తిరుపతి, 2022 ఏప్రిల్ 18:
ఏప్రిల్ 19వ తేదీ మంగళవారం సాయంత్రం 5.45 నుండి రాత్రి 7.00 గంటల వరకు చంద్రగిరి కోదండ రామస్వామి ఆలయంలో శ్రీ రామపట్టభిషేకం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.
మరొక వైపు చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో చక్రస్నానం (అవభృథోత్సవం) నేత్రపర్వంగా జరిగింది.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు వసంతోత్సవం నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకాలు చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.
రేపు పట్టాభిషేకం అనంతరం రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఇక ఒంటిమిట్ట విశేషాలు
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణిలో చక్రస్నానం (అవభృథోత్సవం) నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఉదయం 4.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాములవారు తిరుచ్చిలో, సుదర్శన చక్రత్తాళ్వార్ పల్లకిలో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు వేంచేశారు.
అనంతరం ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకాలు అందుకుని ప్రసన్నులయ్యారు. అనంతరం అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.
కాగా రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
పుష్పయాగం :
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం సాయంత్రం 6 నుండి రాత్రి 9.30 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తారు.