సీమకు డేటే ఇవ్వలే, డెల్టాకు అపుడే నీళ్లు…

 

ప్రజాచైతన్యంతోనే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు.

ఆదివారం నంద్యాల మధుమణి నర్సింగ్ హోం సమావేశ మందిరం లో నంద్యాల జిల్లా స్థాయి రైతు ప్రతినిధుల అవగాహన సదస్సు జరిగింది.

ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ..
రాయలసీమ కరువు భూమిగా మారడానికి ప్రజలలో వనరులు, సాగు, త్రాగునీటిపై అవగాహన లేకపోవడమేనని, రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం రాయలసీమ అవసరాలను తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు.

రాయలసీమ అభివృద్ధికి ఏయే నిర్మాణాలు, ప్రాజెక్టులు, ఏయే విధానాలను రూపొందించుకోవాలో అన్న విషయాలపై అవగాహన, ఆసక్తి లేని ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు ఉన్నారని విమర్శించారు.

అన్ని పంటలు పండే భూమి, వాతావరణ పరిస్థితులు అంతకు మించి కష్టపడి పనిచేసే రైతులు, రైతుకూలీలు రాయలసీమ సొంతమని ఈ పుణ్యభూమికి దుర్భిక్ష ప్రాంతం అని ముద్ర వేసారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కృష్ణా, పెన్నా , వాటి ఉపనదులు తుంగభద్ర, వేదవతి, హంద్రీ, చిత్రావతి, బహుళ, చెయ్యేరు, కుందూ నదులలో నీరు ప్రవహిస్తున్నా పాలకుల నిర్లక్ష్యం కారణంగా కరువు తాండవిస్తోందని దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

కృష్ణా నదికి ఎగువ ప్రాంతమైన రాయలసీమ రైతులకు సాగుకు నీటి విడుదల తేదీలను ప్రకటించని రాష్ట్ర ప్రభుత్వం నదికి దిగువన ఉన్న కృష్ణా డెల్టా పంటల సాగుకు రెండు రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం నీటి విడుదల చేయడం రాయలసీమ పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియచేస్తోందని దశరథరామిరెడ్డి విమర్శించారు.

కర్నూలు పశ్చిమ ప్రాంతంలో లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన తుంగభద్ర దిగువ కాలువ కేవలం నలభైవేల ఎకరాలకు మించి పారడం లేదని వివరించారు. తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ పరిస్థితి కూడా దారుణంగానే ఉన్నదని అన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాయలసీమకు చట్టబద్దంగా కేటాయించిన నీటిలో 60 శాతం నీటిని కూడా వాడుకోలేని దుస్థితిలో ఉన్నామన్నారు. కేంద్ర జలవనరుల శాఖ అనుమతుల ప్రకారం శ్రీశైలం రిజర్వాయర్ లో కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండాలని, అది పాటించక పోవడం వల్లే రాయలసీమ రైతులకు ఖరీఫ్ లో సాగునీటి విడుదల జరగడం లేదని, నదికి నీరు వచ్చినపుడు సాగుకు వదులుతామని ప్రభుత్వం ప్రకటించడం వారి చిత్తశుద్దిని, నిర్లక్ష్యాన్ని తెలియచేస్తోందని ఆయన అన్నారు.

రైతులు జూన్ మొదటి వారంలోనే ప్రతి ఏటా ఖరీఫ్ సాగుకు నీరు విడుదల చేసేలా రాయలసీమ ప్రజాప్రతినిధులను, అధికారులను రైతులు నిలదీయాలని దశరథరామిరెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. జూన్ నెల చివరి వారంలోపుగా నారు మడులు పెంచకపోతే రాయలసీమలో పండించే, నాణ్యమైన, అందరూ ఇష్టపడి తినే బి .పి.టి 5204 వరి రకానికి మెడవిరుపుతో పంట నాణ్యత, దిగుబడి తగ్గడంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు.

రాయలసీమ అభివృద్ధికి జరుగుతున్న ఆటంకాలను, సాగు, త్రాగునీటిపై రైతులు గ్రామ స్థాయిలో అవగాహన చేసుకుని చైతన్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

సిద్దేశ్వరం అలుగు నిర్మిస్తే శ్రీశైలం రిజర్వాయర్ లో ఉన్న 60 tmc ల నీటితో రైతులకు జూన్ మొదటి వారంలోనే ఖరీఫ్ సాగుకు నీటి విడుదల సాద్యమయ్యేదని అలుగు నిర్మాణం కోసం ఉద్యమం ఉదృతం చేస్తామని అన్నారు.

రాష్ట్ర విభజన చట్టంలో అనుమతులు ఉన్న తెలుగుగంగ, గాలేరు – నగరి, హంద్రీ నీవా, వెలిగొండ ప్రాజెక్టులతో పాటు గురు రాఘవేంద్ర, ముచ్చుమర్రి, సిద్దాపురం, మల్యాల ఎత్తిపోతల పథకాలకు ఏడేండ్ల అనంతరం అనుమతులు లేవనీ కృష్ణా నది యాజమాన్య బోర్డు ప్రకటించినా ఇదెక్కడి అన్యాయం అంటూ నిలదీయలేని ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు రాయలసీమలో ఉండటం దురదృష్టకరం అని దశరథరామిరెడ్డి అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విభజన చట్టంలో అనుమతులు ఉన్న అన్ని ప్రాజెక్టులకు చట్టబద్ద నీటిహక్కును కాపాడుకోవాలని దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు ఇస్తున్న 80 tmc ల నీటిని శ్రీశైలం రిజర్వాయర్ లో నిల్వ వుంచి రాయలసీమ ప్రజలకు త్రాగు, సాగునీరు సకాలంలో నీరందించాలని ఆయన డిమాండ్ చేశారు.

రాయలసీమలోని ఎనిమిది జిల్లాలలో గ్రామ, మండల, జిల్లా స్థాయి సాగునీటి సాధన సమితి సంఘాలను ఏర్పాటు చేసి రాయలసీమ ప్రజలను చైతన్యం చేసి హక్కుగా రావలసిన నిధులు, సాగునీటి సాధనకు ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు.

ఈ సదస్సులో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాద్యక్షలు వై.యన్.రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, చెరుకూరి వెంకటేశ్వరనాయుడు, రిటైర్డ్ డిప్యూటీ DEO బ్రహ్మానందరెడ్డి, రిటైర్డ్ ఆంద్రాబ్యాంక్ AGM శివనాగిరెడ్డి, సాకేశ్వరరెడ్డి, బెక్కం చిన్న రామకృష్ణారెడ్డి, రవిబాబుచౌదరి,సంజీవరెడ్డి, తిరుపాలుయాదవ్, తదితర రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *