజలతో సంవత్సరాల తరబడి సహజీవనం చేసిన వ్యక్తిగా, కుల సమస్యను చాలా నిశితంగా, లోతుగా అధ్యయనం చేశారు. ఆయన అభిప్రాయాలు, అనేకమంది ఇతర నాయకుల వలె పాశ్చాత్య దేశాల నుండి దిగుమతి అయిన గత సిద్ధాంతాలకు లేదా కమ్యూనిస్టు సిద్ధాంతాలకు పరిమితమై లేవు. ఆయన కుల సమస్యను నిష్పాక్షికం గా చూశారు. ఆయన కులం గురించి విడిగా ఒక గ్రంథాన్ని రాయలేదు, కాని అనేక రచనల లో ఈ ప్రశ్నపై తన అవగాహనను స్పష్టం గా ప్రకటించారు. . 

కులవ్యవస్థ ఆవిర్భావం గురించి ఆయన ఇలా అంటారు. “భారత దేశంలోని  అన్నీ ప్రాంతాలలోను కుల వ్యవస్థ వుంది. చారిత్రకంగా చూస్తే, ఇవన్నీ ఆదిమ కాలం నాటి తెగలూ, ఉప-తెగలూ అని చెప్పవచ్చును. ఇవి క్రమంగా కులాలుగా రూపొందాయి. బానిస సమాజంలో కులాలు ఉన్నాయి. ఫ్యూడల్ వ్యవస్థలో అవి కొనసాగుతూ వచ్చాయి…. సామ్రాజ్యవాదం కొంతవరకు దాని స్వరూపాన్ని మార్చినదే కాని స్వభావాన్ని మార్చలేదు.”  [ పేజీ xxxv ముందుమాట “భారత జనతా ప్రజాతంత్ర విప్లవం కార్యక్రమం, ఒక వివరణ” ద్వితీయ ముద్రణ 1981 జూన్ ).

ఇది ఒక ముఖ్యమైన పరిశీలన, దీనిపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆయనకు  ఈ అభిప్రాయం  చాలాకాలంగా వుంది, అయితే  ఇది మే 1981 నాటి తన ముందుమాటలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చారిత్రక వాస్తవాలపై ఆధారపడని, అశాస్త్రీయమైన, కులం పుట్టుకకు సంబంధించిన మరికొన్ని ఇతర సిద్ధాంతాలను ఇది త్రోసి పుచ్చుతుంది. నాలుగు కులాల వ్యవస్థ గురించి అస్పష్టమైన ఆలోచనా విధానాన్ని, సంస్కరణలను ఆయన తోసి పుచ్చారు. రాజ వంశాలు వున్నాయి కానీ రాజ కులాలు లేవని, దళిత వర్గాలు, ఎస్టీలతో సహా అన్ని కులాలకు చెంది న రాజులు, పాలకులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. బ్రిటిష్ పాలన కుల సంస్థలను, కుల సంస్కరణోద్యమాలను ఎలా ప్రోత్సహించిందో ఆయన చెబుతారు.

Devulapalli Venkateswara Rao (DV)

కేవలం ఒక స్థిరమైన, స్తబ్దమైన అంశం కాదు. సమాజ జీవనంలో దానికి ఒక గతి శీలత వుంది. దాని చలనంలో, మార్పుల క్రమంలో  ఇమిడి వున్న సామాజిక, రాజకీయ కులతత్వాన్ని కామ్రేడ్ డి.వి. చూశారు. .

దశాబ్దాల తరబడి ఉద్యమాలకు నాయకత్వం వహించిన విప్లవకారుడిగా, ముఖ్యంగా లక్షలాది గ్రామీణ ప్రజలతో కూడిన వ్యవసాయ విప్లవానికి నాయకత్వం వహించిన విప్లవకారుడిగా, రాజకీయ నాయకుడిగా, 1957-62మధ్య  లోక్ సభ సభ్యుడిగా ఆ తర్వాత భారతదేశ ఎన్నికల, రాజకీయ వ్యవస్థలను నిశితంగా పరిశీలించిన వ్యక్తిగా, కులం క్రమంగా,మరింత నగ్నంగా, సిగ్గు మాలినదిగా, సామాజిక, రాజకీయ కులతత్వం గా మారటం ఆయన గమనించారు.  భారత విప్లవానికి ఒక కార్యక్రమాన్ని, మార్గాన్ని అభివృద్ధి పరచడానికి భారతదేశపు నిర్దిష్ట పరిస్థితులకు మార్క్సిజా న్ని అన్వయించిన వ్యక్తిగా, ఒక పెద్ద కాన్వాస్ పై కుల సమస్యను ఆయన చాలా ఎక్కువగా పరిగణనలోకి తీసుకున్నా రు. వివిధ రివిజనిస్టులు, ట్రేడ్ యూనియనిస్టులకు భిన్నమైన దృక్పథంతో.ఆయన కుల సమస్యను వీక్షించారు. 1940 ల నుండి ఆయన  రచనలు  ఆయన దృక్పథాన్ని  ప్రతిబింబిస్తాయి.

 ప్రజల పోరాటాలు జనగాం తాలూకా నుండి నల్గొండ జిల్లావ్యాప్త ఉద్యమంగా విస్తరించిన సమయంలో, కామ్రేడ్  డి.వి. ప్రజలలో చేసిన  తన విప్లవాత్మక కృషి ఆధారంగా,1944-46 నుండే సవివరమైన ఫీల్డ్ రిపోర్టులను రచించి ప్రచురించారు. జనగాం(తాలూకా) ప్రజల వీరోచిత పోరాటాలు [1945లో], నల్గొండ (జిల్లా) ప్రజల వీరోచిత పోరాటాలు [1946 లో], హైదరాబాద్ సంస్థానంలో వెట్టి చాకిరి (1946 లో ) వంటి నివేదికలు వీటికి  ఉదాహరణలు. ఈ రచనలలో ఆయన కుల మనే అంశాన్ని తగిన ప్రాధాన్యతతో ప్రస్తావించారు. 

1940వ దశాబ్దపు ఈ నివేదికల్లో వివిధ కులాలకు చెందిన గ్రామీణ పేదలు ఎలా దోపిడీకి గురయ్యారో నిర్దిష్టమైన, ఉదాహరణలు ఉన్నాయి. తెలంగాణ భూస్వామ్య వ్యవస్థలో, మొత్తం కుల వర్ణపటం అంతటా, పై నుండి క్రిందికి, వారు భూస్వామ్య విధానం ద్వారా దోపిడీకి గురై అణచివేతకు గురయ్యారు. సంస్కరణ వాద గాంధేయ దృక్పథం కంటే భిన్నంగా,ఆయన కులాన్ని మరింత లోతుగా చూసారు.అత్యంత హేయమైన రూపాలలో,అస్పృశ్యత కంటే స్పష్టమైన క్రూర లక్షణాలతో, కులం, కులతత్వం చాలా హానికరమైనవిగా వుండటం ఆయన  ఎత్తి చూపారు. 

ప్రచురించిన  కొద్ది రోజులలోనే నిజాం నిషేధించిన 100 పేజీల జనగామ ప్రజల వీరోచిత పోరాటాలు అన్న ప్రచురణ లో కొన్ని స్పష్టమైన ప్రస్తావనలు ఉన్నాయి. గొల్లలు, కుమ్మరి, మంగలి. వడ్డెర, ఎరుకల, గౌండ్ల, హరిజన తదితర అనేక కులాలకు చెందినవారిపై జమీందారుల పీడన, అణచివేత, దోపిడీ ఎలా సాగిందో గ్రామాల వారీగా వివరించారు. ప్రజలు ప్రారంభించిన ప్రతిఘటనను కూడా చిత్రీకరించారు. నల్గొండ ప్రజల వీరోచిత పోరాటం అనే పుస్తకంలో అమరజీవి దొడ్డి కొమరయ్య మరణం [4 జులై 1946] నుండి 1946 చివరి వరకు చెలరేగిన పోరాట జ్వాలలను నివేదించారు. ఆ సమయం లో, మల్లారెడ్డి గూడెం గ్రామంలో నిజాం సాయుధ దళాలతో జరిగిన తీవ్రమైన సాయుధ ఘర్షణను వివరిస్తూ  “దీనిలో ఐదుగురు మరణించారు. ధనిక రైతు ఎరబోలు అప్పిరెడ్డి, యాదవ కులాని కి చెందిన ముంగి వీరయ్య, హరిజన యువతులు  గురవమ్మ, తొండమ్మ, అంకాలమ్మలు నేలకొరిగారు.  ముగ్గురు దళిత మహిళా అమర వీరుల గురించి  కామ్రేడ్ డి.వి. ప్రత్యేకంగా “వారు తెలంగాణ ఝాన్సీలు, చాంద్ బీబీలు.”అని రాశారు  అన్నికులాల ప్రజలలో వువ్వెత్తున చెలరేగిన ఆందోళనలు, విరుచుకు పడ్డ పోలిస్, మిలిటరీ దాడులను ఈ నివేదిక వివరిస్తుంది.     

1946 లో ప్రచురించిన “హైదరాబాద్ సంస్థానంలో వెట్టి చాకిరి” అనే పుస్తకంలో, గ్రామాలలో వుండే వృత్తిపనులవారు ఏవిధంగా వెట్టిచాకిరికి గురి అయ్యిందీ వివరించారు. కొన్ని జాతుల వారిని బలోతాదారులని నిర్ణయించి అధికారులు దౌరా కు వచ్చినప్పుడు, వీళ్ళు బరువులు మోసుకుపోవాలని నిర్బంధించేవారు. వీరికి తగిన ప్రతిఫలమూ వుండేది కాదు.”గిర్దావర్లు, పోలీస్ సబ్ యినస్పెక్టర్లు మొదలుకొని జవానుల వరకు గ్రామాలకు ఎడ తెగకుండా వస్తూ ఉంటా రు. వారికి, రాగానే కోమటి కావలసిన సామానంతా ఇవ్వాలి… చాకలి వాళ్ళు సామాను తెచ్చి పెట్టడం, చావిడి బాగు చేయటం, కారం కొట్టడం, పిండి విసరటం, మొదలగు పనులు చేస్తారు. కుమ్మరివాళ్లు నీళ్ళు తెచ్చిపెట్టి, వంట చేసి  లేక చేసేవాడుంటే సహాయంగా ఉంటాడు. మంగలి వాళ్ళు పక్కలు వేయాలి. లాంతర్లు తుడవాలి. కాళ్ళు వత్తాలి. రైతులు బండ్లు, చొప్ప ఇవ్వాలి. గొల్లలు గొర్రెలను మేకలను ఇవ్వాలి.. సారు వున్న రోజులు కోమటిండ్ల లో గోల, గొల్లయిండ్ల లో గోల, మాదిగ ఇండ్లలో గోల.. వీరున్న గ్రామపు పనిబాటల వారంతా ఎప్పుడూ వీరి పనుల లోనే ఉంటారు. పోలీస్ స్టేషనులకు గ్రామాలనుంచి రిపోర్టులు తెచ్చే హరిజనులు వచ్చినపుడల్లా కట్టెల మోపులు తేవాలి . వారు వచ్చిన తరువాత స్టేషనులలో వుండే చెట్లకు నీళ్ళు పోయించుతారు” [పుట 10,11]….ఇలా అన్నీ కులాల లోని పేదలు ఈ నిర్బంధ సేవలు చేయాల్సి వచ్చేది. 

“వెట్టి విధానంలో అందరికన్నా ఎక్కువగా బాధపడే హరిజనులు  ఇతర కష్ట జీవులతో కలసి పోరాడటానికి ముందు కు వస్తున్నప్పటికీ వారిని ఆంధ్ర మహాసభ విప్లవ కార్యక్రమం ద్వారా ఇముడ్చుకో లేకపోయింది. ఆదే కాలంలో క్రైస్తవ మిషనరీలు ముందుకు వచ్చి, క్రైస్తవ మతంలో చేరితే ప్రభుత్వ సహాయంతో వారి కష్టాలు పోగొడతామని ప్రచారం చేసి తమ పలుకుబడి క్రిందకు తెచ్చుకున్నారు. “జగిత్యాల తాలూకాలోనే 50-60 గ్రామాలు ఒక్కుమ్మడి గా క్రైస్తవమతాన్ని స్వీకరించారు.” క్రైస్తవం వీరిని జమీందారులకు వ్యతిరేకంగా సంఘటిత పరిచే కార్యక్రమం ఏదీ తీసుకోలేదు, అధికారుల ప్రాపకంతో కొందరికి వ్యక్తిగతంగా,  తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు తొలిగా యి. మిషనరీల ద్వార విద్యావంతులై కొందరు ఉద్యోగాలలో కుదురుకున్నారు. కానీ ప్రజలకు మాత్రం వెట్టి బాధ తప్పలేదు.”   [పుటలు 22,23] 

‘ఫ్యూడల్స్ ను ఎదిరించడానికి’ ‘ఇతర కులస్తులు’ చేసిన మత మార్పిడుల గురించి కూడా నివేదిక పేర్కొంది. కొన్ని గ్రామాలలో ‘హరిజనులు, (దళితులు) వెట్టి-బేగర్ మొదలైన వాటి నుండి తప్పించుకోవడానికి ఇస్లాం మతంలోకి మారిన సందర్భాలను ప్రస్తావిస్తారు.  “దీనికి నిజం ప్రభుత్వం ఆర్ధికంగాను, అధికారులతోనూ పూర్తిగా సహాయపడుట వలన ప్రచారం గూడా తీవ్రంగానే సాగింది. జనగామ తాలూకాలో చాలామంది దేశముఖుల దౌర్జన్యాలను ఎదిరించ లేక,ఇస్లాం స్వీకరించా రు. ముస్లిం మతతత్వవాదులు తమ ప్రచారాన్ని ప్రధానంగా హిందూ జమీందారులు వున్న ప్రాంతాలలోనే  కేంద్రీ కరించారు. దీనితో గాబారాపడిన  దేశముఖులు, పటేలు, పట్వారీలు ఆర్య సమాజం అండ చేరారు. వారు అనేక మందిని  ప్రచారం ద్వారానూ , ఆర్ధిక వొత్తిడి ద్వారాను, శుద్ది చేసి తిరిగి హిందువులుగా మార్చేవారు. అయినా వారికి వెట్టి చాకిరీ బాధలు పోలేదు. తుదకు అస్పృశ్యత కూడా తగ్గలేదు”

1944 నాటి మరొక నివేదిక, సంస్కరణల్లో భాగంగా తలపెట్టిన ఎన్నికలలో నిజాం అనుకూల శక్తులకు బలం చేకూరుతుందని ఆశతో నిజాం పరిపాలన, ఇస్లాంలోకి ‘హరిజనుల’ మత మార్పిడులను ఎలా ప్రోత్సహించిందో ప్రస్తావిస్తుంది. 1938 తరువాత ప్రాంతీయ ఎన్నికలలో కాంగ్రెస్ ఇతర చోట్ల విజయం సాధించిన తరువాత చేసిన రాజకీయ ప్రేరేపిత ప్రయత్నమిది. మత పాక్షికం తో కూడిన ఇస్లాం తబ్లీగ్, లేక హిందూ శుద్ధి కార్యక్రమాలు వెట్టి చాకిరీని పోగొట్టలేక జమీందారుల దోపిడీలను నిలబెట్టటానికే తోడ్పడినవి.  ఆ రోజుల్లో కూడా కుల,మత రాజకీయాల గురించి ఆయన చర్చించడం గమనార్హం.  

“సంస్థానంలో జమిందారీ ప్రభుత్వం  ముస్లిం లను వెనక వేసుకుని ప్రతి సమస్యకు హిందూ-ముస్లిం స్వరూపాన్ని ఇస్తూ, ఐక్య ప్రజా ఉద్యమాన్ని విచ్చిన్నం చేస్తూ వచ్చింది, కానీ నేడో – హిందూ-ముస్లిం ప్రజలు ఈ పోరాటంలో పాల్గొన్నారు. ముస్లింలు తమ హిందూ సోదరులతో పాటు తుపాకి గుండ్లకు ఎర అయినారు. ముస్లిం రాజ్యం అనే నినాదం  జమీందార్ల దని ,ప్రజల దృష్టిలో బూటకమని  రుజువు చేశారు” అని 1946 చివర్లో రాసిన “ నల్లగొండ ప్రజల వీరోచిత పోరాటం” పుస్తకంలో  చెప్పారు. ముండ్రాయ్ [రామవరం]  అడవి భూములను వరి పొలాలుగా మార్చుకుని 4-5 తండాలుగా నివసిస్తున్న  60-70 మంది లంబాడీ రైతు కుటుంబాలను ఆ గ్రామానికి  చెందిన కడారు రామచంద్రరావు, నరసింహారావ్  భూస్వామి, మాలి పటేల్ ఏ విధంగా పీడించినదీ, భూమికోసం జరిగిన సంఘర్షణను ఆయన వివరంగా చిత్రించారు.

 వివిధ కులాలు, మతాలు అవి చూపించిన పరిష్కారాలు విఫలమవ్వటాన్ని కామ్రేడ్ డి. వి. ఆనాడే గమనించి, గుర్తించి ; భూస్వామ్య వ్యతిరేక, దోపిడి వ్యతిరేక  విప్లవ పోరాటాలు మాత్రమే  ఈ మౌలిక సమస్యలను పరిష్కరించగలవని దృఢంగా చాటి చెప్పారు .

 కులం- వర్గం సంబంధాల పరిశీలనలో- బ్రాహ్మణులు, పురోహితులు, వైశ్యులలోని పేదలు కూడా వెట్టి (జీతం లేని శ్రమ, సేవలు) చేయవలసి రావడం వంటి వాటితో సహా బలాత్కారానికి గురవుతున్నారని గమనించారు. నిజాం పక్షాన, సంస్కరణ వాదంతో నిలబడిన దళిత కులీనులు కూడా ఉన్నారని ఆయన రాశారు. క్లుప్తంగానే అయినా   అప్పుడు చెప్పబడిన అభిప్రాయాలు, అయన  పుస్తకాలనుండి నేర్చుకున్నవి కావు; ప్రజా జీవిత అనుభవాలనుండి  గ్రహించినవి. ఆయన వాస్తవాల నుండి సత్యాన్ని అన్వేషించే పద్ధతిని అవలంబించారు. ఆయన పరిశీలనలు నిర్దిష్ట వాస్తవికతల నుండి ఉద్భవించాయి.

 తెలంగాణ ప్రజల సాయుధ పోరాట కాలంలో గడించిన అనేక అనుభవాలను క్రోడీకరిస్తూ ఆయన ఇలా రాశారు.  “ప్రారంభం నుండి  భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజల్లో నూటికి నూరుపాళ్లు ఐక్యత వుంటూ వచ్చింది. సాయుధ పోరాట దశలోను, అంతకు పూర్వమూ ఈ స్థితి వుండేది… బహిరంగ సభలలోనే కాక ,సంఘ కార్యకలాపాలలోనూ అంతా కలసిమెలసి పాల్గొనేవారు. .. అస్పృశ్యతను పాటించడం కూడా చాలావరకు తగ్గిపోయింది. తరచుగా ప్రభుత్వ సాయుధ దళాలు దాడులు చేస్తూ ఉన్నందున ప్రజల జీవితమంత ఇంటి వెలుపలనే గడి చేది. ఎక్కడ నీళ్ళు దొరికితే అక్కడ చేరి భోజనాలు చేయవలసి వచ్చేది. ఈ పోరాట జీవితంలో కుల భేదాలు మరచి అంతా ఐక్య మయ్యారు. ఇలాంటి ఐక్యతను సాధించటంలో కమ్యూనిస్టు పార్టీ ,ఆంధ్ర మహా సభలు చేసిన నిర్విరామ కృషి పాత్ర చాలా వుంది. [ఆ పోరాటం తరువాత వచ్చిన విభజనలు రాజకీయ కారణాల వల్ల వచ్చినవే కానీ కుల విభేదాల వలన కాదు] ఉన్నత ఆశయాల కోసం ప్రజలను ఉద్యమం లోకి సమీకరించినప్పుడు వారు కుల భేదాలను తగ్గించుకుని, మరచి ఐక్యమవుతారు.”    

 1971 ”కోర్టు స్టేట్‌మెంట్” ఒక ప్రత్యేక న్యాయస్థానంలో, హైదరాబాదు కుట్ర కేసు  విచారణలో చదివి వినిపించి నప్పటికీ, దానిలో  కులవ్యవస్థ మీద ఒక ప్రత్యేక  అధ్యాయం వున్నది. ఆ ప్రత్యేక విభాగంలో కుల రాజకీయాలు, కుల సిద్ధాంతాల గురించి  ఆయన చర్చించడం గమనార్హం. ఆ తర్వాత 1981 జూన్ పునర్ముద్రణలో ఆ గ్రంధానికి చేర్చిన తన ముందుమాట లో- కుల వ్యవస్థ పట్ల సమీక్షను, మరికొంత పరిశీలనను జత చేశారు. అయన కులం- వర్గం మధ్య దగ్గరి సంబంధాన్ని చూశాడు.1971లోనే ఆయన ఇలా వ్రాశారు :

“ గ్రామీణ ప్రాంతాల్లో కుల వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థతో ముడిపడి ఉంది. ఒక్క కులానికి చెందినవారు  భూస్వాము లుగా వుండటం, ఇతర కులాలకు చెందినవారంతా లేక వారిలో అధిక భాగం పేదరైతులు, వ్యవసాయ కూలీలుగా వుండటంవల్ల  భూస్వాముల పెత్తనం తరచుగా అగ్రవర్ణాల పెత్తనం గా పరిణమించింది. ఈ భూస్వాములు అగ్రవర్ణాల లోని మధ్యతరగతి, పేదరైతులను తక్కిన [ఇతర కులాలలోని]మధ్యతరగతి, పేద రైతులతో, వ్యవసాయ కూలీలతో భూస్వాములకు వ్యతిరేకంగా ఐక్యం కాకుండా ఆప గలుగుతున్నారు. వారిని చీల్చగలుగుతున్నారు. ఇదే విధంగా  ప్రతి కులానికి చెందిన ప్రజా సామాన్యం ఆ కులంలోని పై వర్గాల పలుకుబడి లో ఉంటుంది. భూ స్వామ్య వర్గం కుల  వ్యవస్థను రాజకీయ అవసరాలకు కూడా ఉపయోగిస్తోంది. భూస్వాములు, కులపెద్దలు లేక కులంలో ఒకరిద్దరు గా వుండే ధనిక, మధ్య తరగతి వ్యక్తులను చేరదీసి వారి ద్వారా ఓట్లను సంపాదించ ప్రయత్నించడం సర్వ సామాన్యం”  (పుట.229,భా.ప్ర.విప్లవం 1981 ముద్రణ).

ఆయనది  ముందే ఏర్పరచుకున్న ఒక సైద్ధాంతిక లేక పిడివాద దృక్పథం కాదు. పాలక వర్గాలచే ప్రభావిత మైన, రూపకల్పన చేయబడిన కుల డైనమిక్స్ గురించి  కూడా ఆయన చర్చించారు. “ఫ్యూడల్  వ్యతిరేక విప్లవం ద్వారా కుల వ్యవస్థను రద్దు చేయవలసిన పెట్టుబడిదారీ వ్యవస్థ మన దేశంలో అటువంటి పాత్రను నిర్వహించలేదు. .. ఇక సామ్రాజ్య వాదం రాజులు, మహారాజులతోపాటు వారి కులాలను కూడా తన ప్రయోజనాలకు వాడుకుంది. కుల ప్రాతిపదిక పై సైన్యాల నేర్పరచి వారి సాయం తో  ఇతర కులాల కు చెందిన రాజులను ఓడించి  వారి రాజ్యాలను  ఆక్రమించుకున్నది. ఆ సైనికులకు ఇతర కులాల రాజులను పీడిస్తున్నా మనే అంశమే తప్ప బ్రిటీష్ సామ్రాజ్యాన్ని విస్తరించి బలపరుస్తున్నామనే అంశమే తెలియదు” అంటూ కులతత్వం పాలకులకు ఎలా ఉపయోగపడిందో చెప్పారు     

 రాజ్యాంగం, చట్టం, కులతత్వం, ఎన్నికల రాజకీయాల ద్వారా రాజకీయ కులతత్వం ఎలా బలపడుతోందో డి.వి. సవివరంగా రాశారు. కొందరు ఇతర రచయితల మాదిరిగా ఆయన కులతత్వాన్ని, అస్పృశ్యతను సమానం చేయ లేదు.: “భారతీయ సమాజంలో కుల వ్యవస్థ నేటికీ కొనసాగుతోంది. దీనికి పరాకాష్ట గా అస్పృశ్యత అమలులో  ఉంది.”   కులంపై విభాగం ఈ మాటలతోనే ప్రారంభమవుతుంది.(పుట 229, భా. ప్ర. వి. 1981 పునర్ముద్రణ) తర్వాత ఆయన ఒక వాక్య౦ వ్రాశారు : ” మతవ్యవస్థతోపాటు, కుల వ్యవస్థ కూడా సామ్రాజ్యవాదానికి. ఫ్యూడలిజా నికి వ్యతిరేక౦గా ప్రజలు ఐక్యం కావటానికి అవరోధంగా వుంటూ వచ్చింది.” సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కూడా అదొక అడ్డంకి గా వుందని ఆయన రాశారు.  

కుల వ్యతిరేక పోరాటాన్ని చేపట్టాల్సిన అవసరాన్ని డి.వి తోసిపుచ్చారా ?

“కులవ్యవస్థ పట్టణాలలోను, పల్లెలలోను వేళ్ళూనుకొని యున్నది”  అని ఆయన స్పష్టంగా చెప్పారు.ఇది కేవలం భూస్వామ్య అవశేషం మాత్రమే కాదు. నేటి పాలకుల చేతిలో ఆయుధం కూడా. కులం యొక్క డైనమిక్స్ మరియు స్థితి స్థాపకతను ఆయన నొక్కి చెప్పారు. దశాబ్దాలుగా, శతాబ్దాలుగా మత, సామాజిక, రాజకీయ, శాసన, చట్టపర మైన, సాంస్కృతిక మొదలైన అంశాల  సంస్కరణలు కులతత్వాన్ని నిర్మూలించలేకపోవడమే కాకుండా, అస్పృశ్యత లాంటి దాని పరమ అమానవీయ వ్యక్తీకరణను నిర్మూలించడం లో కూడా విఫలమయ్యా యని ఆయన గుర్తు చేశారు. 

 ఆయన అస్పృశ్యతను నిషేధించే చట్టంగురించి -“గాంధీ అస్పృశ్యతా నివారణ కు చేసిన కృషి విఫలమైనట్లే  భారత పార్లమెంటు దీనికై చేసిన చట్టాలు కూడా అమలు లోనికి రాకుండా పోయినాయి” (పుట 229, 1981 పునర్ముద్రణ)  అని రాశారు. భారత రాజ్యాంగం, చట్టాల ప్రభావం గురించి, ఆయన ఇది రాశారు.  

కుల వివక్ష తగ్గిపోయిందని, భారత రాజ్యాంగం అందరికీ సమాన  అవకాశాలు కలిగిస్తోందని పాలకులు ప్రచారం చేస్తుంటారు.  ఎస్సీలలో చాలా మంది ప్రముఖులు ఉన్నారని పాలక వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా, సమైక్య ఆంధ్రప్రదేశ్ కు 1960-62లోనే దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఉన్నారు. ఆ తర్వాత ఒక దళిత రాష్ట్రపతి, ఒక ఉప ప్రధాని, ఒక దళిత మహిళా సిఎం, కేంద్ర, రాష్ట్ర హోంమంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు, అత్యున్నత న్యాయ స్థానా  ల్లోని న్యాయమూర్తులు, వీసీలు, యూజీసీ ఛీప్ వంటి ఉన్నత పదవులతో సహా పలు వురు సీఎంలు ఉన్నారు. భారత రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించిన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, న్యాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయా కులాలలోని కొందరు వ్యక్తులు పదవులు, ఉద్యోగాలు పొందటం చూపి కులమంతా అభివృద్ధి చెందినది అని చెప్పటం భ్రమలు కల్పించటమే అవుతుంది.ఈ సందర్భంలో, ఒక వాస్తవికత ను గుర్తుచేస్తూ, భారత రాజ్యం యొక్క స్వభావాన్ని, విప్లవాత్మక ప్రత్యామ్నాయం యొక్క ఆవశ్యకతకు విరుద్ధంగా సంస్కరణవాద ప్రయత్నాలను ప్రస్తావిస్తూ, డి.వి. ఇలా రాశారు :”అస్పృశ్యతా నిర్మూలనకు, వెనుకబడిన తరగతు ల ఆర్థికాభివృద్ధికి సంబంధించి రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు, సామాన్య ప్రజానీకానికి సంబంధించినంత వరకు అమలు కావడం లేదు.”

విశ్వవిద్యాలయాలలో అభివృద్ధి చెందుతున్నకులతత్వ ధోరణుల గురించి  1981 నాటి తన ముందుమాటలో  డి.వి. ఇలారాశారు:“విద్యావంతులలో కుల ఉన్మాదం పెచ్చు పెరిగి పోతున్నది. విద్యార్థులు కులాలుగా చీలి ఘర్షణ పడటం ఒక సాధారణ దృశ్యంగా మారింది. విశ్వవిద్యాలయ అధ్యాపకులలో (లెక్చరర్లు మరియు ప్రొఫెసర్లు) కుల సంఘాలు ఏర్పడ్డాయి. వారు వర్గ ప్రాతిపదికన ఏర్పడుతున్నారని ఎవరైనా చెబితే, వర్గపోరాటం అంటే ఏమిటో వారికి తెలియ దని చెప్పాలి. పాలకవర్గాలకు వ్యతిరేకంగా పోరాడటానికి ఐక్య శక్తిగా ఎదగడానికి బదులుగా, వారు కుల ప్రాతిపదిక న చీలిపోయి ప్రభుత్వానికి సహాయం చేస్తున్నారని స్పష్టంగా తెలియదా?”  “వర్గ పోరాటాల నుండి ప్రజలను మళ్లించ డానికి ప్రభుత్వం ప్రజలను కులతత్వం అనే బురదలోకి లాగింది. ఈ ఉద్దేశ్యంతోనే కులసంస్థలకు (హాస్టళ్లు మొదలైన వి) ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. అలాంటప్పుడు అవి వర్గ సంస్థలుగా ఎలా ఉండ గలవు?” అని ఆయన ప్రశ్నించారు.

కామ్రేడ్ డి.వి. ప్రస్తావించిన కులాల ఆధారిత గృహనిర్మాణం, హాస్టళ్లు, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు ఉపకార వేతనాలు మాత్రమే కాకుండా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం వంటి వాటి పేరిట ఎస్సీ, బీసీలకు ప్రత్యేక పాఠశాల లను ఇటీవల కాలంలో ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ 10-12 సంవత్సరాల పాఠశాల విద్య కొరకు విద్యార్థులను అలా వేరు చేసినట్లయితే, తద్వారా సమాజానికి ఎలాంటి సందేశం అందుతుంది?ఇది కుల నిర్మూలనకు మార్గమా లేక కుల శక్తుల పటిష్టీకరణకు మార్గమా? ప్రభుత్వం ఎవరికి తోడ్పాటునిస్తోంది?

ఆయన ఇంకా  ఇలా రాశారు : “ఒక నిర్దిష్ట కులంలో ఒక గ్రామంలో దోపిడీకి గురయ్యే వారు ఎక్కువగా ఉంటే, మరొక గ్రామంలో (లేదా గ్రామాలలో) అదే కులం ఆధిపత్య, దోపిడీ వర్గాలను కలిగి ఉంటుంది. ఇలాంటివారు ఒకరిద్దరు కాదు. గణనీయ మైన సంఖ్యలో ఉన్నారు.( కామ్రేడ్ డి.వి.ఇక్కడ ఉదాహరణలు ఇవ్వకపోయినప్పటికీ, యాదవ సేన, కుర్మీ సేన, వన్నియార్ ముఠాలు  మొదలైనవి గ్రామీణ పేదలను, ఎస్సీ, ఎస్సీయేతర కులాలను, వేటాడటాన్ని సంబంధిత బహుజన రాజకీయాలను ఈ సందర్భంలో మనం చూడవచ్చు.)

కుల, కులతత్వ రాజకీయాలపై, దళిత్ పాంథర్ ఉద్యమంపై:

1974 లో కలకత్తా నుండి కొంతకాలం పాటు ప్రచురితమైన శ్రామికవర్గ పంథా [ప్రొలిటేరియన్ పాత్]  అనే పత్రికను  కామ్రేడ్స్ డి.వి., మోని గుహలు సంయుక్తంగా సంకలనం చేశారు. ఆ పత్రికలోని కొన్ని వ్యాఖ్య ల సారాంశం  చదివితే  డి వి. అభిప్రాయాలు మరికొన్ని విస్పష్టంగా తెలుస్తాయి. దళిత్ పాంథర్ ఉద్యమం గురించి వ్యాఖ్యానిస్తూ- కుల, కుల తత్వ రాజకీయాల గురించి కామ్రేడ్ డి.వి. వివరించారు. కుల ఉద్యమాలు ఇప్పుడు నూతన రూపాలతో, కొత్త పేర్లతో కొత్త సంస్థలుగా నిరంతరం పుట్టుకొస్తున్నాయి. అయితే వాటి స్వభావం దాదాపు ఒకటిగానే వుంటున్నది. కనుక వీటిని అర్ధం చేసుకోవటంలో నాడు కామ్రేడ్ డి. వి. చేసిన విశ్లేషణ ఉపయోగకరంగా వుంటుంది.

భూస్వామ్య వ్యవస్థ, దాని వ్యక్తీకరణయిన కుల వ్యవస్థ  మనుగడ భారతదేశంలోని ప్రస్తుత రాజకీయ వ్యవస్థతో ముడిపడి ఉంది. మన దేశంలో అర్ధ బానిసత్వం, అర్ధ భూస్వామ్య సంబంధాలకు ఆర్థిక పునాది ఉంది. వ్యవసాయ కూలీలు, పేద రైతులు, పారిశ్రామిక శ్రామికులు ఉన్న గ్రామీణ, పట్టణ పేదలలో అధిక సంఖ్యాకులు హరిజనులు (అస్పృశ్యులు) అని పిలువబడే కొన్ని కులాలకు చెందిన వారు. ఇవి గణనీయమైన సంఖ్యలో వున్నాయి.  కుల తత్వం యొక్క వెన్నెముక ఈ సమాజంలోని ఉన్నత వర్గాల అవసరాలలోఉంది. ఉన్నత వర్గం రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకోసం కుల విభజనను వినియోగిస్తోంది. కాబట్టి భూస్వామ్య వ్యవస్థను నిర్మూలించడం కుల విభజనను, అస్పృశ్యతను నిర్మూలించ డానికి అవసరమైన మొదటి కర్తవ్యం. అందువల్ల వ్యవసాయ విప్లవం అవసరం….

