శ్రీవారి సేవలు తగ్గింది నిజమే…కారణం ఇదే

టిటిడి ప్రకటన

శ్రీ పరిపూర్ణానంద స్వామి వారి ఆరోపణలు అర్థ రహితం

తిరుమ‌ల‌, 2022 ఏప్రిల్ 28

తిరుమల శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేశారని, వేసవిలో భక్తులకు సరైన ఏర్పాట్లు చేయలేదని శ్రీపీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామి వారు చేసిన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అది పూర్తిగా అవాస్తవం. ఈ విషయానికి సంబంధించి మీడియాలో ప్రసారమైన అవాస్తవ కథనాలను టీటీడీ తీవ్రంగా ఖండిస్తూ, భక్తులకు వాస్తవ వివరాలను తెలియజేస్తోంది.

– తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలు, కొన్ని విశేషమైన సందర్భాలలో ‘ఏకాంత తిరుమంజనం’తో సహా సంవత్సరానికి 450 సార్లు ఉత్సవమూర్తులకు ‘అభిషేకాలు’ జరుగుతాయని గణాంకాలు సూచిస్తున్నాయి.

– వీటిలో, రోజువారీ వసంతోత్సవం, వారపు విశేష పూజ మరియు సహస్ర కలశాభిషేకం మాత్రమే 415 సార్లు నిర్వహించేవారు.

– ఇలా సంవత్సరం పొడుగునా నిర్వహిస్తున్న అభిషేకాల వల్ల పురాతనమైన ఉత్సవ మూర్తుల విగ్రహాలకు ఎక్కువగా అరుగుదల ఏర్పడుతుందని భావించిన ఆలయ ప్రధాన అర్చకులు, జీయంగార్లు అభిషేకాలతో ఇమిడియున్న సహస్ర కలశాభిషేకం, విశేష పూజ, వసంతోత్సవం లాంటి ఆర్జిత సేవలను రద్దు చేసి, వార్షిక వసంతోత్సవాలతోబాటు సంవత్సరానికోసారి మాత్రమే సహస్ర కలశాభిషేకాన్ని సర్కారు గా నిర్వహించాలని తద్వారా విగ్రహాలను అరుదుగుదలనుంచి కాపాడవచ్చని సూచించారు.

– ఇలా జియ్యంగార్లు మరియు ప్రధాన అర్చకుల సలహా మేరకు ఈ సేవలను రద్దు చేసారు.

– విగ్రహాలు పూర్తిగా అరిగిపోయి వాటి స్థానంలో క్రొత్త విగ్రహాలను తయారు చేయాల్సి వస్తే పాత విగ్రహాన్ని కరిగించి అదే లోహాన్ని తిరిగి క్రొత్త విగ్రహాల తయారీకి వాడాల్సివుంటుంది. ఇది శ్రమతో, సమయంతో కూడిన పనే కాకుండా అరుదైన పురాతన విగ్రహాలను కోల్పోవలసి వస్తోంది.

– ‘అభిషేకాల’ వల్ల ఉత్సవమూర్తులు త్వరగా అరిగిపోతుండటంతో 1989లో తితిదే వార్షిక జ్యేష్టాభిషేకం (అభిధేయక అభిషేకం)ని ప్రవేశపెట్టింది.

– ప్రతి సోమవారం నిర్వహించే విశేష పూజను 1991లో ప్రవేశపెట్టారు.

– డా. ఎన్.రమేశన్, శ్రీ టి.కె.టి. వీర రాఘవాచార్య, శ్రీ సాధు సుబ్రమణ్యం శాస్త్రి మొదలైన వారు ఆలయ గోడలపై లభించిన శాసనాలను ఉటంకిస్తూ ‘సహస్ర కలశాభిషేకం’ మరియు ‘వసంతోత్సవం’ రెండూ కూడా ఆర్జిత సేవలని, అనగా భక్తులెవరైనా సూచించిన రుసుము చెల్లిస్తే నిర్వహించే సేవలని, ఇవి ఖచ్చితంగా చేయాల్సిన సేవలు కాదని స్పష్టీకరించారు.

– 2019లో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు పంచలోహ విగ్రహాలకు తరచూ నిర్వహించే అభిషేకాలను నిలిపివేయాలనే జీయంగార్లు మరియు ప్రధాన అర్చకులు, అర్చకుల సూచనల మేరకు టీటీడీ ఈ సేవలను రద్దు చేసింది.

– టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామితో పాటు ఈ విషయాన్ని పరిశీలించడానికి ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ కూడా ఉత్సవమూర్తులు అరుగుదలకు గురికాకుండా రక్షించాల్సిన అవసరం ఉందని భావించిన విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

– వేసవిలో తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. శ్రీవారి దర్శనార్థం కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లు, షెడ్ల‌లో వేచి ఉండే భక్తులకు నిరంత‌రాయంగా పాలు, అల్పాహారం, అన్నప్రసాదాలు అందిస్తున్నారు.

– ఆలయ మాడ వీధుల్లో భక్తులు నడిచేందుకు వీలుగా కూల్ పెయింట్, అవసరమైన ప్రాంతాల్లో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతోపాటు క్యూలైన్లు, ఫుడ్ కౌంటర్లలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోంది. రాంభగీచా బస్టాండు, సిఆర్వో, ఏఎన్సి తదితర ప్రాంతాల్లో ఫుడ్ కౌంటర్ల ఏర్పాటుతో భక్తులు అన్నప్రసాద కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా ఆయా ప్రాంతాల్లోనే అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారు.

– ప్రధాన కల్యాణకట్టతో పాటు మినీ కల్యాణకట్టల్లో క్షురకులు 24 గంటల పాటు భక్తులకు సేవలు అందిస్తున్నారు.

– కనుక భక్తుల మనోభావాలతో ముడిపడియున్న ఇలాంటి సున్నితమైన విషయాలగురించి చర్చించేముందు పూర్తి వివరాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *