తెలంగాణ గిరిజన తాండాలో పుస్తకోదయం

తెలంగాణ మారుమూల గిరిజన తాండాలో పుస్తకంతో అదనపు  కలెక్టర్ సృష్టించిన కలకలం

 

(జింకా నాగరాజు)

 

పిక్లా తాండా అనే పేరు ఎపుడూ ఎవరూ వినవుండరు. నలుగురినోట పడి నానే క్వాలిఫికేషన్ ఉన్న తాండా కాదిది.

తెలంగాణ  కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఒక మూల పెద్దగా కనిపించకుండా నక్కి నక్కి ఉన్న గ్రామపంచాయతీ ఇది. జనాభా 970. చిన్న వూరికి తగట్టు ఆ వూర్లో మూడో తరగతి దాకా మాత్రమే ఉండే బుల్లి స్కూలు. తాండాకు ఉన్న ఒకే ఒక విశేషం , సర్చంచు మహిళ కావడం. మరొక విశేషం చెబితే, పుస్తకం పఠనం అంతరించిపోతున్నదని బాధపడే  ఐఎఎస్ అధికారి ఒకరు  అదనపు కలెక్టర్ గా రావడం.

పేరు చెబుతున్న ట్లు అది 100 శాతం గిరిజన గ్రామం.  గోండుల, లంబాడీలు తప్ప మరొక జాతి లేని గ్రామం. చెట్టూ, చేమ, గుట్టలు, అడవులే వాళ్ల ప్రపంచం. అందువల్ల పిక్లాతాండ గురించి బయటి ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు. అవసరమూ లేదు. అయితే, ఇపుడు పిక్లాతాండా ఒక విశేష వార్త అయింది.  అక్కడ ఇపుడు పుస్తకోదయం జరిగింది.  నడివూర్లో పుస్తకం తెరుచుకుంటున్న శబ్దం వినవచ్చు. కళ్లారా చూడవచ్చు.

తాండాలో స్కూలున్నా,  అందులో ఏముంటుంది, ఒక బ్లాక్ బోర్డు, ఒక కుర్చీ ఉంటుంది. పిల్లల దగ్గిర నాలుగు నోటు బుక్కులుంటాయి. ఇవెపుడూ  ఆకర్షణీయ వస్తువులు కాదు ఆ పల్లెలో. మరొక పుస్తకం ఉంటుందని కూడా తెలియని అమాయకపు పల్లె పిక్లా తాండా.  ఇలాంటి వూర్లో అందరి దృష్టి ఇపుడు పుస్తకం మీద పడింది.  ప్రపంచం విశాలమని, అక్కడ ఈ నోటు పుస్తకాలు, బలపాలు, పలకలు,  పాఠ్యపుస్తకాలే కాకుండా, ఇంకా పెద్ద పెద్ద పుస్తకాలుంటాయని, వాటిని తీరుబడిగా చదువుకోవచ్చని  తొలిసారి  పిక్లాతాండా వాసులకు, బడిపిల్లలకు తెలిసింది.

ఎలా?

ఆ వూర్లో ఒక చిట్టి పొట్టి చిత్రమయిన మొబైల్  లైబ్రరి పుట్టింది. లైబ్రరీ అంటే పెద్దదో చిన్నదో ఒక గది, ఒకటి రెండు బీరువాలు, చాలా పుస్తకాలు  కళ్ల ముందు కదలాడతాయి. కాని, పిక్లాతాండా లో వెలసిన లైబ్రరీ ఒక చిన్న చెక్క స్తంభం మీద  నిలబడిన చెక్క పెట్టె. చెక్కపెట్టెకొక గాజు తలపు.  లోన కొన్ని పుస్తకాలు.

ప్రతిరోజు పొద్దునే ఈ పెట్టెని  పంచాయతీ కార్యాలయం నుంచి రచ్చబండ దగ్గరకు తీసుకువచ్చి నిలబెడతారు.  పెట్టె స్తంభానికి అటూ ఇటూ బెంచీలు ఏర్పాటు చేశారు. అదే పిక్లాతాండా లైబ్రరీ. పిడికెడు పుస్తకాలకు ఇంత అందమయిన  ఆకారం ఇచ్చింది  అదనపు కలెక్టర్ కె. వరుణ్ రెడ్డి. ఇంజనీరింగ్ చదివి ఐఎఎస్ కు ఎంపికయ్యారు వరుణ్.

అదనపు కలెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఐఎఎస్

 

ఎవరైనా వచ్చి  ఈ పుస్తకాలు అక్కడే కూర్చుని చదువుకోవచ్చు. సాయంకాలం  6 దాక ఈ బుల్లి లైబ్రరీ తలుపులు తెరుచుకునే  ఉంటాయి తర్వాత అది మళ్లీ పంచాయతీ కార్యాలయానికి తరలిపోతుంది. అందుకే దీనిని తాండా సంచార గ్రంథాలమయని పిలుస్తున్నట్లు  ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శి బొర్లకుంట మనీష్  తెలిపారు.

ఒక వారం కిందట మొదలయిన ఈ లైబ్రరీ గ్రామంలో ఒక చోద్యం  అయింది.  వూర్లో పుస్తకాలను ఇలా ఏర్పాటు చేసుకోవచ్చా, ఎవరైనా వచ్చి చదువుకోవచ్చా అనేది  చర్చనీయాంశమయింది. చదివే వారు, చదువురాని వచ్చి పుస్తకం పట్టుకుని చూసి వెళ్తున్నారు. ఒక గ్రామస్థుడు జీవితంలో తొలిసారి సరదా కోసమయినా సరే, అబ్బురపాటుతో నైనా సరే చేత పుస్తకం పట్టుకోవడం జరుగుతున్నది. ఇది టర్నింగ్ పాయింట్, చారిత్రాత్మకం అని మనీష్ ‘ట్రెండింగ్ తెలుగు న్యూస్’ కు చెప్పారు.

” పుస్తకం పఠనం బాగా తగ్గిపోతా ఉంది. సోషల్ మీడియా జీవితంలోకి ప్రవేశించి పుస్తకాన్ని తరిమేస్తూ ఉంది. పిక్లాతాండా లాంటి వూర్లలో ఈ పరిస్థితి ఇంకా ముదరలేదు కాబట్టి ఇక్కడి పిల్లల్లో పుస్తకం చేత పట్టే అలవాటు తీసుకురాచ్చని మా ఆశ.   రోజుకు నలుగురైదురుగురు పిల్లలు వచ్చి, ఈ పుస్తకాలను తిరగేసి వెళ్లినా మా అదనపు కలెక్టర్   ప్రయోగం విజయవంతమయినట్లే లెక్క. ,” అని మనీష్ చెప్పారు.

ఇపుడు అందుబాటులో ఉన్న పుస్తకాల గురించి చెబుతూ ప్రస్తుతానికి తక్కువ సంఖ్యలోనే పుస్తకాలు ఉన్నాయని, తొందరలో నే వాటి సంఖ్య పెంచడమే కాదు, వైవిధ్యం కూడ తీసుకువచ్చేందుకు అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి సిద్దంగా ఉన్నారని ఆయన  చెప్పారు.

ఇపుడు సుమతి శతకం, భాస్కర శతకం, కాళోజీ ‘నా గోడవ’, శ్రీ శ్రీ మహాప్రస్థానం, పెద్దబాల శిక్ష, ఇంగ్లీష్ గ్రామర్,  పెద్ద బాల శిక్ష, తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ కు సంబంధించిన మరికొన్ని పుస్తకాలు, సాహిత్యం అందుబాటులో ఉంచారు. ఇక ముందు తెలంగాణ సంస్కృతి,టూరిజం, బొమ్మల నీతి కథలు, భారత రామాయణ కథలు  వచ్చి చేరతాయని కూడా ఆయన చెప్పారు.   ఎవరైనా పుస్తకాలను విరాళంగా కూడా ఇవ్వవచ్చని ఆయన చెప్పారు.

విదేశాలలో ముచ్చటైన బుల్లి లైబ్రరీలు
విదేశాలలో ముచ్చటైన బుల్లి లైబ్రరీలు
విదేశాలలో ముచ్చటైన బుల్లి లైబ్రరీలు

జాయింట్ కలెక్టర్ వరుణ్ రెడ్డి కి ఈ ఆలోచన ఒక విదేశీ పర్యటన నుంచి వచ్చింది. అక్కడ ఆయన ఇలా  పావురాల గూళ్ల స్తంభాల్లాగా   కాలనీలలో ఏర్పాటు చేసిన టినీ లైబ్రరీలను చూసి ముచ్చట పడ్డారు. అక్కడ అవి బాగా పాపులర్ అయ్యాయని తెలుసుకున్నారు. ఇలాంటి ప్రయోగం తెలంగాణ మారుమూల గ్రామాల్లో ఎందుకు చేయరాదు అని  వరుణ్ రెడ్డికి అనిపించింది. అంతే,  పిక్లా తాండాను ఆయన ఎంచుకున్నారు. స్థానిక సర్పంచ్ బానోత్ మంగీబాయ్ కిషన్ ని భాగస్వామిని  చేశారు. గ్రామ కార్యదర్శి బొర్లకుంట మనీష్ వెంటనే  బాక్స్ ఏర్పాటు చేశారు. గ్రామస్థులంతా ఈ ప్రయోగానికి మద్దతు తెలిపారు. ఇంకేముంది, ఇల్లు అలికి, ముగ్గు వేసి స్వాగతం అని  రాసి పుస్తకం పండగ చేసుకున్నారు. ఎంతో గొప్ప సంబురం కదూ!

అంతే , వరుణ్ రెడ్డి ఆలోచన ప్రకారం  పుస్తకాలం స్తంభం పెట్టే తయారయింది. తన దగ్గిర ఉన్న పుస్తకాలను ఆయన  అందించారు. మరికొందరు మరిన్నిపుస్తకాలు అందించారు. చిట్టి లైబ్రరీ తయారయింది.

ఆసిఫా బాద్  గిరిజన జిల్లాలో ఆక్షరాస్యత  పెంచేందుకు వరుణ్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ మధ్య ఆయన ‘టీచ్ ఆషిఫాబాద్ ’ (Teach Asifabad)క్యాంపెయిన్ ప్రారంభించారు.   పిరమల్ ఫౌండేషన్ సహకారంతో ఇంటర్న సిఫ్ ప్రోగ్రాం గా దీనిని ఆయన ప్రారంభించారు.  యువకులు జిల్లాకు వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడి విద్యార్థులకు యువకులకు స్కిల్ డెవెలప్ మెంట్ సాయపడేలా ప్రోత్సహించే రెసిడెన్షియల్ ఇంటర్న్ షిప్ కార్యక్రమం ఇది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *