బేలూరు అంటూనే ఎపుడో 11వ శతాబ్దంలో హోయసల రాజులు కట్టించిన మహాద్భుత చెన్నకేశవ స్వామి ఆలయం గుర్తొస్తుంది. అక్కడి ఆలయం గోడల మీద భారతీయ శిల్పుల నైపుణ్యం ప్రత్యక్షమవుతుంది. బేలూరు ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా నామినేట్ అయింది.
బేలూరు కర్నాటక హసన్ జిల్లా లో పెద్ద పేరున్న చిన్న వూరు. రోజూ వేలాది మంది జాతీయ అంతర్జాతీయ పర్యాటకులు, భక్తులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఆలయ ప్రాంగణం ఎపుడూ పర్యాటకులతో క్రిక్కిరిసి ఉంటుంది. అలయంలో చక్కగా ఫోటోలు ఎన్నయినా తీసుకోవచ్చు. ఇలా ఆలయం గురించి చెప్పుకోవడంలో గొప్పేమీ లేదు. అసలు గొప్ప వేరే ఉంది, అదొక వింత. భారత దేశంలోనే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ వింత నిన్నఅంటే బుధవారంనాడు 10.40 కి ఆలయంలో జరిగింది.
నిన్న 10.40కి బేలూరు చేన్నకేశవ స్వామి రథోత్సవం మొదలయింది. ఎలా? అదే వింత. మొదట దేవుడి విగ్రహాలను బయటకు తీసకువచ్చి ఆలయమంతా కలియతిప్పారు. తర్వాత రథంమీద నిలబెట్టారు. ఆపై ఒక ముస్లిం మౌల్వి ఖురాన్ పఠనం చేశాడు. ఆ తర్వాతే వేలాది మంది భక్తులు చూస్తుండ రథయాత్ర మొదలయింది. అంటే ముస్లిం పండితుడు ఖరాన్ చదివాకనే హిందూ రథ యాత్ర ప్రారంభం కావడం. ఇలాంటిది ఎక్కడా లేదు. బేలూరులోనే ఉంది. అందునా ఇపుడుదేశంలో నెలకొన్న మత ఉద్రిక్త వాతావరణం మధ్య కర్నాటకలో ఈ చోద్యం జరిగింది. ఇదే భారతీయత అంటే.
సరిగ్గా వారంరోజుల కిందట బేలూరు నుంచి ఆందోళనకరమయిన వార్తలొచ్చాయి. ఆలయం బయట ఉన్న దుకాణాలలో ఉన్న ముస్లిం దుకాణాలను ఖాళీ చేయించాలని కొంత సంస్థలు అల్లరి చేయడం మొదలుపెట్టాయి. పవిత్రమయిన చెన్నకేశవ స్వామి ఆలయం ఎదురుగా ఎప్పటినుంచో సాగుతూవస్తున్న మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరిగింది. అయితే, నిన్న ఇదే చోట ఏకంగా ఆలయమే మత సామరస్యాన్ని నిలిపింది.
నిన్న ఉదయం చెన్నకేశవ స్వామి ఉన్న రథం ముందు ఖరాన్ పఠనం చేసిన మౌల్లి పేరు సయ్యద్ సజ్జద్ బాషా. ఆయనది సమీపంలోని దొడ్డమేడూరు గ్రామం. పట్టణంలో కొన్ని సంస్థల ముస్లిం దుకాణాలు మూసేయించేందుకు గొడవచేస్తున్నందున రథోత్సవానికి ఖురాన్ పఠనం చేయాలా వద్దా అనేది ఆలయ పాలకవర్గంలో చర్చనీయాంశమయింది. దీనికోసం ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వం కూడాఖురాన్ పఠానానికి అనుమతిచ్చింది.
కరోనా పాండెమిక్ కారణంగా రెండేళ్లుగా ఇక్కడ రథోత్సవం జరగలేదు. ఈ యేడాది కోవిడ్ ఆంక్షలు తొలగిపోవడంతో నిన్న రథోత్సవం జరిగింది. కర్నాటక బిజెపి ప్రభుత్వం కూడా ఆలయ మర్యాదను సంప్రదాయాన్ని గౌరవించవలసి వచ్చింది.
“గత యాభై సంవత్సరాలుగా నేను ఈ రథోత్సవ ప్రారంభానికి ఖురాన్ ను పఠిస్తున్నాను, ” అని సయ్యద్ సజ్జాద్ ఖాజీ పేర్కొన్నారు.
వందల సంవత్సరాలుగా తన తండ్రితాతలు ఆలయంలో ఖురాన్ ను పఠిస్తూ వస్తున్నాను. ఇక ముందు తన కుమారులు కూడా ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తారు అని ఆయన మీడియా కు చెప్పారు.
“బైబిల్, ఖురాన్, గీత ఏది తీసుకున్నా, ఆందులోని శ్లోకాలు చెప్పేదంతా ఒక్కటే. ఒకేసందేశమిస్తాయి,’ అని ఆయన అన్నారు.
హిజబ్, ముస్లిం దుకాణాల వివాదాలతో ఆందోళన కలిగించే వార్తల్లో ఉన్న కర్నాటక నుంచి బేలూరు ఒక మంచి వార్త ను అందించింది. దేశమంతా పొద్దునే వార్త పత్రికల్లో ఈ వార్త చూసి కొంచెం మనసుకుదుట పర్చుకుని ఉంటారు. ఎందుకంటే, వెయ్యేళ్ల గుడిలో రథోత్సవం ఖురాన్ పఠనంతో మొదలుకావడం మనేది చోద్యం కాకఏమవుతుంది.
“ఈ సంప్రదాయం 1932లో వచ్చిన ఆలయం మాన్యువల్ లో ఉంది. మాన్యువల్ చెప్పిన సంప్రదాయాన్ని మేం పాటిస్తున్నాం. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నదని నాకు చెప్పారు. చెన్నకేశవ రథోత్సవంలో అన్ని వర్గాల ప్రజలనుభాగాస్వాములను చేయాలనే సదుద్దేశంతో ఈ సంప్రదాయం మొదలయింది, “అని ఆలయం ఎగ్జిక్యూటివ్ అధికారి కె విద్యుల్లత చెప్పారు.
2002 హిందూ రిలీజియస్ యాక్ట్ ప్రకారం, ఆలయ సంప్రదాయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అని ముజ్రాయ్ శాఖ కమిషనర్ రోహిణిీ సింధూరి చెప్పారు.
మొన్నామధ్య ఆలయ పరిసరాలలో పర్వదినం సందర్భంగా 15 ముస్లిం దుకాణాలను అనుతించారు. వాటిని ఖాళీ చేయించేందుకు కొంతమంది ఆందోళన చేశారు. అయితే, పురప్రజలు దీనిని వ్యతిరేకించారు. దానితో అధికారులు ముస్లింల దుకాణాలను కొనసాగించారు.