[కొన్ని దౌర్జన్యకర] సంఘటనలు తరచుగా నిమ్న కులాలు అని పిలువబడే వారిపై అగ్రవర్ణాలు చేసిన దురాగతా లుగా వర్ణించబడతాయి. నిజమే,భూస్వాములు తమ రాజకీయ అధికారాన్ని, ఆర్థిక ఆధిపత్యాన్ని ఉపయోగించి పేద వర్గాలను విడదీయ గలిగారు. అలా౦టి దౌర్జన్యాలకు పాల్పడే ఉద్దేశ౦తో వారు అగ్రవర్ణాలకు చె౦దిన బీదలను అ౦టే తరచూ తమ స్వ౦త కులాలను ఉపయోగి౦చుకోగలుగుతున్నారు. కులతత్వం అనే అంశం ఈ వర్గాలన్నింటి లోనూ ఉన్నప్పటికీ, అవి ప్రధానంగా గ్రామీణ పేదలపై భూస్వాములు చేసే దౌర్జన్యాలు… ఈ ఘర్షణలను కులాంతర శత్రుత్వాలుగా వర్ణించడమంటే, పరిస్థితులు పరిణతి చెంది,సాగవలసిన వ్యవసాయ విప్లవం నుంచి ప్రజల దృష్టిని మరల్చడమే” 

అప్పుడు  కామ్రేడ్ డి.వి., డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ను, ఆయన వారసులను, వారి అవకాశవాదాన్ని, మహారాష్ట్రలో దళిత్ పాంథర్స్ రూపంలో ఉద్భవిస్తున్న మిలిటెంట్ ధోరణిని ప్రస్తావించారు.

“బొంబాయిలో పోలీసులు, అగ్రవర్ణాల పేద వర్గాలకు వ్యతిరేకంగా దళిత్ పాంథర్స్ చేసిన ప్రతిఘటన మన దేశంలోని మొత్తం ప్రజల దృష్టిని ఆకర్షించిన తాజా సంఘటన. అస్పృశ్యతకు వ్యతిరేకంగా తనదైన శైలిలో సంఘ సంస్కరణో ద్యమం సహాయంతో పోరాడిన డాక్టర్ అంబేడ్కర్ జన్మస్థలం మహారాష్ట్ర. కుల విభజనను వ్యతిరేకించే బౌద్ధమతాన్ని తమ మతంగా స్వీకరించాలని ఆయన తన అనుచరులకు సలహా ఇచ్చారు. ఒక గణనీయమైన విభాగం వెంటనే అంగీకరించి దానిని స్వీకరించింది. రిపబ్లికన్ పార్టీలో డాక్టర్ అంబేడ్కర్ అనుచరులు ఉన్నారు. పార్లమెంటరీ పార్టీగా, అది అవకాశవాదానికి, కెరీరిజానికి బలైపోయింది, కాంగ్రెస్స్ దాన్ని చీల్చివేయగలిగింది తద్వారా అది  లెక్కించదగిన శక్తి గా లేదు. యువ తరం లోని ఒక వర్గం అమెరికాలోని బ్లాక్ పాంథర్స్ తరహాలో దళిత పాంథర్స్ గా రూపుదిద్దుకుంది. ఆ దేశంలో శ్వేతజాతీ యులు అనుసరిస్తున్న జాతి వివక్షకు వ్యతిరేకంగా నీగ్రోల  ఉద్యమం ఇది.”  దళిత్ పాంథర్స్ విధాన ప్రకటనలు, కార్య కలాపాలను గమనించి, కామ్రేడ్ డి.వి. ఇలా వ్యాఖ్యానించారు. 

“దళిత్ పాంథర్స్ కులమతాలకు అతీతంగా అణచివేతకు గురైన వారి ఐక్యత కోసం, అగ్రవర్ణాల హిందువులు, పోలీసుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మిలిటెంట్ ప్రతిఘటనను ప్రదర్శిస్తున్నారు. సెంట్రల్ బొంబాయిలో పార్లమెంటు ఎన్నికలను వారు బహిష్కరించారు. అందువల్ల వారు పోలీసు అణచివేతల రూపంలో కాంగ్రెస్ ఆగ్రహాన్ని ఎదుర్కో వలసి వచ్చింది. ఇవి వారి పాలసీ యొక్క స్వాగతించదగిన లక్షణాలు. పాలకవర్గాల పట్ల, ప్రజాస్వామిక విప్లవం పట్ల తమ వైఖరిని వారు ఇంకా స్పష్టం చేయలేదు.” 

“పాలక వర్గాలు, వారి పార్టీ (కాంగ్రెస్) చేతులు ముడుచుకుని  ఖాళీగా కూర్చోవడం లేదు. వారు దళిత్ పాంథర్స్ నాయకత్వాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారు దాని సంస్కరణ వాద, కుల స్వభావాన్ని నిలుపు కోవాలని కోరుకుంటారు, అయితే దళిత పాంథర్లలో అధిక సంఖ్యాకులు ఒక విప్లవాత్మక పంథా కోసం చూస్తున్నారు. అధికార పార్టీ కుయుక్తులకు వ్యతిరేకంగా వారు అప్రమత్తులయి ఉండాలి .”

“ప్రస్తుత రాజకీయ వ్యవస్థ కొనసాగినంత కాలం సంఘ సంస్కరణోద్యమాలు, చట్టబద్ధమైన రక్షణలు పీడిత కులాలను ఎన్నటికీ విముక్తం చేయలేవని అనుభవం చూపించింది. ఎందుకంటే  ఈ వ్యవస్థ  విదేశీ ప్రయోజనా లను, భూస్వాముల మధ్య ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించిన వారి స్థానిక ఏజెంట్లను కాపాడుతుంది.”అని వారు గుర్తించాలి. ఒక విప్లవాత్మక కార్యక్రమాన్ని, విధానాన్ని అవలంబించి, అణచివేతకు గురైన ప్రజల విముక్తి కోసం, కుల తత్వాన్ని నిర్మూలించడానికి కృషి చేస్తున్న విప్లవ శక్తులతో వారు ఏకం కావాలి.

వ్యవసాయ విప్లవం – భారతదేశంలో జనతా ప్రజాతంత్ర విప్లవ అక్షాన్ని ఏర్పరుస్తుంది, దీని కోసం విప్లవ కమ్యూనిస్టులు పనిచేస్తున్నారు. వ్యవసాయ విప్లవం మాత్రమే గ్రామీణ పేదలను భూస్వామ్యం నుండి విముక్తం చేయగలదు. కులాలు, మతాలకు అతీతంగా పట్టణ ప్రాంతాల్లోని అణచివేతకు గురైన వారందరినీ ఏకం చేసే ఒక విప్లవాత్మక కార్మికవర్గ ఉద్యమం పట్టణ పేదల విముక్తికే కాక వ్యవసాయ విప్లవానికి కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అస్పృశ్యులు అత్యంత పీడితులైన వారు, పేదలలో ప్రధాన భాగం కావడం వల్ల పేదలలో కీలక పాత్ర పోషించవలసి ఉంది.

