*ప్రజలు ఖర్చు తగ్గిస్తే ఆర్ధికాభివృద్ధి తగ్గదా?
*వృద్ధిరేటు పతనమైతే సంక్షోభం తలెత్తదా?
*రోగమొకటైతే మందు మరొకటిస్తే జబ్బు నయం అవుతుందా?
*తీవ్ర సంక్షోభం తలెత్తే ముందు పాట్లూ ఫీట్లూ!
-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
గృహ, వాహన, విద్యా తదితర రుణాలను బ్యాంకులు ఉదారంగా మంజూరు చేసే విధానం ఇప్పటివరకు అమలులో ఉంది. ఫలితంగా తాము తీసుకున్న రుణాలతో ఇళ్ల నిర్మాణం చేస్తే సిమెంట్, ఐరన్, స్టీల్, రియల్ ఎస్టేట్, కనస్ట్రక్షన్ వంటి రంగాల్లో వృద్ధి సాధ్యం. వాహనాలు కొంటే ఆటో మొబైల్ పరిశ్రమ వృద్ధి సాద్యం. వాటిల్లో పని చేసే కార్మికుల ఉపాధికి కారణమయ్యేది. ఇలా రకరకాల సరుకుల అమ్మకాలు పారిశ్రామిక వృద్ధికి దారి తీసేది. ఇలా ఉపాధి పెరుగుతుంది. ఆర్ధిక వ్యవస్థ వృద్ధిరేటు పెరుగుతుంది. GDP వృద్ధి చెందుతుంది. ఇదో రకం ఆర్ధిక విధానం.
పైది కూడా నికర వృద్ది కాదు. అది ఆక్స్ పామ్ నివేదికలు పేర్కొనే అధిక సంపద వ్యత్యాసాలతో కూడింది. సూక్ష్మ దృష్టిలో కనబడే బీదరికాన్ని దాచి, స్థూల దృష్టిలో కనబడే అభివృద్దిని భూతద్దంలో చూపించి ఆర్థిక వ్యవస్థ ధగధగ వెలిగి పోతుందని పాలకులు ఉదర గొట్టేది. అదే పాలకులు నేడు *వృద్ది* రూటు నుండి వైదొలగడం గమనార్హం!
పై కుహనా వృద్ధితో పాటు అసాధారణంగా ద్రవ్యోల్బణం పెరిగింది. నికర వృద్ధిరేటు క్షీణించి పాలకులతో పాటు బడా కార్పొరేట్ వర్గాల్ని నేడు కునుకు పట్టనివ్వడం లేదు. 2009 లో *ప్రతి ద్రవ్యోల్బణం* (డిఫ్లేషన్) దశకి వెళ్లిన ఆర్ధిక వ్యవస్థ మొన్నటి వరకు అదుపు లో ఉంది. అది నేడు కట్టు తప్పుతోంది. నిజానికి పెట్టుబడిదారీ నియమం ప్రకారం *ఇంఫ్లేషన్* & *డిఫ్లేషన్* ల మధ్య చక్కర్లు కొట్టడం సహజం. అది అక్కడే ఆగక 1970 నాటి *స్టాగ్ ఫ్లేషన్* వైపు దారి తీస్తుందనే కొత్త ప్రమాదకర హెచ్చరికలు నేడు వినిపిస్తున్నాయి.
ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఆర్ధిక సంక్షోభం వైపు అడుగులు వేస్తోంది. అది 2008 ఆర్ధిక సంక్షోభ దశ వైపు అడుగులని ఇంతవరకు అనుకున్నది. 1929 మహామాంద్యం వైపు అడుగులు వేస్తోన్న వార్తలు కొత్తవి. 40ఏళ్ల తర్వాత ఈ ఏప్రిల్ లో అమెరికాలో ద్రవ్యోల్బణం 8 శాతం దాటింది. బ్రిటన్ పరిస్థితి కూడా అదే. EU, అమెరికా సహా బలిసిన ఆర్ధిక వ్యవస్థల నుండి నేడు వినిపించే వార్తలు ఆందోళనకరమైనవే. భారత ద్రవ్యోల్బణం కూడా తెల్సిందే.
పెట్టుబడిదారీ వర్గాలకు *సరుకు* ప్రాణం వంటిది. దాని తయారీ, అమ్మకాలే సర్వస్వం. ద్రవ్యోల్బణ నియంత్రణ పేరిట తమకి ప్రాణం వంటి సరుకుల అమ్మకాల పై నియంత్రణ విధించుకునే చర్యల్ని అవి నేడు చేపట్టే కొత్తస్థితి ఏర్పడింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేపట్టే అసాధారణ వడ్డీ పెంపు చర్యల్ని చూసినా, భారత రిజర్వు బ్యాంకు (RBI) చేపట్టే వడ్డీ రేట్ల పెంపు చర్యల్ని చూసినా, ఇదే నిజాన్ని వెల్లడిస్తోంది.
రుణ పరపతి ద్వారా ఖర్చు పెట్టించే పాలసీ ఇంతవరకూ కొనసాగింది. బదులుగా పొదుపు పాలసీకి పెద్దపీట వేసే కొత్త ఆర్ధిక విధానాన్ని నేడు అమలు చేస్తోంది.
సరుకుల్ని కొనుగోలు చేయించాలంటే, జనానికి సులభ వడ్డీకి రణాల్ని ఇప్పించేది పాత విధానం. ఉదారంగా రుణాలిచ్చి ఖర్చు చేయించే పాత విధానానికి బదులు పొదుపుకి పెద్దపీట వేసే కొత్త విధానం నేడు RBI చెపడుతోంది. తమవద్ద దాచుకున్న ₹10 లక్షలకు తోడు ₹40లక్షలు తక్కువ వడ్డీకి అప్పుచేసి ఇల్లు నిర్మాణం ఆశ నిన్నటిది. నేడు వడ్డీరేటు పెరిగాక ఎక్కువ వడ్డీతో అప్పు తీసుకునే కంటే ఇంటి నిర్మాణం యోచన ఆపుకోవడం నేటిమాట! తన వద్ద ₹10 లక్షల్లో అధిక ధరల వల్ల సగం ఆవిరైనా మిగిలిన ₹5 లక్షల్ని ఎక్కువ వడ్డీ ఆశకి పొదుపు చేసుకోవడం రేపటి మాట! ఇలాగే కారు ఇతరత్రా కొనే వారిస్థితి కూడా ఇలాంటిదే! ఇలా తక్కువ వడ్డీకి అప్పు చేసి ఖర్చుచేసే విధానం నుండి ఎక్కువ వడ్డీకై బ్యాంకులో పొదుపు చేసుకునే వైపు నడిపించే ఆర్ధిక విధానం యిది.
నిజానికిది సమాజంలో అధిక శాతం నిరుపేద, పేద వర్గాల ప్రజల మాట కాదు. మధ్యతరగతి, అధికాదాయ ఉద్యోగ వర్గాల మాట మాత్రమే.
ద్రవ్యోల్బణం అరికట్టే పేరిట బూర్జువా ఆర్ధిక వేత్తల చిట్కాలోకి వద్దాం. నేడు RBI చేపట్టే కొత్త విధానం అదే.
ప్రజలతో ఖర్చు తగ్గించి, పొదుపు చేయించి, వస్తు కొనుగోళ్లు తగ్గిస్తే, వాటి ధరలు తగ్గిపోతాయి. ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఆర్ధిక వ్యవస్థ గాడినపడి, రేపటి ఆర్ధిక సంక్షోభాన్ని నివారించవచ్చు. పాలక వర్గాల కుహనా సంక్షోభ నివారణ ప్రక్రియ యిది.
*వృద్ధి రేటు* పెంపుకు ప్రాధాన్యత ఇచ్చే ఆర్ధిక విధానం ఒకటి. దానికి భిన్నంగా *ద్రవ్యోల్బణం* అరికట్టేది మరో విధానం.
మొదటిది, ప్రజల చేతుల్లో నికర కొనుగోలు శక్తి లేకపోయినా వారికి బ్యాంకులతో తక్కువ వడ్డీరేట్లకు అధికంగా అప్పులు ఇప్పించేది. ఆ డబ్బుతో సరుకుల్ని కొనుగోలు చేయించేది. వస్తూత్పత్తుల్ని పెంచేది. GDP పెంచేది. నిజానికిది సామాన్య ప్రజలకు నికర కొనుగోలు శక్తి లేని స్థితిలో పొందే కుహనా అభివృద్ధి నమూనా! వారికి అప్పు ఇప్పించి వృద్ధిని సాధించే ఆర్ధిక విధానమిది.
రెండవది, వడ్డీ రేట్లు పెంచి, రుణ పరపతిని కట్టడి చేసేది. పొదుపుకి పెద్దపీట వేసేది. ఖర్చుని తగ్గించేది. సరుకుల క్రయ విక్రయాల్ని తగ్గించేది. పారిశ్రామిక ఉత్పత్తుల్ని మందకొడికి గురిచేసేది. వృద్ధి రేటు తగ్గించేది. నిరుద్యోగ శాతం పెంచేది.
వస్తువిక్రయాల జోరుతో ఇంతవరకు ద్రవ్యోల్బణం పెరిగింది. దాని తగ్గింపు పేరిట ఇప్పుడు వడ్డీరేట్లు పెంచి, రుణ పరపతిని తగ్గించి, వస్తు విక్రయాల్ని నియంత్రించే విధానమిది.
బూర్జువా అర్ధశాస్త్రం వంటబట్టిన పండిత వర్గాలు చూపే పరిస్కార మార్గాలు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవి. ఒకరోజు ప్రజలు *ఎక్కువ ఖర్చు* చేయాలంటారు. వాళ్లే మరోరోజు *తక్కువ ఖర్చు* చేయాలంటారు. ఒకరోజు *ఖర్చుకి పెద్దపీట* వేయాలని అంటారు. ఇంకోరోజు *పొదుపుకి పెద్దపీట* వేయాలని అంటారు. ఓరోజు *వడ్డీరేట్లకి కోత* పెడతారు. మరోరోజు *వడ్డీరేట్లకి పెద్దపీట* వేస్తారు. వారు ఒకరోజు *సరుకుల అమ్మకాల* కి పెద్దపీట వేస్తారు. ఆ తర్వాత *అమ్మకాలపై నియంత్రణ* విదిస్తారు. ఒకరోజు *వృద్ధిరేటు* సర్వస్వమని అంటారు. మరోరోజు *ద్రవ్యోల్బణ* నియంత్రణే సర్వస్వమని అంటారు. వారొకరోజు సరుకుల కొనుగోలు కై జనం ఎగబడితేనే *దేశం వెలిగిపోయినట్లు* అని అంటారు. మరోరోజు సరుకులపై జనం మోజు తగ్గితేనే ద్రవ్యోల్బణం తగ్గి సంక్షోభ ప్రమాదం నుండి *దేశ ఆర్థిక వ్యవస్థకి రక్షణ* ఉంటుందనే కొత్త మాట చెబుతారు. వారికి నికర విధానం వుండదు.
రిజర్వ్ బ్యాంకు (RBI) మే 4 తర్వాత తిరిగి జూన్ 8న మళ్లీ రెపో రేటు పెంచింది. 35 రోజుల్లో రెండోసారి. బూర్జువా ఆర్ధిక శాస్త్ర పండితుల దృష్టి *ఖర్చు నుండి పొదుపు* వైపు మళ్లింది. *వృద్దిరేటు పెంపు* వైపు నుంచి *ద్రవ్యోల్బణం కట్టడి* వైపు నడపడమే.
RBI ఆధ్వర్యంలో దేశ ఆర్థిక విధానం సమీక్షించే ఆర్ధిక విధాన కమిటీ (MONETERY POLICY COMMITTEE) 2026 తర్వాత ఏర్పడింది. దాన్ని MPC అంటారు. అది RBI గవర్నర్ సహా ఆరుగురి సభ్యుల కమిటీ.
22-5-2020న రెపోరేటు 4.4% నుండి 4% కి MPC తగ్గించింది. నాటి నుండి రెండేళ్లు గడిచింది. రెండు నెలలకోసారి MPC సమీక్ష చేస్తుంది. వరసగా 11 సార్లు MPC సమీక్షల్లో రెపో రేట్ల సవరణ జోలికి వెళ్ళలేదు. 2022 ఏప్రిల్ లో మూడు రోజులు చర్చ చేసింది. ఐనా MPC లో ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా రెపోరేటును 4% వద్ద ఉండాలని ఓటు చేశారు. జూన్ మొదటి వారంలో MPC మీటింగ్ జరగాలి. హఠాత్తుగా మే 4న సమావేశమైనది. రెండేళ్ల తర్వాత పాత ఆర్ధిక విధానానికి స్వస్తి పలికి, రెపోరేటు పెంపుకు పూనుకుంది. పొంచిఉన్న ఆర్ధిక సంక్షోభ భయమే ఈ వైపు నడిపింది. మే చివరలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ పై ₹,లక్ష కోట్ల రాబడిని వదులుకొనే కేంద్ర ప్రభుత్వ వైఖరికి కూడా కారణమదే.
రెపోరేటు బట్టి బ్యాంకు వడ్డీ రేటు వుంటుంది. రుణపరపతి పెంచాలన్నా తగ్గించాలన్నా MPC తో RBI నియంత్రిస్తుంది. RBI ద్వారా పాలక వర్గాలు నియంత్రిస్తాయి. వాటిని తెర వెనుక నుంచి బడా కార్పొరేట్ వ్యవస్థ నియంత్రిస్తుంది. అవి తుది పరిశీలనలో ఆర్ధిక వృద్ధిరేటు పెంపుదలకి ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటే, ప్రజలతో ఎక్కువ ఖర్చు చేయించే చర్యలకు ప్రాధాన్యత ఇస్తాయి. ఫలితంగా కుహనా వృద్ధి రేటు పెరుగుతుంది. ఐతే ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుంది. ఫలితంగా వృద్ధిరేటులో నికరవృద్ధి క్షీణిస్తుంది. కార్పొరేట్ వర్గాలు షాక్ తింటాయి. సహజంగా ద్రవ్యోల్బణ నియంత్రణ పై పాలక వర్గాలు దృష్టి పెట్టాల్సి వస్తుంది. కావున ఖర్చుని నియంత్రించే చర్యల్ని అవి చేపడతాయి. అంటే పొదుపు పెంపుకై చర్యల్ని చేపడతాయి. ఫలితంగా రెపోరేటు పెంచుతాయి. ఇప్పుడు జరిగేది అదే!
పెట్టుబడిదారీ వర్గాలకి ముందు నుయ్యు వెనక గొయ్యు వంటి పరిస్థితి ఎదురవుతుంది. ఒకవేళ అధికంగా సరుకులు, సేవల అమ్మకం పెరిగితే, వెంటనే లాభాలు పెరిగి సంతోషం కలుగుతుంది. ఐతే ద్రవ్యోల్బణం పెరిగి, గడించిన లాభాల్లో నికర విలువ తగ్గుతుంది. లాభాలు గడించడం వల్ల కలిగే ఆనందం మిగలదు. ఆర్ధికవృద్ధి, ద్రవ్యోల్బణం పెట్టుబడిదారీ వర్గాలకు రెండు సమస్యలే మరి!
మొదటిది వికటించింది. ఇక రెండోవంతు వచ్చింది. అంటే కార్పొరేట్ వర్గాల్ని మురిపించిన వృద్ధి రేటు బెడిసికొట్టింది. ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని అరికట్టే విధానం అవసరంగా ముందుకొచ్చింది. అట్టి మరో ప్రక్రియలో భాగమే వడ్డీరేట్ల పెంపు విధానం.
RBI పాలసీలో భాగంగా BR, CRR, SLR, EBLR, రెపో రేటు, రివర్స్ రెపో రేటు వంటివి ఉంటాయి. బ్యాంకు వడ్డీ రేట్లను పెంచాలంటే, RBI తన రెపోరేటుని పెంచాలి. రెపోరేటుకి వద్దాం.
రెపోరేటును బేసిస్ పాయింట్లలో కొలుస్తారు. నూరు బేసిస్ పాయింట్లు ఒక్కశాతంతో సమానం. మే 4న RBI 40 బేసిస్ పాయింట్లు పెంచింది. అది 0.4 శాతంతో సమానం. జూన్ 8న 50 బేసిస్ పాయింట్లు పెంచింది. అది 0.5 శాతంతో సమానం. 35 రోజుల్లో 90 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇది 0.9 శాతం తో సమానం. మే 4 వరకు రెపోరేటు 4 శాతం ఉండేది. (రివర్స్ రెపోరేటు 3.35 శాతం ఉండేది.) మే 4న MPC సమీక్ష చేసి 4.4 శాతానికి పెంచింది. జూన్ 8న 4.9 శాతానికి పెంచింది. ఆ రెపోరేటు పెంపుదల పై ఆధారపడి బ్యాంకులు వడ్డీరేట్లు పెంచుతాయి. అది రుణ గ్రహీతలకు భారంగా, పొదుపుదార్లకి లాభంగా మారుతుంది.
అంతవరకూ బ్యాంకుల్లో సొమ్ము గృహ నిర్మాణ, గృహోపకరణాలు, విద్య, వంటి వాటికై కొనుగోళ్ల పేరిట రుణాల రూపంలో ప్రజల చేతికి చేరేది. అది పారిశ్రామికరంగం ఉత్పత్తి చేసే సరుకుల అమ్మకాలకి వినియోగించబడేది. అట్టి గత కుహనా ఉచ్చస్థితి క్రమంగా క్షీణిస్తుంది. బ్యాంకుల నుండి రుణ మంజూరుకి బదులు బ్యాంకుల్లోకి పొదుపు సొమ్ము చేరే పద్దతి ఇక ముందుకొస్తుంది. గత విధానానికి భిన్నమైనది.