1974లో  కామ్రేడ్.డి.వి. ప్రస్తావించిన పాలకవర్గాల ప్రలోభాల వల్ల యూపీ, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, తమిళ నాడు మొదలైన రాష్ట్రాల్లోని అంబేడ్కర్ వాదులు ప్రలోభాలకు గురై, ఎలా చిక్కుల్లో పడ్డారో మనం మునుపెన్నడూ లేనంత స్పష్టంగా చూడగలం. వారు ఒకవంక  ప్రగతిశీల వాదులనబడే వారితోనూ, మరోవంక బ్రాహ్మణ వాదులుగా పిలువబడే శక్తుల తోనూ చేతులు కలిపారు. బిఎస్ పి కాంగ్రెస్ తోనే కాకుండా యుపి లో బిజెపితో కూడా ఒకటి కంటే ఎక్కువ సార్లు చేతులు కలిపింది. ఆర్ పి ఐ వర్గాలు, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులు కొందరు కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ మరియు బిజెపి నేతృత్వంలోని ఎన్ డిఎతో చేతులు కలిపారు. వారిలో కొందరు బిజెపిలో కూడా విలీన మయ్యారు. బిహారులోనూ ఇలాటి స్థితి వుంది. దళిత్ పాంథర్స్ కు చెందిన కొందరు నాయకులు కూడా శివసేనకు చెందిన దురభిమాన, ఉన్మాద హిందుత్వ పులులతో చేరారు. కాంగ్రెస్, బిజెపి రెండూ కూడా బుద్దిజం, సిక్కు మతంలోకి  మారిన వారికి రిజర్వేషనలు కొనసాగించమనీ  హిందుత్వ కార్డును ఉపయోగిం చాయి, కాని క్రైస్తవ మతం లేదా ఇస్లాం మతంలోకి మారిన వారికి ఈ సౌకర్యాలు నిరాకరించబడ్డాయి. కొంతమంది అంబేద్కరిస్టులు, ఈ ప్రభావంలో పడి, మత పరివర్తన చెందిన దళితులకు రిజర్వేషన్ల ను వ్యతిరేకించారు. ఇటువంటి సందర్భంలో, రెండు వైపులా నిజమైన శక్తుల మధ్య ఐక్యత కోసం  కామ్రేడ్ డి.వి. కొన్ని సూచనలు చేశారు 

“ఓట్లు, పార్లమెంటు, చట్టసభల్లో ప్రాతినిధ్యం, ఉద్యోగాలు, ఇతర సౌకర్యాలు మొదలైన వాటి కోసం కులతత్వాన్ని ప్రోత్సహించడంలో పార్లమెంటరీ పార్టీలన్నీ తమ వంతు పాత్ర పోషిస్తాయి. అటువంటి పార్టీల నుండి కులతత్వాన్ని నిర్మూలించాలని ఆశించడం అత్యాశ. వారు (దళిత్ పాంథర్స్) మన దేశంలో పనిచేస్తున్న విప్లవ శక్తులతో ఏకం కావాలి.” అని ఆయన అన్నారు. 

భారతదేశంలోని విప్లవకారుల మొదటి, ప్రధాన కర్తవ్యం ఏమిటంటే, ఈ పీడిత వర్గాలను ఒక విప్లవోద్యమంగా సంఘటితం చేయడం, నిజమైన సామ్రాజ్యవాద వ్యతిరేక, భూ స్వామ్య వ్యతిరేక సూత్రం ఆధారంగా ఎక్కడ ఏ కార్యక్రమం  నిర్వహించినా వారితో ఏకం కావడం. విప్లవకారులు-అగ్రవర్ణాలు లేదా అగ్రవర్ణాల అణచివేతకు  వ్యతిరేకంగానే కాదు,అన్ని రకాల అణచివేతలను వ్యతిరేకించడమే కాకుండా, ప్రతిఘటించడమే కాకుండా, అణచివేతకు గురైన వారు తమ విమోచన మార్గం విప్లవ మార్గంలోనే ఉందని గ్రహించడానికి సహాయపడతారు

***

 కామ్రేడ్ డి.వి. తన మరణానికి కొద్దికాలం ముందు 1984 మేలో ఆంధ్ర జ్యోతి తెలుగు దినపత్రికకు ఒక అరుదైన మీడియా ఇంటర్వ్యూ ఇచ్చారు. దాని నుండి కుల సమస్యకు చెందిన భాగాలను చూద్దాం 

సాయుధ పోరాటంలోకి ప్రజలను సమీకరించేటప్పుడు ఎదురయ్యే సమస్యలను గురించి కామ్రేడ్ డి.వి ఈ క్రింది విధంగా వివరించారు : “మా పంధా లోని  ముఖ్యమైన అంశం ఏమిటంటే, భూమి కోసం పోరాటానికి, సాయుధ పోరాటానికి అవినాభావ సంబంధ ముందనేది. రాజ్యాంగంపై భ్రమలు తొలగిన తరువాత మాత్రమే ప్రజలు సాయుధ పోరాటంలోకి వస్తారు. ఏ ఒక్క కులాన్నో లేదా ప్రజలలో ఏదో భాగాన్నో ఆధారం చేసుకుని సాయుధ పోరాటం చేయ లేము. ఆనాటి కీ, ఈనాటి కీ ప్రజలలో విభజన ఉంది. ప్రజలలో విభజనలు రెండు రకాలు. మొదటిది  రాజకీయ మైన విభజన. రెండవది కుల ప్రాతిపదిక గల విభజన. కుల విభజన, దానంతట అదే ప్రమాదకరం కాదు. కానీ కులతత్వం ప్రమాదకరమైనది. గత 35 సంవత్సరాలలో ఈ కులతత్వం పెరిగింది. ప్రముఖ ఆంగ్ల సాహిత్య దిగ్గజం శామ్యూల్ జాన్సన్ జీవిత చరిత్రకారుడు జేమ్స్ బోస్వెల్ ఇలా అన్నాడు, “రాజకీయాలు ఒక నీచుడి ఆఖరి శరణ్యం. “. మన పరిస్థితుల్లో మనం “కులతత్వం ఒక రాజకీయ నీచుడి  మొదటి అస్త్రం” అని చెప్పాలి. కులతత్వం ఉన్నందు న, ప్రజలను ఏకం చేయడం సాధ్యం కాదని చెప్పే ఒక సిద్ధాంతం ఉంది. కానీ ఇది తప్పు. ప్రజా ఉద్యమాల ద్వారా మనం కులతత్వాన్ని అధిగమించగలం.

కమ్యూనిస్టులలో కూడా కులతత్వం పనిచేస్తోందా?అన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన అవునంటూ, 1962లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన పోటీని ఉదహరించారు,“…. అంతకు ముందు జరిగిన రెండు ఎన్నిక ల్లోనూ మంచి మెజారిటీతో గెలిచిన పార్టీ అభ్యర్థి కులం ప్రాతిపదికన ఓట్లు వేయడంతో ఓటమి పాలయ్యారు.” అని చెప్పారు. “ఇప్పుడు కులాల మధ్య కూడా విభజన ఉంది. ఉదాహరణకు బందరు నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు ‘కాపు’ కులానికి చెందిన వ్యక్తులను ఎన్నుకున్నాయి. ఇది ఆయా కులాలలో కూడా విభజనకు దారి తీస్తోంది. 

విప్లవకారులలో కూడా కులతత్వం పనిచేస్తోందా అన్న ప్రశ్నకు కామ్రేడ్ డివి ఈ క్రింది విధంగా వివరించారు 

“… సిపిఐ, సిపిఎం లలో కులతత్వం బాహాటంగా పనిచేస్తోందని అందరికీ తెలుసు. యం. ఎల్. గ్రూపులు  దీనికి మినహాయింపేమీ కాదు-సి.పి.[చండ్ర పుల్లారెడ్డి] విభజన సమయంలోనూ, తరువాతా కులతత్వాన్ని ఉపయోగించారు.. కొండపల్లి (సీతారామయ్య) గ్రూపు (పిడబ్ల్యుజి)లో కూడా ఈ సమస్య ఉంది.ఈ మేరకు సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. వెనుకబడిన కులాలలో పేద ప్రజలు ఉన్నందున, ఈ కులాలకు చెందిన వారంతా  విప్లవకారులని, పై కులాల వారు విప్లవకారులు కారని వారి సిద్ధాంతం. వారి దృష్టిలో భూస్వామి అంటే పై కులాల  వ్యక్తి, విప్లవ వర్గాలంటే వెనుకబడిన కులాలు అని అర్థం. వారు ఈ సిద్ధాంతంతో పార్టీని నిర్మిస్తున్నారు.ఇది తప్పు. రాడికల్స్ దీనిని సిద్ధాంతీకరించారు, సి.పి. అలా చేయలేదు. కానీ ఆచరణలో మాత్రం అదే విధంగా అమలు చేస్తున్నారు. మేము ఈ సిద్ధాంతాలకు మద్దతు ఇవ్వడం లేదు. … ఒక వ్యక్తి భూస్వామి అయినప్పటికీ, అతను తనను తాను ఆ వర్గ బాహ్యం [declass ] చేసుకుంటే, అతను విప్లవకారుడు కాగలుగుతాడు. 