ద్రవ్యోల్బణం అదుపులో వుంటూ, ఆర్థికాభివృద్ధి రేటు పెరగాలని బూర్జువా అర్ధశాస్త్రం బోధిస్తుంది. అది ఓవైపు వృద్ధిరేటు పెరుగుతూ; మరోవైపు ద్రవ్యోల్బణం అదుపులో ఉంచడం కత్తిమీద సాము వంటిది. ఓకేఒరలో రెండు కత్తులు ఇమడవు. వృద్ధి రేటు పెంపు, ద్రవ్యోల్బణ నియంత్రణ ఏకకాలంలో సాధ్యమయ్యేవి కాదు. తలలు పండిన బూర్జువా ఆర్ధిక వేత్తలు తల క్రిందకి, కాళ్ళుపైకి పెట్టి తపస్సు చేసినా, ఫలించనిది.
పెట్టుబడిదారీ ఆర్ధిక నియమాలు పరస్పర వైరుధ్యాలతో కూడినవి. ద్రవ్యోల్బణం, ఆర్ధిక వృద్ధి పరస్పర విరుద్ధమైనవి. వృద్ధిరేటుపై కేంద్రీకరిస్తే వెంటనే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. రూపాయ విలువ తగ్గుతుంది. పెరిగే వృద్ధిరేటులో నికరవిలువ క్షీణిస్తుంది. పోనీ అని, ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలు చేపడితే, వృద్ధి రేటు కుంటు పడుతుంది. ఉత్పత్తులు తగ్గుతాయి. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు మూతపడతాయి. నిరుద్యోగం మరింత పెరుగుతుంది. అటు వృద్ధి రేటు, ఇటు ద్రవ్యోల్బణం మధ్య పొత్తు పొసగదు. ఈ రెండింటి మధ్య కుస్తీ తప్పదు. అంతిమంగా ఆర్ధిక సంక్షోభం తప్పదు. దాన్ని తప్పించుకోవడం బూర్జువా అర్ధశాస్త్రానికి ఎప్పటికీ సాధ్యం కాదు.
ఒక మహా సంక్షోభం నేడు ప్రపంచాన్ని చుట్టు ముడుతోంది. తుఫాన్ ముందు ఎగిరే తూనీగల వంటివే నేటి అధికధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటివి. రానున్న ఆర్ధిక సంక్షోభాన్ని తప్పుకునే రకరకాల చిట్కాలలో భాగమే ప్రస్తుత రెపోరేటు పెంచే విధానం. ఇవేవీ వాటిని కాపాడలేవు.
సంక్షోభాల భారాల్ని ఏ శ్రామిక జనలో భరించాలో వారికి వీటి ప్రాధాన్యత, పర్యవసానాలు పూర్తిగా తెలియదు. స్వానుభవం ద్వారా తప్ప అధ్యయనం ద్వారా ముందుగా వారు గ్రహించలేరు. కానీ వీటికి ఏ ఆర్ధిక ప్రాబల్య వర్గాలు మూల కారణమో, వారికి బాగా తెలుసు. రేపటి ఆర్ధిక సంక్షోభ తీవ్రత, వాటి పర్యవసానాల పట్ల స్పష్టమైన అవగాహన, అంచనా బడా కార్పొరేట్ వర్గాలకు తెలుసు. వాటికి సేవచేసే పాలక వర్గాలకు తెలుసు. అందుకే ఇటీవల మత ప్రాతిపదికన ద్వేష, విభజన రాజనీతికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం పాలకులకు ఏర్పడింది. బుల్డోజర్ రాజకీయాలు ప్రజల్ని వాస్తవ సమస్యల నుండి దారి మళ్లిస్తాయి. అది వారి నసమ్మకం. కొత్తగా మరిన్ని బాబరీ మసీదుల్ని సృష్టించాల్సిన అవసరం వారికి ఉంది. రేపటి ఆర్ధిక సంక్షోభ పరిస్థితులకు సంబంధం లేని వ్యవహారాలు కావివి. భారత పాలకులకు శ్రీలంక నేర్పే పాఠాలు మరింత రాజకీయ అప్రమత్తతని బోధిస్తాయి. ముఖ్యంగా శ్రామికవర్గ విప్లవ శక్తులు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాల్సి వుంటుంది.