 పెట్టుబడిదారీ విధానం ప్రవేశించిన తరువాత, ఒక బ్రాహ్మణుడు ఇక బ్రాహ్మణుడు గా వుండడు. ఒక కమ్మఅతను   కమ్మతనుగా ఉండడు. ఏ కులంలోనైనా అన్నివర్గాలు ఉంటాయి. వెనుకబడిన కులాలు మరియు షెడ్యూల్డ్ కులాలలో కూడా భూస్వాములను చూడవచ్చు. మేము వర్గాలను, కులాలను సమానం చేసి చూడము. సంఖ్య రీత్యా చూస్తే, ఒక కులంలోఎక్కువ, మరో కులంలో తక్కువ ఉండవచ్చు.

… మా మార్గం కఠినమైనది. ప్రజలలో కుల విభజనతో వారిని ఏకం చేయడం కష్టంగా మారుతోంది. ముఖ్యంగా గత 35 సంవత్సరాలలో పాలకవర్గాలు కులతత్వాన్ని బాగా పెంచేశారు …. తెలంగాణలో హరిజన కుగ్రామాలు గ్రామాల ను ఆనుకుని ఉండేవి. కాని ప్రభుత్వం వాటిని తొలగించి గ్రామానికి దూరంగా ఇళ్ళు నిర్మిస్తోంది… కుల విభజనే కాకుండా ప్రజలలో రాజకీయ విభజన కూడా ఉంది – కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మొదలైనవి. ఈ పార్టీలన్నీ కూడా  కులతత్వాన్ని వాడుకుంటున్నాయి. విభజనలు ఉన్నప్పటికీ, మేము ప్రజలను వారి సమస్యలపై ఏకం చేయ గలుగు తాము.” ని ఆ ఇంటర్వ్యూ లో చెప్పారు. 

                                                      *********

 కామ్రేడ్ డి.వి.కి  కులతత్వం యొక్క లోతైన మూలాల గురించి బాగా తెలుసు. అణచివేతకు గురైన ప్రజలను, విప్లవ వర్గాలను, దళితులను, ఆదివాసీలను, ఇతర గ్రామీణ పేదలను విప్లవోద్యమాలు, పోరాటాల ద్వారా ఏకం చేసిన అనుభవాలను, వ్యవసాయ విప్లవాన్ని ప్రధాన కర్తవ్యంగా చేసుకొని, విప్లవ రాజ్యాధికారాన్ని ఉపయోగించు కోవాల్సిన ఆవశ్యకతను ఆయన ఈ విధంగా రాశారు , “కుల వ్యవస్థ రద్దును తన ఆధీనంలో ఉన్న సమస్త శక్తులతో అమలు చేసే ఒక విప్లవ శక్తి మాత్రమే దానిని నిర్మూలించగలదు”. కులతత్వానికి సంబంధించి శ్రామికవర్గ నియంతృత్వం  ఆవశ్యకతను డి.వి. నొక్కి చెప్పారు.

“భారత దేశం లో ఏ మూలనైనా కులతత్వమూ, కుల విభేదాలున్నంత వరకూ  గ్రామీణ ప్రజల మధ్య ఐక్యత ఏర్పడటం కల్ల.వ్యవసాయ విప్లవం విజయవంతం కావడమూ కల్ల . అయితే వ్యవసాయ విప్లవం అసంభవమూ కాదు. వ్యవసాయ విప్లవ లక్ష్యాన్ని ప్రజల ముందుంచి, దాన్ని సాధించటానికి ప్రజలను సిద్ధం చేస్తూ, విప్లవోద్యమాన్ని నిర్మిస్తూ వుంటే కుల భేదాలు అంతరిస్తూ ఉంటాయి. వ్యవసాయ విప్లవ కార్యక్రమంలో ఒక భాగంగా కులతత్వానికి వ్యతిరేకంగా సాగించే పోరాటంలో గ్రామీణ ప్రజలు ఐక్యమవుతారు. ఇదంతా సులభసాధ్యం  కాదు కానీ అసాధ్యమేమీ  కాదు”  అని ఒక వాస్తవ చిత్రాన్ని మన ముందుంచారు. అంతే కాదు “పట్టణాలే  కులతత్వ వాద సిద్దాంతాలకూ, సంస్థలకూ, పోషకులకూ కేంద్రాలని మనం గుర్తించాలి. వారి విద్యాలయాలు, హాస్టళ్లు, ఇతర సంస్థలన్నీ ఇక్కడే కేంద్రీకరించి  ఉంటాయి.” విప్లవ ప్రజాతంత్ర కార్యక్రమంతో వీరి దాడిని ఎదుర్కోవాలి. గ్రామాలలోని ఉద్యమ ప్రభావం పట్టణాల లోనూ పడుతుంది కనుక  వ్యవసాయ విప్లవ కార్యక్రమాలను పట్టుదలతో కొనసాగించాలి అని సూచిస్తారు[పుట xxxx ii -భా. ప్ర. వి.1981]

కుల సమస్య పరిష్కారమేమిటి?  విప్లవోద్యమం ద్వారా ఒక మేరకు, విప్లవం ద్వారా శాశ్వతంగా ఈ సమస్య పరిష్కార మవుతుంది. భూస్వామ్య విధానాన్ని రద్దు చేయటానికి గ్రామీణ పేదల ఐక్యత అన్న నినాదంతో  ప్రజలను సమీకరిస్తూ, విప్లవ ప్రజా ఉద్యమాన్ని  నిర్మిస్తే వారు కుల విభేదాలను తగ్గించుకుంటారు. తాత్కాలికంగా మరచి పోతారు. విప్లవం విజయవంతమైతే కొత్తగా ఏర్పడే విప్లవ ప్రభుత్వం తన [అవసరమైతే ] అధికార బలాన్ని ప్రయోగించి కులాలను పూర్తిగా రద్దు చేస్తుంది.”

ఈ మౌలిక  విప్లవ మార్గం కాదని, తాత్కాలిక విజయాలకోసం, ప్రయోజనాలకోసం అడ్డదారులలో వెళితే, ఆ సంస్కరణ లన్నీ పాలక ప్రయోజనాలను నెరవేరుస్తూ, కుల వ్యవస్థను మరింత బలీయం చేస్తాయి.

(డాక్టర్ జతిన్ కుమార్, ఆర్థోపెడిక్ సర్జన్, రచయిత, హైదరాబాద్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *